Advertisement

Advertisement


Home > Articles - Special Articles

సినిమా సూపిత్త మావా

సినిమా సూపిత్త మావా

పావలా కో సినిమా..పది రూపాయిలకో సినిమా

'వురేయ్..నా గళ్ల షర్టందుకో...అర్జెంటుగా కేశినేనికి హైదరాబాద్ టికెట్ వుందేమో చూడు...' అన్నాడు గోపాలం.

'అదేంట్రోయ్...అంతర్జంటు..ఇంటర్వూ ఏదన్నా వచ్చిందా ఏంటి' అడిగాడు..అప్పోజీ.

అప్పోజీ..గోపాలం..గోపారం ఇద్దరూ సినిమాపీడియాలాంటోళ్లు..అలా అని వాళ్ల బుర్ర నిండా సినిమా సంగతులు పేరుకుపోయి వున్నాయంటే అపార్థం అవుతుంది..వాళ్లకు అక్కర్లేని సినిమా సంగతులు లేవు..పోస్టరుకు అంటించిన మైదా ఏ కొట్లో కొనుంటారన్న దగ్గర నుంచి నిర్మాత ఎవరిదగ్గర ఏ వడ్డీకి ఏ మాత్రం అప్పు తెచ్చాడన్న వైనం వరకు అన్నీ వారికి కావాల్సినవే. అలా అని మళ్లీ అన్నీ కచ్చితమైన నిజాలనుకుంటే తప్పులో కాలేసినట్లే. 

ఇంతకీ ఇప్పుడు సదరు గోపాలానికి అర్జెంటుగా హైదరాబాద్ ఎందుకు బయల్దేరాల్సి వచ్చిందీ...అన్నది అప్పోజీ అనుమానం.

'పేపరు చూడలేదా..యూట్యూబ్ చూడలేదా..మరదే..ఇంటికి ఇంటర్నెట్ వుండగానే సరిపోదు..కాస్త యూ ట్యూబ్ చూస్తుండాలి' అన్నాడు గోపాలం

'సర్లే ఆ మధ్య..నువు తీసిన 'చీకట్లో నల్లపిల్లి' లాంగ్ ఫిల్మ్ యూ ట్యూబ్ లోకి అప్ లోడ్ చేసినప్పటి నుంచీ, దానికి వస్తున్న కామెంట్లు చూడలేక..చదవడానికి భయమేసి, నెట్ ఓపెన్ చేయడమే మానేసాను'

'చాల్లే..జెలసీరా..నేను తీసిన సినిమా సూపరైతే..ఎక్కడ టాలీవుడ్ కు వచ్చేస్తానో..అని అలా కామెంట్లు పెట్టి నోక్కేస్తున్నారు..ఇంతకీ విషయం ఏమిటంటే..ఆర్జీవీ విడియో పాఠం పెట్టాడు చూసావా..'

'చూడలేదు..విన్నాను..ఇందాక మన రూమ్ ఎదురుగా కిళ్లీకొట్టు కిరణ్ గాడు..అంటుంటే..అదేదో స్కీమంట కదా..పైసల్లేకుండా సినిమా చేయచ్చుట కదా..వాడు ట్రయ్ చేస్తానంటున్నాడు'

'మరందుకే..కాంపిటీషన్ పెరిగిపోక ముందే నేను హైదరాబాద్ వెళ్లాలనేది..ఇప్పుడు ముందు తిన్నగా హైదరాబాద్ ఎల్లిపోయి..ఎవరో ఒక హీరోని పట్టుకోవాలి..సినిమా తీస్తానండీ..తీసాక..లాభం వస్తే పైసలు ఇస్తా అని చెప్పాలి..హీరోనే కాదు..డైరక్టరు..ఫుటోగ్రపరు..ఎడిటరు..అందర్నీ పట్టుకోవాలి...మూజిక్కు అక్కరలేదులే..నెట్ లోంచి కోట్టేయచ్చట..ఆర్జీవీ చెప్పాడు..అన్నట్లు..అదేదో కెమేరా అంటే పాతికవేలుంటదంట..దాన్ని మాత్రం కొనాల్రోయ్..'

'ముందు టిక్కెట్ కొనడానికి పైసలున్నాయా..కేశినేని బస్సు కంపెనీకి కూడా వాటా ఇస్తానంటావా? ఇంతకీ నీ సినిమాకు లొకేషన్లు'

'మన కథ ఎలాగూ..గడ్డివాము..మర్రి చెట్టు తొర్ర, కొండవార రాతి బండ పక్కన జరుగుతుంది కదా...పెద్దగా ఖర్చేమీ వుండదు..కాస్త తుడిచి శుభ్రం చేయడానికి చీపుర్లు రెండు కొనాల్రొయ్'

'మరి ఈరోయిన్రా?'

'దానికీ చిట్కా వుందిరోయ్..మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాలు చూడాలి..వాటిల్లో హీరోయిన్ పక్కన దూరంగా నిలబడి వుండారు అమ్మాయిలు కొందరు. వాళ్లలో నదురుగా కనిపించిన అమ్మాయిని ఎంచేసుకోవడమే' 

'మరి హీరో ఊ అనాలి కదా?'

'వురే ఎంతమంది లేరు..ఖాళీగా..మనకు కావాలని కాదు, కానీ,,ఈ మధ్య వచ్చిన సవాలక్ష చిన్న సినిమాల్లో కనీసం పాతిక ముఫై మంది హీరోలున్నారు..ఒక్క సినిమాతో పక్కకెళ్లిపోయినోళ్లు..వాళ్లను పట్టుకోవడమే'

'అంతా బాగానేవుంది. కెమేరా నువ్వు కొంటావు..ఆల్లందరినీ పట్టుకోస్తావు..సినిమా తీసేస్తావు..కానీ ఎక్కడాడిస్తావ్ రా?'

'అదేటలాగంటావు..ఇస్తే ధియేటర్ లో వేయరంటావా?'

'ఆ వేసేత్తారు..రమ్మని..పైసలు కట్టకుండా ట్రయిల్ పార్టీ కూడా వేయరు..అంతెందుకు..కొంగమార్కు..లుంగీలు..డ్రాయిర్లు స్లయిడ్ వేయాలన్నా ముందుగా పైసలు కట్టాలి తెలుసా'

'మరి ఈ ముక్క ఆర్జీవీ చెప్పలేదేంటీ?'

'పిచ్చోడా..ఆయనేటి చెప్పాడు..మీ అందరూ కలిసి..కావాలంటే సినిమాలు తీసుకోవచ్చు..అన్నాడు..అంతే కానీ తన మాట విని నవదీప్ వచ్చినట్లు మీ కోసం వస్తాడని చెప్పాడా? మీ సొమ్ములు మీవే కానీ ఎవడూ పెడతాడని చెప్పలేదు..ఆయనకంటే రామ సత్యనారాయణ కోటి రూపాయిలకు పైగా బ్యాంకులో వేసాడు..ఇప్పుడు నువ్వే పట్టుకెళ్లి వెయ్యాల'

'వేస్తే వేసాడు..డబ్బులు వచ్చాయి కదా..'

'అదెవరికి తెలుసు..మొదటేమో 84 లక్షలు వచ్చాయన్నారు..ఇంకా వస్తాయని చూస్తున్నామన్నారు..శాటిలైట్ ఇంకా వుండనే వుందన్నారు..మరి ఇయన్నీ రావాలి..అందులోంచి రామసత్యనారాయణ డబ్బులు తీసేయాలి..అప్పుడు అసలు లెక్క..ఎవరికి ఎంత ఇచ్చినట్లు? వేలల్లోనా..వందల్లోనా...మరోనెల తరువాత లెక్కలు చెప్పమను సూద్దారి...అది సర్లేకానీ ..ఆ ఊసు మనకెందుకు కానీ..అసలు సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, చాంబర్ లాంటి వ్యవహారాలున్నాయి..వాటి మెంబర్ షిప్ లు వున్నాయి. అసోసియేట్ మెంబర్ షిప్ కావాలన్నా యాభై వేలు కావాలి. ఆ తరువాత అన్నీ..ఫ్రీ..ఆల్ ఫ్రీ అనుకున్నా..కనీసం తీసింది స్టోర్ చేసుకోవడానికి నాలుగు హార్డ్ డిస్క్ లన్నా కావాలి...పోనీ అంతా తీసాక..వారం రోజులు జిల్లాకు ఓ థియేటర్ అనుకున్నా..కనీసం పాతిక థియేటర్లు..అంటే కనీసం పాతిక లక్షలు కావాలి..ఇవి కాక పోస్టర్లు..అంటించేందుకు మైదా..అంటించేవాడు..వాటాలు ఇస్తామంటే రారు..ఇవి కాక చెప్పలేనివి..చెప్పుకోలేనివి చాలా ఖర్చులుంటాయి..'

'వురే..ఆర్జీవీ..అందర్నీ ఎంకరేజ్ చేస్తుంటే..నువు భయపెట్టేస్తున్నావ్..'

'చూడొరే..కొన్ని కొందరికే సేతనవుతాయ్..అల్లు అరవింద్ ప్రొడ్యూసరు..అశ్వనీదత్ మెగా ప్రోడ్యూసరు..రాఘవేంద్రరావు..మెగా మెగా డైరక్టరు..మరి వాళ్లు ముగ్గురే కలిసి పెళ్లి సందడి సినిమా తీసారెందుకు..అలా మళ్లీ ఎవరూ ఎందుకు ట్రయ్ చేయలేదు..వర్మ ఈసారి అడిగాడు కాబట్టి..అందరూ వచ్చారు..వర్మకు చేసాడు కదా అని నవదీప్ ను నువ్వూ అదే స్కీములో వెళ్లి అడుగు..చేస్తాడేమో..పాతిక లక్షలు హీనంలో అడుగుతాడు..'

'అంటే మన యూత్ ఎప్పటికీ ఇలా వుండిపోవాలా..మన టాలెంట్ పనికి రాదంటావా'

'నిజంగా టాలెంట్ వున్నొడికి ఇన్ని అడ్డదారులు అక్కరలేదు..ఎప్పుడో అప్పుడు చాన్స్ వస్తుంది..సునీల్ వర్మకు రాలేదా..మారుతికి రాలేదా..ఎంతమంది కొత్త డైరక్టర్లు రాలేదు..అంతెందుకు..ఏ కోపరేటివ్ సొసైటీ పెడితే ఆర్జీవీకి చాన్స్ వచ్చింది?.'

'అయితే ఏం చేయకుండా ఊరుకోమంటావా'

'చూడొరే..తీసేవాళ్లంతా మాంచి సినిమాలు తీసి నెట్ లో పెడుతున్నారు..వాటిలో బాగున్నవి ఐస్ క్రీమ్ లా కరిగిపోకుండా..హిమాలయాల్లా నిల్చుంటున్నాయి..బాగోలేనివి కరిగిపోతున్నాయి. బావున్నవాటిని తీసిన వారికి ఛాన్సులొస్తన్నాయ్..లేనివారికి లేదు..అయినా నీకు నాకు చాన్సుల సంగతి పక్కనెట్టు కానీ..ఈ కాలం కుర్రళ్లకి ఒకరు అయిడియాలు చెప్పక్కర్లా..వాళ్లే చెబుతారు సవాలక్ష అయిడియాలు'

'అయితే హైదరాబాద్ వెళ్లద్దంటావ్.'

'వద్దనను..కానీ ఆర్జీవీ మాటలను పట్టుకుని వెళ్లకు..నీకు టాలెంట్ వుంటే వెళ్లు'

-'చిత్ర'గుప్త

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?