Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: జానపద చిత్రాలు- 4

అతను నేపాళ మాంత్రికుడు. దేవీ ఉపాసకుడు. నేపాళ మాంత్రికుడి దగ్గర సంజీవని వుంది. తెగిపోయిన అవయవాలను అతికించ గల సంజీవని అది. మాంత్రికుడు తన ఎడమచేతిని కత్తితో నరుక్కుని దేవికి సమర్పించాడు.  ఆ తర్వాత సంజీవినితో అతికించుకుని చేతిని తిరిగి తెచ్చుకున్నాడు. ఈ సంజీవని ఐడియా గొప్పది. ఇంటర్వెల్‌లో అయిపోయిందనుకున్న కథను తిరిగి నడపడానికి బహుచక్కగా పనికి వస్తుంది. చేతిని బలియిచ్చి మాంత్రికుడు దేవినుండి సమాచారాన్ని రాబట్టాడు. అన్ని శక్తులను యిచ్చేది, అన్ని కోర్కెలనూ తీర్చేది పాతాళభైరవి అని ఆ దేవి చెప్పింది. అది ఉజ్జయినికి ఉత్తరాన, మంత్రాల మర్రి క్రింద, భూగర్భంలో నిక్షిప్తమై వుందని, సిద్ధించాలంటే నీ యంతటి మంత్రసిద్ధుడు, లేదా సాహసవంతుడు, సన్మార్గుడూ అయిన యువకుణ్ని గానీ బలి యివ్వాలని చెప్పింది. తనను తాను బలి యిచ్చుకునే ఉద్దేశం ఎంతమాత్రం లేని మాంత్రికుడు సాహసవంతుడి కోసం దుర్భిణీ వేసి చూశాడు. అందులో పూలతీగ పట్టుకుని రాజుగారి అంత:పురానికి ఎగబాకుతున్న తోటరాముడు కనబడ్డాడు. కథానాయకుడి తెంపరితనాన్ని చూపడానికి అంతకంటె నిదర్శనం అక్కరలేదు. రాకుమారి కోసం ఎంతటి సాహసమైనా చేస్తాడు అని దుర్భిణీ చేతిలో లేకపోయినా మనక్కూడా అర్థమయ్యే లెవెల్లో చూపించారు. రాకుమారి తోటకు రావటం లేదు కదా, ఆమెను చూడకుండా వుండలేక తోటరాముడు కోటలోకి వచ్చేశాడు.

కోటలోకి వచ్చి రాకుమారిని పలకరించాడు కానీ కర్మకాలి రేలంగి కంటపడ్డాడు. అతను భటుల చేత పట్టించాడు. తెల్లవారగానే ఉరి తీయమని ఆర్డరేసి రాజుగారు నిద్రపోయారు. కానీ రాకుమారి పాముకాటునుండి తనను కాపాడిన రాముణ్ని చెరసాల నుండి తప్పించడానికి వెళ్లింది. దొంగలా పారిపోయి అనామకుడిగా బతకడం యిష్టంలేదని హీరోయిక్‌ చెప్పాడు హీరోగారు. ఈ లోపుగా రాజుగారి కలలో తన కూతుర్ని భవిష్యత్తులో కూడా కాపాడబోయేది రాముడే అని తెలిసి వెంటనే చెరసాలకు వచ్చి విడిపించాడు. 'క్షమించి వదిలేస్తున్నా, అంతస్తుకు మించిన ఆశలు పెట్టుకోవద్దు, భవనాలూ, పల్లకీలూ, పరివారం కలిగిన శ్రీమంతుడిగా ఎదిగిన తర్వాతనే మా అమ్మాయి ప్రసక్తి తీసుకురా' అని హెచ్చరించి వదిలేశాడు. 

మాంత్రికుడు ఉజ్జయిని చేరుకున్నాడు. ఆ సాహసికుణ్ని వలలో వేయడానికి అతని ఆశయం తన ద్వారా నెరవేరుతుందని ఆశ పెట్టాలి. దానికి తన మంత్రశక్తి చూపాలి. అందుకని రాజవీధిలో ఓ ప్రదర్శన ఏర్పాటు చేశాడు. మోళీవాడికైనా ఓ అసిస్టెంటు వుండడం తప్పనిసరి. రంగారావుకి అసిస్టెంటు పద్మనాభం. పేరు సదాజపుడు. ముఖం మీద ముసుగేసుకుని జపం చేసుకునే అలవాటు సినిమా చివర్లో బాలకృష్ణకు పనికి వచ్చింది. రాముడు ముందుకు వచ్చి నోరు తెరుచుకుని మాంత్రికుని మోళీ చూశాడు.  ఈలోగానే  రేలంగి వచ్చి దబాయించబోయి భంగపడి మాంత్రికుడికి మోకరిల్లాడు. ఇక్కడ రేలంగి రావడం ప్రస్తుతానికి అనవసరం అనిపించినా, కథలో తర్వాత అది ఉపకరిస్తుంది. రేలంగి, మాంత్రికుడు ఒకరి కొకరు ఉపయోగపడతారు. మాంత్రికుడు ఓ అక్షయఘటాన్ని ప్రదర్శించినపుడు రాముడు యిక తట్టుకోలేకపోయాడు. ఆ ఘటం వుందంటే రాజుగారు అడిగినవన్నీ యివ్వచ్చనిపించింది. మొండిఘటం కనుక నీతి, నియమం వదిలేసి ఆ ఘటాన్ని పట్టుకుని ఉడాయించాడు. కానీ దాన్లోంచి ఏవీ రాదు. విసుగెత్తి దాన్ని పగలగొట్టబోతూ వుంటే అప్పుడు మాంత్రికుడు వచ్చి 'అందులో ఏముందిరా డింభకా, అంతా మా మంత్రశక్తిలో వుందిరా. ప్రేమించావు గదరా ఉజ్జయినీ రాకుమారిని. భవనాలూ, పల్లకీలూ తెమ్మన్నాడు గదరా రాజు, నీ కోరిక తీరే కీలకం చూపిస్తాను, సాహసం శాయగలవురా?' అన్నాడు. 

'మీరేం చేయమన్నా చేస్తాను. ప్రాణాలైనా యిస్తాను' అన్నాడు రాముడు. ఇక మాంత్రికుడు ఎక్కడకు తీసుకెళితే అక్కడకు వెళ్లాడు. గుహలు, బొడ్డు దేవర, కత్తులబోను దారి, ఫైనల్‌గా పాతాళభైరవి గుహలలో రామారావు సాహసాలను బాగా చూపించారు. అందుకే శక్తి ప్రధానమైన సినిమా అయిందిది. అయితే ఆ శక్తి ఉపయోగించడానికి మరో చోదక శక్తి వుండాలి. అది రాకుమారిమీద ప్రేమ. ఇక్కడి సాహసాల్లో ఓ చోట మాంత్రికుడు రాముణ్ని మంటల్లో ఉరకమంటాడు. రాముడు తటపటాయిస్తూంటే 'పాతాళభైరవి ప్రసన్నమౌతుంది, జయంకోరి మంటలో దూకరా' అంటాడు మాంత్రికుడు. రాముడికి పాతాళభైరవి ప్రసన్నమైతే నేమిటి, సింధుభైరవి ప్రసన్నమైతే నేమిటి? అందుకే కాస్త నిదానించాడు. అది గుర్తించిన మాంత్రికుడు 'సంకల్పం సిద్ధిస్తుంది. రాకుమారి లభిస్తుంది.' అన్నాడు. రాముడు తటాలున ఉరికేశాడు. ఒక్కోడికి ఒక్కో మోటివేటింగ్‌ ఫోర్స్‌! 

గుహలో రాముడితో 'నువ్వు ఆ పుష్కరిణిలో స్నానం చేసి శుచివై రా' అన్నాడు మాంత్రికుడు. గట్టుమీద బాకు పెట్టి మరీ నీటిలో దిగాడు కాబట్టి రాముడు దాన్ని చేజిక్కించుకుని మొసలిని చంపేశాడు. ఆ బాకు అప్పుడు అర్జంటుగా రాదు. అక్షయ ఘటం బద్దలు కొట్టినపుడు వికట్టాట్టహాసం చేస్తూ మాంత్రికుడు తనను సమీపిస్తే రాముడు బొడ్లోంచి లాగిన బాకు అదే!  ఆ మొసలి చచ్చిపోయాక  యక్షకన్య అయిపోయి శాపవిమోచనం చేసినందుకు కృతజ్ఞతగా మాంత్రికుడి అంతరంగం చెప్పేసింది. ఇక రాముడు తెలివిగా మాంత్రికుడి తల తెగేశాడు. పాతాళభైరవికి కావలసినది మాంత్రికుడు లేదా సాహసికుడు తల. ఆ షరతు పూర్తయింది కాబట్టి ఆవిడ ప్రత్యక్షమైంది. 'నరుడా ఏమి నీ కోరిక?' అంది. తన శక్తిని ఓ ప్రతిమ రూపంలో యిచ్చి ఆ ప్రతిమను నుదుట తగిలించుకుని తనను తలచుకుంటే ప్రత్యక్షమవుతానని అంది. 

రామారావు వెంటనే మాంత్రికుడి శవదహనానికి ఏర్పాట్లు చేస్తే గొడవ లేకపోయేది. కానీ అతనికి ఎంతసేపూ రాకుమారిని ఎంత త్వరగా చేరాలా అన్న అడావుడే కదా. పాతాళభైరవిని కోరి రాకుమారుడిగా చేయమన్నాడు. ఉజ్జయినికి వచ్చాక వేరే చోట స్థలం కొనుక్కునే పని పెట్టుకోలేదు. తన తోటలోనే ఓ మాయామహల్‌ రాత్రికి రాత్రి ఏర్పాటు చేయించాడు. మాయామహల్‌ను చూడడానికి వచ్చిన రాజు తను కోరినవి తెచ్చాడు కాబట్టి తన కుమార్తెతో పెళ్లి నిశ్చయం చేశారు. పెళ్లికి ఆహ్వాన పత్రికలు పట్టుకుని అంజి సత్రానికి  వెళ్లాడు. అక్కడ సదాజపుడు జపం చేసుకుంటున్నాడు. గురువుగారు రాముణ్ని వెంటబెట్టుకుని వెళ్లిన దగ్గర్నుంచీ అతను యిక్కడే వున్నాడు. జరిగిన గొడవలేమీ తెలియవు. ఇప్పుడు ఈ అంజి పనిమాలా పెళ్లికబురు చెప్పడంతో గురువుగారి చేతికి రావలసిన పాతాళభైరవి రాముడికి దక్కిందని అర్థమైంది. దుర్భిణీ వేసి చూస్తే గుహలో గురువుగారు తలతెగి పడివున్న దృశ్యం కనబడింది. సినిమా మొదట్లో చూపిన సంజీవని అక్కరకు వచ్చింది. అది పెట్టి గురువుగారి తల అతికేశాడు. ఇక అతను ప్రతీకారంతో ఉజ్జయిని వచ్చాడు.

తనకు దక్కాల్సిన రాకుమారి పోయి పోయి రాముణ్ని పెళ్లాడడంతో గొల్లుమన్నాడు రేలంగి!  ఊరి బయటకు వెళ్లి ఉరేసుకోబోయాడు. అక్కడే మాంత్రికుడు తారసిల్లాడు. తను చెప్పినది చేస్తే పెళ్లి ఆపిస్తానని మాంత్రికుడు హామీ యిచ్చాడు. అతని మాజిక్‌ ఇదివరలో స్వయంగా రుచి చూసి వున్నాడు కాబట్టి రేలంగి వెంటనే నమ్మాడు. అతను చెప్పినట్టే  రాముడి పూజామందిరంలో వున్న పాతాళభైరవి విగ్రహాన్ని తెచ్చి యితనికి యిచ్చాడు. ఓ సారి విగ్రహం చేతికి చిక్కాక మాంత్రికుడు రేలంగిని తన్ని తగిలేశాడు. మాయామహలుతో బాటు, రాకుమారిని కూడా ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. అందరూ కలవరపడ్డారు. క్షణాల్లో హీరో మామూలు తోటరాముడయిపోయాడు. అంజిని వెంటబెట్టుకుని తిరిగాడు కానీ మాంత్రికుడి స్థావరం ఎక్కడని వెతక గలడు? అలా ఎన్నాళ్లు తిరగాల్సి వచ్చేదో ఏమో కానీ చాలా తెలివితక్కువగా మాంత్రికుడే అతన్ని తన వద్దకు రప్పించుకున్నాడు. అది ఎలా జరిగిందంటే - మాంత్రికుడు రాకుమారిని తెచ్చాక ఆమె మీద మనసు పుట్టింది. పెళ్లి చేసుకోమని వెంటపడ్డాడు. ఆమె కాదంటే 'సరసంలో శఠం భటం నాకు పసందు కావే' అంటూ ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నాడు. 'నీ కథానాయకుడు నా ముందు బలాదూర్‌' అని చెప్పడానికి గాను తన మంత్రాలతో అతన్ని అక్కడకు రప్పించాడు. పట్టుకుని చితక్కొట్టాడు. (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2015)

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?