Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ఈ సినిమాలకు రెండు శుభం కార్డులున్నాయ్!

ఈ సినిమాలకు రెండు శుభం కార్డులున్నాయ్!

‘దళపతి’ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఒకానొక సూపర్ హిట్ సినిమా. అంతేనా... తమిళనాట చాలా మంది యువకులకు సినిమాపై మోజుపుట్టించిన సినిమా ఇది. తాము కూడా డైరెక్టర్లయిపోవాలనే అభిలాషను కలిగించి సినిమా! ఇప్పుడు తమిళంలో డైరెక్టర్లుగా రాణిస్తున్న అట్లీ(రాజా రాణి ఫేమ్), కార్తిక్ సుబ్బరాజు( జిగరతాండ ఫేమ్) వంటి వాళ్ళు ‘దళపతి’ సినిమాను తమ అపురూపమైన బాల్య జ్ఞాపకంగా చెబుతారు. రజనీకూతురు సౌందర్య అయితే.. తన జీవితంలో తొలిసారి రిలీజ్ రోజున తొలి షోలో చూసిన సినిమా అదేనని చెబుతుంది. ఇలా దళపతి సినిమాతో ఎమోషనల్ బాండేజీని ఏర్పరుచుకొన్న తమిళులు ఎంతో మంది! ఈ సినిమా తెలుగులోకి కూడా డబ్ అయ్యింది. ఇక్కడ హిట్ అయ్యింది. మరి ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి! మణిరత్నం వంటి డైరెక్టర్ కూడా హీరోల ఇమేజ్‌కు పూర్తిగా తలొగ్గింది ఈ సినిమా విషయంలోనే! 

క్లైమాక్స్‌ను మార్చడం అనేది చాలా సినిమాల విషయంలో జరిగింది. మహేశ్ బాబు నటించిన ‘బాబీ’ సినిమాకు తొలుత ట్రాజెడీ ఎండింగ్ ఇచ్చి.. దానికి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో శుభం కార్డును మరో రకంగా వేశారు. అయితే ఒక సినిమాకు రెండు రకాల క్లైమాక్స్‌లు అలాగే ఉండటం అనేది మాత్రం ‘దళపతి’ విషయంలోనే! అయితే అది రెండు భాషల్లో. ఒక్కో భాషలో ఒక్కోరకమైన క్లైమాక్స్ అనమాట! అప్పటికే మణిరత్నం ‘అగ్నినక్షత్రం’,  ‘గీతాంజలి’ వంటి క్లాసిక్స్‌ను రూపొందించేశాడు. తనకంటూ ఒక ఇమేజ్‌ను కలిగి ఉన్నాడు. అలాంటి నేపథ్యంలో రజనీకాంత్, మమ్ముట్టి వంటి స్టార్ హీరోలతో సినిమా చేయడమే ఒక సాహసం. తనకంటూ ప్రత్యేక బాణీని కలిగి ఉన్నా.. స్టార్ హీరోలతో కూడా సర్దుకుపోయే గుణం ఉంది మణికి. దీంతో రజనీ, మమ్ముట్టిలతో సినిమా స్టార్ట్ అయ్యింది. వీళ్ల కాంబినేషన్‌లో సినిమా అంటే.. రజనీ వల్ల తమిళంలో మార్కెట్ ఉంటుంది, తెలుగులోకి కూడా డబ్ చేసుకోవచ్చు, మమ్ముట్టీ వల్ల మళయాలంలో మార్కెట్ ఉంటుంది. కాబట్టి ఇది ఒకరకంగా త్రిభాష చిత్రం. అక్కడే మొదలయ్యాయి దర్శకుడికి పాట్లు!

ఈ సినిమా కథను మహాభారతం నుంచి స్ఫూర్తిపొందాడు మణి. భారతంలో దుర్యోధన- కర్ణుల స్నేహాన్ని బేస్ చేసుకొని ఈ కథను తయారుచేసుకొన్నాడు. మమ్ముట్టీది ఊర్లో దుర్యోధనుడిలాంటి పాత్ర అయితే, అతడికి సాయంగా వచ్చే కర్ణుడి పాత్రలో రజనీ కనిపిస్తారు. వీళ్లను అడ్డుకోవడానికి ప్రయత్నించే పాండవులందరినీ కలిపినట్టుగా అరవింద్ స్వామి రోల్‌ను డిజైన్ చేశాడు. అయితే ప్రాధాన్యత మాత్రం దుర్యోధన కర్ణ పాత్రలేక! ఒరిజినల్‌గా మణి రాసుకొన్న కథ ప్రకారం క్లైమాక్స్‌లో ధుర్యోధనుడి పాత్ర నుంచి స్పూర్తి పొంది తయారు చేసిన మమ్ముట్టీ రోల్ చనిపోవడంతో సినిమా ఎండ్ అవుతుంది. షూటింగ్ వరకూ ఇలాగే పూర్తి చేశారు. అయితే మమ్ముట్టీకి మళమాలంలో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి సూపర్ స్టార్ క్యారెక్టర్‌ను సినిమాలో చంపేస్తే వాళ్లు తట్టుకోలేరు. ధర్నాలు, బంద్‌లు కూడా జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే మళయాలం కోసం క్లైమాక్స్ మార్చారు. 

ఆ వెర్షన్‌లో రజనీకాంత్ క్యారెక్టర్‌ను చంపేయడం ద్వారా సినిమాను ముగించారు. దీంతో అటు తమిళంలో రజనీ అభిమానులు హ్యాపీ, ఇటు మళయాలంలో మమ్ముట్టీ అభిమానులు హ్యాపీ! మరి మణి వంటి దర్శకుడు అలా హీరోల ఇమేజ్ కోసం రెండు రకాల క్లైమాక్స్‌లు తీయడం అంటే.. అదొక అరుదనే అనుకోవాలి. ఇలా రెండు భాషల్లో రెండు క్లైమాక్స్ లున్న సినిమాగా దళపతి నిలిచిపోయింది.

‘చంద్రముఖి’ సినిమా విషయంలో కూడా దాదాపు ఇలాగే జరిగింది. హీరో ఇమేజ్‌ను పెంచడం కోసం క్లైమాక్స్‌లో మార్పు చేశారు. రజనీకాంత్, ప్రభు, జ్యోతికలు ముఖ్యపాత్రల్లో వచ్చిన ‘చంద్రముఖి’ సినిమాకు మూలం మళయాలీ సినిమా ‘మణిచిత్రతాళు’ ఈ సినిమాలో మోహన్ లాల్, సురేష్ గోపి, శోభనలు ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు. చంద్రముఖి తెలుగు, తమిళ వెర్షన్‌ల క్లైమాక్స్‌పై అందరికీ అవగాహన ఉంటుంది. చంద్రముఖి తనను గత జన్మలో చంపిన రాజుగా భావిస్తున్న సైకియాట్రిస్ట్ కైలాష్‌ను చంపితేనే శాంతిస్తుందన్నట్టుగా తమిళ తెలుగు వెర్షన్లలో చూపుతారు. అయితే ఒరిజినల్‌లో మాత్రం దెయ్యం పట్టిన పాత్రలోని శోభన తన భర్త పాత్రలోని సురేష్ గోపిని చంపింతేగానీ శాంతించనంటుంది! అంటే గత జన్మలో తనను చంపిన రాజే ఈ జన్మలో తన భర్తగా ఉన్నాడని భావిస్తోందనమాట. ఒరిజినల్ వెర్షన్ క్లైమాక్స్‌లో సురేష్ గోపీ పాత్రను శోభన రోల్‌తో దగ్గరుండి హత్య చేయించినట్టుగా భ్రమింపజేస్తుంది మోహన్ లాల్ పాత్ర. అయితే తమిళంలో ఈ సినిమాను రీమేక్ చేసేటప్పుడు.. రజనీ ఇమేజ్‌కు తగ్గట్టుగా క్లైమాక్స్‌ను మార్చి.. ప్రభు చేసిన చంద్రముఖి భర్త పాత్రకు ప్రాధాన్యత తగ్గించారు! 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?