Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : ఏకవీరుడు ట్రంప్‌ గెలిచాడు

ఎమ్బీయస్‌ : ఏకవీరుడు ట్రంప్‌ గెలిచాడు

అమెరికా ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ డోనాల్డ్‌ ట్రంప్‌ గెలిచేశాడు. తను గెలిస్తే వలసదారుల పని, భారత్‌కు ఔట్‌సోర్సింగ్‌ చేసే కంపెనీల పనీ పడతానన్నాడు కాబట్టి మన భారతీయ మీడియా అతనిపై కత్తి కట్టేసిందంటే అర్థం చేసుకోవచ్చు. రష్యా, చైనా పేపర్ల సంగతేమో కానీ తక్కిన ప్రపంచమంతా ట్రంప్‌ని వెక్కిరించి వెక్కిరించి వదిలిపెట్టింది. అమెరికాను మళ్లీ ఉన్నత స్థానాలకు తీసుకెళతానన్న అతనిపై అమెరికా మీడియా కక్ష పూనింది. 77 పత్రికలు, టీవీ ఛానెళ్లు వుంటే ఒకటి, రెండు తప్ప మరేవీ అతని పక్షాన నిలవలేదట. తమ ఉదార విధానాలకు అతను విరుద్ధం కాబట్టి వ్యతిరేకిస్తున్నాం అని చెప్పుకున్నా తప్పు లేదు. ప్రజలంతా అతన్ని అసహ్యించుకుంటున్నారంటూ సర్వే ఫలితాలు వెలువరించి వాస్తవాలకు మసిపూశాయి. అది దుర్మార్గం. సుమారు 70 పాయింట్ల తేడాతో ట్రంప్‌ గెలిచాడంటే అది మామూలు విజయం కాదు. దీని సంకేతం కొన్ని సర్వేలలోనైనా బయటపడి వుండాలి. హిల్లరీపై ఎఫ్ బిఐ పునర్విచారణ సందర్భంగా ట్రంప్‌కు కాస్త మొగ్గు వుందన్నారు కానీ అంతలోనే పరిస్థితి తారుమారైందన్నారు. 6% మార్జిన్‌తో హిల్లరీ విజయం తథ్యమన్నారు.

స్వభావరీత్యా గుంభనగా వుండే ప్రజలున్న భారత్‌లో సర్వే అంచనాలు తప్పాయంటే అర్థం చేసుకోవచ్చు. 'నేను ముద్దు మాత్రమే పెట్టుకోమన్నాను, అతను బుగ్గ కూడా కొరికాడు' అనే ఫిర్యాదులతో కోర్టుల కెక్కే ప్రజలున్న అమెరికాలో బహిరంగంగా తమ అభిప్రాయాలు వ్యక్తపరచడం సర్వసాధారణ విషయం. అలాటి చోట సర్వేలు యింత దారుణంగా తప్పడమంటే దాని అర్థం సర్వే నిర్వాహకులు కావాలని ఫలితాల్లో చేయి చేసుకున్నారనే! డెమోక్రాటిక్‌ పార్టీ ట్రంప్‌ ప్రతిష్ఠ (ఏదైనా వుండి వుంటే, ఎన్నికల్లోకి దిగాక దానిలో ఏదైనా మిగిలి వుంటే) దిగజార్చడానికి చేయని ప్రయత్నం లేదు. దానికి వాచాలతతో ట్రంప్‌ తన వంతు సాయం తను చేశాడు. వలసదారులు, యితర దేశస్తులు, మైనారిటీలు, హిస్పానిక్స్‌ వంటి ఎంతమంది మద్దతు వున్నా హిల్లరీ నెగ్గితే తను తొలి మహిళా అధ్యక్షురాలు అనే విషయాన్ని బాగా చాటుకుంది. జనాభాలో సగం మంది స్త్రీలు. 'మన కంటె ఎన్నోవిధాల వెనకబడిన ఇండియాలోనే ఏభై యేళ్ల క్రితమే మహిళ ప్రధాని కాగా లేనిది, మన దేశంలో యిప్పటివరకూ మహిళ ముఖ్యపదవిలో లేకపోవడం షేమ్‌షేమ్‌' అని వారిలో సగం మంది అనుకున్నా తన గెలుపు ఖాయ మనుకుంది హిల్లరీ.

తను మహిళ కావడంతో బాటు ట్రంప్‌ మహిళా వ్యతిరేకి, వారిని చులకనగా చూస్తాడు అనే భావనను ఓటర్ల మెదళ్లలో నాటడానికి హిల్లరీ సకలయత్నాలు చేశారు. అతను కాజువల్‌గా ఆడవాళ్ల గురించి మాట్లాడిన వాటి ఆడియో టేపులు ఎప్పటెప్పటివో బయటకు లాగి తమ దగ్గర వూరేసి, ఎన్నికల సమయంలో విడుదల చేశారు. మహిళలను వేధించాడని చూపడానికి అనేకమంది మహిళల చేత అర్జంటుగా స్టేటుమెంట్లు యిప్పించారు. ఇక అక్కణ్నుంచి అతని నైతికతపై అందరూ తీర్పులిచ్చేయసాగారు. ట్రంప్‌ వాగిన వాగుడు అనేకమంది మగాళ్లు వాగే వాగుడే. ఇక అక్కడ గిల్లాడు, యిక్కడ ఒత్తాడు అని యిన్నేళ్ల తర్వాత చెప్పుకున్న ఆడవాళ్ల దగ్గర 'వెంటనే చెంప పగలకొట్ట లేకపోయావా? ఇన్నాళ్లూ ఎందుకు వూరుకున్నావ్‌?' అని అడిగితే  సమాధానం లేదు. ప్రతిఘటిస్తే అప్పుడే ప్రతిఘటించాలి. లేదా ఇప్పుడు మళ్లీ చేయబోతే అప్పుడు పాతది బయటపెట్టాలి. ఇప్పుడేమీ జరగనప్పుడు చెప్పుకోవడం దేనికి? ఎన్నికలలో ఓడించడానికేగా! వ్యాపారపరమైన, ఉద్యోగపరమైన అక్రమాల సంగతి వేరు. అవి దేశానికి, చట్టానికి వ్యతిరేకంగా చేసిన పనులు. ఎప్పుడైనా బయటపెట్టవచ్చు. ఇలాటి వ్యక్తిగతమైన విషయాల విషయంలో కుటుంబసభ్యులది మాత్రమే తలనొప్పి. వాటిపై రాద్ధాంతం చేయడం మాత్రం దురుద్దేశంతో కూడుకున్నదే. సొంత కూతురిపై కూడా అసభ్యవ్యాఖ్యలు చేసిన యిలాటి మనుషులంటే హిల్లరీకి గిట్టదు అనుకుందామంటే క్లింటన్లు, ట్రంప్‌ బెస్ట్‌ ఫ్రెండ్సాయె. ఇన్నాళ్లూ స్నేహం చేసి, ఎన్నికల సమయంలోనే మురికి దుప్పట్లన్నీ ఉతకడం మొదలెట్టారు. ట్రంప్‌ బదులు తీర్చేశాడు - హిల్లరీని 'నేస్టీ ఉమన్‌' అని. వెంటనే 'అతనికి స్త్రీలపై గౌరవం లేదు' అని గోల మొదలుపెట్టారు. మహిళా ఓటర్లు ఏ మేరకు యీ మాటలు నమ్మారో పూర్తి గణాంకాలు వచ్చాక తెలుస్తుంది.

ట్రంప్‌ వాచాలత్వం, తెంపరితనం, అసభ్యత, పరుషపదజాలం, తెలివితక్కువ వ్యాఖ్యలు చూసి ప్రజలు అతన్ని అసహ్యించుకుంటున్నారని డెమోక్రాట్లు చేసే ప్రచారం విని, తమ అభ్యర్థి గెలవడనే తీర్మానానికి వచ్చేసి, అనవసరంగా అతనికి టిక్కెట్టిచ్చామని వగచి, రిపబ్లికన్‌ పార్టీ పెద్దలెందరో అతన్ని సమర్థించడం మానుకున్నారు. అయినా ట్రంప్‌ జావ కారిపోలేదు. నెగ్గుతా, నెగ్గుతా అంటూ సొంతంగా ఒంటికాయ సొంటికొమ్ములా తిరిగాడు. అటు హిల్లరీకి ఒబామా, బిల్‌లు అండగా నిలిచారు. హిల్లరీ కున్న తెలివితేటల ముందు ట్రంప్‌కున్న విషయ పరిజ్ఞానం శూన్యం అని ఓటర్లకు అర్థమయ్యేట్లు చెప్పారు. ఆ పాయింటు ఓటర్లకు అర్థమైంది. అయినా అతన్నే గెలిపించారు. ఎందుకంటే మాకు తెలివైన పాలకుడు అక్కరలేదు, మనసున్నవాడు, మా మనసెరిగినవాడు చాలు అనేశారు. ప్రచారసందర్భంగా ట్రంప్‌ చాలా అవాకులూ, చెవాకులూ వాగాడు. అమెరికన్‌ సమాజాన్ని ముక్కలుముక్కలుగా చూసి, అస్మదీయులు, తస్మదీయులు అంటూ విడగొట్టి మాట్లాడాడు. అమలు చేయలేని విద్వేషపూరిత పథకాలను కటువైన భాషలో వెలిబుచ్చాడు. ఏ రాజకీయనాయకుడూ అలా చేయలేడు. అందరికీ అన్నీ యిస్తానంటూ ఆశపెట్టి ఎవరికీ ఏమీ చేయకపోవడమే అసలైన రా.నా. లక్షణం. సాంప్రదాయ రా.నా. కాదు కాబట్టే ట్రంప్‌ యీ వర్గానికే చేస్తాను, ఆ వర్గాలకు చేయను అని చెప్పేశాడు. నెగ్గాక యిక అలా అనడనుకోండి, సరిహద్దుల్లో గోడలూ కట్టలేడు, ఎవరినీ తరిమివేయనూ లేడు, ఔట్‌సోర్సింగ్‌ రాత్రికి రాత్రి అపనూ లేడు. ఇవి ఓటర్లకూ తెలుసు. అయినా అతనొక ఫిలాసఫీని ప్రవచించాడు- మనకు గ్లోబలైజేషన్‌ అనవసరం, యితరుల విషయాల్లో జోక్యం అనవసరం, మన సంగతి మనం చూసుకుంటే, మన ఏడుపు మనం ఏడిస్తే, ప్రపంచ పెత్తనం నెత్తిమీద వేసుకోకుండా ముందు మన యిల్లు మనం దిద్దుకుంటే ఎప్పటికో అప్పటికి బాగుపడతాం - అని. 

ఆ ముక్క సాధారణ ఓటరు మనసుకు హత్తుకుంది. చాలా ఏళ్లగా అతను ఫీలవుతున్నదీ అదే. పేరడైమ్‌ షిఫ్ట్‌ అంటారే, మౌలిక దృక్కోణంలో మార్పు, అది యితనిలో కనబడింది. హిల్లరీ అయితే ఒబామా వారసత్వం కొనసాగిస్తానని ముందు నుంచీ చెపుతోంది. పదేళ్లగా దాని ఫలితాలు అనుభవిస్తూ ప్రభుత్వ వ్యతిరేకత పెంచుకున్న ప్రజలు, హిల్లరీ 'తప్పయిపోయింది, సరిదిద్దుకుంటాను' అనకుండా దాన్ని యింకా ముందుకు తీసుకుపోతానంటోంది అనడంతో దడిశారు. దశాబ్దాలుగా దేశంలో పెరిగిన సంపదనంతా స్వాహా చేసిన మోతుబరులందరూ హిల్లరీని సమర్థిస్తూ వుండడం వారిలో మరింత భయాన్ని రేపింది. ప్రస్తుత వ్యవస్థలోని అస్తవ్యస్తతను ఎత్తిచూపిన ట్రంప్‌ తమ మనసులను చదివాడనిపించి అతన్ని సమర్థించారు. ఇప్పుడు యీ ముక్క అందరూ చెప్తారు. ఎన్నికలకు ముందు జరిగిన సర్వేలలో యీ ముక్క ఏ సర్వే ఎందుకు చెప్పలేకపోయింది? లేక కావాలని చెప్పలేదా? ఈ సర్వేలు చూసి ట్రంప్‌ గుండె జారలేదా? జారకపోవడానికి కారణం ఎన్నికల్లో దిగేందుకు ముందు అతని వ్యక్తిగతంగా చేయించుకున్న సర్వే అంటున్నారు కొందరు. అంటే అది కొన్ని నెలల క్రితం జరిగిన సర్వే. ప్రచారసమయంలో ఎన్నో మార్పులు వస్తాయి. మరి ట్రంప్‌ ధైర్యం చెదరకపోవడానికి కారణం ఏమిటి? అతనే చెప్పాలి.

సర్వే అంచనాలు తప్పడానికి గల కారణాలు అంటూ కొన్ని చెప్పారు. వాటిల్లో ఎటూ తేల్చనివారు 6% వుండడం ఒకటి, మూడో అభ్యర్థి పట్టుకుపోయే ఓట్ల శాతం ఎంత వుంటుందో అంచనాకు అందకపోవడం మరొకటి, హిస్పానిక్స్‌, బ్లాక్స్‌ ఎటు ఓటేస్తారు అన్న సంగతి యింకోటి, అన్నిటికంటె ముఖ్యమైనది ట్రంప్‌ను రహస్యంగా సమర్థించిన వారెందరో తెలియకపోవడం!  ట్రంప్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం చూసి దడిచి, 'ఎన్ని అవలక్షణాలున్నా అతనికే ఓటేస్తాను' అని ధైర్యంగా చెప్పలేని వారు గణనీయమైన సంఖ్యలో వున్నారుట. బయటకు చెప్తే 'అయితే నువ్వూ ట్రంప్‌లా సంస్కారహీనుడన్నమాట' అంటారన్న భయం కావచ్చు. వాళ్లంతా తటస్థులుగానో, హిల్లరీ సమర్థకులుగా  తమను తాము చెప్పుకుని చివరకు బూతు దగ్గరకి వెళ్లినపుడు మాత్రం తమ ప్రియతమ నాయకుడు, ఆశాజ్యోతి ఐన ట్రంప్‌కు గుద్దేశారు. వారిలో అన్ని వర్గాలు వున్నాయా, లేదా? హిల్లరీకి అధికశాతంలో ఓట్లెలా వచ్చాయి? అయినా ఆమె ఎందుకు గెలవలేకపోయింది? ట్రంప్‌ గెలుపు భారతీయ సమాజంపై ఎలాటి ప్రభావం చూపుతుంది? ఇత్యాది అనేక విషయాలను యితర వ్యాసాలలో పరామర్శిద్దాం.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?