Advertisement

Advertisement


Home > Articles - Special Articles

గృహహింస కేసుల్లో ప్రముఖులు

సోమనాథ్ భారతి అజ్ఞాతంలోకి వెళ్లడానికి ప్రేరేపించిన పరిస్థితులకు కారణం: ఆయన భార్య లిపికా మిత్ర ఆయనపై పెట్టిన గృహహింస కోర్టు ఓ కొలిక్కి రావడమే. భార్యని భార్యగా చూడడం ఆయనకు తెలీదని, చిత్రహింసలకు గురిచేసేవాడని...గుట్టు చప్పుడు కాకుండా చంపేందుకు కూడా వెనుకాడని విపరీత మనస్థత్వం ఆయనదని...ఆ వైఖరిపై ఒక్కసారిగా భగ్గుమన్న సోమనాథ్ చటర్జీ భార్య లిపికా మిత్ర ముందు పోలీసుల్నీ, తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పెళ్లయినదగ్గర్నుంచీ పడుతున్న కష్టాలు, కడగండ్లను పూసగుచ్చినట్లు వివరించింది. అదనపు కట్నం ఆశతో అనేకరకాలుగా తనకు నరకం చూపించాడని, పెంపుడు కుక్కను కూడా తనపై ఎగదోసి చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా...హతమార్చేందుకు కూడా  యత్నించాడంటూ ఆమె భర్తపై అనేక ఆరోపణలు చేసింది. అంతే! మాజీ న్యాయశాఖమంత్రికి న్యాయపర కష్టాలు మొదలయ్యాయి. మొదట్లో...తన భార్య చెప్పినవన్నీ కట్టుకథలేనని సమాజాన్ని, పోలీసుల్ని, న్యాయస్ధానాన్నీ నమ్మించేందుకు ప్రయత్నించి విఫలమైన సోమనాథ్ భారతి...సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కోవాల్సింది పోయి...కనిపించకుండా పలాయనం చిత్తగించారు. ఇలా అజ్ఞాతంలోకి ఆయన జారుకోవడం కూడా సర్వత్రా చర్చనీయాంశమైంది. సోమనాథ్ భారతికి ఆశ్రయం ఇచ్చిన అయిదుగురిని కూడా పోలీసులు గుర్తించారు. కాగా, పలాయనం చిత్తగించిన సోమనాథ్ భారతిపై  ఆప్‌నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

కేజ్రీవాల్ మండిపాటు

వాళ్లంతా ప్రముఖులే . సమాజానికి దిశానిర్ధేశం చేసే కీలకబాధ్యతల్ని భుజానెకత్తుకున్నవాళ్లే. వేదికలు, మైకు లుదొరికినప్పుడల్లా...ప్రస్తుత పరిస్థితుల్ని ప్రక్షాళన చేస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేసే మహానేతలే. అవకాశాల్ని చిక్కించుకుంటూ చట్టసభల్లో తమకంటూ ఇంత చోటు దక్కించుకుంటున్నవాళ్లే. అయితేనేం...‘చెప్పేందుకే శ్రీరంగనీతులు’ అన్నటైపు. ఎదుటివాళ్లకోసం ఎన్ని ధర్మపన్నాలైనా వల్లెవేస్తారు. తమదాకా వస్తేనే అసలు రంగు బయటపడుతుంది. అప్పుడే ‘నేతిబీరకాయ’లో నెయ్యి చందంగా నిజమైన వ్యక్తిత్వం ప్రజలకు తెలుస్తుంది. అలా తెలిసిన క్షణంలో...ఇల్లూ, ఈ సమాజం కంటపడకుండా ఏ దూరతీరాలకో పలాయనం చిత్తగించాల్సిన దయనీయమైన పరిస్థితులు ఎదురవుతాయి. సరిగ్గా, ఇప్పుడలాంటి స్థితిలోనే ఉన్నాడో మాజీ న్యాయశాఖామంత్రి. ఒకప్పుడు న్యాయశాఖమంత్రిగా పనిచేసిన ఆ నేతకు ఇంట్లో ఇల్లాల్ని చూసుకునే ‘సహజన్యాయసూత్రాలు’ తెలీలేదో..తెలిసినా ఖాతరు చేయలేదో కానీ...నాలుగ్గోడల మధ్య బంధించి చావచితకబాదితే పిల్లి సైతం పులిలా మారి పంజా విసురుతుందని ఆయనగారు అర్ధం చేసుకునేసరికి సమయం మించిపోయింది. తను లోకువగా భావించిన ‘పిల్లి’లాంటి ఇల్లాలే కన్నీటి చారికలు తుడుచుకుని ఇన్నాళ్లూ ‘ఇల్ల’నే నాలుగ్గోడల మధ్య మౌనంగా భరించిన అఘాయిత్యాలు, అన్యాయాలను ఎదిరిస్తూ ‘పెద్దపులి’లా మారి పంజా విసిరేసరికి...ఆ మాజీ న్యాయశాఖామంత్రి మరి తట్టుకోలేకపోయారు. మీడియా ముందు చెప్పాల్సిన అబద్దాలు, చేయాల్సిన ఆరోపణలు చేసిచేసి..న్యాయస్ధానం కూడా అక్షింతలు వేస్తుంటే...చివరాఖరికి ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి జారుకుని తమ పార్టీ నేత అల్టిమేటం తర్వాత లొంగిపోయి కోర్టు కేసునెదుర్కొనేందుకు ముందుకొచ్చారు. . ఆయనే...ప్రస్తుత రాజకీయాల్ని సమూలంగా మార్చేందుకు పుట్టుకొచ్చిన ‘ఆమ్ ఆద్మీ’ పార్టీలో కీలకనేత. పేరు: 
సోమనాథ్ భారతి. 

సోమనాథ్ భారతి వెంటనే పోలీసులకు లొంగిపోవాల్సిందిగా కేజ్రీవాల్ గట్టి హెచ్చరికే చేసారు. ఈమేరకు ఆయన ఓ ట్వీట్ చేసారు. సోమనాథ్ భారతి వ్యవహారశైలిపై అగ్గిమీద గుగ్గిలమవుతున్న అరవింద కేజ్రీవాల్ ఆంతరంగిక సమావేశాల్లో పలుమార్లు అసహనం వ్యక్తం చేసినట్లు వార్తాకథనాలు వెలువడ్డాయి. రాజకీయాలకు కొత్త దశ, దిశ చూపిస్తామంటూ పార్టీని స్థాపించి రెండోసారి ప్రజామోదంతో పాలనాపగ్గాలు చేపట్టిన ఆప్‌నేతకు పార్టీలోని ప్రముఖులవల్లే తలనొప్పులొస్తున్నాయి. మరొకరికి దిశానిర్ధేశం చేయాల్సినవాళ్లే...అమానవీయంగా ప్రవర్తిస్తూ పీకల్లోతు కష్టాల్లోకి జారుకోవడం ఆయనకు మింగుడు పడడం లేదు. అందుకే, తన అసహనాన్ని ట్వీట్ చేస్తూ...‘వెంటనే లొంగిపోవాల్సి’ందిగా సోమనాథ్ భారతికి అల్టిమేటం జారీ చేసారు. ఆప్‌నేత హెచ్చరికను మాజీ న్యాయశాఖమంత్రి ఏమేరకు పరిగణనలోనికి తీసుకుంటారో...లిపికా మిత్ర పెట్టిన గృహహింస కేసు ఇంకెన్ని మలుపులు తిరిగి ఆయన్ని ఏ ప్రస్థానానికి చేరుస్తుందో...భవిష్యత్ నిర్ణయిస్తుంది. కాకుంటే...బాధ్యతాయుతమైన పదవుల్లో, సమాజంలోని సామాన్య ప్రజానీకాన్ని విశేషంగా ప్రభావితం చేయాల్సిన కీలకభూమికల్లో ఉన్నవాళ్లు ఈ తరహా వైఖరితో ‘వార్తల్లో వ్యక్తు’లుగా నానడం శోచనీయం. 

ఇలాంటి ప్రముఖులు ఇంకెందరో?

ఒక్క సోమనాథ్ భారతే కాదు...ఇలాంటి ప్రముఖులు ఇంకా ఎంతోమంది ఉన్నారు. రాజకీయరంగంలో ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలవాల్సినవ్యక్తులే భార్యలపట్ల కఠినాతికఠినంగా వ్యవహరిస్తున్నారనడానికి మరో సాక్ష్యం ఇది.

కేరళ రాష్ట్రానికి చెందిన కె.బి. గణేష్ కుమార్  2013లో ఆ రాష్ర్ట అటవీ శాఖమంత్రిగా ఉన్న సమయంలో  వ్యక్తిగత సిబ్బంది ఎదుటే తనని పలుమార్లు అవమానపరిచాడంటూ ఆయన భార్య యామిని పోలీసులకు ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. 16 సంవత్సరాలుగా భర్త ఆగడాలు, అవమానాలు భరిస్తూ వస్తున్నానని...ఇకపై భరించే ఓపిక తనకు లేదంటూ న్యాయం కోసం ఆమె కోర్టు తలుపులు తట్టింది. మంత్రి గణేష్‌కుమార్ ఇంటిభాగోతం కేరళముఖ్యమంత్రి ఉమెన్‌చాందికి ఇప్పట్లో సోమనాథ్ భారతి వ్యవహారం అరవింద్ కేజ్రీవాల్‌కి తలనొప్పి కలిగిరచినట్లే...తలనొప్పి తెచ్చింది.

తళుకుబెళుకుల గ్లామర్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన వెండితెర తారలెంతోమంది నాలుగ్గోడల మధ్య నానా చిత్రహింసలకు గురవుతున్నారని ఎన్నోమార్లు మరెన్నో సంఘటనలు తెలియజేస్తున్నాయి. 

ఓంపురిపై భార్య నందితాపురి కేసు 

‘నా భర్త ఓంపురి చిత్రహింసలకు గురిచేసారం’టూ నందితాపురి న్యాయపోరాటం చేస్తోంది. ఓంపురి జగమెరిగిన బాలీవుడ్ నటుడని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నందితాపురి కూడా ఓ సెలబ్రెటీ భార్యగానే కాకుండా, జర్నలిస్ట్‌గా బాధ్యతాయుతమైన విధులు నిర్వర్తిస్తున్నారు. ఓంపురి తనను విచక్షణారాహిత్యంగా కర్రలతో చితకబాదేవారని ...ఈ టార్చర్ 2013 ఆగస్ట్ 22 సాయంత్రం మరింతగా పైశాచికంగా మారిందని న్యాయం కోసం ఆమె బయటకొచ్చారు. మాజీభార్యనుంచి కాల్ వచ్చిన తర్వాత ఓంపురి మనిషిలా ప్రవర్తించరని చెప్తూ...ఆవిడ కాల్స్ అటెండ్ కావొద్దని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకునేవాడు కాడని ఆమె పేర్కొవడం విశేషం. ఆరోజు కూడా అలాగే ఆమె దగ్గరనుంచి కాల్ రావడం..ఆయన మాట్లాడడం...ఆ తర్వాత తనని విచక్షణారాహిత్యంగా కర్రలతో గొడ్డును బాదినట్లు బాదడం...భరించలేక తాను  రక్షణ కోసం పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించడం వరుసగా జరిగిన సంఘటనలని అప్పట్లో ఆమె మీడియాముఖంగా ప్రకటించింది. 

యుక్తాముఖిదీ ఇదే బాధ:

యుక్తాముఖి గుర్తుందా? మాజీ మిస్‌వరల్డ్. తన అందచందాలతో ప్రపంచాన్ని సమ్మోహనపరిచిన ఈ సుందరి తన భర్త వేధింపులు తాళలేక విముక్తి కోసం ఫామిలీ కోర్టును ఆశ్రయించింది. న్యూయార్క్‌లో వ్యాపారవేత్తగా పేరొందిన ప్రిన్స్‌తులి..తన భర్త అని చెప్తూ యుక్తాముఖి ఆయన వేధింపులు ఇన్నీ అన్నీ కావంటూ పోలీసులనాశ్రయించింది. 

కన్నడ నటుడు దర్శన్ కూడా వేధింపుల భర్తే

కన్నడ నటుడు దర్శన్ కూడా వేధింపుల భర్తేనంటోంది అతడి భార్య  విజయలక్ష్మి. దర్శన్ అనుక్షణం తనను మాటలతో, చేష్టలతో వేధించేవాడని పేర్కొంటూ పోలీసుల్ని ఆశ్రయించింది. బాలీవుడ్ నటుడు రాజా చౌదరిని పెళ్లి చేసుకున్న శ్వేతాతివారి కూడా  వివాహజీవితాన్ని సజావుగా సాగిరచలేకపోయింది. భర్త హింసల్ని తట్టుకోలేక ఆమె కూడా పోలీసు కేసు పెట్టింది. అప్పట్లో బిగ్‌బాస్ కార్యక్రమంలో ప్రవేశించడానికి మూడురోజుల ముందుగా ఆమె తన భర్త ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలనాటి బాలీవుడ్ హీరోయిన్ జీనత్ అమన్ కూడా భర్త మజహర్ ఖాన్ నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగానే గడుపుతోంది. ఇవి కేవలం వెలుగులోకి వచ్చిన కొన్ని కేసులు మాత్రమే. ఏ రంగంలో ఉన్నా భార్యను గౌరవించలేని పురుషపుంగవులు ఎందరో ఉన్నారు. సహధర్మచారిణిని సమంగా చూసేలా గృహహింస చట్టాలు ఉపయోగపడతాయా? అన్నది మరో ప్రత్యేక చర్చ. 

పివిడిఎస్. ప్రకాష్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?