Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: పోసాని తుపానులో నంది టీ కప్పు

ఎమ్బీయస్‌: పోసాని తుపానులో నంది టీ కప్పు

ఏదైనా విషయాన్ని తేలిక చేయాలంటే తెలుగువాళ్లు 'ఆఁ ఏముంది, వడ్లగింజలో బియ్యపుగింజ' అంటారు. ఇంగ్లీషువాడు టీకప్పులో తుపాను అంటాడు. తుపాను టీ కప్పులోనే  పుట్టి, అక్కడే సమసిపోయిందని చెప్పడానికి. నంది అవార్డులు ప్రకటించగానే కొన్ని విమర్శలు వచ్చాయి. టీవీ ఛానెళ్లు నాలుగు రోజులు పండగ చేసుకున్నాయి. ఆదివారం సాయంత్రానికి అందరూ అలసిపోయి, ఎవరి పనుల్లో వాళ్లు పడదామనుకున్నట్లు కనబడి టీ కప్పులో తుపానే అనిపించింది. అయితే సోమవారానికి బాబు మాట్లాడారు. విమర్శలు వచ్చాయి కాబట్టి ఇకపై జాగ్రత్తగా ఉంటామనో, మరోటో అనకుండా విమర్శలు చేసినందుకు నొచ్చుకుని, అసలు ఎంపిక విధానమే మార్చేస్తే మంచిదంటూ మాట్లాడారు. 

యువరాజా గారు అర్థరహితంగా ఆధార్‌ కార్డు, ఓటింగులు, పన్ను చెల్లింపులు, ఎన్‌ఆర్‌ఏల గురించి మాట్లాడి టీ కప్పును తుపానులోకి ఎగరేశారు. ఆట్టే మాట్లాడితే అవార్డులు రద్దు చేస్తాం జాగ్రత్త అనే లీకులు కూడా ప్రభుత్వవర్గాలు యిచ్చాయి. అవేవో ఉన్నత వర్గాలే అని వాటికిచ్చిన బ్యానర్‌ హెడింగ్స్‌ బట్టి తెలిసింది. ఇది వింతగా ఉందే అని అందరూ నివ్వెరపోతూ ఉంటే పోసాని ప్రభంజనంలా విరుచుకు పడ్డారు. మనం ఆయన మాటలన్నిటితో ఏకీభవించవలసిన పని లేదు. ఆయన ధోరణి అతిగా ఉందని, అంత ఆవేశం అక్కరలేదని, చెప్పేదాన్ని సౌమ్యంగా చెప్పవచ్చనీ అనవచ్చు. కానీ యింకోలా చెపితే ఆయన పోసానే కాదు. చెప్పదలచినది కపటం లేకుండా చెప్తాడాయన. టిడిపి విధానాలు నచ్చిన రోజుల్లో సినిమా రచయితగా ఉండగానే సొంత డబ్బు ఖర్చు పెట్టి  హాఫ్‌పేజి యాడ్స్‌ యిచ్చిన నిజాయితీపరుడాయన. 

కెసియార్‌ను చూసి ఎవరు నేర్చుకోవాలి? - ఊగిపోతూ అరగంట సేపు చెప్పిన దానిలో రెండు అంశాలున్నాయి. ఒకటి లోకేశ్‌ స్టేటుమెంటుపై విరుచుకు పడడం, రెండు తన అవార్డు తిరస్కరించడం. స్థానికత లేనిదే విమర్శించకూడదని అన్నందుకు దుమ్ము దులిపేశారు. మీకు యిక్కడ ఆస్తులు లేవా? ఇక్కడ పన్నులు కట్టడం లేదా? వంటి అసలుసిసలైన ప్రశ్నలు వేస్తూనే 'రాష్ట్ర విభజన ప్రకటన రాగానే అమరావతి ప్రాంతాలకు వెళ్లి మీ పార్టీ వాళ్లందరూ ఆస్తులు కొనుక్కున్నారు, హైటెక్‌ సిటీ అనగానే చుట్టుపట్ల అంతా కొనేశారు' 'పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు' వంటి అసంగతమైన అంశాలు కూడా లేవనెత్తారు. లోకేశ్‌ను ప్రశ్నించేటప్పుడు 'తాగి ఉన్నావా?' అని కూడా అనేశారు. ఇది టూమచ్‌. పబ్లిగ్గా అనవలసిన మాట కాదిది. ఇంతకంటె త్రీమచ్‌ ఏమిటంటే లోకేశ్‌ ఆలోచనావిధానాన్ని తప్పుపట్టడానికి కెసియార్‌ను పాదాభిషేకం చేయించుకునే లెవెల్‌కు తీసుకుని పోవడం! 

పరిపాలన ఎలా చేయాలో కెసియార్‌ను చూసి నేర్చుకోండి అన్నది లోకేశ్‌ను ఉద్దేశించి అన్నట్లు లేదు, బాబును ఉద్దేశించి అన్నట్లే అయింది, ఇద్దరూ ముఖ్యమంత్రులే కాబట్టి. సంయమనంతో ఎలా ఉండాలో నేర్చుకో అని లోకేశ్‌ను కెటియార్‌తో పోలిస్తే సరిపోయేది. కెసియార్‌ పాలన అద్భుతంగా ఏమీ వెలిగిపోవటం లేదు. ఎన్నో లోపాలున్నాయి. చాలా విషయాల్లో బాబుతో తూగుతాడు. ఫైనల్‌ ఎనాలిసిస్‌లో బాబు కంటె మెరుగనిపిస్తాడు. హైదరాబాదు తన రాష్ట్రంలో ఉంది కాబట్టి ఆర్థికపరంగా, పాలనాపరంగా మెరుగైన స్థితిలో ఉన్నాడు, రాజకీయపరంగా అందర్నీ బెదిరించగలుగుతున్నాడు. కెసియార్‌ అన్నీ తన గుప్పిట్లో పెట్టుకోగలుగుతున్నారని, బాబు తన కోటరీ గుప్పిట్లోకి వెళ్లిపోయారని అందరూ అనుకునే పరిస్థితి వచ్చింది. పోసాని యిన్ని విషయాలు బేరీజు వేసి మాట్లాడారని అనుకోవడానికి లేదు.

కెసియార్‌ వదిలేసిన దాన్ని లోకేశ్‌ పట్టుకున్నారు - ఆయన ఫోకస్‌ ఒక్క పాయింటు మీదే ఉంది - స్థానికత అంశంపై తెలుగువారిని విడదీయడం! ఆ పని ఉద్యమకారుడుగా కెసియార్‌ చేశారు, పాలకుడిగా చేయడం లేదు. లోకేశ్‌ గతంలో చేయలేదు, యిప్పుడు పాలకుడిగా చేశాడు. కెసియార్‌ మంచివైపు మారాడు. లోకేశ్‌ చెడువైపు తిరిగాడు. అలా తిరుగుతూంటే బాబు ఏం చేస్తున్నారనే ప్రశ్న వస్తుంది? ఆయనకు తెలియకుండా లోకేశ్‌ ప్రకటన చేశారా? వద్దన్నా వినలేదా? విమర్శలు వచ్చాకైనా దాన్ని సవరించే ప్రయత్నం చేయలేదేం? బాబు కూడా ఒకప్పటి కెసియార్‌ బాటలో నడుస్తున్నారా? అయితే ప్రమాదమే! గతంలో చేసిన చేష్టల గురించి, యిచ్చిన ప్రకటనల గురించి తెరాస నాయకులకు గుర్తు చేస్తే అవన్నీ ఉద్యమంలో భాగంగా చేశాం, యిప్పుడు వాటి ప్రస్తావన అనవసరం అంటున్నారు. పచ్చిగా చెప్పాలంటే అధికారంలోకి రావడానికి ఏదో చెప్పాం, చేశాం తప్ప మా ఒరిజినల్‌ స్వభావం అది కాదు అని చెప్పుకుంటున్నారు. 

గతంలో చెన్నారెడ్డీ అంతే, 1969లో ఉధృతంగా వేర్పాటు ఉద్యమం నడిపి, చివరకు సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాక గుర్తు చేస్తే, 'అది ముగిసిన చరిత్ర' అని కొట్టిపారేశారు. తనను విభజనవాది అంటే కోపం వచ్చేది కూడా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైయస్‌ ప్రత్యేక రాయలసీమ ఉద్యమం నడిపారు. ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాక వీరసమైక్యవాది అవతారం ఎత్తారు. ఇలా అధికారం కోసం కులం, ప్రాంతాన్ని అడ్డుపెట్టుకునే వాళ్లని చూశాం. అధికారంలోకి వచ్చేశాక మాకు అందరూ ఒకటే అనే పాట పాడతారు. కానీ యిక్కడ లోకేశ్‌ (కిమ్మనలేదు కాబట్టి బాబుగారిని కూడా కలపాలి) ప్రత్యేకవాది అవతారం ఎత్తారేమిటి? ఎన్నారే (నాన్‌ రెసిడెంట్‌ ఆంధ్రా) లంటున్నారు. ఓ పక్క ఎన్నారై (నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్‌)లకు రెడ్‌ కార్పెట్లు వేస్తున్నారే, విదేశీయులకు వేస్తున్నారే, పరిశ్రమ పెడతానంటే, యోగా సంస్థో, డాన్సు సంస్థో పెడతానంటే ఎకరాలకు ఎకరాలు భూమి కట్టబెడుతున్నారే. వాళ్లందరికీ ఆంధ్రాలో ఆధార్‌ కార్డులున్నాయా?

పన్నులెక్కడ కడుతున్నావన్న ప్రశ్నకు బదులేది? - సినిమావాళ్లను కూడా ఆంధ్రలో స్టూడియోలు కట్టండి, సినిమాలు తీయండి అని అడిగినపుడు 'మీ కిక్కడ ఓటింగు హక్కులున్నాయా?' అని అడుగుతారా? తెలుగువాళ్లు వెళ్లి మద్రాసులో సినిమాలు తీసినప్పుడు అరవ్వాళ్లు అలాగే అడిగారా? ఇప్పుడు హైదరాబాదులో సినిమాలు తీసే ఆంధ్ర నిర్మాతలను కెసియార్‌ అడుగుతున్నారా? ఇలా తవ్వుకుపోయిన కొద్దీ లోకేశ్‌ ప్రకటన ఎంత తెలివితక్కువ వ్యవహారమో బోధపడుతుంది. పొరపాటు జరిగిందని గ్రహించి ఉంటే నాలిక కరుచుకుని 'నా ఉద్దేశం అది కాదు' అనేస్తారు. లోకేశ్‌ అనలేదు సరి కదా, 'నా ఆధార్‌ గురించి వెతుకుతున్నవారికి ఎమ్మెల్సీ కావాలంటే స్థానికంగా ఆధార్‌  ఉండాలని తెలియదు' అని సెటైర్లు వేశారు. 

వాళ్లు 'నువ్వు హైదరాబాదులో పన్నులు కడుతున్నావా? లేదా?' అని కూడా అడిగారు, ఎందుకంటే లోకేశ్‌ పన్నుల మాట కూడా ఎత్తారు. తన దగ్గరకి వచ్చేసరికి తెలంగాణలో పన్నులు కడుతున్న విషయం గురించి చెప్పలేదు. లోకేశ్‌ కుర్రవాడు అని టీవీ చర్చల్లోకి వచ్చిన కొందరు వెనకేసుకుని వచ్చారు. అతను సరే, అనేకమంది యువనాయకులను తీర్చిదిద్దిన బాబు లోకేశ్‌ను అలా తయారు చేస్తున్నారేమన్న ప్రశ్న ఉదయిస్తోంది. నేర్చుకునే క్రమంలో శిష్యుడు తప్పు చేస్తే గురువు సరిదిద్దుతాడు. ఇక్కడ గురువు ఖండించటం లేదు. అంటే బాబు ఒకప్పటి కెసియార్‌ అయ్యారన్నమాట. ఇంతకంటె దురదృష్టం ఉందా?

కెసియార్‌కు అధికారం రాకుంటే...? - పోసానికి కెసియార్‌లో విపరీతంగా నచ్చిన అంశం ఏమిటి? తను రాజ్యం ఏర్పడ్డాక ఆంధ్రా వాళ్లని తరిమివేయలేదు, తరిమేయండి అని ప్రజలను రెచ్చగొట్టడం లేదు. ఆంధ్రమూలాల వారు అధికంగా వున్న హైదరాబాదులో కార్పోరేషన్‌ ఎన్నికల సమయంలో 'మిమ్మల్ని కడుపులో పెట్టుకుంటా' అన్నాడు. కార్పోరేట్‌ కాలేజీలపై ఒంటికాలిపై లేచే హరీశ్‌ యిప్పుడు చప్పుడు చేయటం లేదు. సిఎంఆర్‌, బొమ్మన లాటి బట్టల షాపులపై విరుచుకుపడిన కెసియార్‌ యిప్పుడూ ఆ వూసే లేదు. అధికారంలోకి రాగానే సినిమావాళ్లను ఓ వూపు వూపి, తన సత్తా ఏమిటో చూపాడు. దెబ్బకి అందరూ దాసోహం అన్నారు.  రామోజీ ఫిల్మ్‌ సిటీ, పద్మాలయా స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, రాఘవేంద్రరావు కాంప్లెక్సులపై ఉద్యమసమయంలో నిప్పులు చెరిగినా యిప్పుడు వాళ్లందరికీ యింకా విస్తరించే అవకాశాలు యిస్తున్నాడు. 

స్టూడియోలను వేరే గ్రామాలకు తరలిస్తే ఫిల్మ్‌నగర్‌లోని స్టూడియోలను షాపింగ్‌ కాంప్లెక్సులుగా మార్చుకునే సదుపాయం యిస్తానంటున్నాడు. ఇదంతా చూసి పోసాని ముచ్చటపడ్డారు. ఆయన ఆలోచించవలసిన దేమిటంటే - తెరాసకు అధికారం దక్కకపోయి ఉంటే కెసియార్‌ యిలా ప్రవర్తించేవారా? తాము కొట్లాడి తెలంగాణ తెస్తే తెలంగాణ ప్రభుత్వం యింకా ఆంధ్రుల్నే చంక నేసుకుని తిరుగుతోందని, తమ త్యాగఫలం వృథా అయిందని పెద్ద గొడవ చేసి ఉండేవారు కాదా? ఇప్పుడు ప్రతిపక్షలు యివే ఆరోపణలు చేస్తున్నాయి. ఆంధ్రా కాంట్రాక్టర్లు ఎక్కడికీ పోలేదని, కెసియార్‌ కుటుంబంతో అంటకాగుతున్నారని చెప్తున్నాయి. ఇవే ఆరోపణలని యింత కంటె పరమ ఘాటుగా, ఆశ నిరాశైన ఆక్రోశంతో కెసియార్‌ నిప్పులు చెరిగేవారు కాదా?

వేెరెవరైనా యింతకంటె భిన్నంగా ఉండేవారా? - ఇంకోటి కూడా ఆలోచించండి. తెరాస కాదు, కాంగ్రెసో, టిడిపియో నెగ్గినా ఉద్యమసమయంలో వాగిన అవాకులు, చెవాకులు మర్చిపోయి యిప్పుడు తెరాస చేస్తున్న విధానాలనే అవలంబించేవారు. ఇప్పటికిప్పుడు ఆంధ్రులను, ఆంధ్రమూలాల వారిని విసిరికొట్టలేరు. వాళ్ల వ్యాపారాలు ఆపివేయలేరు. ప్రభుత్వోద్యోగాలు ఎలాగూ యివ్వలేరు, ఆంధ్రులను వేధించి, పరిశ్రమలను ఆంధ్రాకు తరిమివేసి, ప్రయివేటు రంగంలో ఉద్యోగాలు కూడా లేకుండా ఎందుకు చేసుకుంటారు? మాట్లాడితే తమిళం, తమిళులు అంటూ గోల చేసే ద్రవిడ పార్టీలు తమిళనాడు నుంచి ఆంధ్రులను తరిమివేశారా? మరాఠీ, మరాఠా అని గర్జించే శివసేన గుజరాతీలను, దక్షిణాది వారిని తరిమివేసిందా? మధ్యమధ్యలో హుంకరిస్తుంటారంతే. 

డబ్బున్నవాళ్లకి, పలుకుబడి వున్నవాళ్లకి ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ల పనులు వాళ్లకు అవుతూనే ఉంటాయి. అధికారం కైవసం చేసుకోవడానికి ప్రాంతీయ తత్వాన్ని, కులతత్వాన్ని ప్రవచించే నాయకుల మాటలు విని సామాన్యజనులే మోసపోతారు. ఆఫీసులు, యిళ్లు ఖాళీ చేసి ఆంధ్రులు వెళ్లిపోతారని అవన్నీ తమకు దక్కుతాయని ఆశ పడిన తెలంగాణ తమ్ముళ్లే దగాపడ్డారు. వాళ్లల్లో కడుపు మండినవారు తెరాసను, కెసియార్‌ను తిట్టుకుంటున్నారు. వాళ్లకు పోసాని మాటలు వింటే మరీ మండుతుంది. ఆంధ్రా వాళ్లను నెత్తిన పెట్టుకుంటున్నాడనడానికి యిదొక నిదర్శనం అనుకుంటారు. 

ఆంధ్ర ప్రజలను ఏమీ అనలేదా? - పోసాని మాట్లాడుతూ కెసియార్‌ ఆంధ్రుల నేమీ అనలేదని, ఆంధ్రనాయకులను మాత్రమే అన్నారనీ చెప్పారు. అది తప్పు. అనేక సందర్భాల్లో ఆంధ్ర అధికారులను, ఆంధ్ర ప్రజలను, వారి తిండి అలవాట్లను అన్నిటినీ తిట్టారు. రాక్షస జాతి అన్నాడు. చరిత్రను వక్రీకరించి అనేక అబద్ధాలు చెప్పాడు. ప్రస్తుతం కెసియార్‌ వాటిని అటకెక్కించి వుండవచ్చు. రేపుమర్నాడు అధికారం పోతే మళ్లీ అటక దింపుతాడు. ఆయన అన్నమాటలు సామాన్య ప్రజల్లోకే కాదు, విద్యావంతుల్లోకి కూడా వెళ్లి నాటుకున్నాయి. తెలుగు సమాజంలో చీలిక వచ్చింది. మొన్ననే ఒక పాఠకుడు రాశారు - ఎక్కడో దక్షిణాఫ్రికాలో కూడా తెలుగు సంఘం ఆంధ్ర, తెలంగాణ లైన్ల మీద విడిపోయిందట. 

తెలంగాణ ఆఫీసుల్లో కూడా  ప్రమోషన్‌ రానప్పుడో, మంచి సీటు రానప్పుడో ఉద్యోగుల మధ్య యీ ఫీలింగ్‌ తలెత్తుతూనే ఉంటుంది. ఈ పుణ్యమంతా కెసియార్‌దే. అవన్నీ మర్చిపోయి, కెసియార్‌ మహానుభావుడనడం ఆశ్చర్యకరం. రాష్ట్రం విడిపోయాక తెలంగాణలో విద్వేష వాతావరణం లేదు, అంతవరకు కెసియార్‌ అభినందనీయుడు. ఇప్పటిదాకా ఆంధ్రలో రెసిడెంటు, నాన్‌రెసిడెంటు ఫీలింగు లేదు. దాన్ని నాటుతున్న లోకేశ్‌ అభిశంసనీయుడు. ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పి అక్కడితో ఆపి ఉంటే బాగుండేది.

ముద్ర ఎంత బలంగా పడింది? - పోసాని లేవనెత్తిన యింకో అంశం - అవార్డులను రద్దు చేయాలన్నది, తన అవార్డును తిరస్కరించారన్నది. ఆయన మాటిమాటికి పేపర్లు లీకయితే రద్దు చేయరా? అని అడిగారు. లీకైందని ప్రభుత్వం ఒప్పుకున్నపుడే ఆ పని జరుగుతుంది. మీడియాలో వస్తే జరగదు. ఇక్కడ నందీ అవార్డుల విషయంలో జ్యూరీ నియామకం కానీ, వారి నిర్ణయం కానీ తప్పు అని ప్రభుత్వం ఒప్పుకోలేదు. అందుచేత రద్దు చేయదు. విమర్శలు చేస్తే రద్దు చేసి పారేస్తాం జాగ్రత్త అనే బెదిరింపు పిల్లచేష్ట. దానికే పోసానికి విపరీతంగా కోపం వచ్చింది. అది నీ అబ్బ సొమ్మా? అని తీవ్ర పదజాలంతో కడిగేశారు. ఆ సదరు 'ప్రభుత్వవర్గాలు' ఎవరో బయటపడేవరకు ఆ తిట్టు ఎవరికి తగిలిందో తెలియదు. 

ఇక రెండోది తిరస్కరణ. ఆయన చెప్పాడు - అవార్డు గురించి వినగానే సంతోషపడ్డాను. కానీ తర్వాత వాటికి 'కమ్మ' ముద్ర కొట్టడంతో బాధపడుతున్నాను, దీన్ని కాన్సిల్‌ చేసి ఇంటరాక్టివ్‌ వాయిస్‌ పద్ధతిలో ప్రజల చేత ఎన్నుకోబడితే అప్పుడు స్వీకరిస్తాను అని. కమ్మ అవార్డు అని ప్రభుత్వం అనలేదు. కొందరు ఆరోపించారు. అందరూ దాన్ని సమర్థించలేదు. 125 మందిలో ఎవరే కులమో ఎలా చెప్పగలం? అనే స్టాండే తీసుకున్నారు. ముఖ్యమైన అవార్డులు కమ్మవారికే రావడం, ''బాహుబలి''లో ప్రభాస్‌కు యివ్వకపోవడం వలన ఆ వాదన బలపడింది. అన్నిటి కన్న ప్రధానమైన పొరపాటు జ్యూరీ నిర్మాణంలో జరిగింది. సాధారణంగా జ్యూరీలో కమ్మలు 25-30% ఉంటూంటారట. కానీ యీసారి 80% వరకు ఉన్నారట. ఇంతకంటె లోతుగా వెళ్లి ఎవరేమిటి అని పరిశోధించడం చికాగ్గా ఉంటుంది.

చిత్రరంగంలో కమ్మవారి పాత్ర - న్యాయంగా మాట్లాడాలంటే - అవార్డుల్లో కమ్మలకు ఎక్కువ అవార్డులు రావడంలో వింతేమీ లేదు. సాహిత్యం, సంగీతం, నృత్యం అవార్డుల్లో చూస్తే 50% గ్రహీతలు బ్రాహ్మలు అయివుంటారు. జనాభాలో 3-4% కంటె ఉండరు కదా, వాళ్లకు అన్ని ఎందుకు అంటే ఆ రంగాన్ని వాళ్లు శతాబ్దాలుగా ఆశ్రయించుకుని ఉన్నారు కాబట్టి! అలాగే సినిమారంగంలో తొలి నుంచి ఉన్నవారిలో కమ్మలదే ప్రధానపాత్ర. సినిమా హాలు వ్యాపారం ఊళ్లోనే నడుస్తుంది కాబట్టి చాలా కులాల వారు వాటిలో పెట్టుబడి పెట్టారు. కానీ సినీనిర్మాణంలోకి వెళ్లాలంటే చాలా చొరవ కావాలి. అప్పట్లో సినిమా పూర్తి జూదం లాటిదే, పైగా సాంఘికంగా పెద్ద మర్యాదైన వృత్తి కూడా కాదు. 

అసలు నాటకాలాడే వాళ్లంటేనే గౌరవం ఉండేది కాదు. అలాటిది ఉన్న ఊళ్లో కాకుండా ఎక్కడో చెన్నపట్నంలో అనేకమంది ఆడవాళ్లు వచ్చీపోయే వాతావరణంలో, వ్యసనాలు సులభంగా అలవాటయ్యే పరిస్థితుల్లో వెళ్లి వ్యాపారం చేస్తానంటే యింట్లో వాళ్లు సమ్మతించేవారు కారు. కమ్మలకు సహజంగా ఉండే ఎంటర్‌ప్రైజింగ్‌ నేచర్‌ వారిని అటువైపు నడిపించింది. సాహసం చేసి వెళ్లిన పెట్టుబడిదారుల్లో కొందరు నిలదొక్కుకున్నారు. నిర్మాణం చేపట్టాక తన బంధువులనే ప్రొడక్షన్‌లో, ఫైనాన్సులో పెట్టుకున్నారు. చదువుపై ఆసక్తి తక్కువ వున్న మేనల్లుణ్ని తీసుకుని వచ్చి డైరక్షన్‌లోనో, ఎడిటింగ్‌లోనో, ఫోటోగ్రఫీలోనో పెట్టారు. ఇలా తెర వెనుక నిపుణుల్లో నిర్మాతకు కావలసినవారు అనేకమంది పెరిగారు. తెలిసినవాళ్లలో నటనాసక్తి ఉన్నవాళ్లకు ఓ ఛాన్సు యిచ్చి చూశారు. క్రమశిక్షణ, కష్టించే స్వభావం ఉండి ప్రజాభిమానం పొందినవారు మాత్రమే ఇక తెరమీద నిలదొక్కుకున్నారు. ఇది అన్ని కులాల వారికీ జరిగేదే అయినా కమ్మల వాటా ఎక్కువ కాబట్టి అవార్డుల్లో పెద్ద వాటా సహజం.

మాట్రిక్స్‌ యిలా ఉండిందా? -అయితే యీసారి తక్కిన పొరపాట్లు కూడా జరిగాయి కాబట్టి మొత్తం మీద కులం రంగు అలుముకుంది. ఇటువంటి కలర్‌ వస్తుందని బాబు కూడా ఊహించి ఉండరు. నా అనుమానం ఒకలా జరిగి ఉంటుందని - ఆంధ్ర ప్రభుత్వానికి ఉత్సవాలమీద ప్రీతి. తెలంగాణ ప్రభుత్వం తెలుగు సభలు నిర్వహిస్తోంది. దానికి పోటీగా, యింకా గ్లామరస్‌గా ఏం చెయ్యాలా అని ఆలోచిస్తే దొడ్లో కట్టి పడేసిన ఐదేళ్ల నందులు గుర్తుకు వచ్చాయి. భారీస్థాయిలో ఫంక్షన్‌ చేసి నందుల్ని పంచేస్తే సరి అన్న ఐడియా వచ్చింది. 'హైటెక్‌ సిటీ కట్టి హైదరాబాదు నిర్మాతగా ఖ్యాతి కెక్కిన బాబు యిప్పుడు ఆంధ్రను సినిమా హబ్‌గా చేయబోతున్నారు, మీరంతా మాలాగే హైదరాబాదు వదిలిపెట్టి యిక్కడకి వచ్చి, మదర్పిత రాయితీ స్థలాది సత్కారాలంది, స్టూడియోలు కట్టి మాకు పేరు తెచ్చిపెట్టండి' అందామనుకున్నారు. కళ్లు చెదిరేలా ఫంక్షన్‌ జరగాలంటే బాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండల్‌వుడ్‌.. ఇలా అన్ని చోట్ల నుంచి తారలను రప్పించాలి. ఊరికే రమ్మంటే రారు. ఏదో అవార్డు యిస్తున్నామంటే వస్తారు. దాని కోసం ఒక మాట్రిక్స్‌ తయారుచేశారు. 2012-16 నందీ అవార్డు పొందిన ముఖ్యతారలను గమనించండి. బాలీవుడ్‌ నుండి హేమమాలిని, కోలీవుడ్‌ నుంచి కమల్‌, రజనీ (ఎన్టీయార్‌ అవార్డులు) కర్ణాటక నుంచి సుదీప్‌ (ఈగ) కేరళ నుంచి మోహన్‌లాల్‌ (జనతా గ్యారేజ్‌), ఇక హీరోలు ప్రభాస్‌, బాలకృష్ణ, మహేశ్‌బాబు, జూ.ఎన్టీయార్‌, నాని, నాగచైతన్య హాజరవుతారు. హీరోయిన్లలో అంజలి, సమంత, అనూష్క, రీతూ వర్మ ఉంటారు. ''మిర్చి'' కోసం ప్రభాస్‌ ఎలాగూ వస్తాడు కాబట్టి ''బాహుబలి''కి మళ్లీ యివ్వడం దండగ. ఆ ఏడాది మహేశ్‌కి యిస్తే సరి. ఇక అల్లు అర్జున్‌, హీరోగా బాలకృష్ణతో పోటీ పడుతున్నాడు కాబట్టి పక్కన పెట్టేసి, కారెక్టరు యాక్టర్ని చేసేయాలి. పెద్ద అవార్డులలో మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరూ లేకపోతే అభాసు. అందువలన చిరంజీవి చురుగ్గా ఉన్నా సరే, రఘుపతి వెంకయ్య అవార్డు యిచ్చి రప్పించాలి. మనల్ని ప్రశ్నించిన గుణశేఖర్‌ వచ్చేందుకు వీలు లేకుండా రుద్రమదేవికి ఏమీ యివ్వకూడదు. అమరావతిలో యీ అంగరంగ వైభోగ తారాతోరణాన్ని నవనందుల బాలకృష్ణ ఆధ్వర్యంలో గ్రాండ్‌ షోగా తీర్చవచ్చు. బోయపాటి శ్రీను చేత గ్రాండున్నరగా షూట్‌ చేయించి డాక్యుమెంటరీ చేసి యికపై సినిమావాళ్లందరూ ఆంధ్రకు తరలి వచ్చేస్తున్నారొహో (వేదిక మీద స్పందనల్లో యిలాటి కబుర్లు చెపుతారుగా) అని చాటింపు వేసుకోవచ్చు. - ఇదీ ప్లాను అయి వుంటుందని నా ఊహ. ఊహకు ఏ ఆధారమూ లేదు. 

అయితే ప్లాను ఎగ్జిక్యూట్‌ చేయడంలో చీదేసింది. 2012, 13 సజావుగా సాగిపోయాయి. ఎన్టీయార్‌ అవార్డు ఆయన సరసన నటించిన ఏ మీనాక్షీ శేషాద్రికో యివ్వకుండా హేమమాలినికి యిచ్చేరేమిటి? శాతకర్ణి ప్రభావమా? అని కూడా ఎవరూ గట్టిగా అడగలేదు. హేమమాలినిని మొహమాట పెట్టి సభకు రప్పింవచ్చు. పైగా ఆవిడ మిత్రపక్షమైన బిజెపి ఎంపి. మీనాక్షి ఎందరికి గుర్తుందో తెలియదు. 2014,15,16 మాత్రం చాలా మొరటుగా వ్యవహరించడంతో చేదెక్కింది. అవార్డులు వచ్చినవాళ్లు కూడా సంతోషించలేని పరిస్థితి వచ్చింది. కులం ఫ్యాక్టర్‌ బయటకు రావడం వలన ప్రతిభ వలన వచ్చినవారు సైతం కించపడతారు అని తొలి వ్యాసంలోనే రాశాను. పోసాని అలాగే ఫీలయ్యారు. ఆయన తర్వాత యింకెవ్వరూ తిరస్కరించలేదు. ఫంక్షన్‌ జరిగేలోపున యీ ముద్ర చెరిగిపోవచ్చు. కానీ లోకేశ్‌ లేవనెత్తిన ప్రాంతీయవాదం యిప్పట్లో పోదు. 'తెలుగు రోహింగ్యాలం మేము, విజయవాడకు ఫ్యామిలీతో వెళ్లాలంటేనే భయమేస్తోంది' అని పోసాని అన్న మాటలు తెలంగాణ టిడిపి నాయకులను ఉడికించడానికి తెరాస నాయకులకు ఆయుధాలుగా ఉపయోగపడతాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?