Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: వినోద్‌ మెహతా - 21

ఎమ్బీయస్‌: వినోద్‌ మెహతా - 21

1999లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బిజెపికి సొంతంగా 182 సీట్లు, ఎన్‌డిఏకు 296 సీట్లు వుండడంతో, యీసారి వాజపేయి ఐదేళ్లపాటు ప్రధానిగా వుంటారని అందరికీ నమ్మకం చిక్కింది. వాజపేయి అంటే వినోద్‌కు చాలా గౌరవం వుంది. సూడో సెక్యులరిస్టు అంటూ వినోద్‌ను చాలామంది బిజెపి నాయకులు దూరం పెట్టినా ఉదారవాది వాజపేయి మాత్రం వినోద్‌ను గౌరవంగా చూసేవాడు. ''డెబొనేర్‌''లో యింటర్వ్యూ యిచ్చిన దగ్గర్నుంచి యిద్దరి మధ్య సత్సంబంధాలు సాగుతూ వచ్చాయి. వాజపేయి సరసుడు, రసికుడు కూడా, మద్యం సేవించేవాడని, పెళ్లి చేసుకోకపోయినా స్త్రీలతో సన్నిహితంగా వుండేవాడని పేపర్లలో అనేకసార్లు వచ్చింది. ఆయన ప్రధాని కాగానే ఆయన యింట్లోకి మిసెస్‌ కౌల్‌ అనే ఆమె తన కూతురు నమ్రత, అల్లుడు రంజన్‌ భట్టాచార్యతో సహా వచ్చి చేరింది. ఈవిడ భర్త కాలేజీ ప్రొఫెసర్‌. అప్పటికే దివంగతుడు. ఏ బంధుత్వంతో వాళ్లు దేశప్రధాని యింట్లో వున్నారో భద్రతా కారణాలతోనైనా చెప్పాలి కాబట్టి నమ్రతను వాజపేయి దత్తత కుమార్తెగా పేర్కొన్నారు. వాజపేయి యీ విషయాలను దాచకపోవడం చేత కాబోలు, దత్తత ఎప్పుడు జరిగింది ఏమిటి అని భారతీయ మీడియా యిరకాటంలో పెట్టే ప్రశ్నలు అడగలేదు. వాజపేయి ప్రధానిగా వున్న రోజుల్లో ఈ అల్లుడు అధికారం చలాయించి ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టాడు. అప్పట్లో ప్రధాని కార్యాలయంపై బ్రజేష్‌ మిశ్రా, ఎన్‌ కె సింగ్‌ అనే ఉన్నతాధికారులతో బాటు యితను పెత్తనం చేసేవాడు. అతని నేపథ్యం ఎడ్మినిస్ట్రేషన్‌ కాదు. లగ్జరీ హోటళ్లలో పార్టీలు ఏర్పాటు చేసే యీవెంట్‌ మేనేజ్‌మెంట్‌ బిజినెస్‌!

బ్రజేష్‌ మిశ్రా కాంగ్రెసు హయాంలో కూడా దౌత్యశాఖలో పనిచేశాడు. బిజెపి పార్టీ ప్రముఖులైన ఆడ్వాణీ, అరుణ్‌ జైట్లే, సుష్మా స్వరాజ్‌, నరేంద్ర మోదీలకు అతను నచ్చేవాడు కాదు. అయినా అతను తనకు కావాలని వాజపేయి పట్టుబట్టడంతో ఆడ్వాణీ ప్రభృతులు ఏమీ చేయలేకపోయారు. ఆడ్వాణీ గ్రూపంటే నమితకు, రంజన్‌కు కూడా యిష్టం వుండేది కాదు. రైటిస్టు జర్నలిస్టులతో కాకుండా స్వతంత్రంగా వుంటారన్న యిమేజి కలిగిన వీర్‌ సంఘ్వి, బర్‌ఖా దత్‌, శేఖర్‌ గుప్తా వంటి వారిని చేరదీసేవారు. ఎలాగైతేనేం ప్రధాని కార్యాలయాన్ని గుప్పిట్లో పెట్టుకున్న త్రయం గురించి మీడియాలో పెద్దగా కథనాలు వచ్చేవి కావు. వినోద్‌ ఓ యిద్దరు రిపోర్టర్లను ఆ పని మీద పెట్టి సమాచారం సేకరించి 2001 మార్చిలో ''రిగ్గింగ్‌ ద పిఎంఓ'' అనే కథనాన్ని కవర్‌ స్టోరీగా ప్రచురించారు. అంతేకాదు, హిందూజా, రిలయన్సు గ్రూపులపై పిఎంఓ చూపుతున్న పక్షపాతాన్ని కూడా బయటపెట్టారు. వాజపేయికి, హిందూజాలకు చాలాకాలంగా సన్నిహిత సంబంధాలున్నాయి. బోఫోర్స్‌ కేసులో వాళ్ల పేరు బయటకు వచ్చినపుడు వారిని రక్షించమంటూ వాజపేయి ప్రధానిగా వున్న పివి నరసింహారావుకు లేఖ రాశారు కూడా. టెలికాం పరిశ్రమలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 74%కు పెంచడంలో  పిఎంఓ పాత్ర గురించి కూడా ఔట్‌లుక్‌ బయటపెట్టింది. 'మమ్మల్ని సంప్రదించకుండానే పిఎంఓ మీ సిఫార్సు మేరకు ఆ నిర్ణయం తీసుకుందని, 49%కు మించి ఎఫ్‌డిఐ అనుమతించడం మంచిది కాద'ని టెలికాం సెక్రటరీ విదేశీ పెట్టుబడులు చూసే ఇండస్ట్రీస్‌ సెక్రటరీకి 2001 జనవరిలో రాసిన లేఖ కాపీని ప్రచురించింది. 

ఇదే కాకుండా ఐయేయస్‌ అధికారి డా|| ఇఎఎస్‌ శర్మతో యింటర్వ్యూ సైతం ప్రచురించింది. నిజాయితీపరుడిగా పేరున్న శర్మ 36 సం||ల కెరియర్‌లో 22 సార్లు బదిలీ చేయబడ్డారు. చివరి బదిలీ ఉత్తర్వులు ఆయనకు పంపలేదు. మీడియాలో చూసి బదిలీ గురించి తెలుసుకోవచ్చింది. దాంతో ఆయనకు ఒళ్లు మండి వీళ్ల పత్రికకు యింటర్వ్యూ యిచ్చి పిఎంఓను ఏకేశాడు. 'నిర్ణయాలు తీసుకోవలసినది కాబినెట్‌. విభిన్న మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం చేయడమే పిఎంఓ బాధ్యత. అన్ని నిర్ణయాలు పిఎంఓ తీసుకోవడం చాలా ప్రమాదకరమైన ధోరణి. (మోదీ హయాంలో కూడా అలాగే జరుగుతోందని, తక్కిన మంత్రులు, అధికారులు డమ్మీలవుతున్నారని ఆరోపణలున్నాయి). ఒడిశాలో రిలయన్సు నెలకొల్పుతున్న రూ. 20 వేల కోట్ల హీర్మా ప్రాజెక్టుకై కేంద్ర ప్రభుత్వం కౌంటర్‌ గ్యారంటీ యివ్వాలని పిఎమ్‌ఓ నిర్ణయించడం తప్పు. హిందూజాలు తాము పెట్టబోయే పవర్‌ ప్రాజెక్టుకి ప్రభుత్వం నుండి కౌంటర్‌ గ్యారంటీ తెప్పించుకోవాలని ప్రయత్నించారు. పవర్‌ సెక్రటరీగా నేను వ్యతిరేకించాను. వాళ్లు చాలా బలవంతులు, కేంద్ర కాబినెట్‌ సమావేశాలను తమకు కావలసినపుడు ఏర్పాటు చేయించగలరు, ఏ రాష్ట్రంలోనైనా సరే తమకు అడ్డు వచ్చిన అధికారులపై కేంద్రానికి ఫిర్యాదు చేసి  తప్పించివేయగలరు. చివరకు కౌంటర్‌ గ్యారంటీ విషయంలో నన్ను పవర్‌ మినిస్ట్రీ నుండి బదిలీ చేయించేశారు. టెండర్లు పిలిచి ఎక్కువ ధర ఆఫర్‌ చేసినవారికి లైసెన్సులు యిచ్చాక పోటీదారుల అభ్యర్థన మేరకు తిరగదోడడం ప్రమాదకరమైన పని. అలాగే ఫీజు చెల్లించడానికి ఒక గడువు నిర్ణయించాక, అది చెల్లించనివారికోసం తాత్కాలికంగా గడువు పెంచడం కూడా తప్పే. ఇలా చేస్తే ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బ తింటుంది. గత ఏడాదిన్నరగా పిఎంఓ నియమించిన మంత్రిబృందం (జిఓఎమ్‌) సిఫార్సు మేరకు ప్రస్తుతం టెలికాం రంగంలో జరుగుతున్న యీ పధ్దతి, రేపు పవర్‌ సెక్టారుకు, రహదారుల విభాగానికి కూడా పాకవచ్చు.'' అని చెప్పాడాయన.

కథనం బయటకు రాగానే పిఎంఓలో సంచలనం. ''ఔట్‌లుక్‌''ని బిజెపి వ్యతిరేక పత్రికగా ముద్ర కొట్టి తప్పించుకోవచ్చు. కానీ శర్మ యింటర్వ్యూలోని వాస్తవాలను ఖండించడం ఎలా? వాజపేయి వినోద్‌ మెహతాను యింటికి టీకి పిలిచి ముచ్చటించాడు. 'ఎన్‌కె సింగ్‌ను బ్రజేష్‌ తెచ్చాడు, కావాలంటే అతన్ని తప్పించగలను కానీ బ్రజేష్‌, రంజన్‌ చాలా మంచివాళ్లు, వాళ్ల గురించి నీకు అనవసరంగా దురభిప్రాయం ఏర్పడింది' అంటూ వాజపేయి చివాట్లు వేశాడు. వినోద్‌ తల వూపి వూరుకున్నాడు. అంతలో వాజపేయి టాపిక్‌ మార్చి బిజెపి వ్యవహారాలపై ''ఔట్‌లుక్‌''లో వ్యాసాలు రాసే కరస్పాండెంట్‌ సబా నక్వీపై విరుచుకుపడ్డాడు. బిజెపి గురించి రాసే బాధ్యత వేరేవాళ్లకు అప్పగిస్తే మంచిది కదా అన్నాడు. వినోద్‌ ఏ సమాధానమూ చెప్పకుండా వచ్చేశాడు. రంజన్‌ పాత్రపై లోతుగా పరిశోధించమని యిద్దరు రిపోర్టర్లకు పని అప్పచెప్పాడు. తెహల్కా టేపుల్లో అప్పటి బిజెపి అధ్యకక్షుడు బంగారు లక్ష్మణ్‌ 'రంజన్‌ పవర్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డీల్స్‌పై దృష్టి కేంద్రీకరిస్తున్నాడ'ని చెప్పారు. వాజపేయికి అభిమాన పాత్రమైన స్వర్ణ చతుర్భుజి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు సంబంధించిన భారీ ప్రాజెక్టు. బోల్డు నిధులు కేటాయించారు. ఆర్‌ కె గుప్తా అనే ఆరెస్సెస్‌ స్వయం సేవక్‌ 'రంజన్‌ పార్టీ కోసం కాకుండా తన కోసమే పని చేసుకుంటున్నాడు. ఒక డీల్‌లో బ్రజేష్‌ను, రంజన్‌ను అతి చేయబోతే తోసిపారేశాను' అని చెప్పుకున్నది కూడా టేపులో వచ్చింది. ఇలాటి మాటలను లోతుగా తవ్వితే ఏదో ఒకటి బయటపడుతుందని ఔట్‌లుక్‌ రిపోర్టర్లు ప్రయత్నిస్తున్నారు. ఔట్‌లుక్‌లో పనిచేసే తమ మనుష్యుల ద్వారా పిఎమ్‌ఓకు యీ సంగతి తెలిసింది. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఒక విందులో వాజపేయి తన సీటు వద్దకు నడుస్తూ మధ్యలో ఆగి, వినోద్‌ను పలకరించి 'నేను నీతో మాట్లాడే పని వుంది. నా తరఫున ఒకరు నీతో మాట్లాడతారు' అన్నాడు. 

కథనం అచ్చు కాబోతూండగా యిక వినోద్‌ కోసం బ్రజేష్‌ నుండి ఫోన్‌ కాల్స్‌ రాసాగాయి. 'నేను ఊళ్లో లేనని చెప్పు' అని వినోద్‌ తన సెక్రటరీకి చెప్పాడు. దాంతో బ్రజేష్‌ వినోద్‌ యింటికి ఫోను చేసి అతని తల్లితో ''మాతాజీ, ప్రధాని కార్యాలయం నుండి ఫోను వచ్చిందని చెప్పరూ?'' అంటూ అతి మర్యాదగా మాట్లాడాడు. 80 ఏళ్లు దాటిన ఆవిడ కొడుక్కి అంత పెద్దవాళ్ల నుంచి ఫోన్‌ వచ్చిందని మురిసిపోయి, ''ఇంటికి రాగానే తప్పకుండా ఫోన్‌ చేయిస్తాను'' అని మాట యిచ్చేసింది! అఫ్‌కోర్సు, ఆవిడ చెప్పిన సంగతి విని వినోద్‌ నవ్వేసి వూరుకున్నాడు. మొత్తానికి 2001 మార్చి చివరివారంలో ''వాజపేయి ఏకిలీస్‌ హీల్‌'' (శరీరంలో బలహీనమైన భాగం) పేర రంజన్‌కు వ్యతిరేకంగా కవర్‌ స్టోరీ అచ్చయింది. రూ. 58 వేల కోట్ల జాతీయ రహదారుల ప్రాజెక్టులో రంజన్‌ తీసుకుంటున్న చొరవ సంగతి, అనుమానాస్పదమైన ఏడు మలేసియన్‌ కంపెనీలు తొలి విడత కాంట్రాక్టులు చేజిక్కించుకోవడం సంగతి, రిలయన్సు వారి హిర్మా ప్రాజెక్టులో రంజన్‌ చొరబడిన సంగతి ఆ వ్యాసంలో రాశారు. టెలికాం శాఖకు బిర్లా, రిలయన్సు, టాటా, ఎస్సార్‌ వంటి పెద్ద ప్రయివేటు ఆపరేటర్లు రూ. 3179 కోట్లు బకాయి పడ్డాయి. అప్పు తిరిగి చెల్లించడానికి గడువు పెంచమని టెలికాం మంత్రి జగ్‌మోహన్‌ను కోరాయి. అతను తిరస్కరించడంతో రంజన్‌ ద్వారా పిఎంఓపై ఒత్తిడి తెచ్చి జగన్‌మోహన్‌ను ఆ పదవి నుంచి తప్పించి తాము అనుకున్నది సాధించాయి. ఇది కూడా ఆ వ్యాసంలో రాశారు. ఈ కథనంలో వాస్తవాలను ధ్రువీకరించుకున్న జార్జి ఫెర్నాండెజ్‌ నేతృత్వంలోని సమతా పార్టీ, ఎన్‌డిఏలో భాగస్వామిగా వుంటూనే బ్రజేష్‌, ఎన్‌ కె సింగ్‌, రంజన్‌ల అవినీతిపై విచారణ జరిపించాలని కోరుతూ ప్రధానికి మార్చి 16 న లేఖ రాసింది.

బ్రజేష్‌, ఎన్‌ కె సింగ్‌ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ''ఔట్‌లుక్‌'' పేరు ఎత్తకుండానే మీడియా చేస్తున్నవి నిరాధారామైన, దురుద్దేశపూర్వకమైన ఆరోపణలు అని ప్రకటించారు. మే 29 న ''ఔట్‌లుక్‌'' ఆఫీసులపై ఇన్‌కమ్‌టాక్స్‌ దాడి జరిగింది. ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, చెన్నయ్‌, సూరత్‌, మధురై వంటి 12 నగరాల్లోని 120 ఆఫీసులపై 700 మంది అధికారులు ఉదయం 8.30 కు సోదాలకు ఉపక్రమించారు. వినోద్‌కు మతి పోయింది. ఎమర్జన్సీ రోజులను తలపిస్తూ వాజపేయి సర్కారు తమకు వ్యతిరేకంగా వచ్చిన కథనానికి ప్రతీకారం తీర్చుకుంటోందని బోధపరచుకుని, తన ఎడిటోరియల్‌ పాలసీతో పబ్లిషరుకు యీ కష్టాలు తెచ్చిపెట్టినందుకు బాధపడి, పబ్లిషర్‌ రాజన్‌కు ఫోన్‌ చేసి ''నన్ను రాజీనామా చేయమంటావా?'' అని అడిగాడు. (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2015) 

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?