Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: చూసే చూపు...

ఎమ్బీయస్‌: చూసే చూపు...

మనలో చాలామందికి మనం వున్న పరిస్థితి నచ్చదు. వేరే యింట్లో, వేరే కులంలో, వేరే మతంలో, వేరే ప్రాంతంలో, వేరే దేశంలో... పుట్టివుంటే భలేగా వుండేది అనుకుంటూ వుంటారు. తాము చేసే వ్యాపారం లేదా ఉద్యోగం పట్ల కూడా చాలామందికి అసహ్యం. ప్రపంచంలో ఏ వృత్తయినా చేయవచ్చు కానీ యీ దిక్కుమాలిన పని మాత్రం పగవాడికి కూడా వద్దండి అంటూంటారు. ఎల్‌బి శ్రీరాం రాసిన ''పద్మవ్యూహం'' నాటికలో ప్రభుత్వాసుపత్రి కాంపౌండరు వుంటాడు. అతని ఓపెనింగ్‌ డైలాగే 'వెధవ డాక్టర్లు, వెధవ నర్సులు, వెధవ పేషంట్లు, వెధవ మందులు, వెధవ బల్లలు, వెధవ కుర్చీలు...' యిలా సాగుతుంది. అతని చుట్టూ కనబడే చరాచర పదార్థాలన్నీ వెధవ్వే. అంత రోత. అలాటి వాడు మందుకోసం వచ్చిన పేషంట్ల పట్ల ఎలా ప్రవర్తిస్తాడో ఊహించుకోవచ్చు.

తక్కిన వాళ్లందరూ బాగున్నారు, మనమే దౌర్భాగ్యుల మనుకునే మన ధోరణి ఎలా వుంటుందో గంగాధర్‌ గాడ్గీళ్‌ అనే ఆయన 'బండోపంత్‌ లాటరీ టిక్కెట్టు' అనే కథలో బాగా చెప్పారు. తనకి లాటరీ తగిలిందని చెప్పడానికి వచ్చిన వారితో బండోపంత్‌ అంటాడు - 'నాకు లాటరీ తగలడమేమిటండీ, నేనెప్పుడూ దురదృష్టవంతుణ్నే. నేనున్న క్యూ ఎప్పుడూ కదలదు. నాకు బస్సులో సీటెప్పుడూ దొరకదు, ఒకవేళ దొరికితే నేను కూర్చున్న బస్సు కాకుండా వెనక్కాల బస్సు ముందుగా వెళ్లిపోతుంది, నేను కూర్చున్న వైపే ఎండ పడుతుంది, నా పక్క వాడికే నిద్రొచ్చి నా భుజం మీదపడి నిద్రపోతాడు...'. మనమూ యిలాగే ఫీలవుతాం. ఎందుకంటే మనం యిలాటి సందర్భాలే గుర్తు పెట్టుకుంటాం. అన్నీ బాగా జరిగితే వాటిని పెద్ద ఖాతరు చేయం. మామూలే అని కొట్టి పారేస్తాం. పైన చెప్పిన ఉదాహరణలో ఎండ పడినందుకు బాధపడ్డాడు తప్ప, సీటే అబ్బురమైన నాకు యివాళ సీటు దొరికిందే అని ఆనందించ లేదు చూడండి. సీటు దొరికిన విషయాన్ని అండర్‌లైన్‌ చేసుకున్నవాడు సుఖపడతాడు. ఎండపడిందన్న విషయాన్ని అండర్‌లైన్‌ చేసుకున్నవాడు దుఃఖపడతాడు. అంతా మనం పరిస్థితిని చూసే చూపులో వుంది.

ఈ పక్కన ఓ పుస్తకం కవర్‌ పేజీ కనబడుతోంది కదా, దాని రచయిత్రి థెల్మా థాంప్సన్‌ కథ వింటే ఆ విషయం బాగా బోధపడుతుంది. ఆమె భర్త ఆర్మీలో పనిచేసేవాడు. రెండవ ప్రపంచయుద్ధ సమయంలో న్యూ మెక్సికో రాష్ట్రంలోని మొజావే ఎడారి పక్కన నెలకొల్పిన ఆర్మీ ట్రైనింగ్‌ క్యాంప్‌కు అతన్ని బదిలీ చేశారు. అక్కడ ఏ సౌకర్యమూ వుండదని తెలిసి యీమె తలితండ్రుల దగ్గర ఉండిపోయింది. కొన్నాళ్లు పోయాక భర్త అవస్థలు పడుతున్నాడని జాలిపడి, దగ్గరుంటే బాగుంటుందనుకుని వెళ్లింది. వెళ్లిన దగ్గర్నుంచి ఎందుకు వచ్చాన్రా దేవుడా అని ఏడ్చింది.

ఉండడానికి వాళ్లకు  రేకుల షెడ్డు యిచ్చారు. విపరీతమైన వేడి. చుట్టూ చూస్తే ఓ చెట్టూ, చేమా ఉండేది కాదు. ముళ్లున్న బొమ్మజెముడు మొక్కలు తప్ప మరో మొక్క లేదు. గాలి వీచినా సుఖం లేదు. ఎందుకంటే గాలితో పాటు యిసుక ఎగిరి వచ్చి కంట్లో, యింట్లో, కంచంలో, ఎక్కడ పడితే అక్కడ పడేది. భర్తను తరచుగా వేరే చోట్లకి పంపేవారు. ఆ షెడ్‌లో ఒక్కత్తీ వుండాల్సి వచ్చేది. ఎవరితోనైనా మాట్లాడదామంటే వాళ్లకు మెక్సికన్‌ భాష తప్ప ఇంగ్లీషు రాదు. పోనీ వాళ్ల భాష నేర్చుకుందామా అంటే అది వింటేనే అసహ్యం యీమెకు. ఈ మెక్సికన్లు, రెడ్‌ ఇండియన్లతో మాట్లాడడమేమిటి, యిన్సల్ట్‌ అనుకునేది. పోగాపోగా జీవితం దుర్భరం అనిపించింది. మొగుడితో కలిసి ఉండలేననిపించింది. అతని మానాన అతన్ని వదిలేసి పుట్టింటికి వెళ్లిపోదామనుకుని యిక్కడి కష్టాలన్నీ ఏకరువు పెట్టి, వచ్చేస్తున్నా అంటూ తండ్రికి ఉత్తరం రాసింది.

తండ్రి యీమె ఉత్తరానికి జవాబుగా మూడే మూడు లైన్లు రాసి పంపాడు. అది రెవరెండ్‌ ఫ్రెడరిక్‌ లాంగ్‌బ్రిజ్‌  (1849-1922) అనే బ్రిటిషు రచయిత కొటేషన్‌ - 

'జైలు ఊచల్లోంచి ఇద్దరు బయటకు చూశారు

ఒకడికి కిందున్న బురద కనబడింది, 

మరోడికి ఆకసాన తారలు కనబడ్డాయి'

అది చదివి ఆమె ఆలోచనలో పడింది. జైల్లో పడిన ఖైదీలిద్దరిదీ ఒకటే పరిస్థితి. భౌతికంగా బయటకు వెళ్లలేరు కానీ కిటికీలోంచి బయటకు చూడగలరు. ఒకడు తలెత్తి నక్షత్రాలను చూసి ఆనందించాడు, మరొకడు తలవాల్చి బురదను చూసి చికాకు పడ్డాడు. ఆ మాట కొస్తే మన దగ్గర గుడికి వెళ్లినవాళ్లందరి చూపూ ఒకేలా వుండదు. ఒకడు విగ్రహాన్ని, చుట్టూ ఉన్న దీపాలంకరణను, శిల్పకళను చూసి ఉప్పొంగుతాడు. ఇంకోడు బయట వున్న ముష్టివాళ్లను చూసి చీదరించుకుని మనసు పాడు చేసుకుంటాడు. అక్కడ అన్నీ వున్నాయి. దేని మీద నీ చూపు పడింది అన్నదే ముఖ్యం.

చెట్టు చూస్తే ఒకడికి ఉయ్యాలలూగ బుద్ధి. మరొకడికి ఉరేసుకుని వేలాడే బుద్ధి. ఖాళీ గోడ కనబడితే గులాబీ రేకుల బొమ్మ గీయవచ్చు, లేదా గులాబీ ముళ్లు మాత్రమే గీయవచ్చు. ఉన్నదాన్ని ఎలా ఉపయోగించుకుంటా వనేది నీ దృక్కోణం మీద ఆధారపడి వుంటుంది. ఇప్పుడున్న అవస్థలనే వేరే కోణంలో చూస్తే ఎలా వుంటుందాని థెల్మా మరో కోణంలో ఆలోచించి చూసింది. నిమ్మకాయ దొరికినవాడు దబ్బకాయ దొరకలేదని ఏడుస్తూ కూర్చునే కంటె ఆ నిమ్మకాయకు వేల్యూ ఏడ్‌ చేసి నిమ్మషర్బత్‌ చేసుకుని తాగి సంతోషపడవచ్చు కదా అనుకుంది.

ఆమె ఒకతని కథ వింది. అతనికి ఫ్లారిడాలో ఒక పెద్ద ఫార్మ్‌ వారసత్వంలో లభించింది. గెంతుకుంటూ అక్కడకి వెళ్లి చూస్తే దానిలో పళ్ల తోటలు వేసుకునేటంత భూసారం లేదు. కనీసం పందులు పెంచి అమ్మే వీలైనా లేదు. ఒక రకమైన పాములు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. పొలాన్ని ఊరికే యిస్తామన్నా ఎవడూ తీసుకునేట్లు లేడు. అతను దీర్ఘంగా ఆలోచించి, యీ పాములతోనే వ్యాపారం చేయవచ్చు కదా అనుకున్నాడు.

పాములను పట్టించి, దాని మాంసాన్ని డబ్బాల్లో పెట్టి ఎగుమతి చేయసాగాడు. దాని రుచి మరిగినవారు యింకా యింకా కావాలని అడిగి తెప్పించుకున్నారు. ఇతను పాముల విషాన్ని తీయించి, విషాన్ని విరిచే మందుల్ని తయారు చేసే ఫార్మా కంపెనీలకు అమ్మాడు. పాముల చర్మాన్ని వలిపించి, ఆడవాళ్ల చెప్పులు, హేండ్‌బ్యాగులు తయారు చేసే కంపెనీలకు అమ్మాడు. అంతేకాదు, పాముల మ్యూజియం ఏర్పాటు చేసి, విషం ఎలా తీస్తారో, చర్మం ఎలా వలుస్తారో ప్రదర్శనకు పెట్టి టూరిస్టుల నాకర్షించి, తన క్షేత్రాన్ని టూరిస్టు ఆకర్షణగా మార్చాడు.

తన చుట్టూ పాములు లేవు కదా, ఎడారే కదా అనుకుంది థెల్మా. ఎడారిలో సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు పరిశీలించసాగింది. వాటిలో అందం కనబడింది. బొమ్మజెముడు మొక్కల్లో తేడాలను తెలుసుకోసాగింది. తక్కిన మొక్కలనూ అధ్యయనం చేసింది. ప్రకృతిలో ఎన్ని వింతలున్నాయో అనుకుంది. అక్కడ పెరిగే కుక్కల్లో కూడా తేడా కనబడింది. వాటినీ పరిశీలించి అబ్బురపడింది. ఆ ఎడారి వేల సంవత్సరాల క్రితం సాగరగర్భం. అందువలన నత్తగుల్లలు, ఆల్చిప్పలు ఆ యిసుకలో దొరికేవి. అవి ఏరే పని పెట్టుకుంది. అక్కడి మనుషులను అసహ్యించుకోవడం మానేసి, వాళ్ల భాషలో చిన్నచిన్న మాటలు నేర్చుకుని పలకరించింది.

ఆమె ధోరణిలో మార్పు గమనించి స్థానికులు సంబరపడ్డారు. బహుమతులు తెచ్చి యిచ్చారు. వాళ్ల స్పందన చూసి ఆమె మరింత ఉత్సాహంతో వాళ్లతో స్నేహం చేసింది, వాళ్ల భాష నేర్చుకుంది. వాళ్ల వంటలు నేర్చుకుంది. వాళ్ల ఆంతరంగిక జీవితాల్లోకి తొంగి చూసి కష్టసుఖాలు తెలుసుకుంది. అక్కడి కాపురంతో ఆమెకు ''బ్రైట్‌ రాంపర్ట్‌స్‌'' అనే నవల రాసేటంత మెటీరియల్‌ దొరికింది. అది పేరూ తెచ్చింది. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే ఆమె వున్న వూరి వాతావరణంలో యిసుమంతైనా మార్పు రాలేదు. ఆమె దృక్పథంలో వచ్చింది. ఆ మార్పుతో ఇబ్బందులనుకున్నవాటినే తనకు అనువుగా మార్చుకుని లాభపడింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?