Advertisement

Advertisement


Home > Articles - Special Articles

అధికారుల్లారా ఊడిగం చేసెయ్యండి.!

అధికారుల్లారా ఊడిగం చేసెయ్యండి.!

ఎమ్మెల్యేలదాకా ఎందుకు.? అధికారంలో వున్న పార్టీ కార్యకర్తలకు సైతం వంగి వంగి సలాం చెయ్యాల్సిన దుస్థితి దాపురించిందంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఒకరు వాపోయారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పరిస్థితే ఇలా వుంటే, కింది స్థాయి అధికారులు.. సాధారణ ఉద్యోగుల పరిస్థితి ఇంకెంత దారుణంగా వుంటుందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. 

ముఖ్యమంత్రిగారు అలా కారులో వెళ్తోంటే, ఐఏఎస్‌ అధికారులు, ఐపీఎస్‌ అధికారులు ఆయన కారు వెంట పరిగెత్తాలి. ఎమ్మెల్యేలు, మహిళా కలెక్టర్లతో అసభ్యకరంగా ప్రవర్తించినా అడిగే దిక్కుండదు. వివాదం ముదిరి పాకాన పడితే, చిన్నపాటి హెచ్చరికతో సరి. అదీ తూతూ మంత్రం హెచ్చరికే. ఆ తర్వాత తెరవెనుక సదరు అధికారులపై వేధింపులు ఓ రేంజ్‌లో వుంటాయి. ఇదీ అధికారుల దుస్థితి. 

ఈ రోజుల్లో ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చేవారెంతమంది.? అడ్డగోలుగా డబ్బు ఖర్చు చేసి పదవులు పొందుతున్నదెంతమంది.? అన్న ప్రశ్నలకు సమాధానం వెతకడానికి కష్టపడక్కర్లేదు.. చిన్న పిల్లాడినడిగినా చెప్పేస్తాడు సమాధానం. అలాంటిది, అధికారులు ప్రజా ప్రతినిథులకు వంగి వంగి దండాలు పెట్టాలని, వారొస్తే లేచి నిలబడాలని ఓ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేస్తే ఎలా వుంటుంది.? 

సిగ్గు సిగ్గు.! అని ఎవరైనా నవ్విపోదురుగాక మనకేటి.? అన్న చందాన వ్యవహరించిన ఆ ముఖ్యమంత్రి ఎవరో కాదు, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌. ప్రధాని నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడైన యోగి ఆదిత్యనాథ్‌, ఉత్తరప్రదేశ్‌లో ఈ కొత్త 'రూల్‌' పాస్‌ చేయించేశారు. ఖర్మ ఏంటంటే, ఇలాంటి ఆదేశాలు జారీ చేసేది కూడా అధికారులే కావడం. 

అధికారులు ప్రజల కోసం పనిచేయడం సంగతేమోగానీ, రాజకీయ నాయకులకు ఊడిగం చేయాల్సి వస్తోందని సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులే వాపోతోంటే, కొత్తగా ప్రజా ప్రతినిథులకు 'రెస్పెక్ట్‌ దొరకడంలేదు' అన్న నెపంతో, ఈ కొత్త చెత్త ఆదేశాలు ఏంటట.? ఇట్‌ హ్యాపెన్స్‌ ఓన్లీ ఇన్‌ ఇండియా అనుకోవాలా.? ప్రస్తుతానికైతే ఈ జాడ్యం ఉత్తరప్రదేశ్‌కి పట్టుకుంది.. భవిష్యత్తులో దేశంలోని అన్ని రాష్ట్రాలూ అధికారికంగా ఈ జాడ్యాన్ని ఫాలో అవుతాయేమో.! 

అవును మరి, ఇప్పటిదాకా అనధికారికం.. ఇకపై అధికారికం.. అదే ఊడిగం.!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?