Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ఇంకేం పోరాటం...ఎన్నికల్లో తీర్పు ఇవ్వాల్సిందే...!

ఇంకేం పోరాటం...ఎన్నికల్లో తీర్పు ఇవ్వాల్సిందే...!

కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు, ఒకప్పుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి 'ఆత్మ'గా బతికిన డాక్టర్‌ కేవీపీ రామచంద్రరావును తమిళ ప్రజలు జల్లికట్టు క్రీడ కోసం చేసిన పోరాటం బాగా కదిలించినట్లుంది. నాలుగు రోజులపాటు లక్షలాదిమంది జనం మెరీనా తీరంలో తిష్ట వేసి ఏమాత్రం ఉద్రిక్తపూరిత వాతావరణం కల్పించకుండా శాంతియుతంగా ఆందోళన చేయడం, అందుకు సమస్త పార్టీలు, యావత్తు సినీ పరిశ్రమ మద్దతు పలకడం, ప్రపంచవ్యాప్తంగా తమిళులు సపోర్టు చేయడం, చివరకు కేంద్రం, సుప్రీం కోర్టు దిగివచ్చి వారి కోరిక నెరవేర్చడం...ఇదంతా నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. ఈ క్రీడలోని మంచి చెడులు పక్కకు పెడితే ఒక డిమాండ్‌ సాధించుకోవడం కోసం పార్టీలు, ప్రజలు రాజకీయాలకు, సిద్ధాంతాలకు అతీతంగా ఒక్కటి కావడం మెచ్చుకోదగిన విషయం. తమిళుల ఆందోళన నుంచి కేవీపీ బాగా స్ఫూర్తి పొందినట్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా కోసం ఈవిధంగా పోరాటం చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు.

తమిళుల పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరం ఒక్కటి కావాలన్నారు. చట్టవిరుద్ధమైన జల్లికట్టును వారు సాధించుకోగలిగినప్పుడు చట్టబద్ధమైన ప్రత్యేక హోదాను మనం సాధించుకోలేమా? అని వైఎస్‌ 'ఆత్మ' ప్రశ్నించారు. ఈ పోరాటానికి చంద్రబాబు నాయకత్వం వహిస్తే అన్ని పార్టీలూ సహకరిస్తాయన్నారు. కాబట్టి చంద్రబాబు చొరవ తీసుకొని ముందుకు రావాలని కోరారు. చంద్రబాబు పోరాటం చేయకపోతే భావి తరాలకు అన్యాయం చేసినవారమవుతామని, చరిత్ర హీనులం అవుతామని కేవీపీ ఆవేదన చెందారు. కేవీపీ చెప్పిదంతా వాస్తవమే. కాని ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడుగాని, ఇతర పార్టీలుగాని ఇంకా పోరాడే పరిస్థితి ఉందా? ఆంధ్రప్రదేశ్‌కూ వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరముంది. కాని ఎక్కడికక్కడ మెరీనా తీరం తరహా పోరాటం సాధ్యమవుతుందా? సముద్ర తీరం అక్కర్లేదు. రోడ్లు చాలు. కేవీపీ మనస్ఫూర్తిగా లేఖ రాశారో, రాజకీయంగా రాశారో చెప్పలేంగాని ప్రత్యేక హోదా కోసం రోడ్డెక్కి పోరాటం చేసే పరిస్థితి ఆంధ్రలో లేదని చెప్పొచ్చు. రాష్ట్రం విడిపోయి దాదాపు మూడేళ్లయింది. ఇప్పటివరకు చేయని తీవ్ర పోరాటం ఇప్పుడు చేస్తారని ఎలా అనుకుంటాం. 

కొంతకాలం క్రితం ప్రతిపక్షాలు ఏదో కొంతమేరకు పోరాటం చేసినా అది తాటాకు చప్పుళ్ల మాదిరిగా ఉంది తప్ప తమిళులు చేసినంత ఉధృతంగా ఏనాడూ చేయలేదు. జల్లికట్టుకు పన్నీరుశెల్వం సర్కారు మద్దతు ఇచ్చింది. కాని ప్రత్యేక హోదాకు చంద్రబాబు నాయుడు ఎన్నడూ మద్దతు ఇవ్వలేదు. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ (కేంద్రం చెప్పిన మాట ప్రత్యేక ఆర్థిక సాయం) బ్రహ్మాండంగా ఉందని, ఇదే సర్వరోగ నివారిణి అని చంద్రబాబు గర్వంగా చెప్పుకున్నప్పుడు ఇంకా ఆయన ఎందుకు పోరాటం చేస్తారు? ప్రతి విషయంలో రెండు రకాలుగా మాట్లాడే అలవాటున్న ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా విషయంలోనూ రెండు రకాలుగా మాట్లాడిన తీరు చూశాం కదా. తమిళనాడులో జనం, పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఒక్కటయ్యారు. ఆ పరిస్థితి ఏపీలో లేదు. ఒక పార్టీతో మరో పార్టీ కలవదు. ఇక్కడ 'క్రెడిట్‌' ప్రాబ్లెం ఎక్కువ. కాంగ్రెసు పోరాటానికి వైకాపా సహకరించదు. వైకాపా పోరాడితే కాంగ్రెసు కలిసిరాదు.  ఈ రెండూ పోరాటం చేస్తే కమ్యూనిస్టులు సహకరించరు. వీరిదంతా సిద్థాంత రాద్ధాంతం. 

ప్రతి పార్టీ వేరే పార్టీకి క్రెడిట్‌ దక్కనివ్వకూడదని తాపత్రయపడుతుంటాయి. అందుకే కలసికట్టుగా పోరాడే పరిస్థితి ఏపీలో లేదు. ఒకవేళ ప్రతిపక్షాలు వీధుల్లోకొచ్చి పోరాటం చేస్తే బాబు సర్కారు తుక్కు రేగ్గొట్టడం ఖాయం. ఇందుకూ కేంద్రమూ సహకరిస్తుంది. చట్ట విరుద్ధమైన జల్లికట్టుకు తమిళులు అనుమతి తెచ్చుకోగలిగినప్పుడు చట్టబద్ధమైన ప్రత్యేక హోదాను మనం సాధించలేమా? అని కేవీపీ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయం విభజన చట్టంలో లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఊరూవాడా తిరిగి చెప్పారు. ఇదే వెంకయ్య నాయుడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామన్నారు. ప్రత్యేక ప్యాకేజీకే ఇప్పటివరకు చట్టబద్ధత కల్పించలేదు. చట్టంలో ఉన్న విశాఖ రైల్వే జోన్‌ వస్తుందో రాదో తెలియదు. పోరాటం చేయాలనే కేవీపీ కోరిక తీరేది కాదు. ఏపీ ప్రజలకు ఉన్న ఒకే ఒక అవకాశం 2019 ఎన్నికలు. ఆ ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే అదే పెద్ద పోరాటంగా భావించాలి. మూడేళ్ల కాలం గడిచిపోయాక వీధి పోరాటాలు చేయడం కంటే ఎన్నికల్లో 'షాక్‌' తగిలే తీర్పు ఇవ్వడం ఉత్తమం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?