Advertisement

Advertisement


Home > Articles - Special Articles

గోపీచంద్‌ లేకపోతే.!

గోపీచంద్‌ లేకపోతే.!

పీవీ సింధు.. బ్యాడ్మింటన్‌లో రజతం సాధించింది. కాస్తలో మిస్సయ్యిందిగానీ, లేదంటే స్వర్ణ పతకాన్ని సగర్వంగా భారతదేశానికి తీసుకొచ్చేదే. ఇక్కడ ఆమె పడ్డ కష్టం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే సింధు కన్నా ఎక్కువ కష్టపడింది మాత్రం ముమ్మాటికీ కోచ్‌ గోపీచంద్‌ అని చెప్పకతప్పదు. పరిచయం అక్కర్లేని పేరు అది. భారత బ్యాడ్మింటన్‌ సంచలనంగా ఒకప్పుడు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న పుల్లెల గోపీచంద్‌, రిటైర్మెంట్‌ తర్వాత కోచ్‌గా అవతారమెత్తాడు. 

అయితే, గోపీచంద్‌ అకాడమీ స్థాపించేందుకుగాను పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం కరవయ్యింది. మానసికంగా గోపీచంద్‌ని చాలామంది చాలా రకాలుగా దెబ్బ కొట్టారు. దెబ్బ దెబ్బకీ అతనిలో కసి పెరిగింది. శిష్యుల ద్వారా సత్తా చాటాలనుకున్నాడు. తన దగ్గర శిష్యరికం చేసేవారి విషయంలో చాలా కఠినంగానే వ్యవహరించాడు. ఆ కఠిన పరీక్షను తట్టుకుంటేనే, అంతర్జాతీయ పోటీల్లో ఒత్తిడిని తట్టుకోగలరని భావించాడు. 

కష్టాన్ని నమ్ముకుంటే తప్ప విజయాలు సాధించలేమనీ, విజయానికి షార్ట్‌ కట్స్‌ వుండవనీ శిష్యులకి బోధించాడు. అలా గోపీచంద్‌ శిష్యరికంలోనే సింధు రాటుదేలింది. కోర్ట్‌లో ఆడేది సింధు అయినాసరే, ఆమెకు ప్రతి విషయంలోనూ మెలకువల్ని గోపీచంద్‌ నేర్పించాడన్నది నిర్వివాదాంశం. సింధు హైట్‌ని దృష్టిలో పెట్టకుని, ఆమె బెండింగ్‌ పొజిషన్‌ దగ్గర్నుంచి, ప్రతి ఒక్క విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుని, ఆమెకు అవసరమైన రీతిలోనే కోచింగ్‌ ఇచ్చాడు. 

'గోపీచంద్‌ లేకపోతే నేను లేను, ఈ రోజు ఈ పతకం లేదు..' అంటూ చెమర్చిన కళ్ళతో సింధు చెప్పిందంటే, సింధు సాధించిన పతకం వెనుక గోపీచంద్‌ కష్టమేంటో అర్థం చేసుకోవచ్చు. గోపీచంద్‌ అంతరంగం తెలిసిన ఆయన సతీమణి, ఇతర సన్నిహితులు, సింధు సెమీ ఫైనల్‌లో గెలిచిన వెంటనే కంటతడిపెట్టారు. గోపీచంద్‌ బౌన్స్‌ బ్యాక్‌.. అని నినదించారు. సింధు ఆడుతోంటే, గోపీచందే కన్పించాడని సింధు తల్లిదండ్రులు కూడా వ్యాఖ్యానించారు. 

ఆటగాడికి వయసు మీద పడ్డాక, ఆట మీద మమకారం తగ్గిపోతుందనేది అన్ని సందర్భాల్లోనూ నిజం కాదు. తాను ఆడలేకపోవచ్చు, కానీ.. ఆడించగలడు. అందుకే క్రీడాకారుల్ని పోరాటయోధులు అంటుంటాం. గోపీచంద్‌ నిజమైన పోరాటయోధుడు. ఆయన కలని సాకారం చేసేందుకు సింధు పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. ఇది గురు శిష్యుల విజయం. ముమ్మాటికీ ఇది నిజం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?