Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : వినోద్‌ మెహతా - 4

ఎమ్బీయస్‌ : వినోద్‌ మెహతా - 4

అయినా అతను తెగించి పబ్లిషరు సోమానీకి ఒక ఉత్తరం రాశాడు. తను యిప్పటిదాకా చేసిన పనుల గురించి రాసి, తనకు ఆ పత్రిక సంపాదకత్వం అప్పగిస్తే ఎలా మెరుగు పరుద్దామనుకుంటున్నాడో తన ప్రణాళికలు చెపుతూ రాశాడు. వారాలు గడిచినా జవాబేమీ రాకపోవడంతో తన లేఖ చెత్తబుట్ట పాలైందనుకున్నాడు. ఇలా వుండగా సడన్‌గా సోమానీ నుంచి ఫోను వచ్చింది. తాజ్‌మహల్‌ హోటల్లో తనను కలవమని.  వినోద్‌ తన నవలలు రెండూ చూపించాడు. బొంబాయి నవలలో స్పైస్‌ హ్యేండిల్‌ చేసిన తీరు సోమానీకి నచ్చింది. మీనాకుమారి జీవితం కూడా రసవత్తరమైనదే. ఆ విషయాన్ని చెప్పీచెప్పనట్లుగా తెలియపరచిన నేర్పు కూడా మెప్పించింది. ఆ సమావేశంలో వినోద్‌ ''నాకు ఆర్నెల్లు టైమిచ్చి చూడండి. సేల్స్‌ పెరక్కపోతే మీరు యిప్పుడు చేద్దామనుకున్న పనే అప్పుడు చేయవచ్చు. పెరిగితే, నేను జీతం పెంచమనిగాని, సిబ్బంది పెంచమని గాని అడగను.'' అన్నాడు. సోమానీ ''సరే, అలాగే కానీయ్‌. నీకు రూ.2500 జీతం, అది కాకుండా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎలవెన్సు యిస్తా. ఆ అర్ధనగ్న పురుషుల ఫోటోలు తీసేయి. అమ్మాయిల ఫోటోలుండే సెంటర్‌స్ప్రెడ్‌ మాత్రం కొనసాగించు.'' అన్నాడు. వినోద్‌ తలవూపాడు. ఆ తర్వాత వినోద్‌ డెబెనేర్‌ సంపాదకుడిగా గుర్తింపు తెచ్చుకోవడం, ఒక దాని తర్వాత మరొక పత్రికలు ప్రారంభించడం యివన్నీ జరిగాయి. దానికి ఆరంభం మాత్రం యింత వింతగా జరిగింది. ఇలాటివే మనం గమనించాలి.

నా పాఠకుల్లో కొంతమంది రాస్తూ వుంటారు - ''నువ్వు రాసేదంత చెత్త. నేను నీ కంటె ఎంతో గొప్పగా రాయగలను. గ్రేట్‌ ఆంధ్రావాడు ఏదో పక్షపాతబుద్ధితో నీకు అవకాశం యిస్తున్నాడు కాబట్టి చేతికొచ్చినదల్లా రాస్తున్నావ్‌. ఆ ఛాన్సు నాకిచ్చి చూడమను, నా తడాఖా చూపిస్తాను...'' అంటూ. తమకు టాలెంట్‌ వుందనుకునేవారు అనుకుని ఆగిపోకూడదు, ఆ దిశగా అడుగులు వేయాలి, ప్రయత్నాలు చేయాలి, రిస్కు తీసుకోవాలి. గ్రేట్‌ ఆంధ్రాలో కాలమిస్టు అవకాశం నాకు వూరికే ఎవరూ కట్టబెట్టలేదు. నేను వరల్డ్‌స్పేస్‌లో రేడియో జాకీగా పనిచేసే రోజుల్లో (ఆ అవకాశం ఎలా వచ్చిందో యింకెప్పుడైనా చెప్తాను) నా తోటి ఆర్‌జెలు మైకు ముందు సునాయాసంగా మాట్లాడేసేవారు. మృణాళినిగారు వృత్తి రీత్యా ప్రొఫెసరు, ప్రవృత్తి రీత్యా ఆకాశవాణితో, టీవీతో దశాబ్ధాల అనుబంధం. చేతిలో కాగితం లేకుండా గంటల తరబడి మాట్లాడగలరు. నందినీ రెడ్డి (''అలా మొదలైంది''తో డైరక్టరు అయ్యారు), నాని (అవును, సినిమా హీరో నానే), సుష్మ (సంగీతంలో దిట్ట, ప్రస్తుతం స్క్రిప్టులు రాస్తున్నారు), సుషుమ్న, రావి కొండలరావు గారు.. వీళ్లంతా కాగితంమీద నాలుగైదు పాయింట్లు నోట్‌ చేసుకుని వచ్చి గడగడా మాట్లాడేసేవారు. నేను మాత్రం ఫుల్‌స్టాపు, కామాల దగ్గర్నుంచి అన్నీ రాసుకుని (అదే.. టైపు కొట్టుకుని) చదివేవాణ్ని. కార్యక్రమం పేరు ''పడక్కుర్చీ కబుర్లు''. కాజువల్‌గా, ఆశువుగా మాట్లాడినట్లు వుండాలి. ప్రసంగవ్యాసంలా వుండకూడదు. సహజంగా నటించడానికి చాలా కసరత్తు చేయాలంటారే, అలా ఊసుపోక కబుర్లు చెపుతున్నట్లు తోచేట్లా చేయడానికి చాలా శ్రమ పడేవాణ్ని. రెస్పాన్సు చాలా బాగా వచ్చింది. 

అప్పట్లో సిరాశ్రీ గ్రేట్‌ ఆంధ్రాలో పనిచేస్తూ వుండేవారు. ఆయన నాకు అప్పటికి రెండేళ్లగా తెలుసు. ''మీ కబుర్లు మా వెబ్‌సైట్‌లో పెట్టవచ్చు కదా'' అని అడిగారు. ''మీ వెబ్‌సైట్‌లో అంతా వార్తలే కదా, వ్యాసాలెక్కడ వున్నాయి?'' అన్నాను. ''మీరు చెప్పేవాటిల్లో సినిమాకు సంబంధించిన వ్యాసాలు వారానికి ఒకటి యివ్వండి. పెట్టి చూస్తాం'' అన్నారు. టైపు కొట్టుకొన్న కారణంగా ఆ మ్యాటరంతా నా సిస్టమ్‌లోనే వుంది. సరే అని వారానికి ఒకటి పంపించేవాణ్ని. గ్రేట్‌ ఆంధ్రా పాఠకులకు అవి నచ్చాయి. ఇంకా పంపకూడదా అని అడిగారు. తక్కినవి సీరియస్‌ టాపిక్సు, గాసిప్స్‌ చదివే మీ పాఠకులకు నచ్చుతాయో లేదో అన్నాను. ట్రై చేద్దాం అన్నారు. అవీ నచ్చాయి. దాంతో 'మీరు రెగ్యులర్‌గా, నడుస్తున్న సంఘటనలపై వ్యాఖ్యానిస్తూ కాలమ్‌ నడపకూడదా' అన్నారు. అలా ''ఎమ్బీయస్‌ కబుర్లు'' శీర్షిక 2008 నవంబరులో మొదలైంది. నెలకు 15 రాద్దామనుకుని మొదలుపెట్టి, సబ్జక్టులలో వెరైటీ పెంచుకుంటూ,  రకరకాల రుచులు పాఠకులకు అలవాటు చేస్తూ ఆరేళ్ల తర్వాత యిప్పుడు అంతకు మూడు రెట్లు రాస్తున్నాను. ఈ రోజు నా కున్న స్థానం ఒక్కసారిగా వచ్చి ఒళ్లో పడలేదు కదా. కొందరనుకుంటున్నట్లు పబ్లిషరు నాకు బంధువూ కాదు, పరిచయస్తుడూ కాదు. సిరాశ్రీ నాతో ప్రయోగం చేస్తానంటే సరేనన్నాడాయన. 

పాఠకులు ఆమోదించడంతో కొనసాగించాడు. మా యిద్దరి మధ్య యింటరాక్షన్‌ కూడా ఏమీ వుండేది కాదు. నేను సైట్‌కి రాయడం మొదలుపెట్టిన మూడేళ్ల తర్వాత సిరాశ్రీ సోదరి వివాహంలో ప్రత్యక్షంగా కలిశాను. అమాయకులైన పాఠకులు కొందరు ఏవేవో వూహిస్తారు. వృత్తిపరమైన సమీకరణాల్లో ప్రతిభ తప్ప వేరేదీ పనిచేయదు. నా కలంలో పస తగ్గిందని తోస్తే మర్నాడే నాకు ఉద్వాసన చెపుతారు. ఔత్సాహిక రచయితలు, సంపాదకులు యిది గుర్తించాలి. తమలో ప్రతిభ వుందని అనుకోగానే సరికాదు. దాన్ని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేయాలి. 'మీకు పంపుతున్నాను, చదివి ఎలా వుందో చెప్పండి, ప్రోత్సహించండి' అంటూంటారు. నాకెందుకు? ఏదైనా పత్రికకు పంపండి, బావుంటే వాళ్లే వేస్తారు కదా అంటాను నేను. 'తిరస్కరిస్తే డిస్కరేజ్‌ అయిపోతాం' అంటారు. అయితే ఎలా? ఇప్పటికి కూడా నావి కొన్ని రచనలు తిరిగి వస్తున్నాయి. డెబెనేర్‌ విజయం తర్వాత కూడా వినోద్‌ జీవితం సజావుగా సాగలేదు. ఆటుపోట్లు ఎన్నో వచ్చాయి. 53 ఏళ్ల వయసులో ఒక ఏడాది పాటు నిరుద్యోగిగా వున్నాడు. మళ్లీ కొత్త ప్రయత్నం చేశాడు. విజయానికి అడ్డదార్లు లేవు. గెలిచినవారందరికీ ఏదో పలుకుబడి వుందనో, కులబంధం వుందనో అనుకుని తమను తాము ఓదార్చుకునే బదులు ప్రతిభను పెంచుకుంటూ, ప్రయత్నాలు చేస్తూ వుంటేనే మంచిదని చెప్పడానికే యిదంతా చెప్పాను. 

డెబెనేర్‌ కేవలం అమ్మాయిల బొమ్మల వలననే సక్సెసైంది అనుకుంటే పొరబాటు. ఆ విషయం నేను మొదటి భాగంలోనే చెప్పాను. వినోద్‌ దానిపై చాలా కృషి చేశాడు. అతను ఆఫీసులో చేరేసరికి అతనికి అసిస్టెంటుగా యిద్దరు మహిళలు వుండేవారు. ఒకావిడ మధ్యవయస్సులో వున్న అవివాహితురాలు. ఇంకో అమ్మాయి టీనేజరు. ఇద్దరికీ ఒక్క క్షణం పడేది కాదు. ఇద్దరికీ కామన్‌గా వున్న లక్షణం ఏమిటంటే గుడ్డలిప్పుకున్న అమ్మాయిల ఫోటోలంటే యిద్దరికీ రోత. ఆ ఫోటోలను చేత్తో తాకనైనా తాకేవారు కాదు. ఏ ఫోటో బాగుందని అడుగుదామంటే ఏదో పనుందని చెప్పి అర్జంటుగా మాయమై పోయేవారు. ఇలాటి వారిని పెట్టుకుని 'ప్లేబోయ్‌' పత్రిక నకలు నడపడం ఎలా? (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2015)

mbsprasad@gmail,com

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?