Advertisement

Advertisement


Home > Articles - Special Articles

'థింసా' ఎవరిది?

'థింసా' ఎవరిది?

రాష్ట్రాల మధ్య ఎప్పుడూ ఏవో వివాదాలు రగులుతూనే ఉంటాయి. కొన్ని కొంతకాలం తరువాత సమసిపోతే, కొన్ని దశాబ్దాల తరబడి కొనసాగుతూనే ఉంటాయి. ప్రధానంగా నదీ జలాల పంపిణీకి సంబంధించిన వివాదాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి అప్పుడప్పుడు ముదిరిపోయి దీంతో సంబంధమున్న రాష్ట్రాల్లో దారుణ మారణకాండకు దారి తీస్తుండటం చూస్తూనేవున్నాం. ఇవి మాత్రమే కాకుండా ఒక్కోసారి భాషా సంస్కృతులకు సంబంధించిన వివాదాలూ తలెత్తుతుంటాయి.

ఏ వివాదమైనా అంతిమంగా రాజకీయాలతో ముడిపడి రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసే ప్రమాదమూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌-ఒడిశా మధ్య పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గొడవ జరుగుతూనే ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం తమ రాష్ట్రానికి నష్టదాయకమని ఆ రాష్ట్రం వాదన. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ గెలకడం మొదలుపెట్టింది. చెప్పుకోవాలంటే ఇదో పెద్ద చరిత్ర.

సరే...దీని సంగతి అలావుంచితే ఈ రెండు రాష్ట్రాల మధ్య సాంస్కృతికపరమైన ఓ వివాదం తలెత్తింది. ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలోని అరకు ఏరియాలో గిరిజనుల నృత్యం 'థింసా' చాలా ప్రాచుర్యం పొందింది. ఆ ప్రాంతానికి వెళ్లే పర్యాటకులు థింసా తప్పనిసరిగా చూసివస్తారు. చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఈ నృత్యంపై పేటెంట్‌ హక్కుల కోసం ప్రయత్నాలు చేస్తోంది. దీన్ని రాష్ట్ర అధికారిక నృత్యంగా ప్రకటస్తామని బాబు హామీ ఇచ్చారు. అయితే థింసా ఒడిశాకు సంబంధించిన నృత్యమని, దీని మూలాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయని, దీంతో ఏపీకి ఎలాంటి సంబంధమూ లేదని అక్కడి మేధావులు, కళాకారులు, పరిశోధకులు చెబుతున్నారు. దీనిపై తాము లోతైన పరిశోధన చేశామంటున్నారు.

కోరాపుట్‌ జిల్లాలోని 'పోర్జా' తెగ గిరిజన మహిళలు థింసాను శతాబ్దాలుగా  ప్రదర్శిస్తున్నారని చెప్పారు. వారి దేవతకు ఆరాధనలో భాగంగా ఈ నృత్యం ప్రదర్శిస్తుంటారు. ఇది ఒడిశా నుంచి పొరుగున ఉన్న విశాఖ ఏజెన్సీకి వ్యాపించింది. దీంతో ఇది ఏపీకి చెందిన గిరిజన నృత్యమనే పేరుపడింది. ఏజెన్సీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ కార్యక్రమాలు నిర్వహించినా థింసా ప్రదర్శన ఏర్పాటు చేయడం ఆనవాయితీగా మారింది. పోర్జ తెగ గిరిజనులు ఉపాధి కోసం సరిహద్దుల్లోని విశాఖ ఏజెన్సీకి వచ్చినందువల్ల అక్కడ కూడా థింసా ప్రాచుర్యం పొందిందని, కాని అది ఏపీ నృత్యమని చెప్పడానికి ఆధారాలు లేవని ఒడిశా పరిశోధకులు చెబుతున్నారు.

అడవుల్లో జంతువులను దూరంగా తరిమేసేందుకు వాయిద్యాలతో నృత్యంలాంటిది చేసేవారని, అది క్రమంగా ఓ కళారూపంగా సంతరించుకుందని అంటున్నారు. దీనిపై పేటెంట్‌ హక్కుల కోసం ప్రయత్నాలు చేస్తామంటున్నారు. థింసా మూలాలు ఒడిశాలో ఉన్నా లేకపోయినా ఎక్కువమంది కళాకారులు తమ రాష్ట్రంలోనే ఉన్నారని ఏపీ సాంస్కృతిక శాఖ అధికారులు చెబుతున్నారు. శతాబ్దాల కిందట ఇప్పుడున్న రాష్ట్రాలు లేవు. అప్పట్లో ఉన్న రాజ్యాల్లో, సంస్థానాల్లో ఒడిశా, ఏపీ ప్రాంతాలు కలిసే వున్నాయి. కాబట్టి మూలాలు ఫలానా ప్రాంతాల్లోనే ఉన్నాయని చెప్పడం కష్టమే. ఏది ఏమైనా ఈ గిరిజన నృత్యం అంతరించకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడాలేగాని హక్కుల కోసం పోరాడినందవల్ల ప్రయోజనం ఉండదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?