Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఇజ్రాయెల్‌ ట్రంప్‌పై పెట్టుకున్న ఆశలు నెరవేరేనా?

ఎమ్బీయస్‌: ఇజ్రాయెల్‌ ట్రంప్‌పై పెట్టుకున్న ఆశలు నెరవేరేనా?

1967 నుంచి ఇజ్రాయెల్‌ అరబ్‌ దేశాలపై దాడి చేస్తూ వాళ్ల ప్రాంతాలు ఆక్రమిస్తూ పోయింది. ముఖ్యంగా పాలస్తీనాలోని అనేక భాగాలను ఆక్రమించి నెత్తురు పారిస్తూ, అక్కడ తమ దేశస్తులను నివాసం ఏర్పరచుకోమని ప్రోత్సహిస్తూ వస్తోంది. ఇది తగదని అంతర్జాతీయ సమాజం ఎంత వారిస్తున్నా, మొత్తుకున్నా పట్టించుకోలేదు. ఎందుకంటే అమెరికా దానికి దన్నుగా నిలుస్తూ వచ్చింది. దాంతో ఇజ్రాయెల్‌ ఆడింది ఆట, పాడింది పాట అయిపోయింది. ఈ వరస చూసి పాలస్తీనా తిరగబడింది. తీవ్రవాదపు బాట పట్టింది. దానివలన ఇజ్రాయెల్‌, పాలస్తీనా రెండూ నష్టపోయాయి. కొంతకాలానికి అమెరికా పెద్దరికం వహించి, యిద్దరి మధ్య శాంతి ఒప్పందం కుదిర్చింది. ఆ తర్వాత కూడా ఇజ్రాయెల్‌ పాలస్తీనాకు చెందిన వెస్ట్‌ బ్యాంకులో స్థిర నివాసాలు ఏర్పరచడం, కొనసాగించడం మానలేదు. వ్యవహారం చివికి చివికి గాలివానై చివరకు 2016 డిసెంబరులో యునైటెడ్‌ నేషన్స్‌ వారి సెక్యూరిటీ కౌన్సిల్‌ ఇజ్రాయెల్‌ సెటిల్‌మెంట్స్‌ అక్రమమంటూ,  అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రకారం వాటికి చట్టబద్ధత లేదంటూ, గట్టి తీర్మానం చేయక తప్పలేదు.

1967 జూన్‌ 4 తర్వాత తూర్పు జెరూసలెంతో సహా పాలస్తీనా ప్రాంతంలో జరిగిన మార్పులను గుర్తించమని, ఇజ్రాయెల్‌ తక్షణం ఆ ప్రాంతంలో సెటిల్‌మెంట్‌ కార్యకలాపాలను నిలిపివేయాలని తీర్మానం ఆదేశించింది. అంతేకాదు, సాధారణ పౌరులపై జరుగుతున్న హింసను ఆపివేయాలని, రెచ్చగొట్టడాలు, వినాశం చేయడాలు, ఉగ్రవాద చర్యలు నిలిపివేసి, విశ్వాసాన్ని పాదుకొలిపే చర్యలు చేపట్టాలని హితవు చెప్పింది. గత నాలుగు దశాబ్దాలలో ఇజ్రాయెల్‌ అక్రమ ఆవాసాలను భద్రతామండలి వ్యతిరేకించడం యిదే ప్రథమం. ఇప్పుడు కూడా వాటిని చట్టవిరుద్ధమైనవి (ఇల్లీగల్‌) అనలేదు. చట్టబద్ధత లేదు (నో లీగల్‌ వేలిడిటీ) అని మాత్రమే అంది. మలేసియా, న్యూజిలాండ్‌, సెనెగెల్‌, వెనిజులా వంటి 14 దేశాలు ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి. అగ్రదేశాల్లో ఎవరైనా వీటో చేస్తే తప్ప ఆ తీర్మానం వలన ఇజ్రాయేలు అభిశంసనకు గురవుతుంది. ఇప్పటిదాకా అలాటి వీటోలతో తమకు అభయహస్తం యిస్తూ వచ్చిన అమెరికా యీసారి కూడా అలా చేస్తుందని ఇజ్రాయెల్‌ ఆశించింది. 

కానీ ఒబామా వీటోను ఉపయోగించనన్నాడు. అలా అని తీర్మానానికి అనుకూలంగానూ ఓటేయలేదు. అమెరికా ప్రతినిథి గైరుహాజరయ్యారు. ఈ తీర్మానం ఇజ్రాయెల్‌ భద్రతకు ముప్పు తెస్తుందని, ఆ ప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి అవరోధమవుతుందని ఆమె వాదించింది. నిజానికి ఒబామా ప్రభుత్వం సెప్టెంబరులో 10 ఏళ్ల వ్యవధిలో 38 బిలియన్‌ డాలర్ల మిలటరీ సహాయం ఇజ్రాయెల్‌కి అందిస్తూ ఒప్పందం చేసుకుంది. ఇక దాని భద్రతకు ఏం లోటు వస్తుందో వాళ్లకే తెలియాలి. ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్‌పై కక్ష కట్టిందని, 2016లో జనరల్‌ ఎసెంబ్లీ, హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ వగైరాలు 18 తీర్మానాలు చేస్తే అవన్నీ ఇజ్రాయెల్‌నే తప్పు పట్టాయని ఈ పక్షపాత ధోరణిని నిరసిస్తూ అమెరికా ఓటేయలేదని అమెరికా ప్రతినిథి వివరించింది. కానీ ఇజ్రాయెల్‌కి అది చాలలేదు. తమపై ఎంత జాలి ఒలకపోసినా సెటిల్‌మెంట్స్‌ అక్రమమని పరోక్షంగా చెప్పినట్లే కదా అనుకుంది. ఈ తీర్మానం నిజానికి ఇజ్రాయెల్‌పై ఏ విధమైన ఆర్థిక ఆంక్షలు విధించలేదు. అంతర్జాతీయ చట్టాన్ని గౌరవించి తీరాలని ఒత్తిడి చేయనూ లేదు. అయినా చాలామంది రిపబ్లికన్లు, డెమోక్రాట్లు దీన్ని వీటో చేసి తీరాలని ఒబామాపై ఒత్తిడి తెచ్చారు. అయినా ఒబామా అంగీకరించకపోవడం ఇజ్రాయెల్‌ను మండించింది.

నిజానికి 2014లో ఇజ్రాయెల్‌ గాజాపై దాడి చేసి 120 మందిని చంపినప్పుడు అంతర్జాతీయం సమాజం మొత్తం ఛీ కొట్టినా ఒబామా 'ఆత్మరక్షణ కోసం చేసిన దాడులవి' అంటూ వెనకేసుకుని వచ్చి ఇజ్రాయెల్‌ను అభిశంసించే తీర్మానాన్ని వీటో చేశాడు. మరి అలాటిది ఒబామా యీసారి ఎందుకిలా ప్రవర్తించాడు?

తమ శత్రువైన ఇరాన్‌తో అమెరికా అణు ఒప్పందం కుదుర్చుకోవడం ఇజ్రాయెల్‌కు నచ్చలేదు. పశ్చిమాసియాను ధ్వంసం చేసే చర్య యిది అంటూ బహిరంగంగా దాన్ని విమర్శించింది. గత ఏడాది నెతన్యాహూ అమెరికా కాంగ్రెసును ఉద్దేశించి ప్రసంగిస్తూ ఒబామాను దుయ్యబట్టాడు. అది ఒబామాను మండించింది. సమయం కోసం వేచి వున్నాడు. ఇంతలో ప్రస్తుత తీర్మానం చర్చకు వచ్చింది. అధ్యక్షుడిగా ఎన్నిక మాత్రం అయి, పదవి చేపట్టడానికి వేచి వున్న ట్రంప్‌ రెచ్చిపోయాడు. ఒబామాకు ముస్లిం పక్షపాతిగా పేరున్నట్లే, అతనికి ముస్లిం వ్యతిరేకిగా, యూదు పక్షపాతిగా పేరుంది. తన ఎన్నికల ప్రచారంలో అతను తన అధ్యక్షపదవీకాలం ఇజ్రాయెల్‌కి వరమన్నాడు. పాలస్తీనా పట్ల కఠినంగా మాట్లాడాడు.

'నేను అధ్యక్షుడయ్యాక ఇజ్రాయెల్‌లో అమెరికా రాయబార కార్యాలయాన్ని టెల్‌ అవీవ్‌ నుంచి జెరూసలెంకు మారుస్తా. ఇజ్రాయెల్‌ సెటిల్‌మెంట్లకు మద్దతిచ్చే వారినే రాయబారిగా నియమిస్తా. పాలస్తీనా, ఇజ్రాయెల్‌ మధ్య శాంతి చర్చలకై ఒత్తిడి తేను.' అన్నాడు. అంతేకాదు, నెగ్గాక ఇజ్రాయెల్‌కి రాయబారిగా తనకు ఆత్మీయుడైన,  దివాలా కేసుల్లో తన లాయరైన డేవిడ్‌ ఫ్రైడ్‌మన్‌ను నియమించాడు. ఇజ్రాయెల్‌ సెటిల్‌మెంట్స్‌ కోసం డేవిడ్‌ నిధులు సేకరించి వున్నాడు. పాలస్తీనాను దేశంగా గుర్తించడానికి కూడా నిరాకరిస్తాడతను.

ఇక ట్రంప్‌ అల్లుడు జారెద్‌ కుష్నర్‌ కుటుంబమైతే యూదు సెటిల్‌మెంట్ల కోసం లక్షలాది డాలర్లు విరాళంగా యిచ్చింది. ఇజ్రాయెల్‌-అరబ్‌ దౌత్యబృందంలో అతనికి ట్రంప్‌ పదవి యిచ్చాడు. అమెరికన్‌ యూదుల్లో 10% మందే రిపబ్లికన్లకు ఓటేస్తూ వుంటారు. కానీ యీసారి ట్రంప్‌ ధోరణి చూసి, 32% మంది వేశారు. ఈ తీర్మానాన్ని ప్రతిపాదించిన దేశాల్లో ఒకటైన ఈజిప్టుకి ట్రంప్‌ ఫోన్‌ చేసి వెనక్కి తగ్గమని కోరాడు. అతను తగ్గాడు కూడా. అయినా తక్కిన దేశాలు తీర్మానం పెట్టి తీరాలని పట్టుబట్టడంతో దానిపై అమెరికా వీటో చేయాలని ఒబామాను బహిరంగంగా కోరాడు. అంతేకాదు, ''యునైటెడ్‌ నేషన్స్‌కు ఏటా అయ్యే రూ. 37 వేల కోట్లలో 22% మనమే భరిస్తున్నాం. అయినా దాని వలన మనకు జరిగే మేలూ లేదు. నేను పదవి చేపట్టాక కథ మారుతుంది చూడండి'' అంటూ ట్వీట్‌ చేశాడు. (నిజానికి ట్రంప్‌ అన్నట్లు అది ఒట్టి దండగమారి వ్యవహారంగా తయారైంది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రొఫెసర్‌ గిడియాన్‌ పోల్యా చేసిన అధ్యయనం ప్రకారం అమెరికా ఆవిర్భవించాక అది, యితరులతో కలిసి 71 దేశాలను దురాక్రమించింది. వాటిలో 50 ఐరాస ఏర్పడ్డాక జరిగినవే. అంటే ఐరాస దురాక్రమణలను ఆపలేక పోతోందని అర్థం.) ట్రంప్‌ జోక్యంతో ఒబామాకు చిర్రెత్తింది. అందువలన యీ సారి ఇజ్రాయెల్‌ను కాపాడలేదు.

నిజానికి యీ తీర్మానం వలన ప్రస్తుతానికి ఇజ్రాయెల్‌కు వచ్చే నష్టమేమీ లేదు. అయితే దీన్ని ఆధారం చేసుకుని కొన్ని దేశాలు తమపై ఆర్థిక ఆంక్షలు విధిస్తాయని, ఆ సెటిల్‌మెంట్లలో తయారైన వస్తువులు కొనకూడదన్న తీర్మానిస్తాయనే జంకు వుంది. అంతకు మించి ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు (ఐసిసి) తమపై ముందుకు వెళ్లడానికి యిది వూతమిస్తుందని భయపడుతోంది. 2014 నాటి గాజా దాడులపై  ప్రాథమిక విచారణను ఐసిసి ప్రాసిక్యూటర్‌ ఫాతౌ బెన్‌సౌదా 2015 జనవరిలో ప్రారంభించి, సెక్యూరిటీ కౌన్సిల్‌ రాజకీయంగా స్పష్టత యిస్తే తప్ప ముందుకు సాగడం కష్టమని ప్రకటించారు. ఇప్పుడు ఆ స్పష్టత వచ్చింది. పాలస్తీనా యునైటెడ్‌ నేషన్స్‌లో 2012 నుంచి సభ్యురాలు, ఐసిసిలో 2014 నుంచి సభ్యురాలు. తన సభ్యదేశంపై జరిగిన దాడిని విచారించడానికి ఐసిసికి పూర్తి అధికారం వుంది కాబట్టి యికపై విచారణ జోరుగా సాగవచ్చు. ఇది ఆ ఆవాసాల్లో కాపురం పెట్టినవారికి భయం పుట్టించవచ్చు. దీని గురించి ఇజ్రాయెల్‌ వర్రీ అవుతోంది. తీర్మానానికి వీటో చక్రం అడ్డు వేయలేదని ఒబామాపై గుర్రుగా వుంది. ఈ ఒబామా వెళ్లిపోయిన తర్వాత ట్రంప్‌ వస్తాడు కదా, తమ కనుకూలంగా గాలి మళ్లుతుంది కదాని ఇజ్రాయెల్‌ వూరడిల్లుతూ వచ్చింది. వాళ్ల ఆశలు ఫలిస్తాయా? 

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ ఫిబ్రవరి మూడో వారంలో అమెరికాకు వెళ్లాడు. ట్రంప్‌ నుంచి యీ మేరకు హామీ వస్తుందనుకున్నాడు. ఒక విషయంలో వూరట లభించింది. మరొక విషయంలో అసంతృప్తి మిగిలింది. ఇజ్రాయెల్‌, పాలస్తీనా లను రెండు దేశాలుగా అమెరికా గుర్తిస్తూ వచ్చింది. ఇప్పుడు ట్రంప్‌ ఆ పంథా మార్చి ''రెండు దేశాల సిద్ధాంతంపై ఇజ్రాయెల్‌, పాలస్తీనా యిద్దరికీ నచ్చినదే నాకూ నచ్చుతుంది. అది ఏమైనా నాకు యిబ్బంది లేదు.'' అన్నాడు. ఒకరి అస్తిత్వాన్ని మరొకరు గుర్తించని దేశాలు రెండూ ఒక్కతాటిపై వస్తాయని ఎలా అనుకోగలం? 'ఇద్దరి మధ్యా శాంతి నెలకొనాలి. దానికి యిద్దరూ రాజీ పడాలి' అన్నాడు. ఇజ్రాయెల్‌ పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమిస్తూ పోతూ వుంటే, ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌లో యూదుల స్థిరనివాసాలు ఏర్పాటు చేస్తూ పోతూంటే, రాజీ ఎలా సాధ్యమో ట్రంప్‌కే తెలియాలి. 'ఇప్పటికైనా ఇజ్రాయెల్‌ను గుర్తించండి. వారితో వైరం మానండి.' అని పాలస్తీనాకు ట్రంప్‌ పిలుపు నిచ్చాడు. 2014 నుంచి ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య చర్చలు జరగటం లేదు. 

ఇంతవరకు నెతన్యాహూకి బాగానే వుంది కానీ ట్రంప్‌ చర్చలు ప్రారంభమవుతూండగానే ''ఆ సెటిల్‌మెంట్ల విషయంలో నువ్వు కాస్త వెనక్కి తగ్గితే మంచిదేమో (హోల్డ్‌ బాక్‌ ఫర్‌ ఎ లిటిల్‌ బిట్‌) అన్నాడు.'' అనడం మింగుడు పడలేదు. గత ఎనిమిదేళ్లగా డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన ఒబామా కారణంగా యిరు దేశాల మధ్య సత్సంబంధాలు అనుకున్నంత స్థాయిలో లేవనుకుంటూ, యూదులకు అనుకూలమైన రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్షుడిగా ట్రంప్‌ ఏదో ఉద్ధరిస్తాడని ఆశ పడితే యిప్పుడిలా అనడం చూసి నెతన్యాహూ ఉలిక్కిపడ్డాడు. 'మా మధ్య ఘర్షణలకు అది మూలం కాదు' (నాట్‌ ద కోర్‌ ఆఫ్‌ ద కాన్‌ఫ్లిక్ట్‌) అని జవాబిచ్చాడు తప్ప సెటిల్‌మెంట్ల గురించి బహిరంగంగా ఏ హామీ యివ్వలేదు. తర్వాత తనతో వచ్చిన రిపోర్టర్లతో మాట్లాడుతూ 'ఈ విషయం గురించి ట్రంప్‌తో ఏదో ఒక ఒప్పందానికి వస్తామని ఆశిస్తున్నాను' అన్నాడు.

చెప్పాలంటే నెతన్యాహూకి స్వదేశంలోనే యిబ్బందులున్నాయి. అతనే అనుకుంటే అతని కంటె తీవ్రమైన రైట్‌ వింగ్‌ నాయకులు కాబినెట్‌లో వున్నారు. వాళ్లకు రెండు జాతుల సిద్ధాంతం నచ్చదు. మొత్తమంతా మనదే అంటారు. పైగా ఆక్రమిత పాలస్తీనాలో మరిన్ని నివాసాలు కట్టాలంటారు. ఫిబ్రవరి 6 న ఇజ్రాయేలు పార్లమెంటు ఓ చట్టం చేసింది. ఇజ్రాయేలు పౌరులు వెస్ట్‌ బ్యాంకులో పాలస్తీనా భూమిపై అక్రమంగా కట్టుకున్న 4 వేల యిళ్లను క్రమబద్ధీకరించిందా చట్టం. అంతర్జాతీయ సమాజం దీన్ని నిరసించింది. పార్లమెంటులో దీనిపై జరిగిన చర్చలో 60 మంది అనుకూలంగా ఓటేస్తే 52 మంది వ్యతిరేకంగా ఓటేశారు. అంతర్జాతీయ కోర్టు కెళితే కొట్టివేస్తుందనే భయంతో ఈ చట్టం నెతన్యాహూకి కూడా యిష్టం లేదట. అయినా పైకి చెప్పలేడు.  ఎందుకంటే అతని లికుడ్‌ పార్టీ కంటె ఛాందసపార్టీ ఐన జ్యూయిష్‌ హోం పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్నాడతను. జనవరి నెలాఖరులో పాలస్తీనా భూమిపై యిళ్లు కట్టుకున్న 330 మంది అక్రమ ఆక్రమణదారులను తరిమివేయడంతో ఆ అంశాన్ని రాజకీయం చేసి లికుడ్‌ ఓటర్లను తమవైపు తిప్పుకుందామని జ్యూయిష్‌ హోం పార్టీ చూసింది. ఇతను కాదనలేని పరిస్థితి. 'ఫిబ్రవరి 15 న ట్రంప్‌ను నేను కలవాలి కదా, అప్పటిదాకా ఓటింగు ఆపండి' అని కోరినా హోం పార్టీ వినలేదట. ఓటింగు టైములో నెతన్యాహూ లండన్‌లో వున్నాడు. అటార్నీ జనరల్‌ మాత్రం చెప్పేశాడు - 'సుప్రీం కోర్టులో దీనిపై ఎవరో ఒకరు కేసు వేస్తారు, అప్పుడు ప్రభుత్వం తరఫున నేను వాదించను' అని. కోర్టులో తీర్పు వచ్చేవరకు దీని గురించి ఏమీ వ్యాఖ్యానించమని వైట్‌హౌస్‌ ప్రతినిథి చెప్పారు. ఇజ్రాయెల్‌కి వ్యతిరేకంగా మాట్లాడడానికి రిపబ్లికన్లు, డెమోక్రాట్లు యిద్దరూ దడుస్తారు. ఎందుకంటే వాళ్లకు నిధులందించే యూదు వ్యాపారస్తులకు ఇజ్రాయెల్‌ ఏం చేసినా మహబాగుగానే వుంటుంది. అమెరికా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకించడానికి వీల్లేదంతే! 

అయితే పూర్తి ఇజ్రాయెల్‌ అనుకూల విధానాలను అవలంబించడానికి ట్రంప్‌ జంకుతున్నాడు. 'మీ రాయబారి కార్యాలయం టెల్‌ అవీవ్‌ నుంచి జరూసలెం'కు మారిస్తే మీరు పాలస్తీనాను ఇజ్రాయేలులో అంతర్భాగంగా గుర్తించినట్లు ధృవపడుతుంది. దానివలన అరబ్‌ రాజ్యాలన్నీ ఎదురు తిరుగుతాయి. జాగ్రత్త' అని జోర్డాన్‌ రాజు అబ్దుల్లా హెచ్చరించడంతో ట్రంప్‌ దానిపై నిదానిస్తున్నాడు. ప్రస్తుతం ఇరాన్‌ను ఎలా కట్టడి చేయాలా అన్నదే ట్రంప్‌ అజెండా. దానికై ఇజ్రాయెల్‌తో సహా ఇరాన్‌ పరిసర దేశాలన్నిటిని కలుపుకు పోవాలి. ఏకపక్షంగా పోయి ఇజ్రాయెల్‌నే నెత్తికెక్కించుకుంటే వ్యవహారం పొసగదు. ఇది ట్రంప్‌కు బోధపడుతున్నట్లుంది. అందువలన అతను ఇజ్రాయెల్‌ ఆశించినంత మేరకు పక్షపాతం చూపలేకపోవచ్చు. 

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2017)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?