Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ఫామిలీ మేటర్స్‌లో కోర్టుల కిరికిరి

ఫామిలీ మేటర్స్‌లో కోర్టుల కిరికిరి

ఏ ఫామిలీ మేటర్‌లో అయినా జోక్యం చేసుకునే హక్కు కోర్టులకు వుంది. అయితే హక్కు వుంది కాబట్టి ఎడా పెడా ఇంటర్ఫియర్‌ అయిపోతాం అనే విధంగా కోర్టులు ప్రవర్తించటం వల్ల కుటుంబాలకు మేలు జరుగక పోగా చాలా నష్టం జరగడానికి ఎక్కువ అవకాసం వుంది.

ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక స్టేట్మెంట్‌ ఇచ్చింది.

కొడుకులు తల్లిదండ్రుల్ని తిట్టటం, కొట్టటం లాంటి పనులు చేస్తే ఆ కొడుకుని తమ ఇంటినుంచి గెంటి వేసే హక్కు తల్లిదండ్రులకుంటుంది అన్నది ఆ స్టేట్మెంట్‌ తాత్పర్యం.

మన సొసైటీలో కుటుంబ వ్యవస్థ గురించి సరైన అవగాహన వుంటే అలాంటి స్టేట్‌మెంట్స్‌ ఎవరూ ఇవ్వరు.. ఇవ్వలేరు.

*నాయినా.. నేనూ చెల్లీ నీతో మాట్లాడాలి.. 

ఏం మాట్లాడెడిదున్నది?

*నువ్వు ఇయాల్రేపు మస్తుగ తాగుతున్నవ్‌.. డాక్టర్‌ తాగొద్దని చెప్పినా గాని ఇంటమ్‌లే..

అవ్‌ రా..! నా పైసల్తోటి నేను తాగుతున్నా.. నిన్నేమైనా పైసలడిగినానా?

*నేను మాట్లాడెడిది పైసల గురించి గాదు.. తాగితే నీకు నడవనికి కూడా రాదు.. మొన్నేమాయే? ఆ చౌరాస్తాల తెల్లారే వరకూ పడివున్నావ్‌.. నీ పక్కకెళ్లే కార్లు బస్‌లూ పోతుండె.. 

ఔరా.. నా పైసలు.. నా ఇష్టం.. తాగుతా.. తింటా.. నీకేమాయే?

*అరె.. నీకేమైనా దమాకున్నదా? లాస్ట్‌ వీక్‌ గిట్లనే తాగి తాగి మంచాన్న పడితే దవాఖానాల జేర్చినం.. 

జేరితే ఏమాయే? ఆరోగ్యశ్రీ కార్డున్నది గదా.. 

*తూ.. నీయవ్వ.. నీతోటి మా ఇజ్జత్‌ పోతున్నది. గిట్లనే తాగి ఏ రోడ్మీదనో పడిచస్తావ్‌.. అంటూ కొడుకు కూతురు తిట్టటం మొదలెట్టే సరికి తండ్రి వెంటనే పోలీసులకు ఫోన్‌ జేస్తాడు.. 

నా పిల్లలు నన్ను తిట్టి అవమాన పరచిన్రు.. నా ఇంట్ల కెళ్లి పొమ్మంటే పోటంలేదు.

పోలీసులు వచ్చి పిల్లల్ని ఇంటినుంచి బయటకు తోలేస్తారు.

ఆహా..  కోర్టు ఎంత మంచి సౌలత్‌ ఇచ్చిన్ద్రా భాయ్‌.. పిల్లగాల్లను మెడబట్టి బయటకు తోలే కానూన్‌ తల్లిదండ్రుల కిచ్చింది.. అనుకుంటూ హాపీగా ఫీలవుతారు తల్లిదండ్రులు.

తరువాత ఓల్డ్‌ ఏజ్‌లో ముసలాల్లకు హెల్త్‌ ప్రాబ్లెమ్స్‌ వచ్చి మంచాన పడతారు.. ఆ విషయం తెలిసినా పిల్లలు పట్టించుకోరు.. 

కోర్ట్‌ కానూన్‌ వున్నదని మమ్ముల బయటకు నూకినావ్‌ గదా.. గిప్పుడు ఆ కోర్టోడినే వచ్చి నీకు సేవలు జెయ్యమను.. అంటారు.

ఇంకో కేస్‌ ఎలా ఉంటుందంటే ఓల్డ్‌ ఏజ్‌లో భార్య చనిపోయిందని ఇంకో పెళ్లికి రడీ అవుతాడు ముసలాడు. దాంతో ఇంట్లో ముసలం.

పిల్లలంతా ఒకటై ఎదురు తిరుగుతారు. అందుకు కారణాలు అనేకం. ముఖ్యంగా ఆస్తి వ్యవహారాలు.. 

ఏమైనా సరే.. నువ్వు ఈ వయసులో రెండో పెళ్లి చేసుకోడానికి వీల్లేదు అంటూ గొడవ చేస్తారు.

వెంటనే కోర్టు ఇచ్చిన హక్కుతో పిల్లలందరినీ బయటకు గెంటి ఇంకో పెళ్లి చేసుకుంటాడు ఆ ముసలాయన.

తరువాత పెళ్లాం గొడవపడి తనదారిన తను వెళ్లి పోయిన్దనుకోండి.

ముసలాయన మంచాన్న పడినా ఒక్కరు కూడా పట్టించుకోరు. దిక్కులేని చావు చావాల్సిందే.. 

మన దేశంలో.. పట్టణాల్లో కూడా ఇంకా మెజారిటీ కుటుంబాలు వుమ్మడి కుటుంబాలే.. పల్లెల్లో నూరుపాళ్లూ వుమ్మడి కుటుంబాలే వున్నాయ్‌.

ఇలాంటి పరిస్థితుల్లో కోర్టులు మన దేశాన్నీ, మన దేశంలో మాత్రమే మిగిలివున్న కుటుంబ సంబంధ బాన్ధవ్యాలనూ, మన కుటుంబ వ్యవస్థనూ దృష్టిలో పెట్టుకుని అలాంటి చట్టాలు చేయకుండా వుంటే చాలా కుటుంబాలకు మేలు చేసిన వారవుతారు. కుటుంబ వ్యవస్థను రక్షించడానికి చట్టాలు అవసరం గానీ విచ్ఛిన్నం చేయడానికి కాదు.

(సరదాకు మాత్రమే... ఇతర ఉద్యేశాలు లేవని మనవి)
-యర్రంశెట్టి సాయి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?