Advertisement

Advertisement


Home > Articles - Special Articles

క్రైమ్ థ్రిల్లర్: ఆత్మహత్యలో ‘ఆత్మ’ ఏదీ.?

క్రైమ్ థ్రిల్లర్: ఆత్మహత్యలో ‘ఆత్మ’ ఏదీ.?

ఓ మేకప్‌ ఆర్టిస్ట్‌ (బ్యూటీషియన్‌) ఆత్మహత్య చేసుకుంది. ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రెండిటికీ ఓ లింకు. ముందురోజు ఓ ఆత్మహత్య, మరుసటి రోజు ఇంకో ఆత్మహత్య.

ఓ ఆత్మహత్య కారణంగా భయాందోళనకు గురై ఇంకో ఆత్మహత్య జరిగింది. కారణం, బ్యూటీషియన్‌ శిరీషపై సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రభాకర్‌ అత్యాచారానికి ఒడిగట్టడం. ఇదీ, మీడియాలో రెండ్రోజులుగా జరిగిన రచ్చ. 

ఈ జంట ఆత్మహత్యల మిస్టరీ విషయంలో ఎట్టకేలకు పోలీస్‌ ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చేశారు. మృతురాలికి, ఆమె పనిచేసే సంస్థ యజమాని రాజీవ్‌తో 'ఫిజికల్‌ రిలేషన్‌' వుందని విచారణలో తేల్చారు పోలీస్‌ ఉన్నతాధికారులు. అంతేనా, ఇందులో మరో ట్విస్ట్‌ కూడా వుంది. అదే ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ.

శిరీష - రాజీవ్‌ల రిలేషన్‌షిప్‌, రాజీవ్‌ పెళ్లి చేసుకోబోయే తేజస్వినికి నచ్చలేదు. దాంతో వివాదం తారాస్థాయికి చేరింది. తేజస్వినికీ శ్రావణ్‌ అనే స్నేహితుడున్నాడు. శ్రావణ్‌కి తెలిసిన పోలీస్‌ అధికారి ప్రభాకర్‌. బహుశా, సూపర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాలోనూ ఈ తరహా డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ వుండవేమో కదూ.! 

సెటిల్‌మెంట్‌ కోసం రాజీవ్‌, శ్రావణ్‌ తమతోపాటు శిరీషని ప్రభాకర్‌ దగ్గరకి తీసుకెళితే, అక్కడో చిన్న గలాటా జరిగింది. శిరీషను రాజీవ్‌, శ్రావణ్‌ చితక్కొట్టారు. అయినా వారితోనే కారులో చాలాదూరం ప్రయాణించింది. తాను పనిచేసే కార్యాలయానికి వచ్చి, అక్కడే ఉరివేసుకుంది.

రాజీవ్‌, శ్రావణ్‌ని క్యాబ్‌ బుక్‌ చేసి పంపించేశాడు. ఈలోగా శిరీష ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అబ్బబ్బా, సినిమాల్లో తలపండిపోయిన సీనియర్‌ రచయిత కూడా ఈ స్థాయిలో 'క్రైమ్‌ థ్రిల్లర్‌'ని రాయలేడేమో.! 

కానీ, ఇది కథ కాదు. నిజ్జంగా నిజం. అర్థరాత్రి.. అది కూడా పన్నెండు గంటలు దాటాక.. వివాదాలు నడుస్తున్న వ్యక్తులతో కలిసి శిరీష, చాలా దూరంలో వున్న పోలీస్‌ అధికారి దగ్గరకు ఎందుకు వెళుతుంది.? పోనీ తిరిగొచ్చే క్రమంలో రాక్షసుల్లాంటి సహచరుల నుంచి ఎలాగైనా తనవారిని కలుసుకోవాలనుకుంటుందిగానీ, కార్యాలయంలోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటుందా.? ఈ ప్రశ్నలకు 'కథలో' లాజిక్‌ వెతక్కూడదు. 

ఇక, ఎస్‌ఐ ఆత్మహత్య విషయానికొస్తే, కొన్నాళ్ళ క్రితం ఓ ఆత్మహత్య జరిగింది.. అదే చోట ఇప్పుడు ప్రభాకర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉన్నతాధికారుల వేధింపులే మొదటి ఆత్మహత్యకి కారణం. రెండో అధికారీ అదే వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంతలోనే, అత్యాచారం ఆరోపణలు.. ఆపై 'అబ్బే, అత్యాచారం జరగలేదు.. అంతా తూచ్‌' అని పోలీస్‌ ఉన్నతాధికారులు తేల్చి చెప్పడం.. ఇదంతా చూస్తోంటే, అక్కడ ఆత్మహత్యలు జరిగాయిగానీ.. ఈ ఎపిసోడ్‌లో 'ఆత్మ' మిస్‌ అవుతున్నట్లన్పిస్తోంది కదూ.! 

కొసమెరుపు: ఓ పోలీస్‌ ఉన్నతాధికారి, విచారణ సందర్భంగా మృతురాలిని పట్టుకుని, 'నిందితుడితో శారీరక సంబంధం వుంది' అని డిక్లేర్‌ చేసేయడం ఈ మొత్తం ఎపిసోడ్‌లో షాకింగ్‌ ఎలిమెంట్‌.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?