Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: విమర్శకూ ప్రాంతీయతా?

ఎమ్బీయస్‌: విమర్శకూ ప్రాంతీయతా?

నందీ అవార్డ్స్‌ వివాదంపై నిన్న ఆంధ్రజ్యోతి ఛానెల్‌ వారు బిగ్‌ డిబేట్‌ పెట్టారు. అది చూస్తూండగానే ఆ ఛానెల్‌లో స్క్రోలింగ్‌ రాసాగింది - రాష్ట్రం కష్టనష్టాల్లో ఉన్నా పోనీ కదాని ఐదేళ్ల నందీ అవార్డులు ప్రకటించి యిద్దామనుకుంటే యింత గొడవా? ఇలా అయితే రద్దు చేస్తే నష్టమేముంది? అని ఆంధ్ర ప్రభుత్వంలో ఆలోచన సాగుతోంది అంటూ. చర్చలో రాధాకృష్ణగారు అన్నారు కూడా 'చంద్రబాబు కాబట్టి యివన్నీ మాట్లాడగలుగుతున్నారు, ఇదే కెసియార్‌ అయితే అందర్నీ తీసుకెళ్లి లోపలేయమనేవాడు, దూల తీరిపోయేది' అని. ఆ మధ్య టీవీలో ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు - 'బాబు గారు ఓపిగ్గా వింటున్నారు కదాని యిన్ని ప్రశ్నలు వేస్తున్నారా? అదే వైయస్సార్‌ అయితే ఫ్యాక్షనిస్టు, ఏదైనా చేసేస్తాడేమోనన్న భయంతో అప్పుడు అన్యాయం జరిగినా నోరెత్తలేదా?' అని. అంటే విమర్శను సహించలేని గుణం వైయస్సార్‌, కెసియార్‌లలో ఉండగా, సహించే గుణం బాబులో దండిగా ఉన్నట్లే కదా! మరి ప్రభుత్వంలో ఎవరు యిలా ఆలోచిస్తున్నారు? అనే సందేహం మెదిలింది. ఇవాళ తక్కిన పేపర్లు ఏవీ వేయలేదు కానీ ఆంధ్రజ్యోతి మాత్రం ఆపేస్తా'నంది'? అంటూ హెడ్‌లైన్‌ బ్యానర్‌ ఐటమ్‌ యిచ్చారు. పద్ధతిగా చేసినా రాద్ధాంతం చేస్తున్నారేం? శ్రుతి మించితే అవార్డులు ఎత్తివేద్దాం, సినిమా వాళ్లందరి ఆస్తులూ, పన్ను చెల్లింపులూ హైదరాబాదులోనే, అయినా తెలుగువారంతా ఒక్కటే అనే ఉద్దేశంతో అవార్డులు యిస్తే యీ పేచీ ఏమిటి? అని ప్రభుత్వ వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయని రాశారు. 

నిన్న ఎబిఎన్‌ చర్చలో జ్యూరీ చేసిన పొరపాట్లకు ప్రభుత్వాన్ని నిందించకూడదనే ఎక్కువమంది అన్నారు. వివాదాన్ని రగిల్చిన బన్నీ వాసు కూడా జ్యూరీ చేసిన పొరపాట్లని ఎత్తి చూపడమే తన లక్ష్యమని, అది నెరవేరింది కాబట్టి ముగింపు పలుకుతున్నాననీ అన్నారు. ప్రభుత్వానికి లక్ష పనులుంటాయని, జ్యూరీ న్యాయబద్ధంగా వ్యవహరిస్తుందనే ఉద్దేశంతో నియమించి వుంటారని, పొరపాట్లను ప్రభుత్వానికి ఆపాదించకూడదని తీర్మానించేశారు. అలాటప్పుడు ప్రభుత్వవర్గాలు యిలా ఎందుకు స్పందిస్తాయి, ఎక్కడో అతి జరుగుతోంది అనిపించింది. ఇవాళ సాయంత్రం స్క్రోలింగ్‌ చూసేసరికి, బాబు విసుగుదల, లోకేశ్‌ ప్రశ్నావళి తెలిశాయి. మెదలకుండా కూర్చుంటే పోయేదానికి బదులు ప్రభుత్వం జ్యూరీ తప్పులను ఓన్‌ చేసుకుంటేదేమిట్రా అని ఆశ్చర్యం కలుగుతోంది. బాబు మాటలు ఎలా వున్నా ఆంధ్రలో ఆధార్‌, ఓటింగు హక్కు లేనివారు ఎలా విమర్శిస్తారని లోకేశ్‌ అడగడం నివ్వెరపరిచింది. 

నేను ఆంధ్రలో పాలనను విమర్శించినప్పుడల్లా టిడిపి అభిమానులు కొందరు 'తెలంగాణలో ఉంటూ ఆంధ్ర రాజకీయాల గురించి రాయడానికి మీకేం హక్కు ఉంది?' అంటూంటారు. ఆంధ్ర అనే ఏమిటి, దేశంలో అన్ని రాష్ట్రాల గురించి, ఆ మాట కొస్తే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల గురించి, లోకం దాటి పరలోకపు విషయాల గురించి కూడా రాస్తున్నాను కదా, అప్పుడు అడగలేదేం? అని అడుగుతూంటా. నన్ను అడిగే పాఠకులు విదేశీ యూనివర్శిటీల్లో చదువుకున్నవారు కాదు. ఆవేశం పట్టలేక ఏదో ఒకటి అనేస్తారు. నేనూ సీరియస్‌గా తీసుకోను. కానీ లక్షణంగా పెరిగి (బాబుగారి మాటల్లో), సొంత ప్రతిభతో స్టాన్‌ఫర్డ్‌లో సీటు సంపాదించి (యిదీ బాబుగారి మాటే), వ్యాపారంలో రాణించి, చిన్నతనంలోనే తండ్రికి ప్రధాని పదవి వద్దు, రాష్ట్ర పదవే ముద్దు అని రాజకీయ సలహాలు యిచ్చి, నగదు బదిలీ వంటి ఆర్థికసంబంధిత సలహాలిచ్చి, యీనాడు మంత్రి అయి, భావి ముఖ్యమంత్రి కావడానికి అన్ని ఛాన్సులూ ఉన్న లోకేశ్‌ కూడా యీ తరహాలో ప్రశ్నిస్తారని నేను ఊహించలేక పోయాను. ఐలయ్యగారి అవాకులూ, చెవాకులను ఎవరైనా ప్రశ్నిస్తే ఆయన వెంటనే మీదే కులం? అంటాడు. నువ్వు కోమట్లను స్మగ్లర్లనడానికి, నా కులానికి సంబంధం ఏమిటంటే వినడు. లోకేశ్‌ ఐలయ్య నుండి స్ఫూర్తి పొందినట్లున్నారు. ఎవరైనా విమర్శించగానే మీదే ప్రాంతం అని అడుగుతారన్నమాట. మెచ్చుకున్నవారిని మాత్రం అడగరు లెండి. డెన్మార్కులో పుట్టిన దీపికా పడుకొనే అమరావతి అద్భుతంగా ఉంది అంటే 'అనడానికి నువ్వెవరు? పుట్టుక చేతనే విదేశస్తురాలివి' అని అనరు. ప్రశ్నిస్తేనే అడుగుతారు.

ఏపి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో జరిగిన 'సోషల్‌ మీడియా సమ్మిట్‌'లో దీపికాకు అవార్డు యిచ్చారు. అప్పుడు లోకేశ్‌ గారికి ఆవిడకు ఆంధ్రలో ఆధార్‌ కార్డు ఉందా? ఆస్తులెక్కడ ఉన్నాయి? పన్నులు ఎక్కడ కడుతోంది? వంటి విషయాలు గుర్తుకు రాలేదు. నంది అవార్డు గ్రహీతల విషయంలో మాత్రమే గుర్తుకు వచ్చాయి. ఆయన మాటల బట్టి ఆయన ఆంధ్రలో ఆధార్‌ సంపాదించారని అర్థమైంది. మొన్నటిదాకా తెలంగాణలోనే పుట్టా, పెరిగా, నా ఆస్తులు యిక్కడా ఉన్నాయి. తెలంగాణలో పోరాటం చేయడానికి నాకు హక్కు ఉంది, తెలంగాణలో టిడిపిని బతికించి, వర్ధిల్ల చేసుకుంటా' అని అంటూ ఉండేవారు. నోటుకు ఓటు ధర్మమాని తెలంగాణ యూనిట్‌ను మిగిలిపోయిన అడుగు బొడుగు లీడర్లకు వదిలి, తను ఆంధ్రలో మంత్రి కావడానికి వెళ్లిపోయారు. తెలంగాణతో పూర్తి తెగతెంపులు చేసుకున్నారేమో, యిప్పుడు ఆంధ్రలో ఆధార్‌ ఉందా? అని అందర్నీ అడుగుతున్నారు. ఆంధ్రలో ఓటుహక్కు ఉన్నవారే అవార్డుల కోసం అప్లయి చేసుకోవాలని ముందే చెప్తే పోయేది. పట్టుమని పదిమంది కూడా ఉండేవారు కాదు. వెతికి పట్టుకుని అవార్డు లిచ్చేవారు. ఈ ఘోష ఉండేది కాదు. వెదురే లేకపోతే వేణుగాన మెక్కడిది? అన్నీ జరిగాక మీరు నియమించిన జ్యూరీ సరిగ్గా వ్యవహరించ లేదయ్యా, యిదిగో యివీ పొరపాట్లు అంటే అప్పుడు ముల్కీ అంశం పైకి లాగటమేమిటి?

ఏ రాష్ట్రంలో నిర్మించిన సినిమాలకు ఆ రాష్ట్రంలోనే అవార్డులు యిస్తారు అని వాదించడం అర్థరహితం. మద్రాసులో సినిమా తీసేరోజుల్లో వాటికీ అవార్డులు యిచ్చారు. పూర్తిగా ఫారిన్‌లో తీసిన ''పడమటి సంధ్యారాగం''కు కథారచనకు నందీ అవార్డు యిచ్చారు. కావలిస్తే కొత్తగా అవార్డులివ్వడానికి ఎలాటి షరతులు కావాలన్నా పెట్టుకోవచ్చు. ఇచ్చేవాళ్ల యిష్టం. కానీ అవన్నీ అప్లయి చేయడానికి ముందే చెప్పాలి. అవార్డులు కాన్సిల్‌ చేసేస్తామన్న బెదిరింపు వింటే నవ్వొస్తోంది. రానివాళ్లేగా విమర్శించేది, కాన్సిల్‌ చేస్తే వాళ్లు మరీ సంతోషిస్తారు. వచ్చినవాళ్లు గొల్లుమంటారు. రాష్ట్రంలో అప్పుల్లో ఉన్నా.. అనే సాగతీత చికాగ్గా ఉంది. మేం పన్నులు కట్టే డబ్బులు ఖర్చుపెట్టి నంది అవార్డులు తప్పకుండా యివ్వండి అని ప్రజలు ఎప్పుడైనా కోరారా? ఐదేళ్లగా ప్రభుత్వాలు అవార్డుల గురించి పట్టించుకోలేదు.  ప్రజలు కానీ, సినీపరిశ్రమ వారు కానీ ధర్నాలు చేశారా? నిరసనలు తెలిపారా? మీ అంతట మీరే ఎనౌన్సు చేశారు. 2012, 13 రెండేళ్లది ఓ సారి ప్రకటించారు. జ్యూరీలో మంచివాళ్లను పెట్టారు. ఏ యిబ్బందీ, ఏ వివాదమూ రాలేదు. 2014, 15, 16 జ్యూరీ ఎంపికలో తప్పులు చేశారు. వివాదాలు వచ్చాయి. ఇక మీరు బెదిరింపులకు దిగారు.

నంది అవార్డులు కూడూ, గూడూ, గుడ్డాకు సంబంధించినవి కావు. వినోదానికి సంబంధించినవి. వాటి కంటె ఘనంగా డాన్సులు, రంగులు, పొంగులతో ప్రయివేటు అవార్డుల ఫంక్షన్లు జరుగుతున్నాయి. టీవీల్లో మాటిమాటికీ చూపిస్తూనే ఉన్నారు. ప్రజలకు వచ్చిన లోటేమీ లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన సినీపరిశ్రమ ఉంది కాబట్టి, సినిమాలపై వినోదపు పన్ను రూపంలో, యితరత్రా ప్రభుత్వానికి బోల్డు ఆదాయం వస్తోంది. ప్రభుత్వం తరఫునుంచి కూడా దాన్ని ప్రోత్సహిస్తే ఆదాయం యింకా పెరుగుతుందేమోనన్ని ప్రభుత్వాల ఆశ. అందుకే స్టూడియోలకు, తారల నివాసాలకు చౌకగా భూములిచ్చి ఆకట్టుకోవడం. అవార్డులూ ఆ ప్రక్రియలో భాగమే. నంది అవార్డులు మానేయదలచుకుంటే నిక్షేపంలా మానేయవచ్చు. ఈ బెదిరింపులు అనవసరం. విమర్శల పట్ల అసహనం పెరిగిపోయింది. సోషల్‌ మీడియాలో కామెంటు పెట్టినా కేసులు పెట్టి జైల్లోకి తోస్తున్నారు. ఇప్పుడు సినిమాల గురించే కాదు, పోలవరం గురించి, అమరావతి గురించి ఏ ప్రశ్నా వేసినా, ఏ వ్యాసం రాసినా ఆధార్‌ కార్డు ఫోటో జతపరచాలేమో! 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?