Advertisement

Advertisement


Home > Articles - Special Articles

డ్రగ్స్‌ రగడ: ఆ నలుగురు ఏం చెప్పారు.?

డ్రగ్స్‌ రగడ: ఆ నలుగురు ఏం చెప్పారు.?

కెల్విన్‌ ఏం చెప్పాడు.? ఈ కేసులో మరో డ్రగ్స్‌ డీలర్‌ ఏం సమాచారమందించాడు.? అన్న ప్రశ్నలు మరుగున పడ్డాయి. కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో డ్రగ్స్‌కి సంబంధించిన వ్యవహారం తెరమరుగైపోయింది. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల 'వారసులకు' డ్రగ్స్‌తో వున్న సంబంధాలు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. కానీ, సినీ పరిశ్రమ 'టార్గెట్‌' అయ్యింది. 

మొత్తం 12 మంది సినీ ప్రముఖులు డ్రగ్స్‌ కేసులో నోటీసులు అందుకున్నారు. చిత్రంగా రాజకీయ ప్రముఖుల వారసులుగానీ, కార్పొరేట్‌ విద్యా సంస్థల మాఫియా వారసులుగానీ, ఇంకెవరూగానీ నోటీసులు అందుకున్న సమాచారమైతే కన్పించడంలేదు. అసలు ఎవరూ ఈ అంశాలకు ప్రాధాన్యత కూడా ఇవ్వడంలేదు. సరే, విచారణ సంస్థలకంటూ ఖచ్చితమైన ప్రణాళిక వుంటుందిగనుక, ముందుగా సినీ పరిశ్రమతో మొదలు పెట్టారనే అనుకుందాం.! 

ముందురోజు పూరి జగన్నాథ్‌, ఆ తర్వాత రోజు శ్యామ్‌ కె నాయుడు, మూడో ఛాన్స్‌ సుబ్బరాజు, నాలుగో దఫా తరుణ్‌.. ఇలా సినీ ప్రముఖు ఎక్సయిజ్‌ ఎన్‌ఫోర్స్‌మెట్‌ 'సిట్‌' బృందం యెదుట విచారణకు హాజరయ్యారు. ఇందులో సుబ్బరాజు విచారణ సందర్భంగా, 'విలువైన సమాచారం అందుతోంది..' అంటూ ఎక్సయిజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రకటించడం కలకలం రేపింది. 'విలువైన సమాచారం' అనగానే, మీడియాలో 'అలాగట, ఇలాగట' అంటూ ప్రచారం షురూ అయ్యింది. దాన్ని ఇంతవరకూ ఎక్సయిజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఖండించలేదు. మామూలుగా అయితే ఇలాంటి ఊహాగానాలకు అధికారులు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చుగాక. కానీ, అత్యంత కీలకమైన విషయంలో ఎక్సయిజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నుంచే లీకులు అందుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో సంబంధిత అధికారులు స్పందించి తీరాల్సిందే. 

తాజాగా విన్పిస్తున్న ఊహాగనాల ప్రకారం, మళ్ళీ సినీ పరిశ్రమే టార్గెట్‌ అయ్యింది. ఇద్దరు యువ నటులు, ఓ వెబ్‌ ఛానల్‌ అధిపతి, ఓ నిర్మాత పుత్రరత్నం.. ఇలా అంతా సినీ ప్రముఖులే మళ్ళీ టార్గెట్‌ అయ్యారు. డ్రగ్స్‌ వాడేవారు కేవలం సినీ పరిశ్రమలో మాత్రమే వున్నారన్న దిశగా 'ప్రొజెక్షన్‌' జరుగుతుండడంతో, ఇప్పటిదాకా సినీ పరిశ్రమలో వున్నవారు డ్రగ్స్‌ వాడారేమో.. అని అనుకున్నవారు కూడా, దీని వెనుక 'పెద్ద రాజకీయం' నడుస్తోందనీ, సినీ పరిశ్రమను భయభ్రాంతులకు గురిచేయాలన్న 'పెద్ద తలకాయల' వ్యూహం కన్పిస్తోందనీ అనుకోవాల్సి వస్తోంది. 

ఇంతకీ, సినీ పరిశ్రమ ఎందుకు టార్గెట్‌ అయ్యింది.? ఆ నలుగురు విచారణ సందర్భంగా ఏం చెప్పారు.? విచారణ పూర్తయ్యాక, ఆయా సినీ ప్రముఖులు సొసైటీకి 'మెసేజ్‌' ఇవ్వడంలో ఆంతర్యమేమిటి.? డ్రగ్స్‌కి వ్యతిరేకంగా వారంతా అంత కాన్ఫిడెంట్‌గా ఎలా మాట్లాడగలుగుతున్నారు.? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి వుంది. ఒక్కటి మాత్రం నిజం. వ్యవస్థలోని లోపాలు డ్రగ్స్‌కి రాచమార్గాలుగా మారుతున్నాయి. ప్రధానంగా రాజకీయమే ఈ డ్రగ్స్‌కి కొండంత బలం. దురదృష్టవశాత్తూ రాజకీయం, ఈసారి డ్రగ్స్‌ ఆరోపణల నుంచి తెలివిగా తప్పించుకుంది. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా సినీ పరిశ్రమ 'టార్గెట్‌' చెయ్యబడింది.!

చివరగా: డ్రగ్స్ సేవించడం కావొచ్చు, డ్రగ్స్ అమ్మకాలు కావొచ్చు.. రెండూ తీవ్రవాదంగానే పరిగణించాలి. ఎందుకంటే, డగ్ర్స్ కారణంగా పుట్టుకొచ్చే సొమ్ములన్నీ, తీవ్రవాదుల చేతుల్లోకే వెళుతుంటాయి కాబట్టి. డ్రగ్స్ కేసులు ఎవరైనా శిక్షింపబడాల్సిందే.. కొందర్ని బలి చేసి, కొందర్ని రక్షిస్తామంటే ఎలా.? వర్మ చెప్పాడని కాదుగానీ, విచారణ అందరికీ ఒకేలా వుండాలని సామాన్యుడు భావిస్తే అది తప్పెలా అవుతుంది.!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?