Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : వినోద్‌ మెహతా - 16

ఎమ్బీయస్‌ : వినోద్‌ మెహతా - 16

49 ఏళ్ల వయసులో వినోద్‌ పనీపాటా లేకుండా కూర్చోవలసి రావడం అతని స్నేహితులను బాధించింది. అప్పట్లో ''సండే'' పత్రికకు ఎడిటరుగా వున్న వీర్‌ సంఘ్వీ తన పత్రికలో ఓ కాలమ్‌ రాసే ఛాన్సు యిచ్చాడు. అది సరిపోదు కదా, అందుకని ''న్యూ ఫ్రాంటియర్‌ పబ్లిషింగ్‌ లి.'' అనే కంపెనీ ఒకటి పెట్టి కోటి రూపాయలు సేకరించి ఏదైనా పత్రిక పెడదామనుకున్నాడు. ఓ ఏడాది పాటు కష్టపడినా ఆ సొమ్ము జతపడలేదు. 1991 ఏడాది ప్రారంభంలో  పారిశ్రామికవేత్త ఎల్‌ఎమ్‌ థాపర్‌ నుండి యిద్దరు వ్యక్తులు వచ్చి ఆఫర్‌ చేశారు - ''ఆయన తన ''పయొనీర్‌'' దినపత్రికను ఢిల్లీ నుంచి వెలువరిద్దామనుకుంటున్నాడు. ఢిల్లీ ఎడిషన్‌కు సంపాదకుడిగా వుంటావా?'' అని. 

పయొనీర్‌ పత్రిక 1865లో అలహాబాద్‌ కేంద్రంగా ఒక బ్రిటిషు రాజభక్తుడిచేత ప్రారంభింపబడింది. విన్‌స్టన్‌ చర్చిల్‌ దానికి వార్‌ కరస్పాండెంట్‌గా పనిచేస్తూ అఫ్గనిస్తాన్‌ నుండి యుద్ధవార్తలు పంపేవాడు. ఆ తర్వాత అది చేతులు మారి లఖ్‌నవ్‌ నుండి వెలువడేది. 1950ల నుండి 70 లవరకు ఉత్తర్‌ప్రదేశ్‌లో లీడింగ్‌ ఇంగ్లీషు పత్రికగా వుండేది, కానీ క్రమేపీ దాని డిమాండ్‌ తగ్గిపోయింది. మూతపడే థకు వచ్చింది. ఆ స్థితిలో దాని ఓనర్లతో ఎల్‌ఎమ్‌ థాపర్‌ బ్రిడ్జి ఆడుతూ పందెంలో భాగంగా దాన్ని తీసుకున్నాడు. చేతికి వచ్చిన పేపరును మూసేసి చేతులు దులుపుకోవడం కంటె, కాస్త పెట్టుబడి పెట్టి, హెడాఫీసు ఢిల్లీకి మార్చి ప్రయత్నించి చూస్తే మంచిదనుకున్నాడు. అప్పటికే టైమ్స్‌, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ తమ ప్రధాన కార్యాలయాలను ఢిల్లీకి మార్చాయి. వినోద్‌కు కబురంపాడు. 'నీకు స్వేచ్ఛ నిస్తా, నిధులిస్తా, నాకు గర్వకారణమైన పేపరు తెచ్చిపెట్టు చాలు' అన్నాడు థాపర్‌. వినోద్‌ అప్పటికే బొంబాయికి బాగా అలవాటయ్యాడు. 'ఈ ఆఫర్‌ ఒప్పుకుంటే ఢిల్లీకి మారాలి. బొంబాయి వాతావరణం వేరు, సంస్కృతి, కళలు లాటివాటికి కాస్త ప్రాధాన్యత వుంది. ఢిల్లీలో కుళ్లు రాజకీయనాయకులు, అవినీతి, అహంభావం కలిసిన అధికారగణం, నువ్వు అక్కడ యిమడలేవు, వద్దు' అని హితైషులు హెచ్చరించినా వినోద్‌ 1991 ఏప్రిల్‌లో ఢిల్లీకి చేరాడు.  అతని అదృష్టం కొద్దీ కొందరు ప్రతిభావంతులు యితర పత్రికల్లో ఉద్యోగాలు మానేసి అతని వద్ద చేరారు.  

అప్పటికే 24 బై 7 టీవీ న్యూస్‌ ఛానెళ్లు వచ్చేశాయి. న్యూస్‌ అందించడంలో టీవీలతో వేగంలో పోటీపడలేమని గ్రహించిన వినోద్‌, టీవీల్లో వున్న లోపమేమిటో గమనించాడు. అవి సంఘటన గురించి చెప్తాయి తప్ప దాని పూర్వాపరాలు చెప్పలేవు. దానికి ఎంతో బాక్‌గ్రౌండ్‌ వర్క్‌ చేసుకుని వుండాలి. లైబ్రరీ వుండాలి. ఇతరుల కంటె ముందే వార్తలందించే అడావుడిలో చెప్పినదే చెపుతూ వుంటారు తప్ప, నేపథ్యం కానీ, విశ్లేషణకానీ అందివ్వలేరు. ఈ న్యూస్‌ ఛానెల్‌ టీవీ యుగానికి సరిపోయే దినపత్రిక అంటే మొదటి పేజీలో తాజా వార్తలిస్తూ, లోపలి పేజీల్లో వాటి వెనుకనున్న కథనాలు, గతచరిత్ర, గణాంకాలు యివ్వాలనుకున్నాడు వినోద్‌. పయొనీర్‌ను అలాగే రూపొందించాడు. సాయంత్రం 5 గం||ల వరకు  వచ్చిన వార్తలను, కథనాలను కూడా తీసుకునే ఏర్పాట్లు చేశాడు. ఎప్పటిలాగ మంచి లేఔట్‌తో పత్రిక తీసుకుని వస్తూ ఢిల్లీ పత్రికలు పట్టించుకోని ఆర్ట్స్‌ వార్తలకు, స్టోరీలకు ఒక పేజీ కేటాయించాడు. 8 నెలల కృషి తర్వాత 1991 డిసెంబరులో ఢిల్లీ పయొనీర్‌ మార్కెట్లోకి వచ్చింది. దాని అందం, గెటప్‌ పాఠకులను ఆకర్షించాయి. సాటి సంపాదకులంతా పేపరును తీసిపారేశారు. రిపోర్టరు, కరస్పాండెంటు స్థాయిలో మాత్రం తోటివారు పయొనీర్‌ స్టాఫ్‌ను అభినందించారు.  

అప్పటికి లైసెన్సు-పర్మిట్‌ రాజ్‌ పోయినా వ్యాపారస్తులు రాజకీయ నాయకులతో సత్సంబంధాలకై పాకులాడడం పోలేదు. అది ఎన్నటికీ పోదు కూడా. థాపర్‌ గ్రూపు చాలా పెద్దదైనా దానికి పబ్లిక్‌ యిమేజి పెద్దగా లేదు. ఈ పేపరు ఆ లోటు పూరిస్తుందని థాపర్‌ సోదరులకు వారి కుటుంబాలకు తోచింది. వాళ్లు వినోద్‌ను వాళ్ల యింటికి పిలిచి పేపరు గురించి కబుర్లు చెప్పమనేవారు. 'నువ్వు వెళితే వెళ్లు గానీ, వాళ్లని పట్టించుకోనక్కరలేదు. నా మాటే ఫైనల్‌' అని థాపర్‌ చెప్పాడు. ఆ రోజుల్లో రాజకీయంగా, సామాజికంగా చాలా ఘటనలు జరుగుతున్నాయి. రాజీవ్‌ హత్యపై విచారణ, పివి నరసింహారావు ప్రధానిగా నిలదొక్కుకోవడానికి చేస్తున్న విన్యాసాలు, ఆడ్వాణీ రథయాత్ర, యుపి ముఖ్యమంత్రిగా కళ్యాణ్‌ సింగ్‌ చేతలకు, మాటలకు పొంతన లేకపోవడం, 1992 డిసెంబరులో బాబ్రీ మసీదు ధ్వంసం.. యిలా చాలా చాలా జరుగుతున్నాయి. వీటన్నిటికీ కార్యక్షేత్రాలైన యుపి, ఢిల్లీ రెండింటిలో పయొనీర్‌కు బేస్‌ వుండడంతో యివన్నీ బాగా కవర్‌ చేయగలిగింది. థాపర్‌ అన్నగారు, హిందూ మతాభిమాని. అయినా థాపర్‌ పత్రిక ఫలానా విధంగా నడిచితీరాలి అని ఎప్పుడూ కట్టడి చేయలేదు. పత్రిక బాగా పుంజుకుంటోంది. పేరు తెచ్చుకుంటోంది, యిక డబ్బు తెచ్చుకోవడం తరువాయి. 1993 ఏప్రిల్‌లో వినోద్‌కు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ అయింది. థాపర్‌ అతనికి అన్ని రకాలుగా సాయం అందించాడు. మూడు నెలల తర్వాత వినోద్‌ డ్యూటీకి తిరిగి వచ్చినప్పటి నుండి విముఖత ప్రారంభమైంది. 

థాపర్‌కు అన్ని పార్టీలలోను స్నేహితులున్నారు. వాళ్ల గురించి రోజూ పేపర్లో ఏదో ఒక సంచలన వార్త వస్తూనే వుంటుంది. తప్పదు. ఎందుకంటే వాళ్లందరినీ పొగుడుతూ రాస్తే పేపరెవరూ చదవరు. అందువలన కాస్త జాగ్రత్త, కొద్దిపాటి సాహసం కలగలిపి ముందుకు దూసుకుపోతూ వుండాలి. ఈ విధానం గురించి వినోద్‌ వివరించినపుడు థాపర్‌ 'నేను అర్థం చేసుకోగలను. నా స్నేహితులు కూడా అర్థం చేసుకుంటారనే అనుకుంటాను.' అన్నాడు. కానీ అప్పుడప్పుడు కాస్త ఎగుడుదిగుళ్లు రాకపోలేదు. 1992 ఏప్రిల్‌లో ఆర్మీ చీఫ్‌గా వున్న జనరల్‌ ఎస్‌.ఎఫ్‌. రోడ్రిగ్‌ పయొనీర్‌కు చెందిన జర్నలిస్టు రామీందర్‌ సింగ్‌కు యింటర్వ్యూ యిస్తూ రాజకీయనాయకులను పందికొక్కులని తిట్టిపోసి, ప్రభుత్వం సరిగ్గా నడవలేనప్పుడు ఆర్మీ కలగచేసుకుని పరిస్థితులు చక్కదిద్దినా ఫర్వాలేదన్నాడు. పయొనీర్‌ దాన్ని రెండు భాగాలుగా వేద్దామనుకుంది. మొదటిభాగం ప్రచురించబడగానే పార్లమెంటులో గగ్గోలు పుట్టింది. ప్రతిపక్షాలు గోల చేశాయి. ఆర్మీ చీఫ్‌ రిజైన్‌ చేయాలని ఫెర్నాండెజ్‌ డిమాండ్‌ చేశాడు. ప్రభుత్వం థాపర్‌పై ఒత్తిడి తెచ్చింది. ఇంటర్వ్యూ టేపు వింటాను పంపించండి అని చెప్పి థాపర్‌ ఆ టేపు తన దగ్గరే పెట్టేసుకున్నాడు. తను చెప్పేదాకా యింటర్వ్యూ రెండో భాగం వేయవద్దన్నాడు. మర్నాటి పేపర్లో రెండో భాగం రాకపోవడంతో పేపరు, ప్రభుత్వానికి అమ్ముడుపోయిందని, భయపడిపోయిందని ఢిల్లీ అంతా ఒకటే పుకార్లు. థాపర్‌ను వినోద్‌ స్వయంగా కలిసి 'వివాదాస్పద విషయమంతా మొదటి భాగంలోనే వేసేశాం. రెండోది వేయకపోతే పేపరు పరువు, మీ పరువు పోతాయి' అని చెప్పి టేపు వెనక్కి తీసుకుని రెండో భాగం కూడా వేసేశాడు. థాపర్‌కు ఏమీ చేయలేక వూరుకున్నాడు. కానీ తనకు బాగా తెలిసున్న మాళవికా సింగ్‌తో గొడవ వచ్చినపుడు మాత్రం రియాక్టయ్యాడు.

మాళవికా సింగ్‌ ఢిల్లీ సర్కిల్స్‌లో బాగా నెట్‌వర్క్‌ వున్న జర్నలిస్టు. పార్టీలిచ్చి అందరితో స్నేహంగా వుంటూ, దూసుకుపోతూ వుంటుంది.  1993లో బిజినెస్‌ ఇండియా గ్రూపుకు చెందిన అనేక పబ్లికేషన్స్‌కు సారథ్యం వహిస్తూన్న సమయంలో ఒక రోజు పార్టీ యిచ్చి బిటీవీ అనే పేర న్యూస్‌ ఛానెల్‌ పెడతామని, ఫలానా తారీకు నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించింది. అయితే టీవీ ఛానెల్‌కు అత్యవసరమైన ట్రాన్స్‌పాండర్‌ ఏర్పాటు చేసుకోలేదు. వాళ్లు చెప్పిన తారీకుకి ఛానెల్‌ ఆరంభం కావడం అసాధ్యం. ఈ విషయమే పయొనీర్‌ రాసింది. మాళవికకు కోపం వచ్చింది. ఎంత నిజమైతే మాత్రం, యిలా తన ఛానెల్‌ పరువు తీయాలా అని. థాపర్‌కు ఫిర్యాదు చేసింది. థాపర్‌ వినోద్‌కు ఒక ఉత్తరం రాశాడు - 'ఇలా గాలివార్తలు మన పేపర్లో రావడం ఏమీ బాగా లేదంటూ..'! పయొనీర్‌లో ఆ వార్త వచ్చిన కొద్ది రోజులకే యితర పత్రికల్లో కూడా ఆ వార్త వచ్చింది. ఇది గాలివార్త కాదు, పచ్చినిజం అని థాపర్‌కు సమాధానం రాద్దామా వద్దా అని వూగిసలాడి, యీ ఉద్యోగమూ వూడితే కష్టమనుకుని థాపర్‌ సెక్రటరీకి ఫోన్‌ చేసి తనకు ఉత్తరం అందిందని చెప్పి వూరుకున్నాడు. దాంతో ఆ అధ్యాయం ముగిసిందనుకున్నాడు కానీ థాపర్‌ క్షమించలేదు. సమయం కోసం ఎదురుచూస్తున్నాడు.

1994 మేలో థాపర్‌ తన యింట్లో ఒక లంచ్‌ సమావేశం ఏర్పాటు చేశాడు. అలాటి సమావేశాలు మొఘల్‌ దర్బారును తలపింపచేసేవి. అక్కడ బాదుషా థాపర్‌. ఎవరూ ఎదురాడడానికి వీల్లేదు. ఆ సమావేశంలో సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ టీమును పిలిచి పేపరు వ్యవహారాలు ఎంత వరకు వచ్చాయో చర్చ ప్రారంభించమన్నాడు. అతనికి పరమవిధేయుడు, పత్రికల వ్యవహారాలు బొత్తిగా తెలియనివాడు ఐన సిఇఓ లేచి 'మన పత్రికలో ఎడిటోరియల్‌ స్టఫ్‌ చెత్త, అందుకే ఎదగటం లేదు' అని దుమ్మెత్తిపోయసాగాడు. థాపర్‌ అది శ్రద్ధగా వింటూ వున్నాడు. తనను, తన ఎడిటోరియల్‌ స్టాఫ్‌ను సమర్థించుకుందామని వినోద్‌ మధ్యలో ప్రయత్నించగా థాపర్‌ అతన్ని ఆపి సిఇఓను ఆపవద్దు అని గట్టిగా చెప్పాడు. తన స్టాఫ్‌ ముందే పబ్లిషరు తనపై గొంతెత్తడంతో అప్పుడు వినోద్‌కు తెలిసివచ్చింది - ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం సాగుతున్న కార్యక్రమమని. ఉద్యోగం పోవడం అలవాటై పోయింది కానీ, యిలా అవమానింపబడడం కొత్తే అని చెప్పుకున్నాడు వినోద్‌. కావాలంటే అందరి ముందా సిఇఓతో, పబ్లిషరుతో వాగ్వివాదానికి దిగవచ్చు. కానీ అంతకంటె మౌనంగా వెళ్లిపోవడం మంచిదనుకుని, తన కాగితాలు తను సర్దుకుని బయటకు వచ్చేశాడు. ఈ ధిక్కారానికి థాపర్‌ తెల్లబోయాడు. అంతకంటె వినోద్‌ వంగి దణ్ణాలు పెట్టి, తప్పయిపోయిందంటే సరేలే పేపరు నడుపుకో అనేవాడేమో, తన స్టాఫ్‌ ఎదుట, యీ ఎడిటరు లక్ష్యం లేకుండా వెళ్లిపోతాడా, యిలా అయితే రేపు తననెవడైనా లెక్క చేస్తాడా, ఎంత మదం వీడికి అని ఆగ్రహించాడు. 

మర్నాడు ఆఫీసుకు వస్తూనే వినోద్‌ తన స్టాఫ్‌కు జరిగిందేమిటో వివరించాడు. అంత పెద్ద యిండస్ట్రియలిస్టును అవమానించేటంత కండకావరమా వీడికి అని థాపర్‌ గ్రూపులో తక్కిన ఆఫీసుల్లో స్టాఫ్‌ అనడం మొదలెట్టారు. ఇక వినోద్‌కు ఏదో ఒకటి చేయక తప్పదని అర్థమైంది. థాపర్‌ పేర ఒక ఉత్తరం రాశాడు - క్షమాపణలేమీ లేకుండా, తనకిచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు చెప్పాడు. తను ఏ పరిస్థితుల్లో సమావేశంలోంచి బయటకు వెళ్లాల్సి వచ్చిందో వివరించాడు. పయొనీర్‌ ఢిల్లీలో సంపాదించుకున్న స్థానాన్ని గుర్తు చేసి, దానికి ఎడిటరు అని చెప్పుకోవడానికి తను గర్విస్తున్నాననీ, పబ్లిషరు అని చెప్పుకోవడానికి ఆయన గర్విస్తాడని భావిస్తున్నాననీ రాశాడు. రెండు రోజుల తర్వాత థాపర్‌ వచ్చి కలవమన్నాడు. 'నువ్వు బాగానే పనిచేశావు కానీ నువ్వు లేకపోతే నీ బదులు మరొకణ్ని చూసుకోలేనని అనుకోవద్దు' అనే ధోరణిలో మాట్లాడాడు. అతని మూడ్‌ గ్రహించిన వినోద్‌ 'న్యూస్‌ పేపరనేది సిమెంటు కంపెనీ లాటిది కాదు, ఎడిటరుపై దాని క్వాలిటీ, పాప్యులారిటీ ఆధారపడతాయి' అని చెప్పడం అనవసరం అనుకున్నాడు. ఎప్పుడు రిజైన్‌ చేయమంటారు? అని అడిగాడు. ''రేపే'' అన్నాడు థాపర్‌. ఆ విధంగా రెండున్నరేళ్ల పయొనీర్‌ ఉద్యోగం తర్వాత 1994 ఆగస్టు 1 న వినోద్‌ నిరుద్యోగపర్వం మళ్లీ ప్రారంభమైంది. (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2015)

[email protected]

Click Here For Previous Articles

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?