Advertisement

Advertisement


Home > Articles - Special Articles

అసలు ‘స్వచ్ఛ భారత్‌’ ఇది కాదు..!

అసలు ‘స్వచ్ఛ భారత్‌’ ఇది కాదు..!

ఈమధ్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన మాట ‘స్వచ్ఛ భారత్‌’. దేశం చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉండాలని అర్థం. అక్టోబరు 2వ తేదీ గాంధీ జయంతి రోజు ప్రధాని మోదీ స్వయంగా చీపురు పట్టుకొని ఢల్లీి వీధులను ఊడ్చారు. ప్రధాని అంతటివాడే  ఊడ్చినప్పుడు మనం కూడా ఊడవాలని ప్రజలు అనుకోవాలి. కాని ఎంతవరకు ఊడస్తున్నారో తెలియదు. ప్రధాని పిలుపు మేరకు కొందరు సెలబ్రిటీలు అంటే సినిమా తారలు, క్రీడాకారులు మొదలైనవారు వీధులను ఊడుస్తున్నట్లు మీడియాలో ఫొటోలు వచ్చాయి. హైదరాబాద్‌లో ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారులు నివసించే ఖరీదైన ప్రశాసన్‌ నగర్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా తీర్చిదిద్దిన టెన్నిస్‌ స్టార్‌ సానియా మిర్జా చీపురు పట్టుకొని ఊడ్చింది. అక్కడ చెత్త ఉందో లేదో తెలియదు. కాని ఆమె కూడా బృహత్తర సామాజిక కార్యక్రమంలో పాలుపంచుకున్నట్లు ప్రజలకు అర్థమైంది. దీపావళినాడు బాణాసంచా పేల్చిన కారణంగా చెత్తతో నిండిపోయిన రోడ్లను ప్రజలు స్వచ్ఛందంగా శుభ్రం చేసుకున్నారని ప్రధాని మోదీ ట్విట్టర్లో సంతోషించారట...! ఆయన ఎక్కడ చూశారో మరి...! 

మోదీ మేధ నుంచి పుట్టిన స్వచ్ఛ భారత్‌ను అతి గొప్ప కార్యక్రమంగా మీడియా అభివర్ణిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొంటారని, ఐదేళ్లలో దేశం అద్దంలా మెరుస్తుందని ఎవరైనా అనుకుంటే అది కేవలం భ్రమే. మన దేశ ప్రజలకు అంత చిత్తశుద్ధి ఉంటుందంటే నమ్మలేం. మోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్‌ మంచి కార్యక్రమమే. కాదనం. కాని...రోడ్ల మీది చెత్తను ఊడవడానికి పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. వారికి నాలుగు డబ్బులు ఎక్కువిచ్చి, సౌకర్యాలు కల్పిస్తే రోడ్లను అద్దంలా చేస్తారు. ప్రజలు మరింత చెత్త పోయకుండా వారికి సహకరిస్తే చాలు. అసలు చేయాల్సిన ‘స్వచ్ఛ భారత్‌’ మరొకటి ఉంది. అది విదేశాల్లోని నల్లధనం బయటకు తీసుకురావడం. దేశంలోని బడా బాబులు విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న లక్షల కోట్ల నల్లధనాన్ని బయటకు తీసుకువస్తామని, వారిని ప్రజల ముందు నిలబెడతామని సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో  ఇదే బీజేపీ, ఇదే నరేంద్ర మోదీ ‘చూస్కోండి మా తడాఖా’ అన్నట్లుగా చెప్పారు. కాని...ఇప్పుడు ‘మా వల్ల కాదు’ అని చేతులెత్తేశారు. ఎందుకీ పనికిమాలిన మాటలు? అధికారంలోకి రావడం కోసం ఇంతగా పచ్చి అబద్ధాలు ఆడతారా? 

యుపిఎ అధికారంలో ఉన్నన్ని రోజులు నల్లధనం రప్పించడంలేదంటూ దానిపై చిందులు వేశారు. కాని ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానానికి ఏం చెబుతున్నారు? ‘నల్ల కుబేరుల’ పేర్లు బయటపెట్టలేమంటున్నారు. యుపిఎ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు, బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీకి తేడా ఏమీ లేదు. మన్మోహన్‌ అసలు నోరు విప్పి మాట్లాడకపోయేవారు, ఈయన మాటల మాయాజాలంతో ప్రజలను సమ్మోహితులను చేస్తున్నారు. అంతే తేడా. అసలు సమస్యలు పక్కకు పెట్టి స్వచ్ఛ భారత్‌ వంటివాటిపై ప్రచారం చేసుకుంటూ సంస్కర్తల్లా కనబడేందుకు ప్రయత్నిస్తున్నారు. నల్ల కుబేరుల పేర్లు బయట పెడితే న్యాయపరమైన చిక్కులు వస్తాయని, అంతర్జాతీయ ఒప్పందాలు ఉల్లంఘించినట్లు అవుతుందని బీజేపీ పాలకులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దీని ద్వారా ఏం అర్థమవుతోంది? నరేంద్ర మోదీ అంతవాడు ఇంతవాడని కార్పొరేట్‌ మీడియా ప్రచారం చేస్తోందే తప్ప ఆయనకు అంత సీన్‌ లేదని అర్థమవుతోంది. ఈ దేశంలో పాలకులెవరైనా సరే బడా పెట్టుబడిదారుల, కార్పొరేట్ల గుప్పిట్లో ఉండాల్సినవారేనని అర్థమవుతోంది. నరేంద్ర మోదీ దేశాన్ని ఉద్ధరిస్తారని ప్రజలు ఆయన్ని ప్రధానిని చేయలేదు. యుపిఎ పాలనతో విసిగిపోయి, మరో ప్రత్యామ్నాయం లేక ఆయన్ని పీఠం మీద కూర్చోబెట్టారు.

ఏ విషయంలోనైనా యుపిఎ విధానాలను అనుసరించడం తప్ప ఇప్పటివరకు కొత్తగా ఏమీ చేయలేదు. అమెరికా ప్రభుత్వం తన దేశంలోని నల్ల కుబేరుల పేర్లను బయటపెట్టింది. అంతటి పెట్టుబడిదారీ దేశమే పేర్లను బయటపెట్టినప్పుడు మన ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? అలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు నల్ల ధనాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడకోకుండా ఉంటే నిజాయితీగా వ్యవహరించినట్లుండేది. అసలు నల్ల కుబేరులు వందల సంఖ్యలో ఉన్నా ప్రభుత్వం చేతిలో ఇరవైఆరు మంది పేర్లున్నాయి. వీళ్లలో కాంగ్రెసు ప్రముఖులు కూడా ఉన్నారు. ఆ పార్టీని ఇబ్బంది పెట్టాలంటే వారి పేర్లు బయటపెట్టొచ్చుకదా అనే ప్రశ్న రావొచ్చు. అది సాధ్యం కాదు. బయటపెట్టే పరిస్థితి వస్తే అందరి పేర్లూ రచ్చకెక్కుతాయి. నల్ల కుబేరుల పేర్లు బయటపెట్టడం సాధ్యం కాదని మన్మోహన్‌ చెప్పారు. ఇప్పుడు మోదీ చెప్పారు. మరి దీనిపై సుప్రీం కోర్టు ఏమంటుంది? బయట పెట్టకపోతే తాట తీస్తాం అంటుందా? సరే..వదిలేయండి అంటుందా? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?