Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: యోగి ఆదిత్యనాథ్‌ ఎంపిక

ఎమ్బీయస్‌: యోగి ఆదిత్యనాథ్‌ ఎంపిక

ఉత్తరప్రదేశ్‌లో అద్భుతమైన ఫలితాలు సాధించిన బిజెపి ముఖ్యమంత్రి పదవికి యోగి ఆదిత్యనాథ్‌ను ఎంపిక చేసి ఆశ్చర్యపరిచింది. ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నవారి పేర్లు చాలానే వినబడ్డాయి. గతంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ అవినీతిరహిత, సమర్థ పాలన అందించారు కాబట్టి ఆయన్నే పంపుతారని ఎక్కువమంది వూహించారు. లాల్‌ బహదూర్‌ శాస్త్రి మనుమడితో సహా యింకా కొన్ని పేర్లు వినబడ్డాయి. ముస్లిములకు అస్సలు టిక్కెట్లు యివ్వలేదు కాబట్టి వారిని ఊరడించడానికి నక్వీని ముఖ్యమంత్రి చేస్తారన్న జోకు లాటి వార్త కూడా వచ్చింది. యాదవేతర బిసిలను ఆకట్టుకోవడానికి వారిలో ఒకరిని ముఖ్యమంత్రి చేస్తారనీ అన్నారు. చివరకు రాజపుత్ర కులంలో పుట్టిన యోగిని ముఖ్యమంత్రి చేసి, యిద్దరు ఉపముఖ్యమంత్రులుగా లఖనవ్‌ మేయరుగా చేసిన బ్రాహ్మణుడు దినేశ్‌ శర్మని, రాష్ట్ర అధ్యక్షుడుగా చేసిన బిసి కేశవ్‌ మౌర్యను వేశారు. వీరు ముగ్గురు కాక 22 మంది కేబినెట్‌ మంత్రులు, 22 మంది సహాయమంత్రులు, మొత్తం 47 మంది. వీరిలో సగం కంటె ఎక్కువగా 26 మంది అగ్రవర్ణులు, దళితులు ముగ్గురు, ముస్లిం ఒకరు. తక్కినవారు బిసిలు. ఉపముఖ్యమంత్రి ఐన మౌర్య స్థానంలో దళితుడి నెవరినైనా రాష్ట్ర అధ్యక్షుడు చేస్తారేమో చూడాలి. 

రాజపుత్‌ నెవరినైనా ముఖ్యమంత్రి చేద్దామనుకుంటే పాలనానుభవం బాగా వున్న రాజ్‌నాథ్‌ సింగ్‌నే చేయవచ్చు. కానీ ఎన్నడూ మంత్రిగా కూడా చేయని యోగిని ఎందుకు ఎంపిక చేసినట్లు? యుపి చాలా పెద్దది. వెనుకబడినది. కులసంఘర్షణలు, మతసంఘర్షణలు ఎక్కువ. వాటిని అదుపు చేయాల్సిన పోలీసు యంత్రాంగంలో కూడా కుల, మత భావనలు చొచ్చుకుని పోయాయి. ఆధునికత, రహదారుల వంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తక్కువే కాబట్టి కమ్యూనికేషన్‌ కూడా అంత బలంగా లేదు. దీన్ని పాలించడం చాలా కష్టం. పూర్వానుభవం లేకుండానే మాయావతి, అఖిలేశ్‌ ముఖ్యమంత్రులై చేతులు కాల్చుకున్నారు, ఓడిపోయారు. ఇవన్నీ తెలిసి యోగితో బిజెపి ప్రయోగం చేస్తోంది. ఎస్పీ, బిఎస్పీ ప్రభుత్వాలపై వున్న ఆశల కంటె రెట్టింపు ఆశలు బిజెపి ప్రభుత్వంపై పెట్టుకున్నారు యుపి ప్రజలు. వాటిని నెరవేర్చాలంటే బృహత్‌ప్రయత్నం చేయాలి. పాలనలో దిట్ట అయివుండాలి. అంతేకాదు, యింకో విషయం కూడా వుంది. కాబినెట్‌లో తన కంటె సీనియర్లు, పాలనలో అనుభవజ్ఞులు వుండడం చేత వారితో వ్యవహరించేటప్పుడు కూడా మెలకువగా వుండాలి. 

రాజకీయంగా కూడా పెద్ద యిబ్బంది వుంది. ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో బిజెపి యితర పార్టీల నుంచి నాయకులను ఫిరాయింపు చేసుకుంది. వారిలో ఆరెస్సెస్‌, జనసంఘ్‌, బిజెపి భావాలంటారా, మన పురంధరేశ్వరి, కావూరి సాంబశివరావు వగైరాలలో ఏ స్థాయిలో వుందో వాళ్లలోనూ అంతే వుంది. ఇటువంటి వారినందరినీ కలుపుకుని జట్టుకట్టి ముందుకు నడవడం కష్టమైన పని. దానికి రాజనీతిజ్ఞత కూడా అవసరం. ఈ విషయాలన్ని దృష్టిలో పెట్టుకునే యుపి ముఖ్యమంత్రి ఎవరవుతారా అన్న ఆసక్తి నెలకొంది. చివరకు బిజెపి అధినాయకత్వం ఎంచుకున్నది యోగిని! ఆయన ఐదుసార్లు ఎంపీగా గెలిచాడు కానీ పూర్వాంచల్‌లోని ఒకే నియోజకవర్గం నుంచే గెలిచాడు. రాష్ట్రమంతటా ఆయనకు అనుయాయులున్నారని చెప్పడానికి ఏమీ లేదు. యోగికి వచ్చిన పేరంతా హిందూ అతివాదిగానే! అతని యిరుక్కున్న వివాదాలు చూసి బిజెపి నాయకత్వమే దడుచుకుందట. మరి అలాటి వ్యక్తిని మోదీ ఎంపిక చేయడమేమిటి? అని పరిశీలకుల ఆశ్చర్యం ! యోగి నియామకం వెనక ఆరెస్సెస్‌ ఉందన్న వార్త ఎంత బలంగా వచ్చిందంటే దానిలో వాస్తవం లేదని వెంకయ్య నాయుడు ప్రకటించవలసి వచ్చింది. ఎమ్మెల్యేలందరూ కోరారు కాబట్టే యోగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని వెంకయ్య చెప్పారు. అధిష్టానం ఎవర్ని ఎంపిక చేస్తే వాళ్లకే చేతులెత్తే సంస్కృతి అన్ని పార్టీలలోనూ ఎప్పుడో వచ్చేసింది. అందువలన మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం.. లాటి మాటలు మనం పట్టించుకోనక్కరలేదు. మోదీ కోరుకున్నారు, అది జరిగింది. అంతే అనుకోవాలి. వాస్తవం వారికే  తెలియాలి. 

మోదీ రాజకీయాలు గమనిస్తే - ఒక విషయం తేటతెల్లమౌతుంది. అతను మతాన్ని రాజకీయాల కోసం వాడుకున్నాడు తప్ప అవతలి మతం వారిపై బహిరంగంగా విషం కక్కలేదు. తను పార్టీలో బలపడడానికి, ముఖ్యమంత్రి సీటులో కుదురుకోవడానికి చేసిన ప్రయత్నం 2002 నాటి గోధ్రా అల్లర్లు. ఒకసారి తనకు ఎదురు లేదు అనుకున్నాక, గుజరాత్‌లో హిందూ-ముస్లిం అల్లర్లు జరగనీయలేదు. ముస్లింలపై ప్రత్యేకమైన కక్ష సాధింపు చర్యలూ చేపట్టలేదు. ముస్లింలను అదుపులో పెట్టి, గుజరాత్‌ అభివృద్ధి పైనే ఫోకస్‌ పెట్టాడు. చేసిన దాని కంటె మూడు రెట్లు ప్రచారం చేసుకున్నాడు. జాతీయ నాయకుడిగా ఎదిగాడు. మోదీ ఒకప్పుడు ఆరెస్సెస్‌ కార్యకర్త ఐనా ఎదిగాక వారిద్దరి మధ్య సంబంధాలు మారుతూ వచ్చాయి. ఆరెస్సెస్‌ కానీ విశ్వ హిందూ పరిషత్‌ కానీ వాళ్లు చెప్పినదల్లా ఆయన వినలేదు. రోడ్ల విస్తరణ టైములో మసీదులతో బాటు గుళ్లూ కూల్చేసినపుడు ఆరెస్సెస్‌ ఆందోళన చేసినా ఖాతరు చేయలేదు. ఆరెస్సెస్‌కు కూడా మోదీ ఫస్ట్‌ ఛాయిస్‌ కాదు. అయితే 2014 పార్లమెంటు  ఎన్నికలు దగ్గర పడుతూండగా ఆరెస్సెస్‌, మోదీ రెండూ ఎదుటివాళ్ల బలాన్ని గుర్తించాయి. ఇద్దరూ ఒక తాటిమీదకు వస్తేనే గెలుపు సాధ్యమని అర్థం చేసుకున్నాయి. రాజీ పడ్డాయి. మోదీ వాజపేయి వంటి ఉదారవాది కాదు అనేది ఆరెస్సెస్‌కు ఊరట. ఎత్తుపైయెత్తులు వేయడంలో తను దిట్ట కాబట్టి, యిప్పుడున్న పరిస్థితుల్లో ప్రజాదరణలో తనకు సాటి వచ్చే నాయకుడు లేడు కాబట్టి, ఆరెస్సెస్‌ను తనని ఆడించలేదనేది మోదీ ధీమా. 2014లో మోదీ రాజకీయాలకు, కార్పోరేట్ల మద్దతుకు తోడుగా ఆరెస్సెస్‌ కార్యకర్తల కృషి కలిసి రావడంతో 2014 అద్భుత విజయం సిద్ధించింది. అంతకు ముందు నుంచీ మోదీ పార్టీలో ఎదుగుతూ వచ్చి పార్టీపై ప్రభుత్వంపై ఏకచ్ఛత్రాధిపత్యం సాధించాడు. అతని ఛాయామూర్తి అమిత్‌ షా కూడా ఆరెస్సెస్‌ నుంచి వచ్చినవాడే. 2014 తర్వాత ఆరెస్సెస్‌, దాని అనుబంధ సంస్థల ప్రాబల్యం దేశంలో, ప్రభుత్వ సంస్థల్లో విపరీతంగా పెరుగుతూ వచ్చింది. కానీ అదంతా మోదీ ఆమోదంతోనే, అతను అనుమతించిన మేరకే సాగుతోంది. 

సమాజంలో కొన్ని వర్గాలతో ఆరెస్సెస్‌కు పని లేదు. వాళ్లెలా పోయినా, వాళ్ల మనోభావాలు ఏమై పోయినా, వాళ్లకు న్యాయం జరిగినా జరగకపోయినా ఖాతరు లేదు. అందువలన అది ఎంత కటువుగానైనా మాట్లాడగలదు, వ్యవహరించ గలదు. కానీ దేశాధినేత అలా వుండలేడు. వ్యక్తిగత యిష్టాయిష్టాలు ఎలా వున్నా, ఒక పద్ధతి, ఒక మర్యాద, ఒక సంప్రదాయం, ఒక వ్యవస్థ మీరి వెళ్లలేడు. ఇష్టం వున్నా లేకపోయినా విభిన్న వర్గాలతో కలసి మెలసి వుంటూ పనులు సాధించుకోవాలి. లేకపోతే జాతీయంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా మాట పడవలసి వస్తుంది. రామమందిరం కోసం రథయాత్ర చేసిన ఆడ్వాణీ తను ఐదేళ్లు ఉపప్రధానిగా వున్నా ఆ విషయంలో ఏమీ చేయలేకపోయాడని గుర్తుంచుకోవాలి. ఆరెస్సెస్‌ రామమందిరంతో పాటు మధుర, కాశీ గుళ్లపై, మతమార్పిడి చట్టాలపై, ఉమ్మడి పౌరస్మృతిపై, కశ్మీరు సమస్యపై తను కోరుతున్నది తక్షణం జరగాలని పట్టుబడుతుంది కానీ మోదీ వారి కోరికలను తీర్చలేడు. ఆచితూచి అడుగులు వేయవలసిన అవసరం అతనిది. అతని కాబినెట్‌లో కొందరు మంత్రులు, పార్టీలో కొందరు ఎంపీలు బాధ్యతారాహిత్యంతో ప్రజల్ని రెచ్చగొట్టడానికి చిత్తం వచ్చినట్లు మాట్లాడి చిక్కులు తెచ్చిపెట్టినప్పుడు మోదీ వారిని బహిరంగంగా సమర్థించ లేకపోయాడు. అలా అని చర్య కూడా తీసుకోలేదు. అధికారంలో వున్నవారికి వుండే యిబ్బంది అది. అధికారం బాదరబందీ లేదు కాబట్టి ఆరెస్సెస్‌ తను అనుకున్న ప్రకారమే అన్నిటా జరగాలని, ప్రతీ చోటా తన మనుషులనే నెలకొల్పాలని పట్టుబడుతూ వుందనే వార్తలు వస్తూనే వుంటాయి. వాటిల్లో కొన్నయినా వాస్తవాలు వుండవచ్చు. 

ఇప్పుడు ఆరెస్సెస్‌ కలగజేసుకుందనే సందేహానికి కారణం - భావతీవ్రతలో మోదీకి, యోగికి వున్న వ్యత్యాసం. మోదీ ప్రధానంగా రాజకీయవాది కాగా, యోగి తీవ్ర హిందూత్వవాది. విశ్వహిందూ పరిషత్‌ హిందూత్వలో రైట్‌ అనుకుంటే యోగీ 'ఫార్‌ రైట్‌'. 'అవకాశం వస్తే, నేను ప్రతీ మసీదులోను గణేశ్‌ ప్రతిమను పెడతాను', 'వాళ్లు ఒక హిందూ అమ్మాయిని తీసుకుపోతే, మేం వందమంది ముస్లిము అమ్మాయిలను తీసుకుపోతాం' వంటి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. వట్టి మాటలే కాక ఆచరణకు దిగి చర్యలు చేపట్టాడు. ప్రతిక్షకులను బెదిరించడాలు, హింసను ప్రయోగించడాలు అతనికి కొత్త కాదు. క్రిమినల్‌ కేసుల్లో యిరుక్కున్నాడు. ఇప్పుడు హోం శాఖ కూడా అతని దగ్గరే వుంది కాబట్టి అవన్నీ ఎగిరిపోవచ్చు కానీ అతని పేరు చెపితే ముస్లిములు భయపడతారు. ఉత్తర యుపి మొదటి నుంచి ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతం. అక్కడ మాఫియా, గ్యాంగులు ఎప్పణ్నుంచో వున్నాయి. హింసకు దిగడం అక్కడి వారికి కొత్త కాదు. అక్కడ బతుకు గడవక ఎంతోమంది మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, పంజాబ్‌లకు తరలిపోతూ వుంటారు. హింస అక్కడి జనజీవితంలో భాగం అయిపోవడం వలన సన్యాసి దుస్తులు వేసుకున్న వారు కూడా రెచ్చగొట్టేట్లా మాట్లాడడం అక్కడి వారికి వింతగా తోచదు. యోగి గురువు మహంత్‌ అవైద్యనాథ్‌ కూడా యిదే తరహా. బాబ్రీ మసీదు కూలగొట్టడంలో ప్రధాన పాత్ర వహించాడు. రామమందిరంపై యిరుపక్షాల మధ్య సయోధ్య సాధించడానికి ప్రభుత్వం ప్రయత్నించినప్పుడల్లా ముస్లిము అతివాదులు, హిందూత్వ అతివాదులు దాన్ని సాగనీయలేదు. హిందూత్వ అతివాదులలో అవైద్యనాథ్‌ ఒకరు. ఇప్పుడు యోగి కూడా రామమందిరం కట్టడానికి గట్టి ప్రయత్నాలే చేయవచ్చు.

యుపిలో ముస్లిములు 19% మంది వున్నారు. వారు పూర్తిగా వ్యతిరేకించే యోగికి మోదీ పగ్గాలు అప్పగించడం చాలా వింతగా తోస్తోంది. యోగి పక్షాన ఎంచి చూద్దామంటే పాలనానుభవం, పార్టీలో అన్ని వర్గాలను, ప్రజల్లో అన్ని వర్గాలను కలుపుకుని పోయే స్వభావం.. యిత్యాది మంచి లక్షణాలు ఏవీ కనబడటం లేదు. హిందువులందరూ హిందూత్వవాదులు కారు. అలా అయి వుంటే బిజెపి ఎప్పుడో అధికారంలోకి వచ్చి అక్కడే స్థిరంగా వుండిపోయేది. మొన్న ఎన్నికలలో కూడా దాదాపు 60% మంది బిజెపికి ఓటేయలేదు. 19% వున్న ముస్లిములలో ఎవరూ ఓటేయలేదనుకున్నా (సాధారణంగా అలా వుండదు, కొందరైనా వేసి వుంటారు) 40% మంది హిందువులు కచ్చితంగా ఓటేయలేదు. వేసినవారందరూ యోగి వంటి తీవ్రభావా లున్నవారనుకోవడానికి లేదు. మోదీపై మోజు, అతను చెప్పే అభివృద్ధిపై ఆశ, ఋణమాఫీ, ఎస్పీ ప్రభుత్వ వ్యతిరేకత, మాయావతి విధానాలపై వ్యతిరేకత, స్థానిక కులసమీకరణలు.. యిలా ఎన్నో అంశాలు సమకూడి యింతటి అపూర్వమైన విజయం సిద్ధించింది. అది గ్రహించకుండా యోగి వంటి వాణ్ని ముఖ్యమంత్రి చేయడమేమిటి అనేదే మోదీని సమర్థిస్తున్న మామూలు హిందువులను, విశ్లేషకులను తొలిచివేస్తున్న ప్రశ్న. బిజెపి గెలిచిన తక్కిన ఏ రాష్ట్రం విషయంలో యింత మీమాంస జరగలేదు.

ప్రస్తుత పరిస్థితి గమనిస్తే - మోదీకి ప్రజాకర్షణ వుంది, పార్టీపై, ప్రభుత్వంపై పట్టు వుంది. అతను ఎటువంటి నిర్ణయం తీసుకున్నా చెల్లిపోతోంది. పార్టీలో కాని, ప్రతిపక్షంలో కాని ఎదురు తిరిగేవాడే లేడు. పార్లమెంటుకి వచ్చి సమాధానం చెప్పకపోతే నిలదీసేవాడే లేడు. ఇలాటి స్థితిలో అతను ఆరెస్సెస్‌ ఒత్తిడికి లొంగి నిర్ణయం తీసుకున్నాడన్నది పొసగదు. ఉత్తర ప్రదేశ్‌లో గెలుపుకై బిజెపి అనుసరించిన విధానాన్ని మరింత దృఢంగా, దీర్ఘకాలికంగా అమలుచేస్తూ ముందుకు సాగాలనే ఆలోచనతోనే యోగి ఎంపిక జరిగిందని అనుకోవాలి. ఉత్తర ప్రదేశ్‌లో బిజెపి గెలుపుకు పైన చెప్పిన అంశాలతో పాటు వారు చేపట్టిన పోలరైజేషన్‌, కన్సాలిడేషన్‌ ముఖ్య కారణాలు. హిందువులు, ముస్లిములు వేర్వేరు ధృవాలకు చెందినవారు అనే వాదనతో ముస్లిములను లెక్కలోకి తీసుకోకుండా కేవలం హిందువుల మీదనే ఫోకస్‌ చేయడం పోలరైజేషన్‌. ఎస్పీ, బియస్పీ ముస్లిములను బుజ్జగిస్తున్నాయి, నెత్తి కెక్కించుకుంటున్నాయి, హిందువులను నష్టపరచి వాళ్లకే అన్నీ కట్టబెడుతున్నాయి అనే వాదనతో ముందుకు వచ్చిన బిజెపి అసలు ముస్లిములు కూడా సమాజంలో భాగమే అనే విషయాన్నే విస్మరించింది. బుజ్జగించనక్కరలేదు కనీసం గుర్తించినా సరిపోయేది. జనాభా ప్రకారం చూసినా వారికి 75-80 టిక్కెట్లు యివ్వడం సమంజసం. అలాటిది దానిలో సగం కాదు, పావు కాదు, పదో వంతు కాదు, ఒక్కటంటే ఒక్కటి కూడా యివ్వలేదు. 'లవ్‌ జిహాద్‌ పేరుతో హిందూ అమ్మాయిలను వలలో వేసుకుంటున్నారు యీ దుర్మార్గులు, వీళ్లను ఎక్కడుంచాలో అక్కడ వుంచాలి' అన్నట్టుగా ఒక్క టిక్కెట్టు కూడా యివ్వలేదు. హిందువుల్లో 35-40% మందికి యిది తప్పుగా తోచినట్టు లేదు. తోచకుండా చేయగలిగింది బిజెపి! 

ముస్లింలకు ఎడంగా సాధించిన యీ పోలరైజేషన్‌తో బాటు హిందువుల మధ్య కన్సాలిడేషన్‌ సాధించింది. అది కూడా హిందువులలో రెండు వర్గాలను ఉపవర్గాలుగా చీల్చిన తర్వాత! బిసిలలో యాదవులు గత కొద్దికాలంగా అధికారం అనుభవిస్తూ తక్కిన బిసిలలో అసూయాద్వేషాలను రగిలించారు. ఎస్పీ ప్రభుత్వం యాదవులను పూర్తిగా వెనకేసుకుని వస్తోందన్న పేరుబడడంతో బిసిలలో యితర కులాల వాళ్లు వీళ్లకు బుద్ధి చెప్పాలనుకుంటూ వచ్చారు. అదే విధంగా మాయావతి హయాంలో దళితుల్లో జాతవులకే ప్రాధాన్యత వస్తోందని జాతవేతర దళితుల ఫీలింగ్‌. ఇది గ్రహించిన బిజెపి జాతవేతర దళితులను, యాదవేతర బిసిలను సంఘటితం చేసింది. వారికి టిక్కెట్లు భారీగా యిచ్చింది. దీనితో బాటు అగ్రవర్ణాల వారినీ చేరదీసింది. బిజెపికి మొదటి నుంచి బ్రాహ్మణ-బనియా పార్టీగా పేరుండేది. కానీ గతంలో కాంగ్రెసు ఆ వర్గాల్లో చీలిక తెచ్చి లాభపడింది. 2007లో బియస్పీ బ్రాహ్మణులను తనవైపు లాక్కుని లాభపడింది. 2012లో ఎస్పీకి బ్రాహ్మణులు కూడా భారీగా ఓటేశారు. ఈసారి బిజెపి తగు జాగ్రత్తలు తీసుకుని బ్రాహ్మణ-రాజపుత్ర-బనియాలను బీరు పోనీయకుండా చూసుకుంది. ఈ విధంగా అగ్రవర్ణ, యాదవేతర బిసి, జాతవేతర దళితులను కన్సాలిడేట్‌ చేసుకుంది. వీరిలో నూటికి నూరు శాతం బిజెపికి ఓటేశారని చెప్పలేం. పైన చెప్పినట్లు 40% మంది హిందువులు బిజెపికి వేయలేదని అనుకున్నాం కాబట్టి అధికాంశం మంది వేశారనే అనగలం. పోలరైజేషన్‌, కన్సాలిడేషన్‌ ఫార్ములాలో భాగంగా యోగిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన మోదీ యీ విషయాన్ని గుర్తుంచుకోవాలి.  సబ్‌కే సాథ్‌ అనే నినాదాన్ని అమలు చేయాలంటే తమకు ఓట్లేయని 60% మందిని కూడా ఆకర్షించాలి, కనీసం వారి చేత ఆమోదింప చేసుకోవాలి. 

దానికి యోగి తగిన వ్యక్తా కాడా అన్నది ప్రస్తుతం తెలియదు. అతని గతచరిత్ర ఆశ కలిగించడం లేదు. కానీ అధికారం తలపై పెద్ద బాధ్యతను కూడా పెడుతుంది. క్లాసులో అల్లరి పిల్లవాడినే లీడరుగా చేస్తారు టీచర్లు. అప్పుడు అందరినీ సంబాళించుకు రావడం అలవడుతుంది. యోగి ముఖ్యమంత్రి కాగానే ఒక బియస్పీ ముస్లిం నాయకుడిపై దాడి జరిగి చంపేశారు. ఇది సహించను అంటూ యోగి ప్రకటన చేశాడు. దోషులపై చర్య తీసుకోవలసినదిగా డిజిపిని ఆదేశించాడు. అదే ప్రతిపక్షంలో వుంటే ఆ సంఘటనను ఖండించి వుండేవాడు కాదేమో! బాధ్యత సంయమనాన్ని నేర్పుతుందని ఆశిద్దాం. కేంద్రం దన్నుగా నిలుస్తోంది కాబట్టి అభివృద్ధి పనులు చేపడితే అన్ని వర్గాల వారికీ మేలు లుగుతుంది. అలా కాకుండా రామమందిరం నిర్మాణం, గోరక్ష, లవ్‌ జిహాదీల నిర్మూలన, ఘర్‌ వాపసీలే నా తక్షణకర్తవ్యం అంటూ కూర్చుంటే యుపి సమాజంలో ఘర్షణవాతావరణం నెలకొని అంతిమంగా అందరికీ నష్టం కలుగుతుంది. యోగి వస్తూనే కబేళాల మూతకు ఆదేశించారు. ఉపముఖ్యమంత్రులకు ప్రాధాన్యత లేని శాఖలిచ్చి ముఖ్యమైనవి తన వద్దే పెట్టుకున్నారు. హోం మంత్రిగా కూడా యోగి వున్నాడులే ఫర్వాలేదని హిందూ వాహిని వారు గతంలోలా హింసకు దిగితే శాంతిభద్రతల సమస్య రావచ్చు. ఎస్పీ అధికారంలో వుండగా శాంతిభద్రతలే ప్రధాన అంశంగా మారి ఎన్నికలలో  వారిని దెబ్బ తీసింది. ఆ విషయాన్ని యోగి గుర్తెరుగుతాడని ఆశిద్దాం. మోదీ కూడా యోగి విషయంలో జాగ్రత్తగానే అడుగులు వేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యుపి ప్రభుత్వంపై పరిశీలకుడిగా. యోగికి తనకు మధ్య లింకుగా నృపేంద్ర మిశ్రా అనే ఐయేఎస్‌ అధికారిని కేంద్రం నుంచి పంపారు. యోగి మరీ మోటుగా వెళితే అంకుశం ప్రయోగించాలని ఆయన మోదీకి సలహా యివ్వవచ్చు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?