Advertisement

Advertisement


Home > Articles - Special Articles

‘భయో’ డేటా: ‘అగ్గీ’ రాజా!

‘భయో’ డేటా: ‘అగ్గీ’ రాజా!

పేరు : దిగ్విజయ్ సింగ్ 

దరఖాస్తు చేయు ఉద్యోగం: ఎఐసిసి (ఉత్తేజ) మోటివేషనల్ సెక్రటరీ.(వరుస ఓటములతో బెంబేలెత్తిన కాంగ్రెస్ నేతల,శ్రేణుల్లో ఉత్తేజం నింపే ఉద్యోగం). నేను చేస్తున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవికి  కాంగ్రెస్ పార్టీలో పనేమీ లేదు.

ముద్దు పేర్లు :దిగ్గీ రాజా, ఇప్పుడు మాత్రం ‘అగ్గీ’ రాజా. (తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో వున్న హనీమూన్ ముగిసింది కాబట్టి, రెంటి మధ్యా అగ్గి రాజెయ్యాలన్న ఉద్దేశ్యంతోనే వచ్చాను. కానీ అదేమిటో తెలంగాణ కాంగ్రెస్ నేతలకీ, టీఆర్‌ఎస్ నేతలకీ మధ్య పచ్చ గడ్డి కాదు, పెట్రోలులో ముంచిన ఎండుగడ్డి వేసినా భగ్గుమనటంలేదు. ఎందుకో నాకు అర్థం కావటం లేదు.)

విద్యార్హతలు : బ్యాచిలర్ ఆఫ్ ఆప్టిమిజమ్( ఆశావాదం). అవును. నేను ఆశావాదినే. అప్పుడు టీఆర్‌ఎన్‌ను, కాంగ్రెస్‌లో కేసీఆర్ విలీనం చేస్తారని ఆశించే ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేశాం. తెలంగాణ ఇవ్వాలని పార్టీలో నిర్ణయం చేసినప్పుడు కూడా ఈ విషయాన్ని గుర్తుచేశాను. ఆయన మాట తప్పాడు. జనం ‘వోటు’ తప్పారు. కేసీఆర్‌కే పట్టం కట్టారు. ఇప్పుడు కేసీఆర్‌తో కయ్యం పెట్టుకోమని మా పార్టీనేతల్ని ఎగదోస్తున్నాను. వీరు వింటారో, లేదో తెలియదు. 

గుర్తింపు చిహ్నాలు :

  • ​ఒకటి: నేను రాజకీయంగా విడాకుల స్పెషలిస్టుని. ఏ రాష్ట్రానికి పార్టీ ఇన్‌చార్జ్ గా వుంటే, ఆ రాష్ర్ట విభజన షురూ చేస్తాను. 
  • రెండు: మీడియా మీదా, మీడియా స్వేఛ్చ మీదా ‘వ్యామోహం’ ఎక్కువ.( కాబట్టే కదా, టీవీ జర్నలిస్టు అమృతా రాయ్‌తో స్నేహం వుందని ధైర్యగా ప్రకటించ కలిగాను.)

సిధ్ధాంతం : ‘చేతులు’కాలాక అవసరమయితే ఆకులు  పట్టుకుంటాను కానీ, పవ్వులు పట్టుకోక పోవటం. కాబట్టే, ‘చేతి’ గుర్తు దెబ్బతిందని ‘గులాబీ’ వైపూ, ‘కమలం’ వైపూ పరుగెత్తే వారంటే  ఒళ్ళు మంట. అలాంటి వాళ్ళ ఇళ్ళ ముందు ధర్నాలు చేయమని పిలుపు ఇచ్చింది అందుకే.

వృత్తి : మధ్య, మధ్య ... మధ్యప్రదేశ్ ను పరిపాలించటం. 

హాబీలు : 

  1. తలలు బోడులయినా తలపులు బోడులవునా..? ( లైఫ్‌నెప్పుడూ ‘రొమాంటిక్’ గా వుంచుకోవటం. అలాగని వేరే అర్థాలు తీయకండి; సోషల్ మీడియా నెట్ వర్క్‌లో నా ప్రయివేటు ఫోటోలు సర్క్యులేట్ చేయకండి. చట్ట రీత్యా నేరం.) నిత్య నూతనంగా జీవితాన్ని వుంచుకోవటమే...!
  2. రెండు గ్రూపుల మధ్య తల దూర్చటం. గ్రూపులు లేకుంటే గ్రూపులను సృష్టించటం. వారి మధ్య... కలహం కాదు.. పోటీని పెంచటం. ఆ విధంగానే కాంగ్రెస్ పెరిగింది. ఆ పోటీ ముదిరినప్పుడు తరిగింది.

అనుభవం : కాంగ్రెస్ గెలిచినప్పుడు, వైరి పక్షం బలహీనంగా వుంది కాబట్టి గెలిచిందంటారు; ఓడినప్పుడు మాత్రం కాంగ్రెస్ స్వశక్తితో ఓడిందంటారు. కానీ కాంగ్రెస్ స్వశక్తితో గెలిచిందని ఎప్పుడూ అనరు. ఇది నా అనుభవం. 

మిత్రులు : పార్టీ ఓడిన మరు క్షణం నుంచి, మిత్రులే శత్రువుల కన్నా హీనంగా మాట్లాడతారు. అందుకే పొత్తు పెట్టుకున్న ప్రతీ వాడూ మిత్రుడుకాడు.

శత్రువులు : కాంగ్రెస్ పార్టీ ఏ విషయంలో చేసినా చెయ్యక పోయినా ఈ విషయంలో మాత్రం స్వయం సమృధ్ధి సాధించింది. శత్రువుల కోసం బయిట వెతుక్కోనవసరం లేదు. అంతా సొంతమనుషుల్లోనే వుంటారు. 

మిత్రశత్రువులు : మన పార్టీ టిక్కెట్టు మీద గెలిచి వేరే పార్టీకి జంప్ చేసేవారు. 

వేదాంతం : మన దేశంలో ‘కండువా’ ను మార్చినంత సులువుగా ‘కర్చీఫ్’ను మార్చలేరు. (రంగు కర్చీఫ్‌కు అంటుకుంటుంది కానీ, కండువాకు అంటుకోదు.)

జీవిత ధ్యేయం :ఎన్ని సార్లు కాంగ్రెస్ ఓడిపోయినా, అందుకు కారకుడు రాహుల్ గాంధీ అని చరిత్రలో రికార్డు కాకుండా చూడటం. 

-సతీష్ చందర్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?