Advertisement

Advertisement


Home > Articles - Special Articles

చిన్న 'సైనికచర్య' - ముష్టియుద్ధం

చిన్న 'సైనికచర్య' - ముష్టియుద్ధం

చైనా తెగ ఆరాటపడ్తోంది. భారత్‌పై దండెత్తాలని ఉవ్విళ్ళూరుతోంది. చైనాతో పోల్చితే, భారత్‌ చిన్న దేశమే. ఆయుధ సంపత్తి పరంగా చూసినా, సైనిక పాఠవంతో పోల్చినా చైనాతో భారత్‌ సరితూగలేదు. అణ్వస్త్రాలు కావొచ్చు, యుద్ధ విమానాలు, జలాంతర్గాములు కావొచ్చు.. ఇంకేదన్నా కావొచ్చు.. భారత్‌ ఎందులోనూ, చైనాకంటే 'ముందు వరుసలో' లేదన్నది నిర్వివాదాంశం. కానీ, భారత్‌ని చైనా తక్కువ అంచనా వేస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. 

'గిల్లికజ్జాలు' తరహాలో, చైనా ఈ మధ్య పదే పదే భారత్‌పై 'కవ్వింపు చర్యలకు' పాల్పడుతోంది. డోక్లామ్‌ దగ్గర మొదలైన ఈ వివాదం, చైనా - భారత్‌ సరిహద్దు కలిగి వున్న చాలా ప్రాంతాలకు పాకింది. అయితే, ఇంతవరకు ఇరు దేశాల మధ్య ఇటీవలి కాలంలో ఒక్క 'తూటా' కూడా పేలిన దాఖలాలు లేకపోవడం ఆశ్చర్యకరం. పాకిస్తాన్‌తో అలా కాదు.. నిత్యం ఇరు దేశాల మధ్యా కాల్పుల మోత మోగుతూనే వుంది. పైగా, పాక్‌ ప్రేరేపిత తీవ్రవాదం సరిహద్దుల్లో నిత్యం మారణహోమాన్ని సృష్టిస్తూనే వుంది. 

నిజానికి పాకిస్తాన్‌ అంతలా తెగించడానికి, దాని వెనకాల అండగా వున్న చైనానే కారణం. ఇప్పటిదాకా తెరవెనకాల వున్న చైనా, ఇప్పుడు బహిరంగంగా భారత్‌తో యుద్ధానికి తలపడేందుకు సిద్ధమవుతోంది. 'చిన్నపాటి సైనిక చర్యకు సమాయత్తం' అంటూ చైనా, సంకేతాలు పంపుతున్న వేళ, భారత్‌ ఏమాత్రం ఉలిక్కిపడటంలేదు. ఎందుకంటే, యుద్ధం వస్తే ఏమవుతుందో భారత్‌కీ తెలుసు, చైనాకీ తెలుసు. 

తూటా పేలడమంటూ జరిగితే, ఆ తర్వాత అది చిన్న యుద్ధం అనడానికి వీల్లేని పరిస్థితులు దాపురించేస్తాయి. ఉత్తర కొరియా, అమెరికాని కవ్విస్తోందంతే. అమెరికా - రష్యా మధ్య 'మాటల యుద్ధమే' జరుగుతుంటుంది. ఎందుకు.? యుద్ధ పర్యవసానాలు అందరికీ తెలుసు గనుక. ప్రపంచంలో నిత్యం ఏం జరుగుతుందో చైనా తెలుసుకోకుండా వుంటుందా.? యుద్ధం వస్తే ఏం జరుగుతుందో చైనాకి తెలియదని ఎలా అనుకోగలం.? 

మహా అయితే సరిహద్దుల్లో 'డోక్లామ్‌' తరహాలోనే యుష్టియుద్ధాలకు తెగబడటం, సైనిక బలగాల్ని ఇంకాస్త ఎక్కువగా మోహరించడం, ఆయుధ సంపత్తిని ప్రదర్శించడం.. ఇంతకు మించి చైనా ఇంకేమీ చేయలేదన్నది నిర్వివాదాంశం. వివిధ రంగాల్లో భారత్‌ సాధిస్తున్న ప్రగతి చైనాకి కన్నుకుట్టేలా చేస్తోంది. అదే అసలు సమస్య. భారతదేశంలో అస్థిరత సృష్టించాలన్న ఆలోచన తప్ప, భారత్‌తో యుద్ధం చేసేంత 'సరదా' అయితే చైనాకి లేదు. యుద్ధం వస్తే భారత్‌ నష్టపోవడం ఖాయం. అంతకన్నా ఎక్కవగానే ఛైనా కూడా నష్టపోవడం ఖాయం. ఇది నిష్టురసత్యం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?