Advertisement

Advertisement


Home > Articles - Special Articles

అమెరికా 'బూచి' అంతలా భయపెడ్తోందా.?

అమెరికా 'బూచి' అంతలా భయపెడ్తోందా.?

మరణం కన్నా భయంకరమైనది ఇంకేముంటుంది.? అందుకే, ఇప్పుడు అమెరికాలోని భారతీయులు భయాందోళనలకు గురవుతున్నారు. భారతీయులే కాదు, అమెరికాలోని అమెరికాయేతరులందరిదీ ఇదే పరిస్థితి. ఇదంతా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పుణ్యమే. అమెరికా కేవలం అమెరికన్లది మాత్రమేనన్న ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికాలో అమెరికాయేతరులకు భద్రత లేకుండా పోయింది. ట్రంప్‌ పేరు చెప్పి, అమెరికాలోని 'తెల్లకావరం' వెర్రి తలలు వేస్తోంది. నిజానికి, ఈ 'ద్వేషం' ఈనాటిది కాదు.. ఎప్పటినుంచో వున్నదే. అయితే, నిన్న మొన్నటిదాకా అక్కడ 'ద్వేషం' నల్ల - తెల్ల జాతీయులైన అమెరికన్ల మధ్యనే వుండేది. అప్పుడప్పుడూ అ ద్వేషం కాస్తా, ఇతరుల్నీ బలితీసుకుంది. 

కానీ, ఇప్పుడు పరిస్థితులు వేరు. నల్ల, తెల్ల అమెరికన్లు ఒక్కతాటిపైకొచ్చి.. అమెరికాయేతరులపై కత్తులు దూస్తున్నారు.. తుపాకీలను ఎక్కుపెడుతున్నారు. దాంతో అమెరికాయేతరులు బిక్కుబిక్కుమనాల్సి వస్తోంది అమెరికాలో. అందరూ కాదుగానీ, 'సోకాల్డ్‌ అమెరికన్లు' ఈ దారుణాలకు ఒడిగడ్తున్నారు. 'అమెరికా మాది.. మీకు ఇక్కడేం పని.? మీరు పోతారా.? మిమ్మల్ని పైకి పంపించెయ్యాలా.?' అంటూ అల్టిమేటం జారీ చేస్తోంటే, భయపడకుండా ఎలా వుండగలరు ఎవరైనా.? సోషల్ మీడియా వేదికగా చేసుకుని, కొందరు బెదిరింపులకు పాల్పడుతోంటే, పబ్లిక్ ప్లేసుల్లో.. అమెరికా పైత్యం ప్రదర్శిస్తున్నారు ఇంకొందరు. ఆ బూతులేంటి.? ఆ బెదిరింపులేంటి.? సిగ్గు సిగ్గు.

పరిస్థితులు ఇంత దారుణంగా తయారైనా, ట్రంప్‌ ప్రభుత్వం 'అబ్బే, మా ఉద్దేశ్యాలు వేరు.. జరుగుతున్న ఘటనలు వేరు..' అని బుకాయించడం తప్ప, భయాందోళనలకు గురవుతున్న అమెరికాయేతరులకు భరోసా ఇచ్చేందుకు మాత్రం ప్రయత్నించడంలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో, ట్రంప్‌కి మద్దతిచ్చినవారిలో అమెరికాయేతరులూ వున్నారు. అంతెందుకు, ఆయన 'కోటరీ'లో మన తెలుగువారూ వున్నారన్నది నిర్వివాదాంశం. ఇప్పుడు వాళ్ళెవరికీ జరుగుతున్న పరిణామాలతో నోరు పెగలని పరిస్థితి. 

'అమెరికాకి మీ అమ్మా నాన్నల్ని తీసుకెళ్ళొద్దు.. మీ వస్ర్తధారణ మీ ఇష్టప్రకారం కాదు, అమెరికన్ల ఇష్టప్రకారం వుండడం మంచిది.. అమెరికన్‌ ఇంగ్లీషు తప్ప.. మీ భాషలేవీ మాట్లాడొద్దు.. రాత్రయితే ఎంచక్కా ఇంటికి వచ్చేయండి.. రాత్రి సమయం బార్లలో గడపొద్దు..' ఇలా చాలా చాలానే హెచ్చరికలు చేసేస్తున్నారు అమెరికాలో వున్న మనవాళ్ళని ఉద్దేశించి. తప్పదు, ఎక్కడో అమెరికాలో వున్నప్పుడు, అక్కడి పద్ధతులకు అలవాటుపడాల్సిందే. అసలే అమెరికా.. పైగా, అక్కడ ప్రజాస్వామ్యమిప్పుడు ఖూనీ అయిపోయింది. నిన్న మొన్నటిదాకా అమెరికా అందరిదీ.. ఇప్పుడు అమెరికా కేవలం అమెరికన్లది మాత్రమే. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే, ఒకప్పటిలా అమెరికా భూతలస్వర్గం కాదు.. భూతాల రాజ్యంగా మారిపోయిందనడం సబబేమో.!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?