Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ఎమ్బీయస్‌: అఖిలేశ్‌-రాహుల్‌ కూటమి గెలిచేనా?

ఎమ్బీయస్‌: అఖిలేశ్‌-రాహుల్‌ కూటమి గెలిచేనా?

ఇవాళ ఉత్తర ప్రదేశ్‌లో మూడో విడత ఎన్నికల సందర్భంగా అఖిలేశ్‌ పరంగా ఓ కీలకఘట్టం నడుస్తోంది. ఇప్పటిదాకా జరిగిన రెండు విడతల ఎన్నికలలో మొగ్గు ఎవరికి వున్నది యితమిత్థంగా తేలలేదట. ఇవాళ 12 జిల్లాలలో వున్న 69 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. వీటిలో కాన్పూరు, లఖనవ్‌ వంటి ప్రధాన నగరాలూ వున్నాయి, గ్రామీణ ప్రాంతాలూ వున్నాయి. 2012 ఎన్నికలలో యిక్కడున్న 69టిలో 55 ఎస్పీ గెలుచుకోవడంతో యిది యాదవభూమిగా పేరుబడింది. 2014 పార్లమెంటు ఎన్నికలలో అదంతా మోదీ గాలికి కొట్టుకుపోయింది. ఈ సారి ఏమవుతుంది? మోదీపై మోజు కారణంగానో, కుటుంబ కలహాల కారణంగానో ఈ ప్రాంతంలో వెనకబడినట్లు రిపోర్టులు వస్తే మాత్రం అఖిలేశ్‌ తట్టాబుట్టా సర్దుకోవచ్చు. 

నిజానికి అసెంబ్లీ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌ ఫలితాలపైనే అందరికీ కుతూహలం వుంది. మొన్నటిదాకా బిజెపి అక్కడ గెలుపొందడం ఖాయం అని అనుకుంటూనే వచ్చారు. ఇప్పుడు ఖాయం అనకపోయినా గెలవవచ్చు అనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో పరిస్థితులు మారతాయా, ఎస్పీ-కాంగ్రెసు కూటమి బిజెపిని ఎదుర్కోగలుగుతుందా? అనే ప్రశ్నలు వుదయిస్తున్నాయి. 2014 తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి కాంగ్రెసుతో పోటీ పడిన చోటల్లా (మహారాష్ట్ర, హరియాణా, ఆసాం) గెలిచింది. గట్టి ప్రాంతీయ పార్టీల నాయకులతో పోటీ పడినపుడు (ఢిల్లీ, బిహార్‌) ఓడింది. ఇప్పుడు పంజాబ్‌లో కాంగ్రెసు, ఆప్‌ రెండూ బలంగానే వున్నాయి. మరి గెలుస్తుందా? ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఆప్‌, కాంగ్రెసుల మధ్య చీలి బిజెపి-అకాలీదళ్‌ కూటమి గెలుస్తుందేమో, ఎవరు చూడవచ్చారు! యుపికి వచ్చేసరికి యిద్దరు స్థానిక నాయకులు - అఖిలేశ్‌, మాయావతి - బలంగా వున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బిజెపి, బియస్పీల మధ్య చీలితే అఖిలేశ్‌ కూటమికి లాభం. బిజెపి వ్యతిరేక ఓటు ఎస్పీ, బియస్పీల మధ్య చీలితే బిజెపికి లాభం. ఈ ముక్కోణపు పోటీ ఎవరికి లాభిస్తుంది?

యుపిలో బిజెపికి వున్న బలం - మోదీ యిమేజి, సంస్థాగతంగా అమిత్‌ షా చేస్తున్న కృషి. అతని పరివర్తన యాత్ర ర్యాలీలు 17 వేల కి.మీ.లు కవర్‌ చేశాయి. 90% బూతుల్లో కమిటీలు ఏర్పాటు చేశాడు. సీనియర్‌ బిజెపి నాయకులు 40 భారీ సభలు నిర్వహించారు. 200 బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ సదస్సులు ఏర్పాటు చేశాడు. ఇక మోదీ కూడా ప్రచారాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఎన్నికల ర్యాలీలలో ప్రసంగిస్తున్నాడు. 2014లో పని చేసిన మోదీ మ్యాజిక్‌ అదే స్థాయిలో పనిచేయదని అందరికీ తెలుసు, కానీ ఏ స్థాయిలో పనిచేస్తుందో ఎవరికీ తెలియదు. ఎవరి గెస్‌ వారిదే! బిజెపికి వున్న పెద్ద మైనస్‌ పాయింటు - ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవర్నీ చూపించలేక పోవడం. మోదీ ప్రధాని పదవి వదలి రాడని తెలుసు. మరి సిఎంగా ఎవరు వస్తారు? మోదీలా పాలిస్తాడా అనే సందేహాలు బిజెపి ఓటర్లకు వస్తాయి కదా. వాటిని నివృత్తి చేసే పని బిజెపి పెట్టుకోలేదు. మోదీ సభల్లో స్టేజిలపై కమలం గుర్తు తప్ప స్థానిక నాయకుల ఫోటోలు పెట్టటం లేదు. 

ఎందుకంటే బిజెపి అన్ని వర్గాల ఓట్లూ ఆశిస్తోంది - యాదవేతర బిసిలు, జాతవేతర దళితులు, అగ్రవర్ణాలు వీరందరూ తమకు ఓట్లేస్తారని బిజెపి ఆశ. ఈ వర్గాల్లో ఎవరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపినా తక్కినవారు మొహం చాటేస్తారని భయం. ఈ స్ట్రాటజీ యితర రాష్ట్రాలలో కూడా కొనసాగిస్తారా లేదా అన్నది యీ ఎన్నిక ఫలితంపై ఆధారపడి వుంటుంది. మోదీ కేంద్రంగానే నడుపుతున్న పబ్లిసిటీ కాంపెయిన్‌లో మోదీ కంటె కాస్త తక్కువగా నైనా ప్రొజెక్టు చేసే లీడరు లేరు. రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్ష పదవిలో వున్న బహుగుణ కుమార్తె రీటా జోషిని కాంగ్రెసు నుంచి బిజెపిలోకి తీసుకుని వచ్చినా ఆమెను కూడా సిఎం అభ్యర్థిగా చూపటం లేదు. ఎందుకంటే ఆమె కారణంగా బ్రాహ్మణ ఓట్లు పడినా, తక్కిన వర్గాల ఓట్లు దూరమవుతాయన్న భయం వుంది. కాంగ్రెసు బ్రాహ్మణ ఓటర్లపై కన్నేసి బ్రాహ్మణుల కోడలైన షీలా దీక్షిత్‌ను సిఎం అభ్యర్థిగా ప్రకటించి, అఖిలేశ్‌తో పొత్తు కుదిరాక గాలికి వదిలేసింది. ఎస్పీ, బియస్పీలలో యీ గందరగోళం లేదు. ఎస్పీ గెలిస్తే యాదవుడు, బియస్పీ గెలిస్తే దళితురాలు సిఎం అని ముందే తెలుసు.

ఇదివరకున్న బలమైన స్థితి నుంచి బిజెపిని కాస్త కిందకు దింపినవాడు అఖిలేశ్‌. ఇటీవల కొన్ని నెలలుగా అతను బలం పుంజుకున్నాడు. నిజానికి ప్రభుత్వాధినేతగా అనేక వైఫల్యాలకు అతను బాధ్యత వహించాలి. గోవింద వల్లభ్‌ పంత్‌ తర్వాత వరుసగా రెండోసారి ఎన్నికైన ముఖ్యమంత్రి అక్కడ లేడట. బిజెపి ధాటికి ఎస్పీ మట్టి కరుస్తుందని అందరూ అనుకుంటున్న సమయంలో ఎస్పీలో ముసలం పుట్టింది. కుటుంబకలహం రచ్చకెక్కింది. ఆ పార్టీగా రెండుగా చీలి బలహీనపడుతుందని, దానివలన ముస్లిములు బియస్పీవైపు మరలి, ముస్లిమేతర ఓట్లతో బిజెపి బలపడి అంతిమంగా గెలుస్తుందని అంచనాలు వెలువడ్డాయి. అయితే అంతర్గత విభేదాల వలన అనూహ్యంగా అఖిలేశ్‌ బలోపేతం అయ్యాడు. చాలా చాకచక్యంగా వ్యవహరించి పార్టీలో తనకు ఎదురు లేదని అతను చూపించుకున్నాడు. అతని తండ్రితో సహా పార్టీ సీనియర్లందరూ మొహం వేలాడేయవలసి వచ్చింది. పార్టీ మొత్తం అఖిలేశ్‌ వైపుకి వచ్చేసింది. అమర్‌ సింగ్‌ సహాయంతో అఖిలేశ్‌పై పెత్తనం చేయబోయిన శివలాల్‌ యాదవ్‌ యిప్పుడు తన జశ్వంత్‌ నగర్‌ నియోజకవర్గంలో గెలిస్తే చాలని చూస్తున్నాడు. అఖిలేశ్‌ను దెబ్బ తీయడానికి 40 మందిని లోకదళ్‌ పార్టీ ద్వారా నిలబెట్టి, ఎన్నికల తర్వాత కొత్త పార్టీ పెడతానని బీరాలు పలికినవాడు యిప్పుడు 'ప్రజలు కోరితేనే పార్టీ పెడతా. అఖిలేశ్‌ అంటే నాకు యిష్టం లేకపోలేదు. ఎటుతిరిగి అతనికి నేను బాబాయినే కదా' అనసాగాడు. అఖిలేశ్‌కు ఏం తెలుసు కుర్రకుంక, పార్టీ పెట్టినపుడు ఎక్కడున్నాడు? అంటూ హుంకరించిన ములాయం యిప్పుడు 'ఈసారీ యుపికి ముఖ్యమంత్రి అఖిలేశే' అంటున్నాడు. 

పదవీకాలంలో మూడేళ్లపాటు తన నెత్తిన ఎక్కి సవారీ చేసిన పెద్దతరం వృద్ధ జంబూకాల గాలి తీసేసిన అఖిలేశ్‌ను చూస్తే యుపి యువతకు ముచ్చటగా వుంది. ఆ గాలి తీయడం కూడా అఖిలేశ్‌  కుటుంబ సంప్రదాయాలకు విరుద్ధంగా వెళ్లకుండా సాధించాడు. 'నేను పార్టీ వీడను, మా నాన్న ఎప్పటికీ నాకు గురువే, బయటివాళ్ల (అమర్‌ సింగ్‌) చెప్పుడు మాటలు విని మా నాన్న నాపై చర్య తీసుకుంటున్నాడు' అంటూ వచ్చాడు తప్ప తండ్రి రెండో భార్య గురించి, సవతి సోదరుడి గురించి ఏమీ అనలేదు. తన భార్య ద్వారా సవతి తల్లితో బాంధవ్యం కొనసాగించాడు. సవతి సోదరుడి భార్య నియోజకవర్గంలో భార్య చేత ప్రచారం చేయిస్తున్నాడు. పాతకాలపు భావాలకు పెద్దపీట వేసే యుపిలో యిలా జాగ్రత్తపడడం మంచిదైంది. ఓటర్లలో యువతీయువకులే ఎక్కువ. 2014లో కులాల కతీతంగా వాళ్లు మోదీకి ఓటేశారు. ఈ సారి అఖిలేశ్‌ వాళ్లని గుంజుకోగలిగితే అతనిదే గెలుపు. యువకుడు కాకపోయినా యువనేతగా అందరూ అనే రాహుల్‌ గాంధీతో అఖిలేశ్‌ జట్టు కట్టాడు. అతని ప్రత్యర్థులు బియస్పీ తరఫున మాయావతి ముందుతరందే. బిజెపి తరఫున ముఖ్యమంత్రి స్థాయిలో యువకులెవరూ లేరు. కారణం ఏమైనా బిజెపి వరుణ్‌ గాంధీ చేత ప్రచారం చేయించటం లేదు. రాజనాథ్‌ సింగ్‌ కొడుకు వంటి 25 మంది నాయకసంతానానికి బిజెపి టిక్కెట్లు యిచ్చింది కానీ వాళ్లంతా తమతమ నియోజకవర్గాల్లోనే తిరుగుతున్నారు. అందువలన యువతను ఆకర్షించే భారం మోదీపైనే వుంది. అఖిలేశ్‌ వైఫల్యాలకు పెద్దతరం వారి పెత్తనమే కారణమని, యిప్పుడా భారాన్ని వదుల్చుకున్నాడు కాబట్టి బాగా పాలించవచ్చని యువత నమ్మితే మాత్రం అఖిలేశ్‌కే ఎక్కువ లాభం చేకూరుతుంది. వాళ్లను ఆకట్టుకోవడానికి స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు యిస్తున్నాడు. బాలికల విద్యకై కన్యా విద్యాదాన్‌ స్కీము పెట్టాడు. 

ఇక కులమతాల వారీ సమీకరణ చూసుకుంటే ముస్లిములలో 10% మంది 2014లో మోదీకి వేశారట. అయినా బిజెపి యీసారి ఒక్క ముస్లిముకు కూడా టిక్కెట్టివ్వలేదు. పైగా మతకల్లోలాలలో నిందితులైన హిందువులకు టిక్కెట్లిచ్చింది. బిజెపి ధాటికి ఆగగల పార్టీ కోసం ముస్లిములు వెతుకుతున్నారనుకుంటే ఎస్పీ, కాంగ్రెసు విడివిడిగా పోటీ చేసి వుంటే వాళ్లకు గందరగోళంగా వుండేది. వాళ్లంతా బియస్పీవైపు మరలేవారు. ఆ లెక్కతోనే బియస్పీ అత్యధిక సంఖ్యలో 97 మంది ముస్లిములకు టిక్కెట్టిచ్చింది. అయితే యింతలో పొత్తు కుదిరింది. దానికి కారణం ప్రశాంత కిషోరేట. రాహుల్‌ గాంధీ నిర్వహించిన ఖాట్‌ సభలు, కిసాన్‌ యాత్రలు అనుకున్నంతగా ప్రజల్లోకి వెళ్లటం లేదని గ్రహించి కాంగ్రెసు విజయావకాశాలు తక్కువగా వున్నాయని లెక్కవేసి ప్రియాంకా గాంధీ బరిలోకి దిగితే మంచిదన్నాడు. ఆమె దిగనని చెప్పడంతో అయితే పొత్తే మంచిదన్నాడు. అతని మాటకు విలువ నిచ్చి స్థానిక నాయకులు పొత్తు వద్దంటున్నా వినకుండా రాహుల్‌, ప్రియాంకా చొరవ తీసుకుని పొత్తు కుదిర్చారు. 125 సీట్లు అడిగితే కుదరదని చెప్పి అఖిలేశ్‌ 105 యిచ్చి సరిపెట్టాడు. తను 298 టిలో పోటీ చేస్తున్నాడు. కాంగ్రెసుకు అన్ని కులాల నుంచి కాస్త కాస్త మద్దతు ఎప్పుడూ వుంటూ వచ్చింది. అది తమ యాదవ ఓటు బ్యాంకుకు తోడవుతుందని అఖిలేశ్‌ అంచనా. ముస్లిములు కూడా తమకే వేస్తారని ధైర్యం. కానీ అఖిలేశ్‌ హయాంలో జరిగిన దాడుల కారణంగా విసిగిన ఆ ప్రాంతాల్లోని ముస్లిములు బియస్పీని ఆదరించవచ్చు. అజిత్‌ సింగ్‌ లోక్‌దళ్‌ కూడా యీ కూటమితో పొత్తు పెట్టుకోవాలనుకుంది కానీ అఖిలేశ్‌ యిష్టపడలేదు. మొదటి కారణం అజిత్‌ సింగ్‌కు జాట్లలో పలుకుబడి బాగా క్షీణించింది. రెండోది అతను చాలామంది ముస్లిములకు టిక్కెట్లిస్తానంటున్నాడు. అలా చేస్తే ముస్లిం పక్షపాతిగా కూటమికి పేరుబడి హిందువులందరూ బిజెపి వైపుకి వెళ్లిపోతారన్న భయం. 

బిజెపి హిందువులలోని అన్ని కులాల ఓట్లు సంపాదించగలనన్న ధీమాతో వుంది. బిసిల్లో యాదవులు తప్ప తక్కిన బిసిలు, దళితుల్లో జాతవులు తప్ప తక్కిన కులాలు తమ వైపు వస్తే ముస్లిము ఓట్లు పడకపోయినా ఫర్వాలేదన్న లెక్క బిజెపిది. ఈ లెక్కల్లో పడి టిక్కెట్ల పంపిణీ విషయంలో తమను నిర్లక్ష్యం చేసిందన్న బాధ అగ్రవర్ణాల్లో వుందట. వారిలో కొందరు కాంగ్రెసువైపు మరలే అవకాశం వుంది. బియస్పీ కూడా అగ్రవర్ణాలను నిర్లక్ష్యం చేయటం లేదు. 87 మంది దళితులకు, 107 మంది బిసిలకు టిక్కెట్లిచ్చిన మాయావతి ఏకంగా 113 మంది అగ్రవర్ణులకు టిక్కెట్లిచ్చింది. దళిత-బ్రాహ్మణ-ముస్లింల కూటమితో గెలుద్దామని చూస్తోంది. బిజెపి లెక్కలు తెలుసు కాబట్టి అఖిలేశ్‌ యాదవేతర బిసిలను దువ్వుతున్నాడు. ఎస్పీ హయాంలో పైనుంచి కింద దాకా యాదవులదే పెత్తనమని, వాళ్లు ఏం చేసినా చెల్లుబాటు అయిపోతోందన్న భావం యుపి ప్రజల్లో వుంది. అలాటిదేమీ లేదని చెప్పడానికి అఖిలేశ్‌ తంటాలు పడుతున్నాడు. బిసీల్లో కూర్మీ కులానికి చెందిన నరేశ్‌ చంద్ర ఉత్తమ్‌కు రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టాడు. కులమతాల గురించి పెద్దగా మాట్లాడకుండా అభివృద్ధి గురించే ఎక్కువ మాట్లాడుతున్నాడు. గతంలో కాంగ్రెసు మిమ్మల్ని ఘాటుగా విమర్శించింది కదా అని గుర్తు చేస్తున్నా పట్టించుకోవటం లేదు. ఏం మాట్లాడినా తిప్పితిప్పి లఖనవ్‌-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే, సమాజ్‌వాదీ పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వే, లఖనవ్‌, కాన్పూరు, వారణాశిలలో మెట్రోలు, సూపర్‌ స్పెషాలిటీ కాన్సరు ఆసుపత్రి గురించే చెప్పుకుంటున్నాడు. డిసెంబరు నెలలో 60 వేల కోట్ల రూ.ల విలువైన 300 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేశాడు. 2014లో మోదీ అభివృద్ధి గురించి మాట్లాడే అందర్నీ ఆకట్టుకున్న విషయం అతను మర్చిపోలేదు.

బిజెపి ప్రధానంగా అఖిలేశ్‌పైనే గురి పెట్టింది. అతని హయాంలో హిందువులకు రక్షణ లేదని అంటోంది. కైరానా నుంచి హిందు కుటుంబాలు వెళ్లిపోవడాన్ని పలాయనంగా వర్ణిస్తోంది. ఉపాధి అవకాశాలకై వెళ్లారని, భయపడి కాదని స్థానికులు అంటున్నారు. అయోధ్యలో రామమందిరం గురించి మానిఫెస్టోలో పెట్టినా ఎవరూ పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో యితర ప్రాంతాల్లో దాని గురించి మాట్లాడటం లేదు. ఇక నోట్ల రద్దు గురించి గొప్పగా చెప్పుకోవాలో, వద్దో తేల్చుకోలేక పోతోంది. రద్దు చేసినపుడు నల్లధనాన్ని, అవినీతిని రూపుమాపుతున్నామని, ఉగ్రవాదాన్ని తరిమివేశామని, మావోయిస్టులు లొంగిపోతున్నారని చెప్పుకున్న వేవీ యింకా ఫలితాల నివ్వలేదు. బిజెపి సానుభూతిపరులు ఫలితాల కోసం కొద్దికాలం ఆగాలని వూరడిల్లుతున్నారు. కానీ యీ లోపున నోట్ల రద్దు వలన ఆదాయం పోగొట్టుకున్న గ్రామీణులు, రైతులు, చిన్న వ్యాపారులు నిరాశానిస్పృహలలో వున్నారు. అనేక ఫ్యాక్టరీలు మూతబడ్డాయి. అది గమనించిన బిజెపి నాయకులు వ్యవసాయం ప్రధాన వృత్తిగా వుండే 73 అసెంబ్లీ సీట్లున్న పశ్చిమ యుపిలో నోట్ల రద్దును తమ ఉపన్యాసాల్లో ప్రస్తావించలేదు. 2012లో ఎస్పీ, బియస్పీ చెరో 24 సీట్లు గెలవగా, బిజెపికి 10 వచ్చాయి. అక్కడ 68% పోలింగు జరిగింది. చండీగఢ్‌ వంటి నగరప్రాంతంలో స్థానిక ఎన్నికలలో గెలుపు చూసి నోట్ల రద్దును ప్రజలు ఆమోదించారని బిజెపి చెప్పుకుంది కానీ  రేపు యుపిలో ఓటమి ఎదురైతే నోట్ల రద్దు కారణంగానే ఓడామని ఒప్పుకుంటుందో లేదో! రెండో విడత పోలింగు జరిగిన రోహిల్‌ఖండ్‌ ప్రాంతంలో 70 నియోజకవర్గాలున్నాయి. అక్కడ కాంగ్రెసు 2012 ఎక్కువ సీట్లు గెలిచింది. 2014లో బిజెపి గెలిచింది. ఇక్కడ ముస్లిము జనాభా తక్కిన ప్రాంతాల్లో కంటె ఎక్కువ. దాదాపు 35%. 

''ద వీక్‌-హంసా'' జనవరి నెలలో నిర్వహించిన సర్వేలో బిజెపికి 37% ఓట్లతో 192-196 వస్తాయని, ఎస్పీ-కాంగ్రెసుకు 33% ఓట్లతో 178-182 వస్తాయని, బియస్పీకి 22% ఓట్లతో 20-24 వస్తాయని అంచనా వేసింది. బియస్పీ పుంజుకుంటే ఎస్పీ కూటమి సీట్లు తగ్గవచ్చు. బియస్పీ పరిస్థితి అలాగే వుండి ఎస్పీ పుంజుకుంటే బిజెపికి తగ్గవచ్చు. ఎస్పీ ఏ మేరకు ఓట్లు గడిస్తుందో యివాళ్టి పోలింగు నిర్ణయిస్తుంది. 

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2017)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?