Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : శివరాజ్‌ చౌహాన్‌కు స్థానచలనమా...?

ఎమ్బీయస్‌ : శివరాజ్‌ చౌహాన్‌కు స్థానచలనమా...?

బిజెపి ఒక్కో రాష్ట్రం గెలుస్తూ వస్తోంది. తాజాగా దిల్లీ స్థానిక ఎన్నికలలో సిద్ధించిన ఘనవిజయం దృష్ట్యా తర్వాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పుడు (ఏదో వంక పెట్టి ఆప్‌ ప్రభుత్వాన్ని రద్దు చేసేస్తే ఆ ఘడియ త్వరలోనే రావచ్చు) అక్కడా నెగ్గేట్లా వుంది. ఈ వూపు యిలా వుండగానే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి నిర్వహించి, దేశంలోని సాధ్యమైనన్ని ఎక్కువ రాష్ట్రాలలో, కేంద్రంలో ఒకేసారి పాగా వేద్దామనే వూహలో బిజెపి వుంది. ఏ కారణం చేతనైనా ఏ రాష్ట్రంలోనైనా పార్టీ బలహీనంగా వుందంటే దాని ప్రభావం పార్లమెంటుపై కూడా పడుతుందన్న సంకోచం వుంది. అందువలన ఏ రాష్ట్రమూ చేజారిపోకూడదని లెక్కలు వేస్తోంది. ఆ విధంగా చూస్తే 2018 నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగవలసిన మధ్యప్రదేశ్‌లో నాల్గోసారి అధికారంలోకి రావడానికి ప్రభుత్వ వ్యతిరేకత అడ్డుపడుతుందాన్న భయం వుంది. 29 పార్లమెంటు స్థానాలున్న రాష్ట్రాన్ని తేలికగా తీసుకోవడానికి వీల్లేదు.

15 ఏళ్లు ఏకధాటీగా పాలించాక ఏ పార్టీకైనా వ్యతిరేకత రావడం, ప్రత్యామ్నాయానికి ఓ ఛాన్సు యిచ్చి చూద్దామని ఓటర్లు అనుకోవడం సహజం. 2003లో బిజెపి గెలిచాక ఉమాభారతి ముఖ్యమంత్రి అయ్యారు. 9 నెలల తర్వాత ఆమె దిగిపోయి, బాబూలాల్‌ గౌర్‌ ముఖ్యమంత్రిగా 15 నెలలు చేసి, 2005 నవంబరులో అధిష్టానం ఆదేశం మేరకు ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్‌ చౌహాన్‌కు పగ్గాలు అప్పగించారు. అప్పణ్నుంచి చౌహాన్‌ ముఖ్యమంత్రిగా వుంటూ వచ్చాడు. వ్యాపమ్‌ కుంభకోణంలో చిక్కుకున్నాడు. కొన్ని రంగాలలో ప్రభుత్వ వైఫల్యం కొట్టవచ్చినట్లు కనబడుతోంది. పౌష్టికాహార లోపం వలన దేశవ్యాప్తంగా సంభవించే మరణాలలో, ప్రసూతి మరణాలలో అత్యధిక శాతం మధ్యప్రదేశ్‌లోనే! నిధులు లేక, అయ్యవార్లు లేక విద్యారంగం అస్తవ్యస్తమైంది. అందువలన అతన్ని కేంద్రానికి మంత్రిగా రప్పించేసి, ఎన్నికలు ఏడాదిన్నర ముందుగానే అతని స్థానంలో వేరే వ్యక్తిని పెడితే శివరాజ్‌ పాలన ప్రజలు మర్చిపోతారని, బిజెపిని ఫ్రెష్‌గా చూస్తారని పార్టీ అంచనా. గుజరాత్‌లో అలాటి ప్రయోగమే జరిగింది. దాని ఫలితం త్వరలోనే తెలుస్తుంది. శివరాజ్‌ ఆడ్వాణీకి అనుచరుడిగా వెలుగులోకి వచ్చాడు. అందువలన మోదీకి, అమిత్‌కు అతనిపై ప్రత్యేక ప్రేమ ఏమీ లేదు. అయితే శివరాజ్‌ ఆరెస్సెస్‌తో సత్సంబంధాలు పెట్టుకున్నాడు కాబట్టి నెట్టుకుని వస్తున్నాడు.

అధిష్టానం ఆలోచన ఎలా వున్నా, శివరాజ్‌కు సొంత ఐడియాలున్నాయి. ''మీరు కేంద్రంలో వ్యవసాయ మంత్రిగా వెళతారటగా?'' అని ఎవరో అడిగితే ''నేను పార్టీకి విధేయుడైన కార్యకర్తను. ఏ బాధ్యత అప్పగిస్తే అదే చేస్తాను.'' అంటూనే ''ప్రస్తుతం ఎక్కడున్నానో అక్కడ సంతోషంగానే వున్నాను.'' అని చేర్చాడు. అతను రాజకీయాల్లో ఢక్కామొక్కీలు తిన్న అనుభవజ్ఞుడు.  తన వైఫల్యాలకు గతంలో అయితే కేంద్రాన్ని తప్పుపట్టి నెగ్గుకొచ్చాడు. ఇప్పుడది కుదరదు. అందువలన అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి జనాలలో మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. రూపాయికి కిలో గోధుమల పథకం, రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం, దీన్‌దయాళ్‌ రసోయీ యోజనా పేరుతో జిల్లా కేంద్రాలలో రూ.5కు భోజనం పథకం,   గ్రామాల్లో యిళ్లు కట్టుకోవడానికి ముఖ్యమంత్రి ఆశ్రయ్‌ యోజనా పేరుతో ఉచితంగా భూమి యిచ్చే పథకం, నర్మదా నది ఒడ్డున హెక్టేరు భూమిలో మొక్కలు పాతడానికై రైతులకు రూ.20,000  యిచ్చే పథకం ప్రవేశపెట్టాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?