Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : వినోద్‌ మెహతా - 17

ఎమ్బీయస్‌ : వినోద్‌ మెహతా - 17

వినోద్‌కు ఢిల్లీలో సొంత ఫ్లాట్‌ వుంది. అక్కడే వుంటూ చేతిలో వున్న డబ్బు ఖఱ్చు పెట్టుకుంటూ, కాలక్షేపం చేస్తూ వుండగా ఐదు నెలల తర్వాత 1995 జనవరిలో అతని స్నేహితుడు అరుణ్‌ శౌరీ తమ్ముడు అయిన దీపక్‌ ఒక ఆఫర్‌ పట్టుకుని వచ్చాడు. టాప్‌ క్లాస్‌ రియల్టర్స్‌గా పేరు తెచ్చుకున్న రహేజా గ్రూపుకు చెందిన రాజన్‌ రహేజా ఫ్యామిలీ బిజినెస్‌లోంచి బయటకు వచ్చి పారిశ్రామికవేత్త అయ్యాడు. ఎక్సయిడ్‌ బ్యాటరీస్‌, ఎచ్‌ అండ్‌ ఆర్‌ జాన్సన్‌ కొన్నాడు, మధ్యప్రదేశ్‌లో సిమెంటు ఫ్యాక్టరీ పెట్టాడు. ఇంకా కొన్ని మధ్యతరహా పరిశ్రమల్లో కూడా పెట్టుబడి పెట్టాడు. అతనికి ఎందుకు పుట్టిందో కానీ పత్రికా వ్యాపారంలో దిగాలనిపించింది. అప్పట్లో జనరల్‌ ఇంట్రస్ట్‌ మ్యాగజైన్‌ అంటే పక్షపత్రికగా నడిచే ఇండియా టుడే మాత్రమే. తక్కిన గ్రూపులు నడిపిన మ్యాగజైన్లన్నీ పడుక్కున్నాయి. ఎదురు లేని రారాజుగా ఇండియా టుడే వెలుగుతోంది. దానికి దరిదాపుల్లో వచ్చేందుకు కూడా ఎవరూ సాహసించటం లేదు. ఆ టైములో రహేజా దాని టైపులో ఒక పక్షపత్రిక పెడదామనుకుని వినోద్‌ను రమ్మన్నాడు. ఆలోచన వినగానే దాన్ని కాపీ కొడుతూ పక్షపత్రిక పెట్టేబదులు, వీక్లీ పెడితే మన ఎజెండా మనదే కదా అన్నాడు వినోద్‌. అది రహేజాకు నచ్చింది. దీపక్‌ను, వినోద్‌ను కలిసి పనిచేయమన్నాడు. ''ఔట్‌లుక్‌'' అనే పేరు రిజిస్టర్‌ చేశారు. 1995 మార్చి 2 నుండి దీపక్‌, వినోద్‌ కలిసి పత్రికపై పనిచేయసాగారు. దీపక్‌ మార్కెటింగ్‌ టీము కూరుస్తూండగా, వినోద్‌ ఎడిటోరియల్‌ టీము నియామకాలపై దీపక్‌ను సంప్రదిస్తూ వుండేవాడు. 

ఇండియా టుడేలో అంతర్గతంగా చాలా కుమ్ములాటలుండేవి. బయటపడితే అవకాశాలు లేవని లోలోపలే కుములుతూండేవారు. ఈ పత్రిక రాగానే పొలోమని బోల్డు మంది వచ్చిపడ్డారు. టైమ్స్‌ నుంచి కూడా చాలామంది వచ్చి చేరారు. ఇండియా టుడే చాలాకాలంగా అదే బిజినెస్‌లో వుండడం చేత ఒక మూసపద్ధతికి అలవాటు పడిపోయింది. ఔట్‌లుక్‌ ఆ కట్టుబాట్లను ఛేదించింది. ఫ్రెష్‌గా ఆలోచించాలని, ఆర్టికల్స్‌ చిన్నగా వుండాలని, అందరూ ఒకే శైలిలో రాయనక్కరలేదని వినోద్‌ స్టాఫ్‌కు చెప్పాడు. ఈ సారి డిజైనింగ్‌కు మొయినుద్దీన్‌ రాలేదు. విశ్వదీప్‌ మొయిత్రా అనే అతను వచ్చి లేఔట్‌ చేశాడు. ప్రారంభ సంచికకు ఏదైనా కొత్త అంశం వుంటే బాగుంటుంది అనుకున్నారు. ఏముందా అని ఆలోచిస్తే కశ్మీర్‌లో ఒపీనియన్‌ పోల్‌ నిర్వహిస్తే ఎలా వుంటుందాని తోచింది. 1995 ఆగస్టులో 5 గురు విదేశీ టూరిస్టులను కిడ్నాప్‌ చేశారు. మిలిటెంట్ల ఆగడాలు ఎక్కువ కావడంతో రాష్ట్రపతి పాలన విధించారు. ఇలాటి సమయంలో అభిప్రాయ సేకరణ చేయిస్తే బాగుంటుంది అనిపించి ప్రఖ్యాత ఏజన్సీ మోడ్‌ను అడిగారు. వాళ్లు ఆలోచించి చెప్తామన్నారు. శ్రీనగర్‌లో ఫీల్డ్‌ స్టాఫ్‌ని సంప్రదిస్తే ఎవరైనా సరే ఢిల్లీ నుంచి వచ్చి సున్నితమైన అంశాలమీద ప్రశ్నలేస్తే వాళ్లని ప్రభుత్వ గూఢచారి సంస్థలకు చెందిన వారిగా భావించి తన్నడం ఖాయం అన్నారు. 

అలా అయితే స్థానికులకే ''ఔట్‌లుక్‌'' ఐడెంటిటీ కార్డులిచ్చి సమాచారం సేకరించమనండి, సూపర్‌వైజర్లు శ్రీనగర్‌లో కూర్చుని వాటిని విశ్లేషించవచ్చు అని ఔట్‌లుక్‌ వాళ్లు చెప్పారు. ప్రశ్నలడిగేందుకు మహిళలను కూడా నియోగిస్తే యిళ్లలోకి వెళ్లడం సులభం అని కూడా సూచించారు. చివరకు సర్వే ఫలితాలు వచ్చాయి. వాటి ప్రకారం భారతరాజ్యాంగానికి లోబడి కశ్మీర్‌ సమస్య పరిష్కరించవచ్చా అంటే 77% మంది అసాధ్యం అన్నారు. ఎన్నికలతో పరిష్కరించవచ్చా అంటే 80% మంది అసాధ్యమన్నారు. కశ్మీర్‌ పాకిస్తాన్‌లో చేరాలా అంటే 19% మందే అది మంచి ఆలోచన అన్నారు. 72% మంది భారత్‌, పాకిస్తాన్‌ రెండిట్లోనూ చేరకుండా విడిగా వుండడమే వుత్తమం అన్నారు. భారతసైన్యం మానవహక్కులు హరిస్తోందా అంటే 90% మంది ఔనన్నారు. ఈ సర్వే ఫలితాలు తప్పకుండా అందరి దృష్టినీ ఆకర్షిస్తాయనీ, కొత్త పత్రిక మార్కెట్లోకి వచ్చిన సంగతి అందరికీ తెలుస్తుందనీ వినోద్‌, అతని సిబ్బంది భావించారు. దీనితో బాటు యింకోటి కూడా వుంటే బాగుండునన్నారు. వినోద్‌ ఆలోచించసాగాడు.

1991లో రాజీవ్‌ గాంధీ తనను పక్కకు నెట్టేస్తున్నప్పుడు పివి నరసింహారావుగారు పదిహేనేళ్లగా తాను రాస్తున్న ఆత్మకథ కాని ఆత్మకథను  (దాని పేరు ''ద అదర్‌ హాఫ్‌'', కథానాయకుడి పేరు నిరంజన్‌ - ఫైనల్‌గా 1998లో ఇన్‌సైడర్‌ పేర విడుదల చేశారు,  కథానాయకుడి పేరు ఆనంద్‌) పూర్తి చేశారు. ఫస్ట్‌ డ్రాఫ్ట్‌ రెడీ కాగానే పివి తనకు బాగా స్నేహితుడైన నిఖిల్‌ చక్రవర్తి అనే లెఫ్టిస్టు జర్నలిస్టుకి, మృణాళినీ సారాభాయ్‌కు యిచ్చి చదివి ఎలా వుందో చెప్పమన్నారు. దానిలో శృంగారవర్ణనలు చాలా వున్నాయిట. నిఖిల్‌ను వినోద్‌ తన గురువుగా భావిస్తూ వుంటాడు. వెళ్లి తరచుగా కలుస్తూ వుంటాడు. ఆయన యీ పుస్తకం గురించి 1991లో చెప్పాడు. అప్పుడు వినోద్‌ పెద్దగా పట్టించుకోలేదు. కానీ యిప్పుడు పివి ప్రధాని అయ్యారు. బహుభాషావేత్త, పండితుడు అని పేరుంది. ఆయన రాసిన శృంగార, రాజకీయ నవల అంటే అందరికీ ఆసక్తి వుంటుంది అని అంచనా వేసి వెళ్లి నిఖిల్‌ను మీ దగ్గర మ్యానుస్క్రిప్టు వుంటే యిస్తారా? అని అడిగాడు. ఆయన మహరాజులా అని చెప్పి యిచ్చేశాడు. దానిలో కొన్ని రసవత్తరమైన భాగాలను ఏరుకుని అదొక స్టోరీ చేశారు. కశ్మీరా? పివి నవలా? ఈ రెండింటిలో దేన్ని కవర్‌ మీద వేయాలి? అంటే సగం మంది స్టాఫ్‌ యిదనీ, సగం మంది అదనీ అన్నారు. బొమ్మాబొరుసూ వేసి, కశ్మీర్‌ ఒపీనియన్‌ పోల్‌ ఫలితాలే కవరు మీద వేశారు. 

''ఔట్‌లుక్‌'' 15 ఏళ్ల ఫంక్షన్‌కై హైదరాబాదు వచ్చినపుడు వినోద్‌ మెహతా పివి శృంగార నవలోదంతం సభలో చెప్పారు. అందరూ నవ్వారు. ఆయనతో బాటు వున్న పబ్లిషరు పేరి మహేశ్వర్‌ కశ్మీరు సర్వేపై బాల ఠాక్రే రియాక్షన్‌ గురించి చెప్పారు. 1998 ప్రాంతాల్లోనే పివి తెలుగులో ఒక రాజకీయ, శృంగార, వ్యంగ్య నవలిక రాస్తే దాన్ని ఆంధ్రప్రభ వీక్లీ అనుబంధంగా వేసింది. వినోద్‌ మెహతాకు దాని గురించి తెలుపుతూ, కథ కొంతైనా ఇంగ్లీషులోకి అనువదించి, ఉత్తరం రాద్దామనుకున్నాను. అది నా పేపర్‌ కటింగ్స్‌లో ఎక్కడో వుంది. వెతికి పంపడానికి బద్ధకిస్తూ ఎప్పుడో ఒకప్పుడు పంపుదామనుకుంటూ వాయిదా వేశాను. ఇప్పుడు ఆయన పోనే పోయాడు. ఆ నవలిక పేరు కోసం (శీనయ్య ప్రేమకథ అనో ఏదో వుండాలి) వెతుకుదామన్నా పాత కాగితాలన్నీ దుమ్ము దులపాలి. ఎవరికైనా గుర్తుంటే రాస్తే పాఠకులకు తెలియపరుస్తాను.  (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2015)

[email protected]

Click Here For Previous Articles

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?