Advertisement

Advertisement


Home > Articles - Special Articles

బ్లాక్‌ అండ్‌ వైట్‌: భిన్నత్వలోనే భిన్నత్వం.!

బ్లాక్‌ అండ్‌ వైట్‌: భిన్నత్వలోనే భిన్నత్వం.!

భిన్నత్వంలో ఏకత్వం.. ఏకత్వంలో భిన్నత్వం.. ఇది భారతదేశం తాలూకు గొప్పతనమని ఇప్పటిదాకా చెప్పుకుంటూ వున్నాం. కానీ, ఇప్పుడు రూటు మారింది. భిన్నత్వంలోనే ఇంకా భిన్నత్వాన్ని వెతుక్కుంటున్నాం మనం. ఇంటర్నెట్‌ విప్లవం పుణ్యమా అని ప్రపంచం కుగ్రామంగా మారిపోతే, కొత్తగా భారతదేశంలో విభజన రేఖలు 'అది మీది, ఇది మాది..' అంటూ తెరపైకొస్తున్నాయి. 

ఓ మాజీ ఎంపీ, ఓ చర్చా కార్యక్రమంలో 'మేమంతా భారతీయులం.. మాకు రంగుల తేడాల్లేవు.. తేడాలుంటే, ఉత్తరాదివారు నల్లగా వుంటారు కదా, వారితో ఎందుకు కలిసి వుంటాం.?' అనడంతో దేశమంతా భగ్గుమంటోంది. 'మాలోనే రకరకాల రంగులున్నాయి.. అలాంటప్పుడు మాకెందుకు వర్ణబేధాలు..' అనాల్సిన మాటని, కాస్త భిన్నంగా సదరు మాజీ ఎంపీ చెప్పడమే ఇంత వివాదానికీ కారణం. ఈ వ్యాఖ్యలు చేసింది బీజేపీకి చెందిన నేత కావడంతో, సహజంగానే ఈ అంశాన్ని కాంగ్రెస్‌ పార్టీ రచ్చ చేస్తుంది.. చేస్తోంది కూడా.! 

అయితే, ఇక్కడ అంతా గుర్తించాల్సిన విషయం, 'ఉత్తర దక్షిణ బేధాలు ఈనాటివి కాదు' అని. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజననే తీసుకుంటే, అప్పటి మన్మోహన్‌ సర్కార్‌ ఎంత అడ్డగోలుగా ఆ విభజన ప్రక్రియను చేపట్టిందో అందరికీ తెల్సిన విషయమే. ఉత్తరాది అహంకారానికి నిలువెత్తు నిదర్శనం ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని విభజించడం. 'మీకిది, వాళ్ళకి అది..' అని వీలైనంత తక్కువ నష్టంతో ఇరు రాష్ట్రాల్ని విభజించాల్సింది పోయి, ఇరు రాష్ట్రాల మధ్యా 'పంచాయితీ' ఎప్పటికీ కొనసాగేలా, లింకులు పెట్టి విడదీసింది కాంగ్రెష్‌ ప్రభుత్వం. 

ఉత్తరప్రదేశ్‌ విభజనకు సంబంధించి ఎప్పటినుంచో వివాదం నడుస్తోంది. 'మమ్మల్ని విభజించండి మొర్రో..' అంటూ ఆ రాష్ట్ర అసెంబ్లీలోనే తీర్మానాలు జరిగాయి. కానీ, యూపీ విభజనకు కాంగ్రెస్‌ సర్కార్‌ అప్పట్లో ససేమిరా అనేసింది. అంటే, 'విభజన నీతి' ఉత్తరాదికి ఒకలా, దక్షిణాదికి ఇంకోలా అన్నమాట. ఏటా కేంద్రం వెచ్చించే నిధుల్ని పరిగణనలోకి తీసుకుంటే (ఏ పార్టీ అధికారంలో వున్నాసరే..) ఉత్తరాధికి తూకం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకలా.? అని ప్రశ్నించే నాథుడెవ్వరు.? 

అయితే, ఇదంతా రాజకీయ వివక్ష మాత్రమే. ప్రజల మధ్య విభేదాలేమీ లేవు. 'మనమంతా భారతీయులం..' అన్న భావన ప్రజల్లో అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అలాగే వుంటుంది. కానీ, రాజకీయ వివక్ష ఇంకా ఇంకా ఇలాగే కొనసాగుతోంటే, 'నలుపు తెలుపు..' అనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకుంటూ పోతే, భవిష్యత్‌ ఊహించుకోవడానికే కష్టంగా కన్పిస్తుంది. 

అన్నట్టు, ఉత్తరాది - దక్షిణాది వివాదానికి సంబంధించి జరుగుతున్న చర్చల సందర్భంగా తెలంగాణని ఉత్తరాదికి పంపేసి, ఆంధ్రప్రదేశ్‌కి దక్షిణాదికి వదిలేస్తున్నాయి కొన్ని మీడియా సంస్థలు (తెలుగు మీడియా సంస్థలు కూడా). ఇది మరీ చిత్రం. చేతి వేళ్ళన్నీ ఒకే తీరున వుండవు. అలాంటప్పుడు, దేశమంతా ఒకేలా వుండాలంటే ఎలా.? భిన్నత్వం ఎంత వున్నా, అందులో ఏకత్వం కన్పించాలి. అదే 'మేం భారతీయులం' అన్న భావన. దురదృష్టవశాత్తూ భిన్నత్వంలో మళ్ళీ భిన్నత్వం.. మేం ఉత్తరాదివాళ్ళం, మీరు దక్షిణాదివాళ్ళు అని. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల పట్ల చిన్నచూపు కారణంగా అక్కడ అసంతృప్తి సెగ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఈ కొత్త వివాదం, దేశానికి అస్సలేమాత్రం మంచిది కాదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?