Advertisement

Advertisement


Home > Articles - Special Articles

‘కాషాయం’ వచ్చె! ‘లౌకికం’ పోయె!?

‘కాషాయం’ వచ్చె! ‘లౌకికం’ పోయె!?

నచ్చటం లేదు. రాజ్యాంగం నచ్చటం లేదు. ఈ రాజ్యాంగం మార్చి కొత్త రాజ్యాంగం తెచ్చుకోవాలన్న కోరిక నరనరాన ఎక్కిపోయింది. ఎవరికి? ఎవరో తిరుగుబాటు దారులకు కాదు. విప్లవకారులకు కాదు. వేర్పాటు వాదులకు కాదు. 

ఎవరయితే రాజ్యాంగాన్ని అమలు జరపాల్సి వుందో వారికే నచ్చటం లేదు. సాక్షాత్తూ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజే, రాజ్యాంగం పట్ల ఆంసతృప్తిని కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసింది. అది కూడా దేశంలోని ప్రతీ పౌరుడికీ తెలిసేలా వ్యక్తం చేసింది. అన్ని పత్రికలలోనూ ప్రకటనల రూపంలో వెలువరించింది. రాజ్యాంగానికి  ‘ప్రవేశిక’ (ప్రీంబుల్)ను ప్రచురిస్తూ, అందులో వున్న ‘సెక్యులరిస్టు’(లౌకిక), ‘సోషలిస్టు’(సామ్యవాద) అనే పదాలను తొలగించింది. అది అచ్చుతప్పు అని సరిపెట్టుకోవచ్చు. కానీ ఇందుకు ఏలిన వారు ఇచ్చిన వివరణలు సహకరించటంలేదు. ఉద్దేశ్యపూర్వకంగానే ఈ రెండు మాటలూ లేకుండా వుండాలని జాగ్రత్త పడ్డట్లుగా అనిపిస్తోంది. 

న్యాయకోవిదులూ, కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇచ్చిన వివరణ ఎలా వుందంటే, అసలు ఈ మాత్రం దానికి వివరణ కూడా ఇవ్వాలా అన్న ధోరణిలో వుంది. అసలు ‘ ఈ పదాలు వుండాలో, లేదో చర్చకు పెడదాం. దేశమే నిర్ణయిస్తుంది.’ అన్నారు. పైపెచ్చు నెహ్రూ ప్రధాని గా  వుండగా అమలులోకి వచ్చిన రాజ్యాంగంలో ఈ రెండు పదాలు లేవనీ, అప్పటి ‘ప్రవేశిక’లో కేవలం ‘సోవరిన్(సర్వసత్తాక), డెమాక్రటిక్ (ప్రజాస్వామిక), రిపబ్లిక్(గణతంత్ర) అన్న పదాలు మాత్రమే వున్నాయని గుర్తు చేశారు. 

నిజమే. 1976 లో 42 వ రాజ్యాంగ సవరణ ప్రకారమే ‘సెక్యులర్, సోషలిస్టు’ అన్నపదాలు చేరాయి. అప్పటికి ఎమర్జన్సీ అమలులో వుండటం కూడా వాస్తవమే. కానీ ఎమర్జన్సీ ఎత్తి వేసిన తర్వాత వచ్చిన జనతా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకూ ఆ పదాలు కొనసాగుతూనే వున్నాయి. ఈ పదాలను ఉపసంహరించుకోవాలన్న ఆలోచన ఏ ప్రభుత్వానికీ రాలేదు. కడకు వాజ్‌పేయీ నేతృత్వంలోని ఎన్డీయే1 సర్కారు ఈ పదాలను మార్చాలని కంకణం కట్టుకోలేదు. కానీ ఇప్పుడు మోడీ సర్కారు మాత్రం ఈ పదాల మీద సరికొత్తగా ‘ఏవగింపు’ను ప్రకటించింది. 

రాజ్యాంగ ప్రవేశికను ప్రచురించటేప్పుడు, సవరణలతో కూడిన  ప్రవేశికనే ప్రచురించాల్సి వుంటుంది. రాజ్యాంగ ముఖ పత్రాన్నే మార్చి ప్రకటించటం రాజ్యాంగ విరుధ్ద అవుతుందో కాదో, రాజ్యాంగ నిపుణలేక తెలియాలి. ఈ పనిని ఏ ప్రయివేటు వ్యక్తులో, ప్రయివేటు సంస్థలో చేసి వుంటే, వారి పై చట్టపరమైన చర్యలు తీసుకునే వారు కారా? ఈ ప్రశ్న ఉదయించకుండా వుంటుందా? 

కాని ప్రభుత్వం తరపున ఈ ప్రకటనను విడుదల చేసిన వారు ఎలా సమర్థించుకోవాలని చూస్తున్నారంటే, తాము తొలి రాజ్యాంగాన్నే ప్రచురించాం, కాబట్టి తప్పు ఎలా అవుతుందీ అంటున్నారు. అంతే కాదు. అప్పటి నెహ్రూ మార్కు సెక్యులరిజమూ, తర్వాత వచ్చిన సెక్యులరిజమూ వేరని కూడా భాష్యాలు చెబుతున్నారు. 

ఇదిలా వుంటే, బీజేపీతో భావసారూప్యం వున్న ఏకైక మిత్ర పక్షం శివసేన, ఏమాత్రం జంకూ, గొంకూ లేకుండా ఈ రెండు పదాలతో పనేమిటీ వాటిని తొలగించాల్సిందే నని వాదిస్తోంది. ఈ పార్టీ నేత సంజయ్ రౌత్  ‘సెక్యులరిస్టు’ అనే మాట అవసరమేలేదని చెబుతూ శివసేన వ్యవస్థాపకు బాల థాకరే, అంతకన్నా ముందు వీర్ సావర్కర్ కూడా ఈ విషయంలో స్పష్టమైన వైఖరి కలిగివున్నారని గుర్తుచేశారు. దేశం నుంచి ముస్లింల కోసం పాకిస్తాన్ వేరు చేసి ఇచ్చాక, మిగిలినది హిందువుల దేశం మాత్రమే నని వారు భావించారన్నారు. 

భిన్న మతాల, సంస్కృతుల సముదాయంగా దేశాన్ని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. అంతే కాదు. మతస్వేఛ్చ కలిగిన లౌకిక రాజ్యంగా ఈ దేశాన్ని ప్రకటించారు. ఏ రిపబ్లిక్ నాడు ‘సెక్యులరిస్టు’ పదంలేని ప్రకటన విడుదల చేశారో, అది రిపబ్లిక్ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా వచ్చిన అమెరికా అధ్యక్షుడు తన భారత పర్యటనను ముగించుకుని వెళ్తూ, వెళ్ళూ ఏమన్నారు? అమెరికా, భారత్‌లలోని ప్రజాస్వామ్యాలలో మత స్వేఛ్చకు ఆస్కారముందనీ, ఎవరయినా తమకు ఇష్టం వచ్చిన మత విశ్వాసాన్ని స్వీకరించ వచ్చనీ, తమ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చనీ, ఏ మతం మీదా విశ్వాసం లేకుండా కూడా జీవించ వచ్చనీ గుర్తు చేసి వెళ్ళారు. 

అంటే మన రాజ్యాంగంలో , మన నేతలు పక్కన పెట్టాలనకున్న ‘సెక్యులర్’ స్ఫూర్తిని, ఒబామా గుర్తు చేసివెళ్ళాల్సి వచ్చింది. అయినా మన నేతలకు స్పృహ వచ్చినట్లు లేదు. వీరికి ఆయన ఇచ్చిన కితాబులు గుర్తున్నాయి కానీ, చేసిన విమర్శలు గుర్తులేవు. 

సతీష్ చందర్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?