Advertisement

Advertisement


Home > Articles - Special Articles

దీప ఇంట్లోనా? జనంలోనా?

దీప ఇంట్లోనా? జనంలోనా?

రాజకీయాల్లో చిత్రవిచిత్ర ఘటనలు జరుగుతుంటాయి. కొన్ని సంచలన పరిణామాల్లో ఊహకు అందని కొందరు వ్యక్తులు రాజకీయ తెర మీద ప్రత్యక్షమవుతుంటారు. ఒక్కసారిగా వారు పొలిటికల్‌ హీరోలుగా, హీరోయిన్లు మారిపోతారు. మీడియాలో ఫోకస్‌ అవుతారు. నానా హడావుడి చేస్తారు. కాని కాలక్రమంలో వారి అడ్రస్‌ దొరక్కపోవచ్చు. తమిళనాడులో జయలలిత అపోలో ఆస్పత్రిలో అంతిమ ఘడియల్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా తెర మీదికి వచ్చింది దీపా జయకుమార్‌. మీడియా దృష్టి ఆమె మీదకు మళ్లింది. ఇందుకు కారణం ఆమె జయలలిత మేనకోడలు కావడమే. జయను చూడటానికి ఆమె ఆస్పత్రికి వచ్చినప్పుడు లోపలికి అడుగు పెట్టనీయలేదు. అప్పుడే ఆమెవరో జనాలకు తెలిసింది. జయ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నవారికి లేదా ఆమె కుటుంబం గురించి తెలిసినవారికి జయలలితకు దీప అనే మేనకోడలు ఉందని తెలుసేమోగాని సామాన్య జనాలకు తెలియదు. దీప గురించి మీడియాలో కథనాలు రావడంతో ఒక్కసారిగా పాపులర్‌ అయిపోయింది. జయ ఆస్తులకు, రాజకీయానికి తానే వారసురాలినని ఆమె ప్రకటించుకోవడం సంచలనం కలిగించింది. 

మీడియాలో ఆమెతో ఇంటర్వ్యూలు రావడంతో ఆమె చరిత్ర, జయలలితతో ఆమె కుటుంబానికి సంబంధాలు తెగిపోవడం మొదలైన విషయాలు తెలిశాయి. తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పడం, శశికళ వ్యతిరేకులు ఆమెను ప్రోత్సహించడంతో దీపా జయకుమార్‌ రాజకీయ నాయకురాలిగా దాదాపు అవతారమెత్తేసింది. ఆమెలో జయలలిత పోలికలు ఎక్కువగా ఉండటంతో శశికళను వ్యతిరేకించే 'అమ్మ' భక్తులు, అభిమానులు, నాయకులు, అన్నాడీఎంకే కార్యకర్తలు ఆమె చుట్టూ మూగారు. ప్రతి రోజు ఆమె ఇంటికి తండోపతండాలుగా వెళ్లి రాజకీయాల్లోకి రావాలని వేడుకున్నారు. ఆమె పేరుతో అభిమాన సంఘాలు పెట్టారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. శశికళను వ్యతిరేకించే మీడియా దీపకు ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో జయ చనిపోయినప్పటినుంచి భీకరమైన హైడ్రామా జరిగి రాజకీయ సంక్షోభం సద్దుమణిగేదాకా దీప పేరు మారుమోగిపోయింది. ఒక దశలో శశికళకు సమవుజ్జీ దీప అనే అభిప్రాయం కొందరు నాయకులు వ్యక్తం చేశారు. జయ మరణంతో ఖాళీగా ఉన్న అన్నానగర్‌ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో తాను పోటీ చేస్తానని దీప ప్రకటించింది. జయలలిత మరణం వెనక ఉన్న కుట్రను కూడా బయటపెడతానని శపథం చేసింది. 

జయలలిత పుట్టిన రోజైన ఫిబ్రవరి 24న కొత్త పార్టీ పెడతానని ప్రకటించిన దీప ఆ పని చేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. మొన్నటి రాజకీయ సంక్షోభంలో ఆమె మాజీ సీఎం పన్నీరుశెల్వానికి మద్దతు ఇచ్చి ఆయన వెన్నంటే ఉంది. యుద్ధంలో ఓడిపోయిన పన్నీరు 'అమ్మ డీఎంకే ' పేరుతో పార్టీ పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే దీప ఆ పార్టీలో చేరుతుందా? లేదా తాను ప్రకటించినట్లు సొంత పార్టీ పెడుతుందా? అదీ ఇదీ కాకపోతే ఎందుకులే రిస్క్‌ తీసుకోవడమని ఇంట్లోనే ఉంటుందా? ఈ ప్రశ్నలకు జయ జన్మదినంనాడు జవాబులు తెలియవచ్చు. ఆరోజు ఆమె తన భవిష్యత్తు కార్యాచరణ గురించి ఏదో ఒక ప్రకటన చేస్తుండవచ్చు. ప్రస్తుతం దీప గురించి మీడియాలో పెద్దగా కథనాలు రావడంలేదు. ఆమె కూడా ఏమీ మాట్లాడటంలేదు. తాను జయలలిత ఇంట్లోనే పుట్టి పెరిగానని, తానంటే అత్తకు చాలా ప్రేమని  చెప్పుకుంది. ఇదంతా తన వారసత్వానికి ప్రాతిపదికగా చిత్రీకరించింది. పోయస్‌గార్డెన్‌ ఇల్లు తనకే చెందాలని ఆకాంక్షిస్తోంది. ఆ ఇంట్లోనే ఆమె పుట్టింది.  

జయ అనారోగ్యం, మరణం వెనక కారణాలను శశికళ, అన్నాడీఎంకే నాయకులు దాస్తున్నట్లే జయలలితకు-అన్న జయకుమార్‌ కుటుంబానికి విభేదాల విషయాన్ని దీప దాస్తోంది.  ఏ కారణం వల్ల విభేదాలు వచ్చాయో, జయ ఇంట్లోంచి అన్న కుటుంబం ఎందుకు బయటకు వెళ్లిపోవాల్సి వచ్చిందో, వదిన చనిపోయినప్పుడు, దీప పెళ్లయినప్పుడు జయ ఎందుకు వెళ్లలేదో, ఆ తరువాత ఆ కుటుంబాన్ని దశాబ్దాల తరబడి ఎందుకు పట్టించుకోలేదో తెలియదు. అత్త  తమను దూరం చేశారని చెబుతోందిగాని అసలు కారణాలు చెప్పలేదు. జయ మృతి మిస్టరీగా మారిన నేపథ్యంలో దాన్ని బద్దలుకొట్టే శక్తి దీపకు ఉందా? అనేది అనుమానమే. ఆ పని చేయడం ఆమె వల్ల కాకపోవచ్చు. దీప అన్నానగర్‌ ఉప ఎన్నికలో పోటీచేస్తే గెలిచే అవకాశం ఉండొచ్చు. అక్కడ తాను పోటీ చేస్తానని శశికళ ప్రకటించినప్పుడు అక్కడి ప్రజలు వ్యతిరేకించారు. సీఎం పళనిసామి  పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోవాల్సివుంది. దీప పన్నీరువర్గంలో చేరితో ఆ వర్గం అన్నానగర్‌ నుంచి దీపను పోటీ చేయిస్తుందేమో చూడాలి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?