Advertisement

Advertisement


Home > Articles - Special Articles

‘బ్లూ’కి తక్కువ.. బూతుకి ఎక్కువ!

‘బ్లూ’కి తక్కువ.. బూతుకి ఎక్కువ!

దశాబ్దాలుగా భారతీయ చిత్ర పరిశ్రమకు ’సమాంతరం’ గా కొనసాగుతున్న వ్యవహరమే ఇది! ’సెమీ పోర్న్ సినిమా’ అంటూ వాటికి గౌరవాన్ని ఇచ్చింది చిత్ర పరిశ్రమ. ఇందులోనూ.. స్టార్లున్నారు, సంచనాలున్నాయి. కాసుల కళకళలున్నాయి.. కలెక్షన్ క్వీన్లున్నారు!  

థియేటర్లు దాటింది.. టీవీలనూ దాటి వచ్చేసింది.. సీడీ ప్లేయర్లకూ, డీవీడీలకూ కాలం చెల్లిపోయేలా చేసి.. వయా ఇంటర్నెట్‌గా యూట్యూబ్‌ను ఊపేస్తోంది ఆ సినిమా. అటు వీక్షకులకు నయనానందకరంగానూ... ఇటు రూపకర్తలకు కాసుపంటగానూ మారి..‘నయా బూతు సినిమా పరిశ్రమ’ గా వర్ధిల్లుతోంది ఈ వ్యవహారం. కమర్షియల్ సినిమా కు సమాంతరంగా ఆది నుంచి కొనసాగుతున్న సెమీ పోర్నోగ్రఫిక్ సినిమా తాజా రూపమిది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ పరిశ్రమలో ఇప్పుడు కొత్త పోకడ సంతరించుకుంది. చూడాలనుకొంటున్న వారికి అత్యంత సమీపంలోకి వచ్చేయడంతో పాటు.. ఈ తరహా సినిమాలు నిర్మించడం కూడా సులభతరం అయిపోయింది. 

యూట్యూబ్ హిట్స్‌తో సూపర్ హిట్ అవుతున్నాయి ఈ సెమీ ఫోర్నోగ్రఫిక్ మూవీస్! యూత్‌కు కనెక్టివిటీ పెరిగిన ఈ బూతు సినిమాలు ఇప్పుడు కొంతమంది పాలిట బంగారు బాతుల్లాగా మారాయి. డబ్బులు సంపాదించుకునే మార్గాలవుతున్నాయి. ప్రత్యేకించి తెలుగులో వీటి పోకడలు తీవ్రమవుతుండడం ఇక్కడ విశేషం. వెనుకటికి యావత్ దేశాన్నే ఊపేసిన మలయాళీ బూతు చిత్ర పరిశ్రమ స్థాయికి నెమ్మనెమ్మదిగా దూసుకెళుతోంది ఈ తెలుగు బూతు సినిమా!

ఇంటర్నెట్ ఆధారంగా అల్లుకుపోతున్నారు..! 

ఎన్నో సెక్సస్ స్టోరీలకు ఊపిరి పోసింది ’ఇంటర్నెట్’. ఇంటర్నెట్ సృష్టించిన కోటీశ్వరులు ఇప్పటికే ప్రపంచానికి ఎంతోమంది పరిచయం అయ్యారు. ఇ టెక్నాలజీలో ఇంత సంపద దాక్కొని ఉందని ఎవరూ ఊహించలేదు. చేవ ఉన్న్ద్దంతా చేదుకోవచ్చు. ఇలా చేదుకోవడంలో ఒక్కోరి శక్తియుక్తులు ఒక్కోరకమైనవి. కేవలం సంపద సృష్టించుకోవడానికే కాదు.. తమ సృజనాత్మకతను చాటుకోవడానికి కూడా ఇంటర్నెట్ అనేక మార్గాలను ఇచ్చింది. అలాంటి మార్గాల్లో ఒకటి ’యూట్యూబ్’. సినీ సృజనాత్మకతపై ఆసక్తి కలిగిన యువతకైతే ఈ వెబ్‌సైట్ ఒక వరప్రదంగా మారింది. అనేక ముంది యువతీయువకులు బుల్లిబుల్లి సినిమాలు తీసేసి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు. ఎవరి అవసరం లేకుండా.. గుర్తింపును తెచ్చుకున్నారు. యూట్యూబ్ ఈ తరహాలో ఉపయోగపడుతుండే సరికి అనేక మంది ఆనందపడ్డారు.

అనేకమంది ఉత్సాహవంతులు ఈ మార్గంతో వచ్చే గుర్తింపుకు ఆశపడి షార్ట్‌ఫిల్మ్‌లు రూపొందించారు. అలాంటి వారిలో కొందరు టాలీవుడ్ లో కూడా దూసుకుపోతున్నారు. వారి కథ వేరే! యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్‌ల మేళా కొనసాగుతుండగానే.. దీన్ని అడ్డం పెట్టుకుని మరో వైపు నుంచి దూసుకొచ్చాయి దిగువస్థాయి సినిమాలు! సూటిగా చెప్పాలంటే బూతు సినిమాలు! ఇప్పుడు వీర విజృంభణగా సాగుతోంది వీటి హవా. వీటిని రూపొందించడం ద్వారా లాభాల రుచి మరిగారు కొంతమంది! ఎవరి అవసరం లేకుండా కేవలం వీక్షకుల సహకారంతో, గూగుల్ నుంచి వచ్చే యాడ్స్‌తో వీళ్లు బయటపడిపోతున్నారు! తాము పెట్టిన పెట్టుబడికి కొన్ని రెట్ల మొత్తాన్ని సంపాదించేస్తున్నారు! ఒక్కసారి యూట్యూబ్‌ను కాసేపు బ్రౌజ్ చేస్తే.. ప్రతి రోజూ లెక్కకు మించి ఇలాంటి సినిమాలు రూపొందుతున్నాయని స్పష్టమవుతుంది. 

స్వల్ప బడ్జెట్ తో తయారు చేస్తారు! 

భారీ సెట్టింగులు అవసరం లేదు.. బెడ్ సెటప్ తప్ప! క్రియేటివిటీకి అయితే కొదవలేదు. కథంటే అది.. అక్రమసంబంధాలు, అనైతిక సంబంధాలతో ముడిపడిన సరంజామానే కాబట్టి.. పుర్రెకోబుద్ధి..! తర్వాతి లెక్కలు బడ్జెట్ విషయంలో. రామ్‌గోపాల్ వర్మ వంటి వాళ్లే సినిమా బడ్జెట్‌ను ’లక్షల’ రూపాయల స్థాయికి తీసుకొచ్చారు. ఇక దాసరి మారుతి వంటి వారు చూపించిన దారి ఎలాగూ ఉండనే ఉంది. అంతకన్నా తక్కువ అంటే.. ఒక ఐఫోన్ ఉంటే చాలు ఐదారు నిమిషాల కాన్సెప్ట్‌తో సినిమాను రూపొందించేయవచ్చని కొంతమంది షార్ట్‌ఫిల్మ్ మేకర్లు నిరూపించారు. ఇలాంటి దారుల్లో నడుస్తూ కేవలం లక్ష రూపాయలు, అంత కన్నా లోపు స్థాయి బడ్జెట్‌తోనే ఈ సినిమాలు రూపొందుతున్నాయి! ఈ తరానికి తగ్గ తెరపైకి వచ్చేస్తున్నాయి బూతు చిత్రాలు. 

పెద్ద పరిశ్రమగానే మారుతోంది..!

80 లలో 90లలో మలయాళ చిత్రపరిశ్రమ బూతు సినిమాలకు అడ్డాగా మారింది. అసలు సినిమాలు మరుగున పడిపోయి.. మలయాళ చిత్ర పరిశ్రమ అంటే అతి బూతు సినిమాలకు కేరాఫ్ అయ్యింది. ముందుగా మలయాళ చిత్రపరిశ్రమలోని ఇతర సోషల్ సినిమాలను తీవ్రస్థాయిలో ప్రభావితం చేసిన ఆ బూతు చిత్రాలు తర్వాత తమిళ, తెలుగు భాష చిత్ర పరిశ్రమను ప్రభావితం చేశాయి. యావత్ దక్షిణ భారత దేశాన్నీ ఒక ఊపు ఊపాయి! ఒక దశలో వ్యవహారం ఎక్కడి వరకూ వెళ్లిందంటే.. తెలుగు, తమిళ భాషల్లోని ప్రముఖ నటీమణులను, నటులను తీసుకెళ్లి ఆ సినిమాల్లో నటింపజేశారు! తెలుగు నాట మహానటీమణులుగా వెలుగొందిన వారిని కూడా మలయాళ చిత్రపరిశ్రమ అక్కడికి తీసుకెళ్లింది. సెమీ పోర్న్ సినిమాల్లో నటింపజేసింది! భారీ భారీ పారితోషకాలు ఇస్తుండే సరికి అనేక మంది తెలుగు నటీనటులు కూడా కేరళకు వెళ్లి అలాంటి సినిమాల్లో నటించి వచ్చారు. 

ఇలాంటి వాళ్లంతా వల్గర్ యాక్షనే చేయనక్కర్లేదు. పోస్టర్ పై వీళ్ల బొమ్మలేసుకుని.. అసలు సినిమా నిండా వేరే సీన్లను చూపించే ప్లాన్‌తో తెలుగు, తమిళ భాషల్లోని అనేక మంది ప్రముఖ నటీనటులను ఇలాంటి సినిమాలకు తీసుకున్నారు. ఇప్పుడు ఈ ఊపోద్ఘాతం ఎందుకంటే... తెలుగులో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ బూతు షార్ట్‌ఫిల్మ్‌లు కూడా పెద్ద పరిశ్రమగానే మారుతోంది. హిందీ లో కూడా ఈ తరహా బూతు సినిమాలు రూపొంది.. ఇంటర్నెట్‌లోకి అప్‌లోడ్ అవుతున్నా.. తెలుగులో ఫిల్మ్‌లు వీక్షకాదరణలో తీసిపోవడం లేదు. 

అప్‌లోడ్ అయిన వెంటనే వేల, లక్షల వ్యూస్! 

లక్షల సంఖ్యలో ఉంటున్నాయి ఇలాంటి సినిమాలకు వ్యూస్. స్టార్‌హీరోల సినిమాల టీజర్లు యూట్యూబ్‌లో సృష్టిస్తున్న సునామీకి తీసిపోవడం లేదు. కనిష్టంగా వేల సంఖ్యతో మొదలుపెడితే గరిష్టంగా కొన్సి సెమీ పోర్న్ షార్ట్‌ఫిల్మ్‌లకు వీక్షకుల సంఖ్య ఇరవై లక్షల వరకూ ఉంటోంది. తెలుగునాట ఇంటర్నెట్ విస్తతంగా  అందుబాటులో ఉండడం.. ఇలాంటి చిత్రాలపై ఆసక్తిని కలిగి ఉన్న నెటిజన్లు ఎక్కువమందే ఉండటం, చూసిన వాళ్లే మళ్లీ మళ్లీ చూసే అవకాశం కూడా ఉండటంతో ఇలాంటి ఫిల్మ్‌లకు వీక్షకుల సంఖ్య ఈ స్థాయికి చేరుతోంది.

వ్యూస్ కొద్దీ కలెక్షన్లు..! 

గూగుల్‌యాడ్‌సెన్స్ అకౌంట్ ఉంటే చాలు.. యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించుకుని ఇలాంటి వ్యూస్‌ను కలెక్షన్లుగా మార్చుకోవచ్చు. యూట్యూబ్‌లో వీడియోలతో పాటు ప్లే అయ్యే యాడ్స్‌తో డబ్బులు వస్తాయి. దీంతో వీక్షకుల సంఖ్య భారీ స్థాయికి చేరిన వీడియోలకు కాసుల పంట పండుతోంది! పెట్టిన పెట్టుబడి అతి తక్కువ రోజుల్లోనే తిరిగి వస్తోంది. సబ్‌స్కైబర్లు ఎక్కువ సంఖ్యలో కలిగిన యూట్యూబ్ చానళ్లలో విడుదల అయ్యే సెమీ పోర్న్ సినిమాలకు అయితే యాడ్స్ ద్వారా డబ్బు చాలా త్వరగా రీఫండ్ అవుతోంది! దీంతో కొంతమంది దీన్ని ఒక వ్యాపార మార్గంగా మార్చుకున్నారు. వారానికి పది రోజులకూ ఒక సినిమాను తీసేయడం దాన్ని నెట్‌పై వదలడమే వీరి పనిగా మారింది. 

మేకింగ్ పెద్ద కష్టమేమీ కాదు! 

ఇలాంటి సినిమా కాన్సెప్టులు ఎలా ఉంటాయో వేరే వివరించనక్కర్లేదు. రెచ్చగొట్టే ఆంటీలు... పక్కింటి ఆంటీలపై మోజు పడే యువకులు.. వాళ్ల మధ్య కమ్యూనికేషన్, అక్రమ సంబంధం ఏర్పడడం.. ఇలాంటి కాన్సెప్టుల చుట్టూనే వీటి కథలు తిరుగుతాయి. అది కూడా ఐదారు నిమిషాల వ్యవదిలోనే కథ క్లైమాక్స్‌కు వచ్చేస్తోంది. దీంతో సృజన చాలా సులభమే! ఇక మేకింగ్ విషయానికి వస్తే.. కాస్త బడ్జెట్ పెట్టగలిగే వారైతే ఊరికి దూరంగా ఉన్న గెస్ట్ హౌస్‌లను అద్దెకు తీసుకుని.. ఇలాంటి మూవీస్ మేకింగ్ అక్కడ పెట్టుకొంటున్నారు. ఇంకొందరు అందుబాటులో ఉండే ఫ్లాట్స్‌ను అడ్డాలుగా  మార్చుకున్నారు. ఏ కథ అయినా అంతిమంగా బెడ్ మీదకో,  సోఫా మీదకో చేరి ముగుస్తుంది కదా! ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవడానికి తక్కువ ఖర్చే అవుతుంది కానీ.. ఇందులో నటించే నటీమణుల కోసమే కొంచెం ఎక్కువగా వెచ్చించాల్సి వస్తుందని ఈ ఇలాంటి మూవీ మేకర్లు చెబుతున్నారు. 

సెలబ్రీటీలు తయారయ్యారు! 

వెనుకటికి మలయాళ చిత్రపరిశ్రమలో తన హవా కొనసాగుతున్న రోజుల్లో రోజుకు నాలుగైదు సినిమాల్లో నటించేందట షకీల. ఒక్కో సినిమా షూటింగ్‌కు ఆమె కేటాయించే సమయం రెండు మూడు గంటల సేపు అంతే! ఆ వ్యవధిలో డైరెక్టర్లు తనపై తీసుకోవాల్సిన సీన్లను పూర్తి చేసేస్తారు. ఆ తర్వాత మరో సినిమా సెట్టింగ్స్ మీదకు వెళ్లడం.. అక్కడ పని పూర్తి చేసుకోవడం! ఈ షార్ట్‌ఫిల్మ్స్‌లో నటిస్తున్న నటీమణుల పని కూడా అచ్చం ఇలాగే ఉంది. ఒక రోజులో కొన్ని గంటలు కేటాయిస్తే చాలు వాళ్లపై తీసుకోవాల్సిన సీన్లను పూర్తి చేస్తారు. ఆ సీన్లు ఎలా ఉంటాయో కూడా వర్ణించనక్కర్లేదు. అలాంటి సీన్లలో నటిస్తూ వీడియోలకు ఎక్కాల్సి ఉంటుంది కాబట్టి.. వీళ్లు ఎక్కువ పారితోషకాన్నే డిమాండ్ చేస్తారని మేకర్‌లు వివరిస్తారు. ప్రస్తుతం గరిష్టంగా ఇలాంటి సినిమాల్లో నటిస్తున్న యువతులకు, ఆంటీలకు 50 వేల రూపాయల వరకూ చెల్లించుకొంటున్నామని ఈ సెమీ పోర్న్ మూవీ మేకర్లు వివరిస్తున్నారు. 

ఇక మేల్ ఆర్టిస్టులకు పెద్దగా ఇచ్చేదేమీ ఉండదని.. అబ్బాయిలకు పెద్దగా సిగ్గెగ్గులు ఏమీ ఉండవు కాబట్టి.. తక్కువ డబ్బు తీసుకుని ఈ మూవీస్‌లో నటించడానికి వారు ముందుకొస్తారని వారు చెబుతారు. ఓవరాల్ గెస్ట్‌హౌస్ లేదా ఫ్లాట్ రెంట్, లేడీ ఆర్టిస్ట్ రెమ్యూనరేషన్, కెమెరా, ఎడిటింగ్, ఇతర టెక్నికల్ సపోర్ట్... ఇలాంటి వాటన్నింటి కలుపుకొంటే.. లక్ష రూపాయల నుంచి లక్ష ఇరవై వేల రూపాయల లోపు బడ్జెట్‌తో సినిమాను పూర్తి చేయవచ్చునని.. ఆపై అదనపు ఆకర్షణలకు ఖర్చు చేయాలను కొంటే చేయవచ్చు అని వివరిస్తారు. 

ఇలాంటి సినిమాల్లో నటించే నటీమణుల్లో కొంతమంది తమ పాలిట సెలబ్రిటీలుగా తయారయ్యారని.. వారు నటించిన సెమీ పోర్న్ సినిమాలకు ఎక్కువ క్రేజ్ ఉంటోందని.. నెటిజన్లు వారి పేరుతో సెర్చ్ చేసుకుని సినిమాలు చూసే వారు ఉండటంతో.. అలాంటి వారికి డిమాండ్ పెరుగుతోందని.. దీంతో వారి చేత నటింపజేయడానికి కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుందని.. మూమీ మేకర్లు తమ అనుభవాలను వివరించారు. అలాంటి వారిని నటింపజేయడం వల్ల యూట్యూబ్‌లో వ్యూస్ కూడా అందుకు తగ్గట్టైన స్థాయిలో వస్తాయని.. దీంతో యాడ్‌రెవెన్యూ పెరిగే అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు. 

సెన్సార్ లేదు.. నైతికత మాటేంటి?!

ద్వంద్వార్థ సంభాషణలు, అనైతిక సంబంధాలు.. వావీ వరసలు మరిచిన శృంగారం.. ఇవే ఈ సినిమాల్లో చూపించేవి.. ఎంత నైతికత తప్పితే ఫిల్మ్ అంతగా వీక్షకులను ఆకట్టుకొంటోంది..ఇలాంటి సినిమాలు తీయడానికి సిగ్గనిపించదా, అంటే చూసే వాళ్లకు లేని సిగ్గు మాకెందుకన్నట్టుగా మాట్లాడతారు మేకర్లు. హాట్ షార్ట్‌ఫిల్మ్ చూడటానికి తపించిపోతూ సెర్చ్ చేసుకుని వాటిని చూసే వాళ్లు ఉన్నప్పుడు.. తీయడానికి ఎందుకు సిగ్గుపడాలి, చేస్తున్నది నటన.. కాబట్టి మా తప్పేం లేదు అంటూ వీటిని రూపొందిస్తున్న యువకులు చెబుతున్నారు. తాము నెలకు నాలుగు సినిమాలు తీస్తామని.. ఒక్కో సినిమాకు లక్ష నుంచి లక్షన్నర బడ్జెట్ అవుతుందని.. వారం గడిచే సరికి యాడ్‌సెన్స్ అకౌంట్ ద్వారా తమ పెట్టుబడి వచ్చేస్తుంది.. ఆ తర్వాత వచ్చేదంతా లాభమే! 

ఈ రకంగా నెలకు తమ టీమ్ నాలుగైదు లక్షల రూపాయలు సంపాదిస్తుంది.. దాన్నే పంచుకొంటాం. ఇది మాకు ఒక మంచి ఉపాధి మార్గం అవుతోంది. శృంగారంతో ముడిపడిన సృజనను పెట్టుబడిగా చేసుకుని మేము డబ్బు సంపాదిస్తున్నాం అని ఇలాంటి మూవీ మేకింగ్‌లో పండిపోయిన యువకుల బృందం ఒకటి చెబుతోంది. సంభాషణల్లో కూడా తాము మరీ అంత దిగజారం అని.. సెల్ఫ్ సెన్సార్ ఉంటుందని, హద్దులు దాటితే యూట్యూబ్ నుంచి తమ అకౌంట్, తమ షార్ట్‌ఫిల్మ్ సస్పెండ్ అవుతుంది.. అలా మొదటికే మోసం వచ్చే పని తాము చేయమని... వారు చెప్పారు.  

టీవీల వాళ్లూ తీశారు కదా...! 

ఈ మూవీ మేకర్ల నుంచినే మరో వాదన కూడా వినిపిస్తోంది. ఇలాంటి పోకడ ఏమీ కొత్త కాదు అని.. వెనుకటికి తెలుగులో పేరెన్నిక కలిగిన కొన్ని చానళ్లు కూడా అరగంట, గంట నిడివితో కూడిన బూతు సినిమాలు తీసిన విషయాన్ని వీరు గుర్తు చేస్తారు. దాదాపు పదేళ్ల కిందట తెలుగులో కొన్ని ప్రముఖ చానళ్లు ఇలాంటి సినిమాలను రూపొందించాయి. తమ రేటింగులను పెంచుకోవడం కోసం వారాంతాల్లో పది, పదకొండు తర్వాత అలాంటి మూవీలను ప్రదర్శించి వేడెక్కించాయి. దీనిపై అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో వెనక్కు తగ్గారు. అలాంటి షార్ట్‌ఫిల్మ్‌లు యూట్యూబ్‌కు అప్‌లోడ్ అయ్యాయి. అలాంటి వాటికి ఉన్న డిమాండ్‌ను గుర్తించే ఈ తరహా షార్ట్‌ఫిల్మ్ మేకింగ్ మొదలైంది. యాడ్‌సెన్స్ ద్వారా అది కమర్షియల్ గా కూడా సెక్సస్ కావడంతో ఉత్సాహవంతులు దూసుకుపోతున్నారు.

నెటిజన్లే మహరాజా పోషకులు!

నెటిజన్లకు సైకో ప్లజర్‌ను కలిగిస్తున్నాయి.... ఇంకా విశ్లేషిస్తే.. సెక్సువల్ ఫాంటసీలను వీడియోల రూపంలో ఆవిష్కరిస్తున్నాయి. దీంతో నెటిజన్లు వీటిని సెర్చ్ చేసుకుని మరీ చూస్తున్నారు. అనైతిక సంబంధాల కాన్సెప్టులేక ఇక్కడ ఆదరణ ఎక్కువ ఉందంటే.. ఈ విషయంలో కేవలం తీసే వారిని మాత్రమే తప్పుపట్టాల్సిన అవసరం లేదు. చూసే వారి తీరు, సంఖ్య అదే స్థాయిలో ఉంది కాబట్టి అలాంటి మూవీస్ వస్తున్నాయి. 

చట్టపరమైన ఇబ్బందుల్లేవా? 

ప్రస్తుతానికి లేనట్లే! ఎందుకంటే.. ఇప్పటి వరకూ సిసలైన బ్లూఫిల్మ్‌ల విషయంలోనే ఈ దేశం ఏమీ తేల్చుకోలేకపోతోంది. వాటిని నిషేధించాలా? వద్దా.. అనే విషయం గురించి సుప్రీం కోర్టే ఏమీ తేల్చలేకపోయింది. ఇక నెటిజనుల నుంచి తలా ఒక అభిప్రాయం వినిపించింది. నీలి చిత్రాలను పూర్తిగా నిషేధించాలని కొంతమంది.. ఆ అవసరం లేదని మరికొంతమంది వాదించారు. నీలి చిత్రాల వల్లనే అత్యాచారాలు జరుగుతున్నాయని కొంతమంది, కాదు.. అలాంటివి చూడటానికి అందుబాటులో ఉండటం వల్లనే అత్యాచారాలు కంట్రోల్ అవుతున్నాయని మరికొందరు వాదించారు. 

చివరకు ఈ విషయంలో ఒక నిర్ణయానికి రాలేక కేంద్ర ప్రభుత్వం కూడా ఆ వ్యవహారాన్ని పూర్తిగా పక్కనపెట్టేసింది. దీంతో బ్లూ ఫిల్మ్ వెబ్‌సైట్లు కూడా యధేచ్చగా కొనసాగుతున్నాయి. విషాదకరమైన అంశం ఏమిటంటే.. ఇంటర్నెట్ అంటే అది నీలి చిత్రాలు చూడటానికి  ఒక సులభకరమైన మార్గంగానే చూస్తోంది చిన్నపట్టణాల్లోని యువత. క్షేత్రస్థాయిలోకి వెళ్లి చూస్తే ఈ వాస్తవం అర్థం అవుతోంది. మరి ముందుగా విదేశీ మర్కెట్ నుంచి విరుచుకుపడుతున్న బూతు కంటెంట్ కు చెక్ చెప్పాల్సి ఉంది. ఒకవేళ దాన్నే ఎవరూ అడ్డుకోలేకపోతే.. ఈ యూట్యూబ్ మూవీస్‌కు తిరుగుండకపోవచ్చు! ఈ సెమీ పోర్న్ సినిమాలకు యూట్యూబే కొంత వరకూ అడ్డుకట్ట వేస్తోంది. చూపించాల్సిన సీన్లకు కొన్ని పరిమితులు పెట్టింది. 

కాబట్టి.. ఇవి శ్రుతి మించి రాగాన పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి! జనాల నైతిక విలువల సంగతెలా ఉన్నా.. దేశీయంగా యూట్యూబ్‌కు ఉన్న నియమనిబంధనలు అంతో ఇంతో మంచిని చేస్తున్నాయి! కాబట్టి పరిస్థితి కొంత నియంత్రణలో ఉన్నట్టే. కానీ ఇలాంటివి ఇంటర్నెట్ ద్వారా ప్రతి ఇంటిలోకి దూసుకొస్తూ.. టీనేజర్లను పలకరించడం వల్ల.. అదంతా సమాజంపైనే చెడు ప్రభావంగా మారితే మాత్రం అది ప్రారబ్దం అనుకుని బాధపడాల్సిన స్థితిలో ఉన్నాం మనం! అంతకు మించి ఏం చేయలేం మరి!  

వెంకట్ ఆరికట్ల

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?