Advertisement

Advertisement


Home > Articles - Special Articles

చెంపదెబ్బ తిన్నాక ఎక్స్‌ప్రెషన్‌ మారింది

చెంపదెబ్బ తిన్నాక ఎక్స్‌ప్రెషన్‌ మారింది

'రియో ఒలింపిక్స్‌ భారత్‌ నుంచి ఆటగాళ్ళను పంపించడం దండగ. ఆట మీద వారికి ఏమాత్రం దృష్టి లేదు. సెల్ఫీలు తీసుకోడానికీ, ఎంజాయ్‌ చేయడానికి మాత్రమే ఆటగాళ్ళు భారత్‌ నుంచి వెళుతున్నారు..' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ రచయిత శోభా డే తప్పు తెలుసుకుంది. ఒలింపిక్స్‌లో పతకాల్ని గెలుచుకున్న భారత క్రీడాకారులకు ఆమె శుభాకాంక్షలు తెలిపింది. 

తప్పదు మరి, చెంప దెబ్బ తిన్నాక.. ఒకదాన్ని మించి ఇంకోటి గట్టిగా తగిలాక, ఎక్స్‌ప్రెషన్‌ మార్చకపోతే ఎలా.? ముందేమో, మహిళా రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ కాంస్య పతకంతో శోభా డే చెంప ఛెళ్ళుమనిపించింది. ఆ వెంటనే మహిళా షట్లర్‌, మన తెలుగు తేజం పివి సింధు, రజత పతకంతో గూబ గుయ్యిమనిపించింది. రెండు దెబ్బల తర్వాత ఎలాగైతేనేం శోభా డేలో చాలా మార్పు వచ్చింది. ఇప్పటికీ మారకపోతే, క్రీడాభిమానులు ఊరుకోరు కదా.! 

ప్రముఖ రచయిత అయితే మాత్రం పైత్యం చూపిస్తే ఇలానే వుంటుంది మరి. మహిళా రచయితకి మహిళా క్రీడామణులే తాము సాధించిన విజయాలతో చెంపదెబ్బలు కొట్టడం గమనార్హమిక్కడ. 'సింధూ నువ్వు బంగారం..' అంటూ మారిన మనిషి శోభా డే సోషల్‌ మీడియాలో తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఆనందమా.? చెంపదెబ్బలు తగిలాక, వచ్చిన తెలివితోనా.? ఏదైతేనేం, శోభా డే మనసు మార్చుకుంది. ఇంకెప్పుడూ ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా వుంటుందా.! ఏమో మరి, ఆమెకే తెలియాలి. 

ఏదిఏమైనా, ప్రముఖ రచయిత్రిగా దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న శోభా డే ఇలా తన స్థాయిని దిగజార్చేసుకోవడం అత్యంత దురదృష్టకరం. 

కొసమెరుపు: పివి సింధు విజయగాధల్ని సినిమాగా తెరకెక్కించాలనీ, అందులో దీపికా పడుకొనే లీడ్‌ రోల్‌ చేయాలనీ శోభా డే ఆకాంక్షించారు. అలాగే టైటిల్‌ సాధించిన సింధు, సాక్షి మాలిక్‌తోపాటు, పతకం తీసుకురాకపోయినా ఒలింపిక్స్‌లో సత్తా చాటిన దీపా కర్మాకర్‌ విజయగాధని కూడా ఆమె సోషల్‌ మీడియాలో ప్రస్తావించారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?