Advertisement

Advertisement


Home > Articles - MBS

తమిళనాడులో మరీ ఘోరం

హైదరాబాదులో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తూన్న తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర వలస పాలకుల పాలన వలనే యిలాటి కట్టడాలు వచ్చాయని చెపుతున్నారు. తమిళనాడులో అక్రమ నిర్మాణాల గురించి అడిగితే  ఏమంటారో మరి! చెన్నయ్‌ శివార్లలో నిర్మాణంలో వున్న 11 అంతస్తుల భవంతి జూన్‌ 28 న కూలి ఉత్తరాంధ్ర నుండి వెళ్లిన వలస కార్మికులు మరణించడంతో ఒక్కసారిగా చెన్నయ్‌ నిర్మాణాలపై అందరి దృష్టీ పడింది. మౌళివాకంలో పోరూరు చెఱువు క్యాచ్‌మెంట్‌ ఏరియాలో ఆ భవంతి కడుతున్నారు. నేల కాస్త ఎండగానే సాయిల్‌ టెస్టు మొక్కుబడిగా కానిచ్చేసి, సరైన పునాది లేకుండా కట్టాడు. ఆరు అంతస్తులకు అనుమతి తీసుకున్నాడు కానీ 11 అంతస్తులు కట్టేశాడు. ఆంధ్ర, ఒడిశాల నుంచి వచ్చిన 61 మంది కార్మికులు చనిపోయారు, 27 మంది గాయపడ్డారు.  భవంతి పేరు 'ట్రస్టు హైట్స్‌'. కానీ దాన్నే కాదు, అదే ఏరియాలో కడుతున్న మరో భవంతి పటిష్టతను కూడా ఎవరూ నమ్మటం లేదు. చుట్టుపట్ల యిళ్లవాళ్లు ఖాళీ చేసి పారిపోయారు. రెండంతస్తుల భవంతికి అనుమతి కావాలంటే చెన్నయ్‌ కార్పోరేషన్‌ యిస్తుంది. అంతకంటె ఎక్కువైతే సిఎండిఎ (చెన్నయ్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) అనుమతి యివ్వాలి. భవంతి అనుమతుల ప్రకారం కడుతున్నారో లేదో పర్యవేక్షించాలి. అయితే దానికి తగినంత సిబ్బంది లేరు. ఇద్దరు డిప్యూటీ ప్లానర్లు, ఇద్దరు అసిస్టెంటు ప్లానర్లు మాత్రం వున్నారట. ఫైళ్లు ఓ పట్టాన కదలవు. అందువలన బిల్డర్లు యిష్టం వచ్చినట్లు కట్టేసి అంతగా అడిగితే జరిమానా కడదాంలే అనుకుంటున్నారు. ఒక అంచనా ప్రకారం చెన్నయ్‌లో అక్రమ నిర్మాణాల సంఖ్య లక్షట!

డిఎంకె ప్రభుత్వం 2006లో యీ నిర్మాణాల సొంతదారుల నుండి జరిమానా వసూలు చేసి రెగ్యులరైజ్‌ చేసేద్దామనుకుంది. అప్పుడో ఆర్డినెన్సు విడుదల చేసింది. తర్వాత 2007 జులైలో అక్రమ నిర్మాణాలపై ఏడాది దాకా ఏ చర్యా తీసుకోకూడదంటూ మోరటోరియం విధిస్తూ యింకో ఆర్డినెన్సు విడుదల చేసింది.  నాలుగు నెలల తర్వాత మద్రాసు హై కోర్టు దాన్ని కొట్టేసి, వాటిపై చర్య తీసుకోమంది. ప్రభుత్వం సుప్రీం కోర్టుకి వెళ్లింది. సుప్రీం కోర్టు చర్య తీసుకోవద్దంటూ స్టే యిచ్చింది. ఆ స్టే కొనసాగిస్తూ వచ్చి చివరకు 2011 మార్చిలో ఆ నిర్మాణాల విషయంలో ఏం చేయాలో నిర్ణయించండి అంటూ హై కోర్టును ఆదేశించింది.  అక్రమ నిర్మాణాలపై యిప్పటివరకు ఏ చర్యలు తీసుకున్నారో చెప్పండి అంటూ హైకోర్టు ప్రభుత్వ శాఖలను అడిగింది. వాళ్లు యిచ్చిన ఏక్షన్‌ టేకెన్‌ రిపోర్టు చూసి ఒట్టి కంటితుడుపుగా వుంది, మీరు ఒక్క అక్రమ నిర్మాణం కూడా కూల్చలేదు అని తప్పుపట్టింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సిఎండిఏ వారు టి నగర్‌లో 25 కమ్మర్షియల్‌ బిల్డింగులకు తాళాలు వేశారు. దాంతో నష్టపోయిన వ్యాపారస్తులు సుప్రీం కోర్టుకి వెళ్లారు. సుప్రీం కోర్టు స్టే యిచ్చింది. విషయాలన్నీ విచారించి సరైన నిర్ణయం తీసుకోమని హై కోర్టుకు చెపుతూనే వాళ్లు మూయించేసిన బిల్డింగులను మళ్లీ తెరిపించింది. 

ఈ లోగా ప్రభుత్వం మోహన్‌ కమిటీ ఒకటి వేసి ఏం చేయాలో చెప్పమంది. 2007 జులై 1 వరకు కట్టినవన్నీ రెగ్యులరైజ్‌ చేయమని ఆ కమిటీ సిఫార్సు చేసింది. వాటిని ఆమోదిస్తూ 2012 అక్టోబరులో ఎడిఎంకె ప్రభుత్వం ఆర్డర్లు జారీ చేసింది. అయితే హై కోర్టు వాటిని కొట్టేసింది. ప్రభుత్వం, హై కోర్టు, సుప్రీం కోర్టు యిలా దోబూచులాడుతూండగా బిల్డర్లు ఏ అనుమతీ లేకుండా  బిల్డింగులు కట్టేయడం మరిగారు. ఈ ప్రమాదం జరిగాక జయలలిత ప్రభుత్వం కారణాలు వెతకడానికి జస్టిస్‌ రఘుపతి కమిషన్‌ వేసింది. ఆ రిపోర్టు వచ్చేలోగానే ఆవిడ కంటికి ఒక అక్రమ నిర్మాణం కనబడింది. రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ కోయంబత్తూరు జిల్లాలో అటవీ భూముల్లో అనుమతులు లేకుండా కట్టుకున్న భవంతి అది! అతని పుట్టిన రోజునే దాన్ని కూల్చివేయించింది! 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?