Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: సంతాన చింత - 2

ఎమ్బీయస్‌: సంతాన చింత - 2

చదువు విషయంలో తలిదండ్రులు తమ యిష్టాయిష్టాలను పిల్లలపై రుద్దడం జరుగుతోంది. తమ యిష్టం మాట ఎలా వున్నా ఫలానాది చదివితే ఉద్యోగాలు వస్తాయి అనే ఊహతో చదివిస్తున్నారు. అయితే చదువు పూర్తయేసరికి ఆ అంచనాలు తలకిందులవుతున్నాయి. ఇష్టం లేని చదువు వలన కావచ్చు, చదివే సామర్థ్యం లేకపోవడం వలన కావచ్చు, జాబ్‌ మార్కెట్‌ పరిస్థితులు మారిపోవడం వలన కావచ్చు, అనేక మంది యువతీయువకులు నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు. కొంతకాలం పాటు నిరుద్యోగం ఎవరికైనా తప్పదు. కానీ ఉద్యోగ యోగ్యత (ఎంప్లాయబిలిటీ) లేకుండా అనేకమంది తయారవుతున్నారు.

ఉద్యోగాలిద్దా మనుకున్నవాడికి సరైన అభ్యర్థులు దొరక్క బాధపడుతున్న కాలమిది. ఇది ఆ యువతకు, తలితండ్రులకు అత్యంత చింత కలిగించే కాలం. వారి మధ్య ఘర్షణలు పెరిగే కాలం కూడా యిదే. తాము చదివిన చదువు పనికి రావడం లేదని గ్రహించిన యువత ఉద్యోగం కాకుండా వేరే రకమైన ఉపాధి కోసం ప్రయత్నించాలనుకుంటుంది. కాదు, ఉద్యోగం కోసమే గట్టిగా ప్రయత్నించు అంటారు పెద్దలు. గతంలో ఉద్యోగం కోసం యింత వెంపర్లాట ఉండేది కాదు. ఇంతింత జీతాలూ ఉండేవి కావు. ఏవో కొన్ని వర్గాలు మాత్రమే వాటిని పట్టుకుని వేళ్లాడేవి.

తక్కినవాళ్లు వ్యాపారమో, వ్యవసాయమో చేసుకునేవారు. పోనుపోను వ్యవసాయం పూర్తిగా దైవాధీనం అయిపోయింది. వ్యాపారంలో తీవ్రమైన ఒడిదుడుకులు వస్తున్నాయి. అందువలన వరద వచ్చినా, అనావృష్టి కలిగినా, బందులు జరిగినా, యుద్ధం వచ్చినా ఒకటో తారీకు కల్లా ఠంచనుగా జీతం రాళ్లు వచ్చే ఉద్యోగమే మేలని అన్ని వర్గాలూ అనుకుని అందరూ వాటికోసమే ఎగబడడంతో వాటికి డిమాండు పెరిగింది. వీలైతే ప్రభుత్వోద్యోగం, లేకపోతే ప్రయివేటు ఉద్యోగం జీవితలక్ష్యమై పోయింది. చదువులు కూడా వాటిని చేజిక్కించుకోవడం కోసమే అనుకుంటున్నారు. ఏదో ఒక ఉద్యోగంలో చేరితే పిల్లల జీవితానికి ఢోకా ఉండదు కదాని పెద్దల ఆరాటం.

తమకు సరైన ఉద్యోగాలు రావటం లేదని గ్రహించిన కొడుకు ఉపాధికై వేర్వేరు మార్గాలు పట్టాలని ప్రతిపాదిస్తాడు. ఏదో చిన్న వ్యాపారం పెడతాను, పెట్టుబడి పెట్టమని తండ్రిని అడుగుతాడు. 'ఇది ఒట్టి ఉబలాటమే, నాలుగు రోజుల్లో బుస్సుమని తగ్గిపోతుంది. దీనిలో కష్టం ఎక్కువ, రిస్కు ఎక్కువ. ఆ రిస్కు నేనైతే తీసుకోగలను కానీ మా పిల్లవాడు తీసుకోలేడు, ఎందుకొచ్చిన రొష్టు వాడికి. ఇప్పటికే చదువుకి బోల్డు 'తగలేశాను', మళ్లీ దీనికి కూడానా? వీడు ఉద్యోగ ప్రయత్నాలు సరిగ్గా చేయటం లేదు' అని తండ్రి భావన. 'లోకాన్ని చూసిన అనుభవంతో చెపుతున్నాను, ఫలానావాళ్లు యిలాగే చేసి దెబ్బ తిన్నారు' అని దృష్టాంతాలు చెప్తాడు. 'నా ఉత్సాహానికి అడ్డుకట్ట వేస్తున్నాడు, డబ్బు యివ్వడం యిష్టం లేక ఏవో సాకులు చెప్తున్నాడు' అని  కొడుకు అలుగుతాడు.

తండ్రి అనుభవానికి, కొడుకు అత్యుత్సాహానికి మధ్య ఘర్షణ ఏర్పడుతుంది. ఇద్దరూ ఎడమొఖం, పెడమొఖం అవుతారు. మధ్యలో తల్లి నలుగుతుంది. ఈ సమస్యకు పరిష్కారం బయటివాళ్లు ఎవరూ చెప్పలేరు. పెద్దలే తర్కించుకుని, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. కొడుక్కి ఉద్యోగం వస్తే బాగుండును అని తమకున్నా, అతనికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా, వచ్చినా నిలుపుకునే ఆసక్తి, సామర్థ్యం, స్వభావం (ఏటిట్యూడ్‌) ఉన్నాయా అనేది తరచి చూడాలి. అవి లేకపోతే ఉద్యోగంలో రాణించలేడు, నిలుపుకోలేడు. తమకు తోచకపోతే వేరే ఎవరి చేతనైనా బేరీజు వేయించాలి. ఒకటి రెండేళ్లు అతను అనుకున్నది చేయనిచ్చి దాని ఫలితాలు తనూ, అతనూ యిద్దరూ అనుభవించాలి. ఇలా చేయడానికి కొందరికి కుదురుతుంది, కొందరికి కుదరదు. కానీ ఏదో ఒక కసరత్తు చేయక తప్పదు, లేకపోతే ఆ చింత ఎప్పటికీ పోదు.

ఇక్కడ సి.రామచంద్రరావు గారు రాసిన ''టెన్నిస్‌ టూర్నమెంటు'' కథ గురించి ప్రస్తావించాలి. టెన్నిసు ఆడే యిద్దరు కాలేజీమేట్స్‌ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. భర్తకు ఓ పట్టణానికి బదిలీ అవుతుంది. అక్కడ టెన్నిసు ఆట కొనసాగిస్తూన్నా, అందమైన, డబ్బున్న భార్య ఉన్నా, అతనికి అసంతృప్తి.  పెళ్లి కారణంగా ఆటను నిర్లక్ష్యం చేయడం వలన జాతీయస్థాయికి వెళ్లలేకపోయానని బాధపడుతూ ఉంటాడు. ఓ సారి అతని కాలేజీమేటు, ప్రస్తుతం జాతీయ స్థాయి టెన్నిసు ఆటగాడైన కథకుడు ఆ వూరికి వచ్చి టూర్నమెంటులో పాల్గొంటాడు. అప్పుడు జంటలోని భార్య తన భర్త ఆట స్థాయి ఏమిటని అడుగుతుంది.

సుమారుగా ఉంది కానీ గొప్పగా లేదని, యిప్పుడు ప్రాక్టీసు చేసినా లాభం లేదని జవాబిస్తాడు కథకుడు. కొన్నాళ్లకు ఆమె తన భర్త చేత ఉద్యోగానికి రిజైన్‌ చేయించి, నగరానికి కాపురం మార్చి టెన్నిసులో ప్రాక్టీసు చేయిస్తోందని విని ఆశ్చర్యపడతాడు. అంటే ఏమిటన్నమాట? భార్యకు తెలుసు, భర్త టెన్నిసులోకి మళ్లీ వచ్చి విఫలమవుతాడని. కానీ తన కాపురం నిలబడాలంటే అది జరగాల్సిందే. లేకపోతే జీవితాంతం భర్త ఆమెను దెప్పుతూనే ఉంటాడు - నీ కారణంగానే నాకు పేరు రాకుండా పోయిందని! ఒకసారి ఫెయిలయ్యాక తెలిసి వచ్చి, ఉద్యోగమైనా సరిగ్గా చేస్తాడని ఆమె అంచనా.

తనను ఏదైనా వృత్తితో ప్రయోగం చేయనీయమని కొడుకు అడిగినపుడు తండ్రి ఒప్పుకోకపోతే కొడుకు జీవితాంతం తండ్రిని నిందిస్తూనే ఉంటాడు, నీ వలననే నా జీవితం చెడిందని. అందువలన కాలవ్యవధి పెట్టి ప్రయోగం చేయనీయడమే మేలు. కొందరు అలా చేయనీయడానికి సిద్ధపడినా, ఊళ్లోవాళ్లు ఏమనుకుంటారో అనే బెంగతో చింతాక్రాంతులవుతారు. దాని గురించి మరోసారి.

ఎమ్బీయస్‌ : సంతాన చింత

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?