Advertisement

Advertisement


Home > Articles - Special Articles

‘లైకు’ కొడితే లోపల వేస్తారా?

‘లైకు’ కొడితే లోపల వేస్తారా?

కొత్త రెక్క మొగ్గ తొడిగితే చాలు, కొత్త కత్తెర సిధ్ధంగా వుంటుంది తెగ్గొయ్యటానికి. ఇక ఎగిరేది ఎలా? కొత్త మాధ్యమం పుట్టుకొచ్చిందో లేదో, దాని గొంతు నొక్కటానికి చట్టాలు సిధ్ధమయిపోతాయి. ఆయుధాలకన్నా అభిప్రాయాలకు భయపడేవాళ్ళే ఎక్కువ. ఆయుధం మరో ఆయుధానికి జన్మలివ్వలేదు. కానీ అభిప్రాయం పుట్టాలే కానీ, వెంటనే పిల్లల్నిపెడుతుంది. ‘కుటుంబ నియంత్రణ’ పెట్టాలన్నా, కుదిరి చావదు. అంతే కాదు, అవసరమనుకుంటే అభిప్రాయం, ఆయుధాన్ని పట్టిస్తుంది; అస్త్ర సన్యాసం చేయిస్తుంది. కానీ ఆయుధం ఒక్క అభిప్రాయాన్నీ ఉత్తరించలేదు; సృజించ లేదు. 

ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటి) చట్టం లోని 66(ఎ) ను సుప్రీం కోర్టు రద్దు చేస్తూ, అభిప్రాయ ప్రకటనను అడ్డుకునే ఏ ప్రయత్నమయినా రాజ్యాంగ విరుధ్ధమనే భావనను మరోసారి ఎలుగెత్తి చాటింది. ఈ చట్టం దుర్వినియోగాన్నే కాదు, నిష్ర్పయోగత్వాన్ని కూడా అత్యున్నత న్యాయస్థానం ఎత్తి చూపింది. ఈ చట్టంలో శిక్షకు అర్హమైన నేరాల నిర్వచనం సందిగ్ధం గావుంది; స్పష్టత కొరవయింది. అంతే కాదు, రాజ్యాంగం ప్రసాదించిన ప్రజల తెలుసుకునే హక్కులోకి ఈ చట్టం చొరబడింది. ఫలితంగా ఈ సెక్షన్‌ను పూర్తిగా తొలగిస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. 

ఈ చట్టం దుర్వినియోగాన్ని కోర్టుకు తెచ్చినది పాతికేళ్ళ యువతి. ఆమె న్యాయశాస్త్రం చదువుతోంది. పేరు శ్రేయ సింఘాల్. ఈమె కోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం వెయ్యటంతో దానిని కోర్టు విచారణకు స్వీకరించింది. అంతే కాదు, ఈ చట్టం పలు మార్లు దుర్వినియోగమయ్యింది. అధికారంలో వున్న రాజకీయ  నాయకులు తమకు వ్యతిరేకంగా వ్యక్తమవుతున్న అభిప్రాయాన్ని అణచి వేసేందుకు ఈ చట్టాన్ని ప్రయోగించటం శ్రేయ చూశారు. శివసేన వ్యవస్థాపకులు బాల థాకరే మృతి చెందినందుకు మొత్తం ముంబయిలో ‘నిర్బంధపు’ బంద్ పాటింప చేయటంపై  సోషల్ మీడియా నెట్‌వర్క్ (ఫేస్‌బుక్)లో పోస్ట్  పెట్టినందుకు ఇద్దరు యువతులను అరెస్టు చేశారు. అలాగే,  ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీ శాసన సభ్యుడు, మంత్రి అజమ్ ఖాన్‌కు వ్యతిరేకంగా  ‘పేస్ బుక్’ లో పోస్ట్ పెట్టినందుకు, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అలాగే పశ్చిమ బెంగాల్‌లో తన పై వేసిన కార్టూన్‌ను షేర్ చేసినందుకు, ఏకంగా ఒక ప్రొఫెసర్‌నే అరెస్టు చేయించారు ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. 

ఇలా 66(ఎ) సెక్ష్టన్ ను తొలగించాలంటూ న్యాయపోరాటం చేయటానికి, శ్రేయతో పాటు ‘కామన్ కాజ్’ అనే ఎన్జీవో, అంతర్జాతీయ గుర్తింపు పొందిన బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ కూడా ఆమెకు మద్దతు పలికారు. నాయ్యమూర్తులు నారిమన్, చలమేశ్వర్ తో కూడిన ధర్మాసనం, ఈ సెక్షన్ రద్దు చేస్తూ తీర్పు ఇచ్చారు. అయితే సెక్షన్ పైనా, దాని పై కోర్టు ఇచ్చిన తీర్పుపైనా దేశంలో రాజకీయపార్టీలో గమ్మత్తుగా స్పందించాయి. 

నిజానికి ఐటి చట్టం 2000 లోనే వచ్చింది. అప్పుడు ఈ చట్టం కేవలం ‘పేటెంట్’ కు భద్రత కల్పించటానికే ఉద్దేశించారు. తమది కానిది, తమదిలాగే భ్రమింప చేయటానికి ప్రయత్నించటాన్ని నేరంగా ఈ చట్టం పరిగణిస్తుంది. కానీ 2008లో అప్పటి యుపీయే ప్రభుత్వం ఈ చట్టానికి 66(ఎ) సెక్షన్‌ను జోడించింది. దాని ప్రకారం ఎవరయినా  ‘స్థూలంగా నేరపూరితమైన’ లేక, ‘స్వభావరీత్యా ప్రమాదకరమైన’ సమాచారాన్ని పంపించినా, లేక పంపించిన సమాచారమూ; ఇతరలుకు ‘చికాకు’నూ, ‘అసౌకర్యాన్నీ’ కలిగించే సమాచారమూ నేరవూరితమయినవి సెక్షన్ 66(ఎ) చెబుతోంది. ఈ నేరానికి పాల్పడిన వాళ్ళకి  మూడేళ్ళ వరకూ ఖైదు శిక్షనూ, లేక రు.5లక్షల నగదు నూ  లేదా రెంటినీ శిక్షగా విధించవచ్చు. 

ఈ చట్టాన్ని చేసినప్పుడు, అప్పటి ప్రతిపక్షంగా వున్న ఎన్డీయే, కాంగ్రెస్ సర్కారు తీరును తప్పుపట్టింది. కొందరు ఎన్డీయేనైతలైతే, ఈ సెక్షన్‌ను చేర్చటాన్ని ‘ఎమర్జన్సీ’ తో పోల్చారు. ( సోషల్ మీడియా నెట్ వర్క్ ను నియంత్రించే చట్టం కనుక దీనిని ‘ఆన్‌లైన్ ఎమర్జన్సీ’ అన్నారు.) తీరా 2014 లో అధికారంలోకి వచ్చాక, తాము ఈ చట్టాన్ని దుర్వినియోగం చెయ్యకుండా చూస్తామని  కోర్టుకు మాట ఇచ్చి, చట్టాన్ని కొనసాగించారు. అలాగే అప్పట్లో ఈ చట్టాన్ని తీసుకొచ్చిన  యుపీయే నేతల కొందరు ఈ చట్టాన్ని చాలా పేలవంగా, సందిగ్ధతకు తావిచ్చే విధంగా విమర్శిస్తున్నారు. ఎవరు ఏమనుకున్నా ఈ సెక్షన్ ను కోర్టు రద్దు చేయటం, భావప్రకటనా స్వేఛ్ఛ కు ప్రాణం పోయటమే.

సతీష్ చందర్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?