Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: శ్రీకృష్ణుడు క్షత్రియుడు కాడా?

ఎమ్బీయస్‌: శ్రీకృష్ణుడు క్షత్రియుడు కాడా?

ఇటీవల కృష్ణుడు-యాదవులు అనే అంశంపై గురించి వివాదం చెలరేగడంతో చాలామంది నాకు మెయిల్స్‌ రాశారు - కృష్ణుడు యాదవుడా? క్షత్రియుడా? స్పష్టంగా చెప్పండి అంటూ. ఇక్కడ గందరగోళం ఎందుకు వస్తోందంటే - యిప్పటి పరిభాషలో యాదవులు బిసి, క్షత్రియులు ఓసి.

'కృష్ణుడు యాదవుడు, గొల్లవాడు, పాలు పితికాడు కాబట్టి బిసి' అని కొందరి వాదన. నిజాన్ని కచ్చితంగా చెప్పాలంటే కృష్ణుడు యాదవ వంశానికి చెందిన క్షత్రియుడు. ఓసియో, బిసియో సామాజిక పండితులే తేల్చాలి. క్షత్రియుడైతే రాజ్యం చేయలేదేం? పట్టాభిషేకం చేసుకుని కృష్ణరాజు అనో, కృష్ణ చక్రవర్తి అని అనిపించుకోలేదేం? అనే ప్రశ్న సహజంగా వస్తుంది. రాముడూ క్షత్రియుడే. పట్టాభిషేకం వగైరాలు చేసుకున్నాడు. మరి యీయన చేసుకోలేదు. ఎందుకు? అంటే ఆయన పుట్టిన యాదవ వంశానికి శాపం వుంది. అది కాస్త చెప్పుకుంటే తప్ప అసలు సంగతి తెలియదు. 

యయాతి అనే మహాచక్రవర్తి శుక్రాచార్యుడి కూతురైన దేవయాని అనే ఆమెను పెళ్లాడాడు. పిల్లల్ని కన్నాడు. ఆ తర్వాత ఆమెకు తెలియకుండా ఆమె స్నేహితురాలైన శర్మిష్ఠ ద్వారా కూడా పిల్లల్ని కన్నాడు. ఈ విషయం తెలిశాక దేవయాని వెళ్లి తండ్రికి ఫిర్యాదు చేసింది. ఆయనకు వెర్రి కోపం వచ్చి 'ఏ యౌవనమదంతో యింతటి నీచానికి వడికట్టావో ఆ యౌవనం నాశనమై పోగాక! నీకు తక్షణం వార్ధక్యం దాపురించుగాక' అని శపించేశాడు. యయాతి తక్షణం వికారంగా, అతివృద్ధుడై పోయాడు. ఆ తర్వాత ఆవేశం తగ్గాక 'అల్లుడు ముసలివాడైతే కూతురి సంగతేమిటి?' అనే ఆలోచన వచ్చింది. 'నీ ప్రస్తుత వార్ధక్యాన్ని నీ నిజవార్ధక్యం వచ్చేవరకూ నీవారు ఎవరైనా స్వీకరించి - వారి యవ్వనం నీకు యివ్వడానికి అంగీకరిస్తే నీకు వెంటనే యవ్వనం సిద్ధిస్తుంది. నీవూ నా కుమార్తె, శర్మిష్ఠ కూడా మరొక వేయి సంవత్సరాలు సుఖించవచ్చు. ఆ తరువాత నీ యవ్వనాన్ని వారికి తిరిగి యిచ్చి, నీ నిజవార్ధక్యాన్ని పొందవచ్చు.' అని శాపవిమోచనానికి మార్గం చూపాడు. 

యయాతి కొంతకాలం ఆకాల వార్ధక్యం అనుభవించి కుమారులు యౌవనావస్థకు వచ్చాక సిగ్గు విడిచి వారినే అడిగాడు. 'వెయ్యి సంవత్సరాల తర్వాత నీ యౌవనం తిరిగి నీకు యిచ్చేస్తాను. వరాలిస్తాను.' అని ఆశ చూపాడు. అతని పెద్ద కొడుకు యదువు కుదరదన్నాడు. దాంతో యయాతి 'నా మాట విననివాడికి నా ఆస్తిలో వాటా రాదు. నీ వంశస్తులకు ఎన్నటికీ రాజ్యార్హత వుండదు. నా మాట కాదని ఎవరైనా రాజ్యం చేపట్టినా రాణించరు. మీరంతా పశువులు మేపుకుంటూ బతకండి.'' అన్నాడు. అలాగే తన మాట కాదన్న తక్కిన కొడుకులను కూడా శపించాడు. తుర్వసుణ్ని - 'మీ వంశం వారు అడవులు పట్టి కిరాతకులై, చండాలురకు రాజులై బతకండి' అని అన్నాడు. ద్రుహ్యునితో 'నిత్యం నావపై తిరుగవలసిన చోట వుండు. నీ వంశంలోనివారు రాజులు కాలేరు.' అన్నాడు. అనువు అనే అతన్ని 'నీ సంతానం యౌవనం పొందుతూనే నశిస్తుంది' అని శాపమిచ్చాడు. చివరకు అతనికున్న ఐదుగురు కొడుకుల్లో శర్మిష్ఠకు పుట్టిన పురువు అనేవాడే దీనికి సమ్మతించాడు. అతనికే వేయి సంవత్సరాల తర్వాత యయాతి తదనంతరం రాజ్యం దక్కింది. కురుపాండవులు అతని వారసులే. పెద్ద కొడుకైనా యదువుకు దక్కలేదు.

యయాతి శాసనాన్ని యదువంశ వారసులు అందరూ పాటించలేదు. యదువు పెద్ద కొడుకైన సహస్రజిత్తు మనుమడు హేహయుడి నుంచి హేహయ వంశం పుట్టింది. వారికి మాహిష్మతి రాజధాని. ఆ వంశంలో కార్యవీర్యార్జునుడు (పరశురాముడితో వైరం తెచ్చుకున్నవాడు) ప్రసిద్ధుడు. యదువు రెండో కొడుకు క్రోష్టువు వంశంలో విదర్భుడు (రుక్మిణి యీ వంశానికి చెందినదే) ప్రసిద్ధుడు.  క్రోష్టువు తక్కిన వారసుల ద్వారా భోజ వంశం, అంధక వంశం (కృష్ణుడు యీ వంశం వాడే), వృష్ణి (సత్యభామ యీ వంశానికి చెందినదే) వంశం, చేది వంశం (శిశుపాలుడు యీ వంశం వాడే) కలిగాయి. కృష్ణుడి పితామహుడైన శూరుడు (శూరసేనుడు) సంప్రదాయాన్ని పక్కకు పెట్టి మధుర రాజ్యాన్ని పాలించాడు. అతని కొడుకుల్లో ఒకడు వసుదేవుడు. కూతుళ్లలో ఒకరు పృథ. ఈ పృథను శూరుడి బావ ఐన కుంతిభోజుడికి పిల్లలు లేకపోతే దత్తత కిచ్చారు. అతని పేర ఆమె కుంతిగా ప్రసిద్ధి కెక్కింది. పాండవులకు తల్లి ఐంది. ఈమె కారణంగానే కృష్ణుడికి, పాండవులకు 'బావా' అనే బంధుత్వం ఏర్పడింది. శూరుడి తర్వాత రాజ్యం చేసే అవకాశం వసుదేవుడికి వచ్చింది. కానీ అతను తమ పూర్వీకుడు యయాతి శాసనాన్ని మన్నించి రాజ్యం కాదన్నాడు. భోజవంశంలోని ఉగ్రసేనుడికి రాజ్యం ధారపోశాడు. తను మంత్రిగా వున్నాడు. రోహిణి అనే ఆమెను పెళ్లాడాడు. కానీ వారికి బిడ్డలు పుట్టలేదు. నారదమహర్షి రోహిణికి కలలోకి వచ్చి 'నీ భర్త మారుమనువు చేసుకుని, నీ సవతికి బిడ్డలు పుడితేనే నీకు పిల్లలు పుడతారు.'అని చెప్పాడు. ఆ మాట వసుదేవుడికి చెపితే అతను వినలేదు. చివరకు ఒప్పించారు. 

వసుదేవుడికి రెండో భార్యగా తన కూతురు దేవకి నివ్వడానికి ఉగ్రసేనుడు ముందుకు వచ్చాడు. వసుదేవుడు ధారపోసిన రాజ్యంతో అతను రాజుగా, అతని కుమారుడు కంసుడు యువరాజుగా మధుర నేలుతున్నారు. అప్పట్లో మగధను పాలిస్తున్న జరాసంధ చక్రవర్తి తన కూతుళ్లయిన అస్తి, ప్రాప్తిలను సామంతరాజ్యమైన మధుర యువరాజు కంసుడికి యిచ్చి పెళ్లిచేశాడు.  ఈ కంసుడి చెల్లెలు దేవకిని ద్వితీయవివాహం చేసుకుని వసుదేవుడు తన యింటికి వెళుతూండగానే కంసుణ్ని ఆకాశవాణి అష్టమగర్భం గురించి హెచ్చరించడం అవీ జరిగాయి. దాంతో దేవకీ, వసుదేవులను కంసుడు చెఱసాలలో పెట్టాడు. అప్పుడు వసుదేవుడు తన మొదటిభార్య రోహిణిని వ్రేపల్లెలోని నందుడు అనే స్నేహితుడి వద్దకు వెళ్లి తలదాచుకోమని చెప్పి పంపాడు. అక్కడే ఆమెకు బలరాముడు పుట్టాడు. 

ఈ నందుడు గొల్లవాడు. అతనిది పాలవ్యాపారం. అతని భార్యే యశోద. కృష్ణుడు ఆమె వద్ద పెరిగాడు. అంటే కృష్ణుడు రాజులుగా, రాజబంధువులుగా వుంటూ వచ్చిన యదువంశపు క్షత్రియకుటుంబంలో పుట్టి, గొల్లవాళ్ల యింట కొంతకాలం పెరిగాడు. కంససంహారం తర్వాత రాజధాని అయిన మధురలోనే నివసించసాగాడు. కంససంహారం గురించి క్లుప్తంగా చెప్పాలంటే - అతను తన మావగారైన జరాసంధుడి మాట విని తండ్రిని చెఱసాలలో పెట్టి తనే రాజై పోయాడు. కృష్ణుడి వలన తనకు ప్రాణగండం వుందని తెలిసి, అతన్ని చంపడానికి సకలయత్నాలు చేశాడు. చివరకు ఎక్కడ వున్నాడో తెలుసుకుని ముష్టియుద్ధానికి ఆహ్వానించి చంపించబోయాడు. అయితే కృష్ణబలరాములు ఆ యోధులను చంపారు. అదే వూపులో కృష్ణుడు కంసుణ్నీ చంపివేసి, చెరసాలకు వెళ్లి తలితండ్రులైన దేవకీ వసుదేవులను, మాతామహుడు, మాతామహి ఐన ఉగ్రసేనుడు, పద్మావతిలను విడుదల చేశాడు.

అప్పుడు ఉగ్రసేనుడు కృష్ణుడికి రాజ్యం కట్టబెడతానన్నాడు. 'మా నాన్నగారిలాగానే నేనూ సింహాసనానికి దూరంగా వుండదలిచాను. మీరే పట్టం కట్టుకోండి.' అన్నాడు కృష్ణుడు తాతగారితో. తాతగారిని సింహాసనం ఎక్కించినా రాజకీయ సుస్థిరత వచ్చేవరకూ మధురలోనే వుండడానికి నిశ్చయించుకున్నాడు కృష్ణుడు. 'కంససంహారం తర్వాత అతని భార్యలు తండ్రి జరాసంధ చక్రవర్తి వద్దకు వెళ్లిపోయారు. అతడు దండెత్తిరావచ్చు. సామంతరాజుల్లో కంసవిధేయులు వుండవచ్చు. ఇవన్నీ చక్కబెట్టడానికి యిక్కడే వుండిపోతా'నంటే నందుడు నొచ్చుకున్నాడు. 'కన్నవాళ్లను చూడగానే పెంచినవాళ్లను మరిచావా?' అని అడిగాడు దీనంగా. ఎప్పటికైనా నేను నందనందనుడినే, యశోదాసుతుడినే అని బుజ్జగించి అతన్ని గోకులానికి పంపాడు కృష్ణుడు. అప్పణ్నుంచి ఎన్నిసార్లు గోకులానికి వెళ్లాడో లెక్క తెలియదు కానీ మధురలో, తర్వాత ద్వారకలోనే వుండి రాజ్యపాలన పర్యవేక్షించాడు. రాజుగా కాదు! సలహాదారుల్లో ఒకడిగా వున్నాడనుకోవాలి. అందుకే అనేక ముఖ్యనిర్ణయాలలో అతని పాత్ర కనబడుతుంది. 

కృష్ణుడు సింహాసనం మీద కూర్చుని రాజుగా పాలన చేయకపోయినా క్షాత్రధర్మాన్ని పాటిస్తూ యుద్ధాలు చేశాడు. సినిమాల్లో కృష్ణుడు అనగానే వేణువుతో కనబడతాడు కాబట్టి, అది వాయించడం తప్ప అతనికి వేరే ఏదీ రాదని అనుకోకూడదు. కృష్ణుడు అనేక ఆయుధాలతో యుద్ధాలు చేశాడు. జరాసంధుడితోనే కాదు, ఖాండవవన దహనం సమయంలో కూడా యుద్ధం చేశాడు.    శమంతకోపాఖ్యానంలో జాంబవంతుడితో అన్ని రకాల ఆయుధాలతో యుద్ధం చేశాడు. అర్జున, సుయోధనులతో 'కురుక్షేత్రంలో ఆయుధాలు చేపట్ట'నని చెప్పాడంటే దాని అర్థం మామూలుగా అయితే ఆయుధాలతో యుద్ధం చేసే తరహాయే అని కదా! 

ఇక అష్టభార్యల సంగతి చూడబోతే - రుక్మిణి, సత్యభామ తన యాదవ వంశ క్షత్రియవర్ణానికి చెందినవారే. భద్ర మేనత్త శ్రుతకీర్తి కూతురు. మిత్రవింద అవంతీ దేశాధీశుడైన విందుని చెల్లెలు. లక్షణ మద్రదేశపు రాజైన బృహత్సేనుడి కూతురు. కృష్ణుడు ఆమెను మత్స్యయంత్రం ఛేదించి మరీ గెలుచుకున్నాడు. కాళింది సూర్యుని కూతురు. నాగ్నజితి కోసల దేశాధిపతి ఐన నగ్నజితి కుమార్తె. రాజ్యాన్ని చికాకు పరుస్తున్న వృషభాలను సంహరించి, కృష్ణుడు ఆమెను చేపట్టాడు. జాంబవతి జాంబవంతుడి కూతురు. కృష్ణుడు  తన చెల్లెలు సుభద్రను చంద్రవంశ రాజులైన పాండవులకు చెందిన అర్జునుడికి యిచ్చి పెళ్లి చేశాడు. భీమార్జునులతో కలిసి జరాసంధుణ్ని సంహరించడానికి వెళ్లినపుడు బ్రాహ్మణ వేషంలో వెళితే జరాసంధుడు మీరెవరు? అని అడిగాడు. 'సజాతీయులైన క్షత్రియుల అభివృద్ధికై నిన్ను చంపటానికై యిక్కడకు వచ్చాం.' అని చెప్పి అతనితో యుద్ధాన్ని కోరారు వీళ్లు. అంతేకాదు, భారతంలో అనేక చోట్ల కృష్ణుని క్షత్రియ ధర్మప్రస్తావన వస్తుంది. అందువలన కృష్ణుడు క్షత్రియుడు కాడన్న సందేహమే అక్కర లేదు. బాల్యంలో గోపాలురతో, గోవులతో తిరిగినట్లు వున్నా పెద్ద అయిన తర్వాత రాచకార్యాలలోనే మునిగి తేలాడు. ద్వారకలో పశుసంపద వుంది కదా అంటే ఆ రోజుల్లో ప్రతి రాజుకి వ్యవసాయం, పశుసంపదే ముఖ్యసంపద. అందుకే విరాటపర్వంలో గోగ్రహణం (పరాయిదేశంపై దండెత్తి పశువులను పట్టుకోవడం) ప్రస్తావన వుంది. 

ఈ వ్యాసంలో ఏవైనా పొరపాట్లు దొర్లితే ఎత్తి చూపితే సవరించుకుంటానని మనవి. 

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2017)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?