Advertisement

Advertisement


Home > Articles - Special Articles

జీఎస్టీతో అదిగదిగో స్వర్ణయుగం.!

జీఎస్టీతో అదిగదిగో స్వర్ణయుగం.!

పెద్ద పాత నోట్ల రద్దుతో దేశం అభివృద్ధిలో పరుగులు తీస్తుందన్నారు. మార్పు ఎక్కడో ఓ చోట మొదలవ్వాలనీ, దేశంలో అవినీతి అంతమవ్వాలనీ భావించిన దేశ ప్రజానీకం కష్టమైనా పెద్ద పాత నోట్ల రద్దు అనే 'పాశవిక' నిర్ణయాన్ని భరించారు. పాలకులు పైశాచికానందం పొందుతోంటే, ప్రజలు రోడ్డున పడ్డారు. ఆ తర్వాత ఏం జరిగింది.? అన్నది అందరికీ తెల్సిన విషయమే.! 

పాత 500, 1000 రూపాయల నోట్లకు బదులు కొత్తగా వచ్చిన 2 వేల రూపాయల నోటుని తేలిగ్గా 'నకిలీ' చేసేస్తున్నారు. నల్ల కుబేరులు 'బ్లాక్‌ మనీని' దాచుకోవడానికి మార్గం ఇంకాస్త సుగమం అయ్యిందంతే. పెద్దలు ఏ స్థాయిలో బ్లాక్‌ మనీని వైట్‌ మనీగా మార్చుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయనీ, పెట్రో ధరలు దిగివస్తాయనీ చెప్పిన బీజేపీ, ఇప్పుడా ఊసు ఎత్తడంలేదాయె.! 

ఇక, ఇప్పుడు జీఎస్టీ పేరుతో దేశవ్యాప్తంగా పెద్దయెత్తున పబ్లిసిటీ స్టంట్‌ నడుస్తోంది. అభివృద్ధి కోసం చేపట్టే సంస్కరణల్లో భాగంగా జీఎస్టీని తెరపైకి తీసుకొస్తున్నారు. అయితే, దీనికోసం జరగాల్సిన రీతిలో 'కసరత్తు' జరగలేదనే వాదనలు విన్పిస్తున్నాయి. రాష్ట్రాలకు జీఎస్టీతో వచ్చే నష్టాన్ని భర్తీ చేసే విషయమై కేంద్రం హామీ ఇచ్చినా, ఈ తరహా హామీల్ని పాలకులు తుంగలో తొక్కేయడం పెద్ద విషయమేమీ కాదు. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం ఇచ్చిన హామీ ఏమయ్యిందో అందరికీ తెలుసు కదా.! 

కొన్ని వస్తువుల రేట్లు జీఎస్టీ రాకతో తగ్గుతాయట.. ఇంకొన్ని పెరుగుతాయట.! ఇది ఎప్పుడూ జరిగేదే. బడ్జెట్‌ వచ్చిన ప్రతిసారీ ఇదే తంతు. కానీ, పెరిగేవి చాలా ఎక్కువ.. తగ్గేవి చాలా తక్కువ వుంటాయి. ఆ లెక్కన, తగ్గింపు ఉపశమనం కన్నా, పెంపు కారణంగా వచ్చే వాపు అత్యంత బాధాకరంగా వుంటుంది. జీఎస్టీపై ఆర్థిక రంగ నిపుణులు చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తోంటే, మీడియా మాత్రం మోడీ భజనలో మునిగి తేలుతుండడం గమనార్హం. 

మొత్తమ్మీద, మరో బాదుడికి దేశ ప్రజానీకం సిద్ధంగా వుండాల్సిందే. బాదుడు మాత్రమే కాదు, ఆర్థిక వ్యవస్థకి జీఎస్టీ పెను సవాల్‌ విసరనుంది. కొన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ముందు ముందు అగమ్యగోచరంగా తయారవనుంది. ఏం చేయగలం.? ఏం జరిగినా చూస్తూ ఊరుకోవడం తప్ప.!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?