Advertisement

Advertisement


Home > Articles - Special Articles

అహో తెలంగాణభోజా...శ్రీకృష్ణదేవరాయా...!

అహో తెలంగాణభోజా...శ్రీకృష్ణదేవరాయా...!

ఘంటసాల పాడిన పాట ఇది కాదు కదా. ఆయన పాడింది ఏమిటి? 'ఆహో ఆంధ్రభోజా..శ్రీకృష్ణదేవరాయా'..అని కదా. తెలంగాణ భోజుడేమిటి? ఈయన ఎక్కడినుంచి వచ్చాడు? ఎక్కడినుంచో రాలేదు. తెలంగాణ భోజుడంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని అర్థం. తెలంగాణ మొక్కులు చెల్లించుకోవడానికి కేసీఆర్‌ మందీమార్బలంతో వెంకన్న కొలువైన తిరుమలకు వెళ్లడం, అక్కడ టిటిడి ఈవో సహా అధికారులు, పోలీసు ఆఫీసర్లు, మంత్రి, అధికార, ప్రతిపక్ష నాయకులు ఘనంగా స్వాగతం పలకడం తెలిసిందే. ఇదంతా నభూతో అన్నరీతిగా సాగింది. అందులోనూ కేసీఆర్‌ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా తిరుమలకు వచ్చారు.  మీడియా సంగతి చెప్పక్కర్లేదు. చివరకు కేసీఆర్‌ మనుమడిని కూడా వదలకుండా మినీ ఇంటర్వ్యూ చేస్తే ఆ బుడతడు కారులో కూర్చుని తనకు తెలిసిందేదో మాట్లాడి 'ఆంధ్రా పీపుల్‌, తెలంగాణ పీపుల్‌ హ్యాపీగా ఉండాలని దేవుడిని కోరుకున్నా' అని చెప్పాడు.

తమిళనాడు తెలుగు యువశక్తి అధినేత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దారి పొడవునా స్వాగత ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తే  ఆలయ ప్రాంత పరిధిలో ఉండకూడదని అధికారులు తొలగించారట. ఈయన వెళ్లి వాదన వేసుకున్నాట్ట. చెన్నయ్‌లో ఏవో కార్యకలాపాలు చేసుకునే కేతిరెడ్డికి కేసీఆర్‌కు స్వాగతం చెప్పాల్సిన అవసరం ఏమిటో...! కేసీఆర్‌ తిరుమల స్వామివారిని దర్శించుకోవడం ఒక చారిత్రక ఘటనగా చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి  ఐదు కోట్లకు పైగా విలువైన కానుకలను స్వామివారికి సమర్పించడంతో ఉబ్బితబ్బిబైన టిటిడి ఈవోకు గులాబీ దళాధిపతిలో అలనాటి శ్రీకృష్ణదేవరాయలు కనిపించాడట...! ఇంతటి విలువైన కానుకలు స్వామివారికి ఒకానొక కాలంలో శ్రీకృష్ణదేవరాయలు, మరికొందరు రాజులు సమర్పించారని విన్నామని, ఇప్పుడు మళ్లీ ఆవిధంగా కేసీఆర్‌ను చూస్తున్నామని అన్నారని సమాచారం. మరి ఈ అభినవ శ్రీకృష్ణదేవరాయలును తెలంగాణ భోజుడని అనాల్సిందే కదా...! కేసీఆర్‌ ఎంతటి ఉద్యమకారుడో, ఎంతటి సమర్థుడైన ముఖ్యమంత్రో అంతకుమించి కరడుగట్టిన భక్తిపరుడు. ఉమ్మడి ఆంధ్రాలో టీడీపీ నాయకుడిగా ఉన్నప్పుడు ఇంతటి భక్తిపరుడో కాదో తెలియదుగాని ముఖ్యమంత్రి అయ్యాక తన భక్తిప్రపత్తుల విశ్వరూపం చూపిస్తున్నారు.

ప్రజల్లో తెలంగాణ సెంటిమెంటును ఎంత సజీవంగా ఉంచుతున్నారో, భక్తిపరమైన సెంటిమెంటును కూడా పెంచిపోషిస్తున్నారు. మీడియా ప్రజాసమస్యలకు ఇస్తున్న ప్రాధాన్యం కంటే కేసీఆర్‌ ఆలయాల అభివృద్ధికి చేస్తున్న కృషికి ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. దీంతో ఆయన చాలా మంచి పనులు చేస్తున్నారంటూ సామాన్య జనం మెచ్చుకుంటూ తమను పీడించే సమస్యలను మర్చిపోతున్నారు. క్రైస్తవులను, ముస్లిములను కూడా సీఎం తగిన విధంగా సంతోషపెడుతున్నారు. తిరుమలలో మీడియాతో మాట్లాడిన కేసీఆర్‌ ఓ మాటన్నారు. ఏమని? 'తెలంగాణ ప్రభుత్వ పక్షాన మొక్కు చెల్లించాను' అని.  ప్రజాస్వామ్య వ్యవస్థలో, లౌకిక రాజ్యంలో ప్రభుత్వం ఓ మతానికి చెందిన ఆలయంలో దేవుడికి మొక్కులు చెల్లించవచ్చా? భారత రాజ్యాంగాన్ని అనుసరించి వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి తన సొంత మొక్కు కోసం కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేయొచ్చా? కేసీఆర్‌ ఉద్యమ నాయకుడిగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తే తిరుమల వెంకన్నకు, బెజవాడ కనకదుర్గమ్మకు, శ్రీశైలం మల్లన్నకు, తెలంగాణలోని కొందరు దేవుళ్లకు కానుకలు సమర్పిస్తానని మొక్కుకున్నారు.

కోరిన కోరిక తీరడం కోసం దేవుడికి మొక్కుకోవడం ధనిక, పేద తేడా లేకుండా ఆస్తికులంతా చేసే పనే. కేసీఆర్‌ కూడా ఆ పనే చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక మొక్కు తీర్చుకున్నారు. విచిత్రమేమిటంటే...కానుకలు సమర్పిస్తానని వ్యక్తిగతంగా, ఉద్యమ నాయకుడిగా మొక్కుకొని ప్రజాధనంతో ఆభరణాలు తయారుచేయించి సీఎం హోదాలో మొక్కు చెల్లించారు. ముఖ్యమంత్రిగా మొక్కులు మొక్కనప్పుడు 'ప్రభుత్వ పక్షాన కానుకలు సమర్పించాను' అని ఎలా చెబుతారు? ప్రభుత్వం ఇటువంటి పనిచేయదు కదా. ఆయన పార్టీ దగ్గర బొచ్చెడు డబ్బుంది. సంపన్న నాయకులున్నారు. కేసీఆర్‌కూ తక్కువేం లేదు. అలాంటప్పుడు సొంత డబ్బుతోనో, పార్టీ నిధులతోనో మొక్కులు చెల్లించుకోవాలి. వ్యక్తిగతంగా మొక్కుకొని ప్రజాధనం అప్పనంగా ఖర్చు చేసే అధికారం, హక్కు ముఖ్యమంత్రికి లేవు. రాజ్యాంగపరంగా, నైతికంగా ఇది తప్పు. కాని ఎవ్వరేం చేయలేరు. కేసీఆర్‌ భక్తి ముందు రాజ్యాంగం బలాదూర్‌. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?