Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ఇవి కార్పొరేట్‌ చదువు హత్యలు.!

ఇవి కార్పొరేట్‌ చదువు హత్యలు.!

పరువు హత్యల గురించి విన్నాం.. కార్పొరేట్‌ చదువు హత్యల గురించి చూస్తున్నాం. పరువు హత్యలు అత్యంత తీవ్రమైనవి. మరి, కార్పొరేట్‌ చదువు హత్యల మాటేమిటి.? ప్రభుత్వాలు పట్టించుకోవు.. ఓహో, విద్యార్థులకు ఓటు హక్కు లేకపోవడం వల్లనేనా.? ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కార్పొరేట్‌ చదువు హత్యలు సర్వసాధారణమైపోయాయి. మరీ ముఖ్యంగా నారాయణ - శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో చదువు సంగతేమోగానీ, చావు గంట మాత్రం నిత్యం మోగుతూనే వుంది.! 

మామూలుగా ఓ మరణం సంభవించగానే, ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి. చిత్రంగా చావుల మీద చావులు నమోదవుతున్నా తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు తమకేమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నాయి. మొన్నీమధ్యనే ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో తనిఖీలు నిర్వహించేశారు. నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఖబడ్దార్‌.. అని హెచ్చరించేశారు. 'తొక్కలో హెచ్చరిక' అని కార్పొరేట్‌ విద్యా సంస్థలు లైట్‌ తీసుకున్నాయి. అవును మరి, కార్పొరేట్‌ విద్యాసంస్థల్ని ఏ ప్రభుత్వమైనా శాసించే పరిస్థితి లేదిక్కడ. ఏ ప్రభుత్వాన్ని అయినాసరే, శాసించగల స్థాయికి కార్పొరేట్‌ విద్యా సంస్థలు ఎదిగాయి. మరి.! 

ఫీజుల విషయంలో నియంత్రణ లేదు.. సెలవుల విషయంలో మాట్లాడుకోవడం దండగ. కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో సౌకర్యాల గురించి చెప్పుకోవడమంటే, అంతకన్నా 'బూతు' ఇంకొకటుండదు. అక్కడ ఏమైనా చెల్లుతాయి. కొన్ని కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌ మామూలే. ప్రేమ వ్యవహారాలకు ఆకాశమే హద్దు. గ్రేడ్లు వారిగా విద్యార్థుల్ని విభజించేసి, బాగా చదివినవారిని బండకేసి రుద్దేసినట్లుగా తెగ చదివించేస్తుంటారు. ర్యాంకుల సంగతి దేవుడెరుగు.. ఆ ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థుల ప్రాణాలు పోతున్నాయి. 

ఈ మొత్తం వ్యవహారం ఎల్‌కేజీ నుంచే మొదలవుతుందంటే నమ్మగలమా.? కిలోల కొద్దీ బరువు తూగుతాయి పుస్తకాల బ్యాగులు. ఒకటో తరగతికే వీపు విమానం మోతెక్కిపోతోంది విద్యార్థులకి. 'మా పిల్లలకి చదువు కావాలంతే, మీరేమన్నా చేసుకోండి..' అని తల్లిదండ్రుల్లో చాలామంది, తమ పిల్లల్ని కార్పొరేట్‌ స్కూళ్ళు అనబడే జైళ్ళకి పంపించేస్తున్నారు. తిండి, చదువు, నిద్ర, ఆట అన్నీ అక్కడే. ఇకనేం, బండకేసి బాదుడు షురూ అవుతుంది. 

ఇక్కడ పూర్తిగా కార్పొరేట్‌ స్కూళ్ళదే తప్పని చెప్పేస్తే కుదరదు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆలోచనల్లోనూ మార్పు రావాలి. ప్రభుత్వాలదీ బాధ్యత వుంది. దురదృష్టవశాత్తూ తల్లిదండ్రుల ఆశలకు ఆకాశమే హద్దు అవుతోంది. పిల్లల ప్రాణాలు పోతున్నా, తల్లిదండ్రులు తమ ఆలోచనా విధానాన్ని మాచ్చుకోకపోవడం ఆశ్చర్యకరం. ముందే చెప్పుకున్నాం కదా, ప్రభుత్వాల సంగతి.! ప్రభుత్వాలు కార్పొరేట్‌ విద్యా సంస్థల్ని శాసించడం కాదు, కనీసం ప్రశ్నించలేని దుస్థితిలో వున్నాయి. ఎందుకంటే, ఆ కార్పొరేట్‌ విద్యా సంస్థల్ని నిర్వహిస్తోన్నవారిలో మెజార్టీ ఎవరంటే, రాజకీయ నాయకులే మరి.! 

విద్య అంటే వికాసం ఒకప్పుడు.. ఇప్పుడు విద్య అంటే వైపరీత్యం. చదువుకోవడమన్న మాటకు విలువ లేదు.. ఇప్పుడంతా చదువు కొనుక్కోవడమే.. అది మంచి భవిష్యత్తునివ్వడం సంగతేమోగానీ, విద్యార్థి దశలోనే 'చావు'ల్ని మిగుల్చుతోంది. ఈ నేరానికి శిక్ష విధించాల్సిందెవరు.? శిక్ష అనుభవించాల్సిందెవరు.? అనుభవిస్తోన్నదెవరు.? ఈ తీవ్రవాదంపై సర్జికల్‌ స్ట్రైక్‌ నిర్వహించగలమా.?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?