Advertisement

Advertisement


Home > Articles - Special Articles

బాబుకీ, జగన్‌కీ ఇదే సూపర్‌ ఛాన్స్‌.!

బాబుకీ, జగన్‌కీ ఇదే సూపర్‌ ఛాన్స్‌.!

రాజకీయాల్లో శాశ్వత శతృత్వం, శాశ్వత మితృత్వం వుండవని అంటారు. కానీ, శాశ్వతంగా శతృత్వం మాత్రం ఇద్దరి మధ్య కొనసాగుతోంది. ఆ ఇద్దరూ ఎవరో కాదు, టీడీపీ అధినేత చంద్రబాబు.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌. ఈ ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేసినా, వెయ్యకపోయినా భగ్గుమంటుంది. ఆ స్థాయిలో వీరిద్దరి మధ్యా వ్యక్తిగత, రాజకీయ విభేదాలున్నాయి. ఒకరినొకరు శతృవుల్లా చూసుకుంటుంటారు. 'వ్యక్తిగతంగా ఆయన మీద నాకెలాంటి ధ్వేషం లేదు..' అని ఇరువురూ చెప్పొచ్చుగాక. కానీ, ఆ వైరం జగమెరిగిన సత్యం. 

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విషయంలో 'సమైక్యంగా' పోరాడేందుకు ఇంతకు మించిన సమయం ఇంకోటి దొరక్కపోవచ్చు. ఇటు ప్రతిపక్ష నేత, అటు ముఖ్యమంత్రి.. ఇద్దరూ ఒక్కతాటిపైకి రావాల్సిన సందర్భమిది. ఇద్దరి టార్గెట్‌ ప్రత్యేక హోదా అయినప్పుడు, ఇద్దరూ కలిసి కేంద్రంపై పోరాడాలి. ఆ తర్వాత ఎలాగూ కాంగ్రెస్‌, పోరుబాటలో కలిసిరాక తప్పని పరిస్థితి ఏర్పడుతుందనుకోండి. వామపక్షాలూ కలిసొస్తాయి, చివరికి బీజేపీ.. కలిసి రాకుండా వుండలేని పరిస్థితి. 

కానీ, ముందుగా చంద్రబాబు - వైఎస్‌ జగన్‌ కలవాలి. రాజకీయ ప్రయోజనాల్ని, రాజకీయ విభేదాల్ని పక్కన పెట్టి, చంద్రబాబు, వైఎస్‌ జగన్‌ ఒక్కటవ్వాల్సిన తరుణం ఖచ్చితంగా ఇదే. ఓ పక్క పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి, ఇంకోపక్క ప్రత్యేక హోదా కాక రేగింది. కాంగ్రెస్‌ పార్టీ కారణంగానే ప్రత్యేక హోదా వేడి పుట్టిన మాట వాస్తవం. కేవీపీ ప్రైవేటు మెంబర్‌ బిల్లు అనేదే లేకపోతే, అసలు ఇప్పుడీ అంశం చర్చకు వచ్చేదే కాదు. 

కాంగ్రెస్‌ కారణంగా, చంద్రబాబు కూడా డిఫెన్స్‌లో పడిపోయారు. ఈ టైమ్‌లో ప్రతిపక్ష నేత ఛాన్స్‌ తీసుకోవాలి. చంద్రబాబు వద్దకు వెళ్ళాలి. దాంతోపాటుగా, చంద్రబాబు నుంచి కూడా జగన్‌తో కలిసి పనిచేసేందుకు వాతావరణం అనుకూలంగా వుండాలి. కానీ, ఇవన్నీ సాధ్యమేనా.? అసాధ్యమైతే కాదుగానీ, ఇరువురి మధ్య ఇప్పుడు 'ఇగో'లకు ఆస్కారం వుండకూడదు. ఆగస్ట్‌ 5 తర్వాత చంద్రబాబు, వైఎస్‌ జగన్‌ విడివిడిగా నెత్తీనోరూ బాదుకున్నా ఉపయోగం వుండదుగాక వుండదు. 

వచ్చే శుక్రవారం.. అంటే ఆగస్ట్‌ 5న రాజ్యసభలో కేవీపీ ప్రైవేటు మెంబర్‌ బిల్లుపై చర్చ, ఓటింగ్‌ జరిగే అవకాశముంది. ఈలోగానే ప్రత్యేక హోదా హీట్‌ని పెంచాలి.. అది ఢిల్లీ పాలకులకి తగలాలి. అలా జరగాలంటే కలవాల్సింది చంద్రబాబు, వైఎస్‌ జగన్‌. ఆగస్ట్‌ 2న బంద్‌కి పిలుపునివ్వడం వరకూ ప్రతిపక్షం తన బాద్యతను తాను నిర్వహిస్తోందనుకోవచ్చు. కానీ, ఆ బంద్‌ వల్ల ఉపయోగమేంటి.? అన్నదీ ఆలోచించుకోవాలి. ఎందుకంటే, విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి ఈ బంద్‌లు ఇంకా నష్టం కలిగిస్తాయి. ఆ బంద్‌ జరగకూడదంటే, చంద్రబాబు - జగన్‌తో సంప్రదింపులకు సిద్ధం కావాల్సిందే. 

ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ని తీసుకుని, జగన్‌తోపాటు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నేతల్నీ కలుపుకుని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి ప్రతినిథి బృందాన్ని తీసుకెళ్ళగలిగితే ప్రత్యేక హోదాపై నరేంద్రమోడీ దిగిరావడం నూటికి నూరుపాళ్ళూ ఖాయమే. కానీ, దానిక్కావాల్సిందల్లా చంద్రబాబు - జగన్‌ కలయిక. రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.. మరి ఈ ఇద్దరూ రాష్ట్రం కోసం ఒక్కటవుతారా.? వేచి చూడాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?