Advertisement

Advertisement


Home > Articles - Special Articles

దేశానికి దూరంగా బీసీలు... వైకాపా రెడ్‌కార్పెట్..!

దేశానికి దూరంగా బీసీలు... వైకాపా రెడ్‌కార్పెట్..!

తూ.గో.జిల్లాలో మారుతున్న సమీకరణాలు

ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వెనుకబడిన వర్గాలు తెలుగుదేశం పార్టీకి కుడి భుజంగా ఉండేవారు! కాలక్రమంలో ఈ పార్టీలో బీసీల పాత్ర నామమాత్రం కానున్నదా? అన్న చర్చ జిల్లా రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తూర్పుగోదావరికి సెంటిమెంట్ జిల్లాగా గుర్తింపు ఉంది. ఈ జిల్లాలో ఏ రాజకీయ పార్టీకి ఆదరణ లభిస్తే అదే సెంటిమెంట్ రాష్ర్టమంతా వర్కవుట్ అవుతుందన్న నమ్మకం ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నేతల్లో బలంగా నాటుకుపోయింది. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక ఆ పార్టీ అధినేత స్వర్గీయ పన్టీరామారావు బీసీల పట్ల చూపిన ప్రత్యేక శ్రద్ధ ఫలితంగా ఆ వర్గానికి చెందిన ఎందరో నేతలు ఒక్కసారిగా రాజకీయ తెరపై వెలుగువెలిగారు. వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేసే ఏకైక రాజకీయ పార్టీగా తెలుగుదేశం గుర్తింపు తెచ్చుకుంది. ఐతే ఆ పార్టీలో నేడా పరిస్థితి కనుమరుగయ్యింది. కాలక్రమంలో తెలుగుదేశం పార్టీలో బీసీల హవా తగ్గుతూ అగ్రవర్ణాల ఆధిపత్యం మరింత పెరుగుతూవచ్చింది. టిడిపి బూర్జువా పార్టీ అని, కాంగ్రెస్ మాదిరిగానే అగ్రవర్ణాలకు కొమ్ముకాస్తోందన్న ప్రచారం గత కొన్నేళ్ళుగా ఎక్కువయ్యింది. 

ప్రతిపక్ష నేతగా సుమారు 9 సంవత్సరాల పాటు పనిచేసి, అధికారం కోసం రేయింబవళ్ళు కష్టించిన టిడిపి అధినేత చంద్రబాబు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొనే గత ఎన్నికల్లో రెండు సామాజిక వర్గాలకు ఒక అద్భుతమైన హామీనిచ్చి సునాయాసంగా అధికారంలోకి రాగలిగారు. తాను అధికారంలోకి వస్తే కాపు, బిసి సామాజికవర్గానికి చెరోక డిప్యూటి సిఎం పదవి ఇస్తానంటూ ఆయన హామీనిచ్చి ఆయావర్గాల నుండి దండిగా ఓట్టు కొల్లగొట్టగలిగారు. అనుకున్నట్టే అధికారంలోకి వచ్చీరాగానే తూర్పుగోదావరి జిల్లాలోని కాపు సామాజిక వార్గానికి చెందిన నిమ్మకాయల చినారాజప్పకు, రాయలసీమ నుండి బిసి సామాజికవర్గ నేత కృష్ణమూర్తికి ఉపముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టారు. వాస్తవానికి ఉపముఖ్యమంత్రి పదవికి తూర్పుగోదావరి జిల్లానుండి బిసి(యాదవ) సామాజిక వర్గానికి చెందిన యనమల రామకృష్ణుడు ఆశించారు. పార్టీలో నెంబర్ 2గా చెప్పుకునే యనమల ఈ పదవిని ఆశించడంలో తప్పులేనప్పటికీ తుని నియోజకవర్గం నుండి వరుసగా రెండుసార్లు సార్వత్రిక ఎన్నికల్లో యనమల కుటుంబం పరాజయాన్ని మూటగట్టుకోవడంతో సహజంగానే యనమలపై అధినేత చంద్రబాబులో ఒకింత అసంతృప్తి ఏర్పడింది. 

ఈ కారణాన్నే సాకుగా చూపుతూ యనమల స్థానే కాపు సామాజిక వర్గానికి చెందిన చినరాజప్పకు ఉపముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు. తూర్పుగోదావరి జిల్లాకు డిప్యూటి సిఎం కేటాయింపుతో కాపుల కోటా భర్తీ కాగా రాయలసీమకు చెందిన బీసీనేత కృష్ణమూర్తికి డిప్యూటి సిఎం పదవి వరించింది. గత రెండు పర్యాయాల కాంగ్రెస్ ప్రభుత్వాలను పరిశీలించినా, అంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వాలలో ఐనా తూర్పుగోదావరి జిల్లా నుండి బీసీలకు లభించిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదన్నది జనమెరిగిన సత్యం! ఈ తాజా ప్రభుత్వంలో పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి, కాకినాడ, అమలాపురం ప్రాంతాలు వేటికవే భౌగోళికంగా విభిన్నంగా ఉంటాయి. 

కోనసీమగా పేరొందిన అమలాపురంలో బిసి, ఎస్సీల హవా అధికంగా ఉంటాయి. కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో అగ్రవర్ణాలను మినహాయిస్తే కాపుబిసి సామాజికవర్గాల బలాబలాలు నువ్వా?నేనా? అన్నట్టు ఉంటాయి. కాకినాడకోనసీమ తీరప్రాంతం వెంబడి మత్స్యకారులు, యాదవులు, మెట్ట ప్రాంతంలో కాపు సామాజికవర్గాలకు పట్టుంది. కోనసీమలో ఎస్సీలతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గానికి మేజర్ కమ్యూనిటీగా పేరుంది. జిల్లాలోని దాదాపు ప్రతిచోటా అన్ని బిసి కులాలూ కలిస్తే సంఖ్యాపరంగా అగ్రస్థానంలో వీరే ఉంటారు. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకునే గత ప్రభుత్వాలలో బీసీలకు అగ్రతాంబూలాన్ని ఇచ్చారు. తాజా చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రం జిల్లాలో బిసిలందరూ నిరాదరణకు గురియ్యారన్నది నూరుశాతం వాస్తవమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాన్ని ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకునే వ్యూహంలో ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం అధికార తెలుగుదేశం పార్టీలో గాని, ప్రభుత్వంలో గాని ఉన్న ముఖ్యమైన పదవులను ఓసారి పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుంది. 

ఈ జిల్లాలో కాపు సామాజికవర్గానికి చెందిన నిమ్మకాయల చినరాజప్ప ఉపముఖ్యమంత్రి సహా మంత్రిగా వ్యవహరిస్తున్నారు. జిల్లా ప్రజాపరిషత్ ఛైర్మన్ నామనరాంబాబు, జిల్లా కేంద్రం కాకినాడ ఎంపి తోట నరసింహంలు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే! రాజమండ్రి నగర పాలక సంస్థ మేయర్ పంతం రజనీతో పాటు ఇటీవల ఆప్కాబ్ ఉపాధ్యక్షుడిగా నియమితులైన వరుపుల రాజా కూడా ఇదే సామాజికవర్గానికి చెందిన వారు! అలాగే తూర్పుగోదావరి జిల్లా టిడిపి అధ్యక్ష పదవిని సైతం కాపు సామాజికవర్గానికి చెందిన పర్వత చిట్టిబాబుకే కట్టబెట్టారు. ఇవే కాకుండా జిల్లాలోని ఆయా డివిజన్లు, నగరపాలక, పురపాలక సంఘాల పరిధిలో వివిధ పదవుల్లో కాపులకు ఇచ్చిన ప్రాధాన్యత తమకు ఇవ్వడం లేదన్న బాధను బీసీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. త్వరలో వివిధ నామినేటెడ్ పోస్ట్‌ల నియామకాల్లో సైతం కాపు సామాజికవర్గంతో పాటు జిల్లాలోని అధికారక కమ్మ సామాజికవర్గానికి పెద్దపీట వేసే ప్రయత్నాల పట్ల బీసీలు గుర్రుగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. 

ఈ పరిణామాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. తెలుగుదేశం నుండి దూరమయ్యే బీసీలను దువ్వే పనిలో ఆ పార్టీ నేతలు పడ్డారు. దళిత క్రిస్టియన్లు, గిరిజనుల సానుభూతిని ఇప్పటికే చూరగొన్న వైకాపా రానున్న కాలంలో బిసి ఓటుబ్యాంక్‌ను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ వ్యూహంలో భాగంగానే జిల్లాలోని బిసి(శెట్టిబలిజ) సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాస్‌చంద్రబోస్‌కు అసెంబ్లీ కోటాలో శాసన మండలి సభ్యుత్వాన్ని కట్టబెట్టాలి. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో (స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో) సుభాస్‌చంద్రబోస్ జిల్లా నుండి మంత్రిగా ప్రాతినిథ్యం వహించారు. వైఎస్ హయంలో బిసి సామాజికవర్గానికి చెందిన పలువురు నేతలు వివిధ ముఖ్యమైన పదవులను  అలంకరించారు. వీరిలో చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ జిల్లా పరిషత్ ఛైర్మన్‌గాను, కవికొండల సరోజ కాకినాడ మేయర్‌గాను పనిచేశారు.  

ముత్తా వైపు...వైసిపి చూపు..!

తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెలిమికి తహతహలాడుతున్నారు. ప్రస్తుతం ఏ పార్టీకీ అనుకూలంగా లేని ముత్తాను తమ పార్టీలోకి రావాల్సిందిగా వైసిపి ఆహ్వానించింది. ఆయనతో చర్చలు జరిపే బాధ్యతలను కాకినాడ సీటి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి అధినేత జగన్ అప్పగించారు. ఇప్పటికే రెండు, మూడు పర్యాయాలు ముత్తాతో ద్వారంపూడి సంప్రదింపులు జరిపారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పౌరసరఫరాశాఖ మంత్రిగా పనిచేసిన ముత్తా తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత 2014 పన్నికల్లో మళ్ళీ టిడిపిలో చేరి కాకినాడ సిటీ అసెంబ్లీ టిక్కెట్‌ను ఆశించి భంగపడ్డారు. ఇవే ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ తరుఫున తన కుమారుడు శశిధర్‌ను కాకినాడ సిటీ పమ్మెల్యే అభ్యర్ధిగా నిలిపినప్పటికీ ఆయనకు డిపాజిట్టు దక్కలేదు! వైశ్య సామాజిక వర్గానికి చెందిన ముత్తా తమ పార్టీలోకి వస్తే రాజకీయంగా ఆయనకున్న అపారమైన అనుభవం తమకు కలసివస్తుంద్న యోచనలో స్థానిక వైసిపి నేతలున్నారు.

అంతా ‘గ్యాసే’నా....?

అధికారంలోకి రాగానే కృష్ణాగోదావరి బేసిన్ (కెజి బేసిన్) గ్యాస్‌ను ముందు స్థానిక అవసరాలకు కేటాయించేలా తక్షణ చర్యలు తీసుకుంటామంటూ పచ్చదళంకమలనాధులు జాయింట్‌గా బాకా ఊదారు. పవర్‌లోకి రాగానే ‘ఏరు దాటాక బోడి మల్లయ్య’ చందాన స్థానిక నినాదాన్ని పెడచెవిన పెట్టారు! 2014 సార్వత్రిక ఎన్నికల్లో కెజి బేసిన్ ప్రాంతంలో పర్యటించిన సందర్భంలో తెలుగుదేశం, బిజేపి నేతలు ప్రజలకు పలు హామీలిచ్చారు. కెజి బేసిన్‌లో అపారమైన సహజ వాయు నిక్షేపాలను తవ్వుకుని ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తలలిస్తున్నప్పటికీ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు చమురు సంస్థలపై ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదంటూ ధ్వజమెత్తారు. స్థానిక నిర్వాసితులను పూర్తిగా నిర్లక్యం చేశారని, కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీకి తిలోదకాలిచ్చారంటూ సదరు నేతలు విమర్శలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నప్పటికీ కెజి బేసిన్ వైపు కన్నెత్తి చూడటం లేదంటూ పలువురు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల తీరును గర్హిస్తున్నారు. 

ఉద్యోగ జెఎసి అడ్రస్ గల్లంతు!

సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉద్యోగ జెఎసి పోషించిన పాత్ర మరువలేనిది! రాజకీయ పార్టీలకు చెందిన నేతలంతరూ స్వార్ధపూరిత ధోరణిలో చేష్టలుడిగి చూస్తుంటే, ఉద్యోగ సంఘాలు ఉప్పెనలా లేచి సమైక్య ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్ళిన గొప్ప ఉద్యమ చరిత్ర ఎన్జిఓలకు ఉంది. ఐతే విభజనకు ముందు సీమాంధ్రకు జరుగుతున్న నష్టంపై ఎలుగెత్తి పోరాడిన ఈ ఉద్యోగ వీరులందరూ నేడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ కేంద్రం ప్రకటించడంపై ఎంత మాత్రం నోరు మెదపకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మేం అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి ఐదేళ్ళు కాదు, పదేళ్ళు ప్రత్యేక హోదా కల్పిస్తామంటూ తమ మాటల గారడీతో బురిడీ కొట్టించిన రాజకీయ అవకాశవాదులకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు ఏ ఒక్క సమైక్యవాదీ ముందుకు రాలేకపోయారు. ఆయా రాజకీయ పార్టీల నేతలూ  విషయంలో తగిన విధంగా స్పందించలేకపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం సినీ నటుడు శివాజీ వంటి కొద్ది మందైనా ప్రత్యేక హోదా కోసం అమరణ నిరాహార దీక్ష చేపట్టి మన నేతల కళ్ళు తెరిపించే ప్రయత్నం చేయడం హర్షణీయం!

ఎస్‌ఆర్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?