Advertisement

Advertisement


Home > Articles - Special Articles

7 దశాబ్దాల స్వాతంత్య్రం.. మనమిక్కడున్నాం.!

7 దశాబ్దాల స్వాతంత్య్రం.. మనమిక్కడున్నాం.!

ఎందరో మహనీయులు.. దేశం కోసం ప్రాణ త్యాగం చేశారు. ఆ ప్రాణ త్యాగం వారి జీవితాల కోసం కాదు, భావితరాల కోసం. 'మాకు దేశం ఏమిచ్చింది.?' అని ఏ ఒక్క మహనీయుడూ అనుకోలేదు. 'మేం దేశానికి ఏమివ్వగలం.?' అని మాత్రమే ఆలోచించారు. 'పోరాడితే పోయేదేముంది.? బానిస సంకెళ్ళు తప్ప.!' ఇదే నినాదం.. స్వాతంత్య్ర పోరాటంలో స్ఫూర్తిని రగిలించింది. దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది. 

ఆగస్ట్‌ 15, జనవరి 26.. ఈ రెండ్రోజులు మాత్రమే దేశాన్ని తలచుకోవడం, దేశభక్తితో ఊగిపోవడం 'నయా ట్రెండ్‌'గా మారిపోయింది. సోషల్‌ మీడియా పుణ్యమా అని, ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో ప్రొఫైల్‌ ఫొటోల ప్లేస్‌లోకి జాతీయ జెండాలు వచ్చిపడ్తున్నాయి. 'ఇండియా' అన్న పేరెలా వచ్చిందో తెలుసా.? అంటూ, తెలిసీ తెలియని పరిజ్ఞానాన్ని విశ్వవ్యాపితం చేసెయ్యాలని ఆరాటపడ్తున్న రోజులివి. అసలు జాతీయ జెండాకి వుండే రంగులేంటి.? వాటి ప్రత్యేకత ఏంటి.? అన్న విషయం ఎంతమందికి తెలుసో ఏమో.! 

ఇదీ, ఇప్పుడు భారతదేశంలో పరిస్థితి. ఫలానా సిన్మా హీరో ట్రాక్‌ రికార్డ్స్‌ చెప్పమంటే చెప్పేస్తాం. క్రికెట్‌లో ఫలానా ఆటగాడి రికార్డ్స్‌ గురించీ చెప్పేస్తాం. కానీ, మహనీయుల గురించి చెప్పమంటే మాత్రం నీళ్ళు నమిలేస్తాం. ఇంతేనా.? ఇంకా చాలా వుంది. కులం, మతం, ప్రాంతం పేరుతో మనలో మనమే చిచ్చు రేపేసుకుంటాం. జాతీయ జెండా ఎంత.?

నాకు నా మతమే గొప్ప.! అనుకునే మహానుభావుల్ని మనం చట్ట సభలకీ పంపించేస్తున్నాం. దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడమే కాదు, దేశభక్తి అంటే అది పైకి చాటుకునేది కాదని గొప్పగా లెక్చర్లు దంచే మహానుభావుల్నీ చూస్తున్నాం. ఇట్‌ హ్యాపెన్స్‌ ఓన్లీ ఇన్‌ ఇండియా.. అనుకోవాలేమో.! 

ఏడు దశాబ్దాల కాలంలో దేశానికి చాలామంది పరిపాలించారు. ప్రతి ఒక్కరూ దేశం నుంచి పేదరికాన్ని తరిమికొడ్తామన్నవారే. దురదృష్టవశాత్తూ వాళ్ళెవరూ పేదరికాన్ని తరిమికొట్టలేకపోయారు. కానీ, విలువల్ని అద్భుతంగా దేశం నుంచి తరిమికొట్టేశారు.. తరిమికొట్టేస్తూనే వున్నారు. 

ప్రజా ప్రతినిథుల జీతాలు పెంచుకోవాలి.. సామాన్యుడిని మాత్రం పన్నుల పేరుతో నడ్డివిరిచెయ్యాలి. ఏమన్నా అంటే, పన్నులు లేకపోతే ఖజానా నిండేదెలా.? అనే ప్రశ్నలు పాలకుల నుంచి వచ్చేస్తాయ్‌.! కానీ, మళ్ళీ ఆ ఖజానాన్ని కొల్లగొట్టి పందికొక్కుల్లా అవినీతి కన్నబిడ్డలైన 'సోకాల్డ్‌ మహానుభావులు' మేసెయ్యడం మామూలే. అన్నిటికీ మించి, ప్రజల్ని ఉద్ధరించే పాలకుల పబ్లిసిటీ 'గుల' తీర్చుకోడానికీ మళ్ళీ ఆ 'ఖజానా' మీదనే కన్నేయాలి.! 

మనం ఓటు వేస్తాం.. ఆ ఓటేయించుకున్నోడు ఇంకో పార్టీలోకి మారిపోతాడు. ఇంతకీ మనం పార్టీకి ఓటేసినట్టా.? వ్యక్తికి ఓటేసినట్టా.? జుట్టు పీక్కునేలోపు మళ్ళీ ఎన్నికలొచ్చేస్తాయ్‌. ఎవడో ఒకడికి ఓటేసి ఛావాలి కదా.. తప్పదంతే. ఇది మన ఘన ప్రజాస్వామ్యమ్‌. దేశం మారుతుంది.. వ్యవస్థ మారుతుంది.. రాజకీయాలు మారతాయి.. ప్రజల బతుకులు మారతాయ్‌.. విలువలు పెరుగుతాయ్‌.. ఇవన్నీ ఆశలే. 'చందమామ రావే, జాబిల్లి రావే..' ఇలాగే.! చందమామ రాకపోయినా కన్పిస్తుంది.. కానీ, ఆశించినవేవీ నిజం కావు. అదే తేడా.! ఏడు దశాబ్దాలకి ఇదిగో ఇలా వున్నాం.! 

- సింధు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?