Advertisement

Advertisement


Home > Articles - MBS

మొదటి ప్రపంచయుద్ధంలో భారత సైనికుల స్మృతులు

మొదటి ప్రపంచయుద్ధంలో భారతీయుల భాగస్వామ్యం గురించి చరిత్రలో సముచిత స్థానం లభించలేదని గుర్తించిన బ్రిటన్ ఇప్పుడు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. ప్రపంచయుద్ధం నాటి జ్ఞాపకాలతో ఇప్పటినుండి వచ్చే నాలుగేళ్లలో 500 ఎగ్జిబిషన్లు, 1500 ఈవెంట్స్ నిర్వహించాలని నిశ్చయించి, దానిలో భారతీయులకు కూడా చోటు కల్పిస్తోంది. దక్షిణ లండన్‌లోని బ్రైటన్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ‘వాయిసెస్ ఆఫ్ ద ఫస్ట్ వరల్డ్ వార్’ ఎగ్జిబిషన్‌లో భారతీయ సైనికులు తమవాళ్లకు రాసిన, అందుకున్న ఉత్తరాలను ప్రదర్శనకు పెట్టారు. ఆ భవనాన్ని 123లో నాల్గవ కింగ్ జార్జి తన కోసం కట్టుకున్నాడు. 1915లో దాన్ని క్షతగాత్రులైన భారతీయ సైనికులకై ఆసుపత్రిగా మార్చారు. మూడేళ్లలో 4 వేల మందికి అక్కడ చికిత్స జరిగింది. హిందువులకు, ముస్లిములకు, శిఖ్కులకు వేర్వేరుగా వంటగదులు, ప్రార్థనామందిరాలు వున్నాయి. ఆ యుద్ధంలో 70 వేల మంది భారతీయులు మరణించారు. మరో 70 వేల మంది గాయపడి ఇల్లు చేరారు. పత్తి, జనుము, తోలు వంటి ముడిసరుకులు భారతదేశం నుంచి పంపించారు. సంస్థానాధీశులు పది కోట్ల పౌండ్ల క్యాష్ పంపారు. ఈ యుద్ధంలో సహకరిస్తే హోం రూల్ అనుమతిస్తామని బ్రిటిషు వారు మాట ఇవ్వడంతో జాతీయ నాయకులు కూడా దేశపౌరులను సైన్యంలో చేరమని ప్రోత్సహించారు. 

తమను పాలిస్తున్న రాజెవరో, తాము ఎవరికోసం యుద్ధం చేస్తున్నామో సరిగ్గా అర్థం కాకుండానే అనేకమంది భారతీయులు యుద్ధంలో పాల్గొన్నారు, ఫ్రాన్సు, ప్రాచ్య ఆఫ్రికా, మెసపొటేమియా వంటి ప్రాంతాల్లో భాష తెలియని చోట్ల యుద్ధాలు చేశారు, గాయపడ్డారు, ప్రాణాలూ పోగొట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దగా చదువుకోని ఈ సైనికులు తమ కుటుంబసభ్యులకు ఎటువంటి ఉత్తరాలు రాస్తారో వూహించవచ్చు. ‘ఇది మహాభారతయుద్ధం లాంటిది’ అని చాలామంది రాసుకున్నారు. ‘యుద్ధం ఎప్పుడు పూర్తవుతుందని అడిగితే నేనేం చెప్పగలను? గంటకు పదివేల మంది చచ్చిపోతున్నారు. ఇంకా ఎంతమంది మిగిలారో ఏం తెలుస్తుంది?’ అని వాపోయారు. ఆ సైనికులు తమవాళ్లకు రాసిన లేఖలను ‘‘ఇండియన్ వాయిసెస్ ఆఫ్ ద గ్రేట్ వార్’’ అనే డేవిడ్ ఒమిస్సి సంకలనం చేస్తే పెంగ్విన్ వారు ప్రచురించారు. ఇన్నాళ్లకు బ్రిటన్ సీరియస్‌గా వీళ్ల గురించి పట్టించుకుని ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. అయితే బాధపడాల్సింది  ఏమిటంటే ఆ బ్రైటన్ మ్యూజియం గురించి, దానికి వెళ్లే దారి గురించి స్థానికులకు పెద్దగా తెలియదట. వెతుక్కుంటూ వెళ్లాల్సిందేట!

-ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?