Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ముమ్మారు తలాకుల పద్ధతి ముగుస్తుందా? -1/2

ఎమ్బీయస్‌: ముమ్మారు తలాకుల పద్ధతి ముగుస్తుందా? -1/2

మూడుసార్లు తలాక్‌లు చెప్పి భార్యను వదిలించుకోవడం ఇన్నాళ్లూ భారతీయ ముస్లిము భర్తల హక్కుగా చలామణీ అవుతూ వచ్చింది. ఆ హక్కును కొంతమంది ఉపయోగించుకోలేదు, మరి కొంతమంది జాగ్రత్తగా ఉపయోగించుకున్నారు, కానీ కొందరైనా దాన్ని దురుపయోగం చేశారన్న మాట వాస్తవం.  కురాన్‌,  దైవం గురించి చర్చలతో సరిపెట్టకుండా సాంఘిక నియమాలను కూడా ఏర్పరచింది. అది ఆనాటి అరబ్బు సమాజంలో అభ్యుదయవాదం కిందే లెక్క. కానీ కాలం మారుతూ వచ్చింది. అరేబియాకు భిన్నమైన సంస్కృతులున్న దేశాలకు కూడా ఇస్లాము వ్యాపించింది.

అందువలన స్థానిక దేశకాల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కురాన్‌ స్మృతిలో మార్పులు, చేర్పులు చేసుకోవాలి, కొన్ని దేశాల్లో చేసుకున్నారు కూడా. పరాశర స్మృతి, మను స్మృతి యిలా మన దేశంలోనూ అనేక స్మృతులున్నాయి. వాటిని యిప్పుడు యథాతథంగా అమలు చేయాలంటే కుదరని పరిస్థితి. అలాగే షరియాను కూడా కాలానుగుణంగా అన్వయించే ప్రక్రియ సాగాలి. ఏ మతాన్ని సంస్కరించాలన్నా ఆ మతస్తులే ఆడా, మగా అందరూ కలిసి పూనుకోవాలి. విద్య నేర్చి ఆధునిక పోకడలు అవగతం చేసుకున్నవారు, సంప్రదాయానికి కట్టుబడ్డవారు అందరూ కూచుని చర్చించుకుని ఒక మధ్యేమార్గానికి అంగీకరించాలి.

హిందూమతానికి వస్తే సంప్రదాయ పద్ధతులకు రక్షణగా బ్రాహ్మణ వ్యవస్థ నిలిచింది. దానికి కాపుగా క్షత్రియులు నిలిచారు. అయితే బ్రాహ్మణక్షత్రియులలోనే కొందరు పాత పద్ధతులను నిరసించారు. సంస్కర్తలుగా మారి ఛాందసులతో పోరాడారు. మార్పులు తెచ్చారు. అనేక యితర కులాల వారిలో కూడా సంస్కర్తలున్నారు. కానీ అగ్రకులాల సంస్కర్తలు సమాజాన్ని ప్రభావితం చేసినట్లుగా యితరులు చేయలేరన్నది వాస్తవం. ఏ మతంలోనైనా సరే, ముందువరుసలో నిలిచినవారు పూనుకుంటేనే పెనుమార్పులు వస్తాయి. 

అదే విధంగా యితర ముస్లిము దేశాల్లో కూడా జరిగింది. భారత ముస్లిము సమాజంలో కూడా కాలగతిలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఛాందసవాదం వెనకబడింది. అయినా యితర మతస్తులతో పోలిస్తే మార్పు వేగం తక్కువనే చెప్పాలి. ముల్లాలు తమ పట్టు సడలిపోకుండా చూసుకుంటున్నారు. ముస్లిములలో ఉన్నత, మధ్యతరగతి ఉదారవాద ముస్లిముల కంటె సంఖ్యాపరంగా ఎక్కువగా వున్న దిగువ మధ్యతరగతి, పేద ముస్లిములు ముల్లాల ఉక్కు పిడికిలి నుంచి బయట పడలేకపోవడంతో ఉదారవాద ముస్లిములకు సంస్కరణలు చేపట్టడానికి శక్తియుక్తులు చాలటం లేదు.

దీనికి తోడు ముస్లిములు గంపగుత్తగా ఓటు వేస్తారనే భావనతో, వారిని ఓటు బ్యాంకులుగా చూసే రాజకీయ పార్టీలు ముస్లిము సమాజానికి ద్రోహం చేస్తున్నాయి. 'ఏ వర్గంలోనైనా పేదవారే మూకుమ్మడిగా ఓటు వేస్తారు. పేద ముస్లిములు ముల్లాలు చెప్పినట్లు వింటారు. అందువలన ముల్లాలను సంతృప్తి పరిస్తే చాలు' యిదీ పార్టీలు వేసుకునే లెక్క. పేదరికం తగ్గిన కొద్దీ మతమౌఢ్యం తగ్గుతుంది. ముస్లిముల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిస్తే వారే కాదు, భారతీయ సమాజం కూడా ఎదుర్కుంటున్న అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. 

దురదృష్టవశాత్తూ ఆ పని జరగటం లేదు. వాళ్లకు రిజర్వేషన్లు యిస్తాం, మదరసాల్లో మతపాఠాలు చెప్పే వారిని ప్రభుత్వ టీచర్లుగా గుర్తిస్తాం, ఉర్దూ స్కూళ్లు తెరుస్తాం (భాషకూ, మతానికి సంబంధం ఏమిటో వారికే తెలియాలి), ప్రభుత్వధనంతో హజ్‌కు పంపిస్తాం.. యిలాటి తాయిలాలు చూపిస్తారు కానీ వారి అసలు సమస్య ఏమిటో అది పరిష్కరించరు. కొన్ని వర్గాలు నడిపే ప్రయివేటు రంగ సంస్థల్లో ముస్లిములకు ఉద్యోగాలు కరువు.

వారివే అధికాంశం కంపెనీలు. చాలామంది ముస్లిములు చిన్నా, చితకా ఉద్యోగాలు లేదా వ్యాపారాలు చేసుకుని బతకవలసి వస్తోంది. దాని కారణంగా వారి కుటుంబాలలో విద్యాబుద్ధులు తక్కువ, అభ్యుదయ భావాలు తక్కువ, ఆధునిక ఆలోచనా ధోరణులు తక్కువ. చీప్‌ లేబర్‌కు కేరాఫ్‌ ఎడ్రసుగా మారిన యీ ముస్లిం కుటుంబాలలో యువకులు తీవ్రవాదానికి ముడిసరుకుగా మారుతున్నారు. కొంత అభివృద్ధి చెందినవాడు కాస్త వెనకేసుకుని దాన్ని కాపాడుకోవడానికి శాంతిభద్రతలు వుండాలని కోరుకుంటాడు, దానికై పాటు పడతాడు.

ఏమీ లేనివాడికి తెగింపు ఎక్కువ. కడుపు మండుతుంటే ఏ పని చేయడానికైనా సిద్ధపడతాడు. అందుకే శాంతి, అభివృద్ధి అవిభక్త కవలలు. పేదలు, దళితులు, మైనారిటీలు.. ఏ వర్గానికైనా సరే, అభివృద్ధి ఫలాలు అందచేయకుండా శాంతంగా వుండమంటే పొసగదు. చిత్తశుద్ధితో బృహత్ప్రయత్నం చేస్తే భారతీయ ముస్లింల స్థితిగతులు బాగుపడవు. అప్పటివరకు భారతీయ సమాజమూ స్థిమితంగా వుండలేదు. 

మతఛాందసత్వానికి పేద ముస్లిములు బలి అవుతూంటే మరో పక్క కొందరు ధనిక ముస్లిములు ఆ ఛాందసత్వాన్ని తమ కనుకూలంగా మలచుకుంటున్నారు. తమ చిత్తానుసారం ప్రవర్తించడం, అదేమని సభ్యసమాజం అడిగితే యిది మా మతానికి సంబంధించిన విషయమని, యితరులు జోక్యం చేసుకోకూడదనీ దబాయించడం. దురదృష్టకరమైన విషయమేమిటంటే మత పెద్దలు వారిని వెనకేసుకుని వస్తున్నారు. ముస్లిము మహిళల విషయంలో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. వారు గొంతెత్తి నిరసన తెలిపినపుడల్లా అణచి వేయడానికి యీ మతపెద్దలు నడుం బిగిస్తున్నారు.

జనాభాలో 50% మంది మహిళలే అయినా ఆల్‌ ఇండియా ముస్లిం పర్శనల్‌ లా బోర్డులో మహిళా సభ్యులు 10% మాత్రమే వున్నారు.  దానిలో సభ్యత్వం కోసం ప్రయత్నించి విఫలమై, వేసారిన షాయిస్తా అంబర్‌ అనే మహిళ ఆల్‌ ఇండియా ముస్లిము విమెన్‌ పర్శనల్‌ లా బోర్డు అని ఒకటి స్థాపించింది. ఆమె పోరాడిన కేసుల్లో ఇమ్రానా కేసు ఒకటి. ఇమ్రానాను ఆమె మావగారే చెరిచాడు. 'ఆయన చెరిచాడని నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి యిప్పుడు ఆయనే నీ మొగుడు, నీ మొగుడు నీ కొడుకు' అని మౌలానాలు తీర్పు యిచ్చారు.  ఇమ్రానా లబోదిబోమంటూ కోర్టు తలుపులు తట్టింది. ముస్లిము మహిళా సంఘాలు ఆమెకు అండగా నిలిచాయి. కోర్టు మౌలానాల ఫత్వాను తిరస్కరించింది. 'మా పర్శనల్‌ చట్టాలను స్థిరీకరించాలి. (కోడిఫై చేయాలి). లేకపోతే యిలాటి ఫత్వాలే వస్తాయి.' అంటుంది షాయిస్తా. . 

మార్పు కోసం పోరాడుతున్న అటువంటి మహిళా ఉద్యమకారులందరూ ఆమె సారథ్యంలో యిప్పుడు ముస్లిము మహిళా సంఘాలు ముమ్మారు తలాక్‌ (తలాక్‌ ఎ బిదాత్‌- ఇన్‌స్టంట్‌ డైవోర్స్‌)పద్ధతిని రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టుకి వెళ్లిన షయారా బానోకు అండగా నిలిచారు. వారు ఎత్తి చూపేది ఏమిటంటే అఫ్గనిస్తాన్‌తో సహా 20 ముస్లిము దేశాల్లో తలాక్‌ విధానాన్ని సంస్కరించారు. మూడుసార్లు గబగబా తలాక్‌ అని చెప్పేసి 'నీకూ నాకూ సంబంధం లేదు, విడాకులిచ్చేశాను ఫో' అనే పద్ధతి కురాన్‌లో కూడా లేదట. భార్యాభర్తల మధ్య తగాదా వచ్చినపుడు ఎవరైనా వచ్చి మధ్యవర్తిగా సంప్రదింపులు చేయాలి.

కోపతాపాలు తగ్గి వివేకంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికై 90 రోజుల గడువు యిచ్చారు. ఈ 90 రోజుల్లో భర్త ఒక్కోసారి తలాక్‌ అనవచ్చు. మొత్తం మూడు సార్లు అలా అంటే యిక వారిద్దరి మధ్య పొసగదని నిర్ధారణ జరిగి, విడాకులు అయినట్లే పరిగణించాలి. ఈజిప్టు, ఇరాక్‌, ఇండోనేసియా, యుఎఇ వంటి దేశాల్లో మూడుసార్లు తలాక్‌ అని వరుసగా అన్నా అది ఒక్కసారి అన్నట్టే లెక్క. కావాలంటే దాన్ని వెనక్కి తీసుకోవచ్చు. 98% ముస్లిము జనాభా వున్న అల్జీరియాలో రాజీ ప్రయత్నాలు విఫలమయ్యాక కోర్టు ద్వారా మాత్రమే విడాకులు తీసుకోవాలి.

అంతే శాతం ముస్లిము జనాభా వున్న ట్యునీసియాలో కూడా కోర్టు అనుమతిస్తే తప్ప విడాకులు యిచ్చినట్టు కాదు. 96% వున్న టర్కీ 1926లో స్విజర్లండ్‌ చట్టాలనుసరించి షరియా సూత్రాలను అనేక వాటిని మార్చేసింది. అంతే జనాభా వున్న పాకిస్తాన్‌ 1961 లో ముస్లిము ఫ్యామిలీ లా ఆర్డినెన్స్‌ తెచ్చి వైవాహిక చట్టాలు అనేకం మార్చి, ముమ్మారు తలాక్‌ను చట్టవిరుద్ధం చేసింది. 86% జనాభా వున్న బంగ్లాదేశ్‌ 1961 ఉమ్మడి పాకిస్తాన్‌ చట్టాన్నే కొనసాగిస్తోంది. 

ఈ మధ్య వాట్సప్‌ ద్వారా తలాక్‌లు చెప్పేస్తున్నారు. ఇటీవలే హైదరాబాదుకి చెందిన యిద్దరు వనితలకు వాట్సప్‌ల ద్వారానే విడాకులు అందాయి. మనిద్దరికి ఫలానా విషయంలో పడటం లేదని చెప్పడం లేదు, రాజీ ప్రయత్నాలు లేవు, ఇందుకోసం విడాకులు యిస్తున్నానని ఎదుట పడి చెప్పడం లేదు, వాట్సప్‌ పంపేయడం, చేతులు దులిపేసుకోవడం. ఏమైనా అంటే నాకా హక్కు కురాన్‌ యిచ్చిందని వాదించడం.  భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్‌ వారు చేసిన సర్వేలో  విడాకుల్లో కూడా 66% మందికి కేవలం నోటిమాట ద్వారా విడాకులు పొందినవారే. పైగా విడాకులివ్వబడిన మహిళల్లో 95% మందికి భర్తల నుంచి మనోవర్తి రావటం లేదు.

ఇప్పుడు దీనికంతటికీ ఫుల్‌స్టాపు పడుతుందా లేదా అన్నదే ఆసక్తి కలిగించే అంశం. సుప్రీం కోర్టు దీని విషయమై గట్టిగా పరిశీలిస్తోంది. దీన్ని వారి సమ్ముఖానికి తీసుకెళ్లిన ధైర్యశాలి - షయారా బానో. ఉత్తరాఖండ్‌ వాసి. కుమావూ యూనివర్శిటీలో సోషియాలజీలో పోస్టు గ్రాజువేషన్‌ చేసింది. 21 ఏళ్ల వయసులో ఇలాహాబాద్‌లో రిజ్వాన్‌ అహ్మద్‌ అనే ఒక ప్రాపర్టీ డీలర్‌తో పెళ్లయింది. పెళ్లయాక కారు యివ్వకపోతే విడాకులు యిస్తామని బెదిరించారట. పెళ్లయిన ఏడాది దాకా పిల్లలు పుట్టకపోతే అత్తగారు తలాకులు చెప్పించేస్తాను జాగ్రత్త అని బెదిరించిందిట.

అది జరగకుండానే యీమె కడుపు పండింది. ఒక అమ్మాయి పుట్టింది. వయసు 13. తర్వాత పుట్టిన అబ్బాయి వయసు 11. ఆ తర్వాత ఆరుసార్లు భర్త అబార్షన్లు చేయించాడు. కుటుంబ నియంత్రణ మాత్రలు వాడనిచ్చేవాడు కాదు. ఈమె బాగా జబ్బు పడిపోయింది. 2015 ఏప్రిల్‌లో ఓ రోజు యీమెను తీసుకెళ్లి మొరాదాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పడేసి, అత్తమావలకు ఫోన్‌ కొట్టాడు, వచ్చి తీసుకుపొండి అని. పిల్లల్ని తన దగ్గరే వుంచేసుకున్నాడు. ఆ తర్వాత ఆర్నెల్లకు స్పీడు పోస్టులో తలాక్‌నామా పంపేశాడు. ఇంకో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 

ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్‌లో ఫ్యామిలీ కోర్టుకి వెళ్లి యీమె ఫిర్యాదు చేసింది. వాళ్లు రిజ్వాన్‌ను పిల్లలతో సహా కోర్టుకి రమ్మనమన్నారు. అతను రాలేదు. ఈమె సుప్రీంకోర్టులో పిటిషన్‌ పడేసింది. నూర్జహాన్‌ సాఫియా నియాజ్‌ స్థాపించిన భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్‌ సంస్థ ఆమెకు అండగా నిలిచింది. వీళ్లంతా కలిసి ముల్లాలను 'మీరు చెప్పే సూత్రాలకు కురాన్‌లో ఆధారాలు చూపండి' అని నిలదీస్తున్నారు.

తలాక్‌ విషయం ఒక్కటే కాదు, బహుభార్యాత్వం, వారసత్వం, మెహర్‌, పిల్లల సంరక్షణ వంటి విషయాల్లో కూడా మార్పు రావాలంటున్నారు. తలాక్‌ కేసు తేలితే 'నికా హలాలా' అనే పద్ధతిపై కూడా పోట్లాడదామని చూస్తున్నారు. అదేమిటంటే - విడిపోయిన భార్యను మళ్లీ పెళ్లి చేసుకుందామని భర్త అనుకుంటే ఎకాయెకి పెళ్లి చేసుకోలేడు. ఆమె వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుని, కాపురం చేసి, అతనికి విడాకులు యిచ్చిన తర్వాతనే మళ్లీ యితన్ని చేసుకోవాలి. ఆ రోజుల్లో ఎందుకు పెట్టారో తెలియదు కానీ యిప్పుడీ పద్ధతి వింతగా అనిపిస్తుంది. దీనిపై సినిమాలు కూడా వచ్చాయి. 

(ఫోటో - ముస్లిం పర్శనల్‌ బోర్డు అధ్యక్షుడు సయ్యద్‌ మొహమ్మద్‌ రబీ హసానీ నద్వీ)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?