Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ఆంధ్రప్రదేశ్‌కి అదే శాపం

ఆంధ్రప్రదేశ్‌కి అదే శాపం

ఇప్పుడు తమిళనాడులో కులాలు లేవు, మతాలు లేవు.. అసలు రాజకీయాలే లేవు.. అందరిదీ ఒక్కటే నినాదం, జల్లికట్టు కావాలని. తమిళనాడు అంటే జల్లికట్టు, జల్లికట్టు అంటే తమిళనాడు. ఇది తప్ప, తమిళనాడులో ఇంకో సమస్య లేదు. జల్లికట్టు లేని తమిళనాడుని ఊహించుకోలేం. అసలు జల్లికట్టు లేకపోతే, తమిళ సంస్కృతీ సంప్రదాయాలే లేవు. ఇదే అందరి నినాదం.

ఈ స్థాయిలో తమిళనాడులో జల్లికట్టుపై 'ప్రొజెక్షన్‌' జరిగింది.. జరుగుతోంది. మామూలుగా అయితే, జంతు హింస పేరుతో జల్లికట్టుకి వ్యతిరేకంగా నినదించాలి. అసలు అది మా ప్రాంతినికి సంబంధం లేని ఆచారం.. అని కొందరైనా చెప్పాలి. అబ్బే, అది మా మతానికి సంబంధించిన విషయం కాదని, ఇంకొందరు పెదవి విరిచెయ్యాలి. మూర్ఖులు అలా మాట్లాడుతున్నారు, ఇదెక్కడి సంప్రదాయమని మరికొందరు గేలి చెయ్యాలి. కానీ, తమిళనాడులో ఇలాంటి పప్పులేవీ ఉడకలేదు. 

'ప్రత్యేక హోదా సంజీవని ఏమీ కాదు.. ప్రత్యేక హోదా కాదు, అంతకు మించి చేసేస్తున్నాం..' అని కేంద్రం కల్లబొల్లి కబుర్లు చెప్పేస్తే, రాజకీయం రెండు వర్గాలుగా విడిపోయి, అసలు సమస్యను ఆంధ్రప్రదేశ్‌లో పక్కదారి పట్టించేసినట్లు, తమిళనాడులో కుదరలేదు. సమస్య ఏదన్నా వస్తే, ఐక్యంగా పోరాడటం అనేది తమిళనాడులో కన్పించింది. ఆ ఐక్యత, ఆంధ్రప్రదేశ్‌లో మచ్చుకు కూడా కన్పించదు. 

ప్రభుత్వం జల్లికట్టుకి అనుకూలంగా నినదిస్తే, విపక్షాలు ప్రభుత్వంతో గొంతు కలిపాయి. విద్యార్థి లోకం కదిలి వచ్చింది, సినీ పరిశ్రమ కూడా స్పందించక తప్పలేదు. అది జస్ట్‌ ఓ ఆట మాత్రమే. అది తమిళ సంస్కృతి అన్నది వేరే విషయం. కానీ, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అనేది అంతకు మించిన సమస్య.. జీవన్మరణ సమస్య. ఇలాంటి కీలకమైన అంశంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ స్పందిస్తే, 'ఎంపీగా అప్పుడు నువ్వేం చేశావ్‌.?' అని టీడీపీ, బీజేపీ ప్రశ్నించాయి. కాంగ్రెస్‌ ఉద్యమించినా అదే పరిస్థితి. 

తమిళనాడులో జల్లికట్టు వివాదం ఈనాటిది కాదు, అన్నాడీఎంకే గతంలో ఏం చేసింది.? అని డీఎంకే ప్రశ్నించలేదు. డీఎంకే కేంద్రంలో, అధికారంలో వున్నప్పుడు నోరెత్తలేదెందుకు.? అని అన్నాడీఎంకే ప్రశ్నించలేదు. అసలక్కడ జల్లికట్టు ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నాలే జరగలేదు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు వేరు. జగన్‌, ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష చేస్తే, చంద్రబాబు సర్కార్‌ ఎంత రాజకీయం చెయ్యాలో అంతా చేసేసింది. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేయడమే తన జీవిత పరమార్థం అన్నట్లు వ్యవహరించారు చంద్రబాబు.

ఆంధ్రప్రదేశ్‌కి శతృవులు ఎక్కడో లేరు, ఆంధ్రప్రదేశ్‌లోనే వున్నారు. ఆ శతృత్వం రాజకీయం రూపంలోనే వుంది. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేవు. పార్టీల ప్రాతిపదికన, కులాల ప్రాతిపాదికన, మతాల ప్రాతిపదికన, కుట్రపూరిత రాజకీయాలు చేయడంలో మనకు మనమే సాటి. పవన్‌కళ్యాణ్‌ది ఏ కులం.? చంద్రబాబుది ఏ కులం.? వైఎస్‌ జగన్‌ది ఏ కులం.? ఇదీ మన దిక్కుమాలిన సంస్కృతి. సిగ్గు సిగ్గు. తమిళనాడుని చూసైనా నేర్చుకుందాం.

ప్రత్యేక ప్యాకేజీ బిచ్చం.. ఆ బిచ్చానికీ చట్టబద్ధతలేని దుస్థితి. అయినా, పండగ చేసేసుకుంటున్నాం. పాచిపోయిన లడ్డూలని పవన్‌కళ్యాణ్‌ ప్రశ్నిస్తే, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుగారికి కోపమొచ్చేసింది. మూడేళ్ళవుతోంది, రైల్వే జోన్‌ ఎక్కడ.? ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత ఏది.? ప్రశ్నిస్తే పవన్‌కళ్యాణ్‌ది అవగాహనా రాహిత్యం. జగన్‌ది రాజకీయ మూర్ఖత్వం. ఇంతేనా.? 'తమిళనాడు తరహాలో అందరూ ఒక్కటవ్వాలి..' అన్న మాట ఇప్పుడు గట్టిగా విన్పిస్తోందిగానీ, తమిళ జనాల్లో వున్న ఐక్యత మనకెక్కడిది.? మనకి రాజకీయం కావాలి. అది కుల రాజకీయం కావొచ్చు, మత రాజకీయం కావొచ్చు, ప్రాంతీయ రాజకీయం కావొచ్చు.. ఇంకోటి కావొచ్చు. ఆ రాజకీయమే ఆంధ్రప్రదేశ్‌కి శాపం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?