Advertisement

Advertisement


Home > Articles - Special Articles

భళారే.. కళకళ్ళాడుతున్న బెజవాడ

భళారే.. కళకళ్ళాడుతున్న బెజవాడ

రాజకీయ రాజధాని అనీ ఇంకోటని ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో బెజవాడకి పేరుండేది. ఇప్పుడు ఏకంగా బెజవాడ ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని అయిపోయింది. పేరుకి అమరావతి, ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అయినా, అమరావతిలో ప్రస్తుతానికి 'పాపులేషన్‌' ఎక్కువగా వున్నది బెజవాడే. పాపులేషన్‌ మాత్రమే కాదు, బెజవాడకి ఉన్నంత పాపులారిటీ, అమరావతి పరిధిలో గుంటూరుకి కూడా లేదు. ఆ మాటకొస్తే, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య నగరాల్లో బెజవాడ ఒకటి. 

కారణాలేవైతేనేం, ఆంధ్రప్రదేశ్‌ తాత్కాలిక రాజధాని విజయవాడ రెండేళ్ళ తర్వాత కళకళ్ళాడుతోంది. మొదట్లో మొహమాట పడ్డ ఉద్యోగులు ఇప్పుడిప్పుడే తాత్కాలిక రాజధానికి తరలి వస్తున్నారు కొన్ని శాఖలు గుంటూరుకు వెళ్ళినా, చాలావరకు శాఖలు విజయవాడ వైపే మొగ్గు చూపాయి. అలా, విజయవాడ రోజురోజుకీ మరింత జనసమ్మర్ధం కలిగిన ప్రాంతంగా మారుతోంది. కొత్తగా హాస్టళ్ళు వెలుస్తున్నాయి.. కొత్త కొత్త హోటళ్ళు పుట్టుకొస్తున్నాయి. చిన్నా చితకా వ్యాపారాలూ జోరందుకుంటున్నాయి. 

ఓటుకు నోటు కేసు తర్వాతే ముఖ్యమంత్రి చంద్రబాబులో కదలిక బయల్దేరింది. చంద్రబాబుకంటే తొందరొచ్చిందిగానీ, ఆ తొందరలో ఉద్యోగుల్ని పరుగులు పెట్టించాలనుకుంటే ఎలా.? కానీ తప్పదు.. ఉద్యోగులూ పెద్ద మనసు చేసుకున్నారు. కుటుంబాల్ని హైద్రాబాద్‌లో వదిలి కొందరు, కుటుంబ సమేతంగా మరికొందరు ఉద్యోగులు బెజవాడకు తరలి వెళుతున్నారు. దాంతో, విజయవాడలో ఎటు చూసినా సందడి వాతావరణమే కన్పిస్తోంది. 

కొత్త కార్యాలయాల్లో ఉద్యోగులు పూర్తిస్థాయిలో విధుల్లో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల నుంచీ ప్రభుత్వ కార్యాలయాల పనుల నిమిత్తం విజయవాడకు వస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఎప్పుడూ ఇసకేస్తే రాలనంత బిజీగా వుండే విజయవాడ బస్టాండ్‌ ఇప్పుడు అస్సలేమాత్రం ఖాళీ వుండడంలేదు. రైల్వే స్టేషన్‌దీ అదే పరిస్థితి. షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, పలు బజార్‌ రోడ్‌లు మునుపటితో పోల్చితే రెండింతలు, మూడింతలు బిజీగా వుంటున్నాయి. 

గడచిన రెండు నెలలుగా తమ వ్యాపారం బాగా పెరిగిందనీ, మరీ ముఖ్యంగా నెల రోజుల నుంచీ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. అదే సమయంలో, రహదార్లపై ట్రాఫిక్‌ నరకయాతనను తలపిస్తోంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పటికే కొన్ని రహదార్లను విస్తరించినా, అవి ముందు ముందు అవసరాలకు ఏమాత్రం సరిపోవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇప్పుడే ఇలా వుంటే, కృష్ణా పుష్కరాల సమయానికి పరిస్థితి ఎలా వుంటుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రాఫిక్‌ కష్టాలెలా వున్నా, రహదార్లు, షాపింగ్‌ కాంప్లెక్సులు, ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటువుతున్న ప్రాంతాలు నిత్యం జనంతో కళకళ్ళాడుతుండడంతో బెజవాడ వాసులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇంకో ఏడాది క్రితమే ఈ తరలింపు ప్రక్రియ జరిగి వుంటే, విజయవాడలో ఇప్పుడు అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుని వుండేవన్నది వారి అభిప్రాయం. 

ఎలాగైతేనేం, విజయవాడకు రాజధాని కళ పూర్తిస్థాయిలో వచ్చేసింది. సొంత ఇల్లు సంగతి తర్వాత, అసలంటూ అద్దె ఇళ్ళు కూడా దొరకని పరిస్థితి నెలకొంది విజయవాడ పరిసర ప్రాంతాల్లో. మరోపక్క బహుళ అంతస్తుల నిర్మాణం విజయవాడ - గుంటూరు నగరాల పరిధిలో శరవేగంగా జరుగుతోంది. పెద్దయెత్తున విస్తరించనున్న నగరాలకు, కొత్త భవనాల నిర్మాణంతో కొత్త కళ రానుందన్నది నిర్వివాదాంశం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?