Advertisement

Advertisement


Home > Articles - Special Articles

చట్టం, న్యాయం ఓడి.. గెలిచింది రాజకీయం.!

చట్టం, న్యాయం ఓడి.. గెలిచింది రాజకీయం.!

పద్ధెనిమిదేళ్ళ నాటి కేసు.. అనేక మలుపులు తిరిగి, చివరకు ‘ముఖ్యమంత్రి’ని జైలుకు పంపింది. ఐదేళ్ళ జైలు శిక్ష, వంద కోట్ల జరీమానా.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు ఇది. తమిళనాడు వ్యాప్తంగా విధ్వంసాలకు తెరలేపిన శిక్ష ఇది. ‘అమ్మ’ను జైలుకు పంపిస్తారా? అంటూ అభిమానులు ఆవేశంతో ఊగిపోయారు. తమిళనాడు అంతటా ఎటు చూసినా విధ్వంసాలే. ‘పురచ్ఛతలైవి’, ‘అమ్మ’.. ఏ పేరుతో అభిమానులు పిలుచుకున్నాసరే.. ఆమె అసలు పేరు జయలలిత. ఎఐఎడిఎంకె అధినేత్రి జయలలిత అంటే రాజకీయ ప్రత్యర్థులకీ హడల్. ఈసారి న్యాయం, చట్టం కూడా హడలిపోయాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే, కేసు విచారణపై రాజకీయ ప్రభావం పడకుండా వుండేందుకు తమిళనాడు నుంచి కర్నాటకకు మార్చి, కర్నాటకలో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసి, విచారణ చేయిస్తే, ఆ న్యాయస్థానం ఆమెకు నాలుగేళ్ళ జైలుశిక్ష, వంద కోట్ల జరీమానా విధిస్తే, అదే కర్నాటకలోని హైకోర్టు.. ఆమెను నిర్దోషిగా తేల్చింది. జైలుకు వెళ్ళినట్టే వెళ్ళి, జయలలిత బెయిల్‌పై బయటకు వచ్చి, ఆ తర్వాత క్లీన్ చిట్‌తో తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.

లోపం ఎక్కడ వుంది.? చట్టంలోనా? న్యాయంలోనా? చట్టమూ న్యాయమూ ఒకటేనా? ఒకేలా పనిచేస్తున్నాయా? వీటిని రాజకీయం కంట్రోల్ చేయడంలేదు కదా.? ఇలా సవాలక్ష ప్రశ్నలు సామాన్యుడి మదిని తొలిచేస్తున్నాయి. అందరికీ ఒకటే డౌట్. శిక్ష ఎక్కువ, శిక్ష కాస్త తక్కువ వుండొచ్చుగానీ, ఓ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని ఇంకో న్యాయస్థానం ఎలా కొట్టేస్తుంది.? అని. ‘టెక్నికల్ పాయింట్స్’లోకి వెళితే సామాన్యుడి బుర్ర బద్దలైపోతుంది. ఎందుకంటే, చట్టం న్యాయం ఒకేలా వున్నా, విచారణలో వ్యవహారాన్ని అటు తిప్పి, ఇటు తిప్పి, తిమ్మిని బమ్మిని చేసేస్తుంటారు లాయర్లు.. ఈ క్రమంలో తీర్పుపై లాయర్ల వాదనలు తీవ్ర ప్రభావమే చూపుతుంటాయి. సినిమాల్లో చూస్తుంటాం కదా.. అలానే. ఇక్కడ కూడా అదే జరిగినట్టుంది.

ఈ ఎపిసోడ్‌లో జయలలిత కోల్పోయింది కొన్ని నెలల రాజకీయ జీవితం మాత్రమే. రాజకీయ నాయకురాలిగా జయలలితకు అది చాలా నష్టమే మిగిల్చిందని చెప్పొచ్చు. అయితేనేం జైల్లోంచే తాను అనుకున్నట్టే పరిపాలన చేయించగలిగారామె. తనకు నమ్మిన బంటు అయిన పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టిన జయలలిత, తాను జైల్లోంచి రాగానే ఆయనతో రాజీనామా చేయించి, మళ్ళీ తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్లాట్‌ఫామ్ సిద్ధం చేసుకున్నారు.. అదీ అతి తక్కువ కాలంలో. ఎఐఎడిఎంకే పార్టీలో జయలలితకు ఎదురు లేదు. ఆమె ఏం చెయ్యాలనుకున్నా, దానికి ప్రతి ఒక్కరూ ‘జీ హుజూర్’ అనాల్సిందే. జైలుకు వెళ్ళింది ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో. కాబట్టి, జనం ముందుకెళ్ళి తన నిజాయితీని నిరూపించుకుంటే అది ఎంతో కొంత ఆమెకు భవిష్యత్‌లో తన వాదనను సమర్థంగా విన్పించేందుకు వీలవుతుంది. కానీ, అలా ఆలోచిస్తే ఆమె జయలలిత ఎందుకు అవుతుంది? తానో మోనార్క్, తానో డిక్టేటర్.. అన్నట్లుగా ఎపడూ తన గురించి తాను భావించే జయలలిత, పార్టీ నేతలకు హుకూం జారీ చేశారు.. పార్టీ నేతలు దాన్ని శిరసావహించారు. ఫలితం, మళ్లీ ముఖ్యమంత్రి పీఠమెక్కిన జయలలిత.

అంతా బాగానే వుంది. జయలలిత గెలిచారు. మరి ఓడిందెవరు? ఇంకెవరు.. సామాన్యులు.. సామాన్యులకు తోడు చట్టం, న్యాయం ఓడిపోయాయిక్కడ. ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని కొట్టేయడమంటే ఆ న్యాయస్థానానికి విలువ లేనట్టే కదా. విలువ లేనపడు ప్రత్యేక న్యాయస్థానాన్ని ఎందుకు ఏర్పాటు చేసినట్టు? దాని కోసం అనవసరపు ఖర్చు ఎందుకు పెట్టాల్సి వచ్చినట్టు. న్యాయమూర్తులు, అడ్వేకట్లు, విచారణ.. ఇంత తతంగం అవసరమా! అని సామాన్యుడికి డౌట్ రావొచ్చుగాక. అది వారి తప కానే కాదు. కానీ, మన గొప్ప ప్రజాస్వామ్యంలో, మన గొప్ప న్యాయ వ్యవస్థలో ఇవన్నీ కామన్. ఓ కేసు ఏడాది పైన, పదేళ్ళ పైన నడవడం ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది. విచిత్రంగా రాజకీయ పలుకుబడి వున్న కేసుల్లోనే జరుగుతుందిది. అదే సామాన్యుడి విషయంలో మాత్రం, కేసుల విచారణ త్వరితగతిన పూర్తయిపోయి, శిక్షలు పడిపోతుంటాయి. ‘నేను తప చెయ్యలేదు మొర్రో..’ అని నెత్తీ నోరూ బాదుకున్నా, సామాన్యుడి ఘోష ఏ న్యాయస్థానానికీ పట్టదేమో అని కొన్ని కేసులు నిరూపిస్తుంటాయి. విచిత్రంగా, పొలిటికల్ ప్రెజర్ వున్న కేసులు నత్త నడకన ఏళ్ళ తరబడి సాగుతూనే వుంటాయి.

ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ కేసునే తీసుకుంటే తప్పతాగి కారు నడిపి ఓ వ్యక్తి మృతికి కారణమైన ఈయనగారికి సెషన్స్ కోర్ట్ ఐదేళ్ళ జైలు శిక్ష విధిస్తే, సింపుల్‌గా హైకోర్టు ఆ శిక్షను రద్దు చేయడమే కాకుండా, కింది కోర్టు తీర్పుని సస్పెండ్ చేసింది. ఇప్పటికే పదమూడేళ్ళకు పైన నడిచింది ఆ కేసు విచారణ. ఇన్నేళ్ళ విచారణ, తదనంతరం వచ్చిన తీర్పుని సింపుల్‌గా రెండ్రోజుల్లో హైకోర్టు కొట్టి పారేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?

జయలలిత కేసు అయినా, సల్మాన్‌ఖాన్ కేసు అయినా.. దేశంలో చాలామంది అయోమయాన్నే మిగిల్చాయి. పలుకుబడి వున్నవారు తాము కోరుకున్నట్టు న్యాయస్థానాల నుంచి తీర్పుల్ని రాబట్టుకుంటారేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయంటే, జరుగుతున్న ‘తతంగం’ అలా వుంది మరి.! చట్టం, న్యాయం ఓడిపోయి.. రాజకీయం, పలుకుబడి గెలుస్తాయనడానికి జయలలిత, సల్మాన్‌ఖాన్ ఎపిసోడ్స్ పెర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్స్.

వెంకట్ ఆరికట్ల 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?