Advertisement

Advertisement


Home > Articles - Special Articles

నమో అచ్చేదిన్‌.. రైతులకేమో చచ్చేదిన్‌

నమో అచ్చేదిన్‌.. రైతులకేమో చచ్చేదిన్‌

ఎప్పుడూ చెప్పుకునే మాటే.. తాను పండించిన పంటకి, గిట్టుబాటు ధర కల్పించుకోలేని దుస్థితి రైతన్నలది. ప్రపంచంలో ప్రతి వస్తువు తయారీదారుడూ దాని ధరను నిర్ణయించుకోగలడు.. వ్యవసాయం చేసి, అందరికీ తిండి పెట్టే రైతన్న మాత్రం తను ఉత్పత్తి చేసే 'పంట'కి ధరని నిర్ణయించుకోలేని దౌర్భాగ్యర పరిస్థితి. ఎందుకిలా.? ఏ మేధావీ సమాధానం చెప్పడు ఈ ప్రశ్నకి.

ఏ పార్టీ అయినా సరే 'రైతే రాజు..' అంటూ రైతుని ఆకాశానికెత్తేస్తుంటుంది. ఆకాశానికి కాదు, మునగచెట్టు ఎక్కించేస్తుంటుంది. ఏ ప్రభుత్వమైనాసరే, రైతుల్ని ఉద్ధరించేస్తున్నామని చెబుతూనే రైతుల్ని పాతాళానికి తొక్కేస్తుంటుంది. వాళ్ళూ వీళ్ళూ అన్న తేడాల్లేవ్‌ రైతుల్ని సర్వనాశనం చేసే విషయంలో. ఒకర్ని మించి ఇంకొకరు.. రైతు నడ్డి విరుస్తూనే వున్నారు.

వేల కోట్లు దోచేసి, విదేశాలకి ఎంచక్కా 'వ్యాపార అయస్కాంతాలు' పారిపోవచ్చుగాక. కానీ, కొత్తగా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహకాలు అందించాల్సిందే. కానీ, రైతన్నకు మాత్రం 'రుణమాఫీ' చెయ్యకూడదుగాక చెయ్యకూడదు. చేస్తే ఇంకేమన్నా వుందా.? రైతులు సోమరిపోతులైపోతారన్నది చాలామంది మేధావుల అభిప్రాయం.

పారిశ్రామికీకరణ లేకపోతే పట్టణాలెక్కడ.? అభివృద్ధి ఎక్కడ.? అన్న ప్రశ్న సహజంగానే మేధావి వర్గం నుంచి పుట్టుకొస్తుంది. అసలంటూ వ్యవసాయమే లేనప్పుడు, మానవ మనుగడ మాటేమిటి.? అన్న ప్రశ్నకి మాత్రం నీళ్ళు నమలాల్సిందే ఏ మేధావి అయినా.!

ఉర్జీత్‌ పటేల్‌.. పెద్ద పాత నోట్ల రద్దు వ్యవహారంలో బాగా పాపులర్‌ అయిన పేరు ఇది. ప్రధాని నరేంద్రమోడీ, అత్యంత వ్యూహాత్మకంగా రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా ఉర్జీత్‌ పటేల్‌కి అవకాశమిచ్చారు. చాలా గొప్పగా పెద్ద పాత నోట్ల రద్దు వ్యవహారాన్ని ఉర్జీత్‌ పటేల్‌ డీల్‌ చేశారు. ఆపరేషన్‌ సక్సెస్‌, పేషెంట్‌ డెడ్‌ అంతే. అవును, ఆర్థిక వ్యవస్థ దాదాపుగా చచ్చిపోయింది. నల్లధనం బయటకు రాలేదు సరికదా, వ్యవస్థలోని అన్ని విభాగాలూ అత్యంత దారుణంగా దెబ్బతిన్నాయి. ఇందులో రైతు విభాగం కూడా వుంది.

ఇప్పుడీ ఉర్జీత్‌ పటేల్‌ వ్యవహారమెందుకంటే, రైతు రుణమాఫీ చేయొద్దంటూ ఉర్జీత్‌ పటేల్‌ కేంద్రాన్ని హెచ్చరించారు. నిజమే, రైతులంటే ఎవరు.? అపర కుబేరులు కదా.! వాళ్ళకి రుణమాఫీ ఎలా చేసేస్తారు.? నవ్విపోదురుగాక మనకేటి.? అన్న చందాన తయారయ్యింది వ్యవహారం.

రైతులంటే, ఆ మధ్య ఢిల్లీలో తమిళనాడు నుంచి వెళ్ళి చాలా రోజులపాటు తిండీ తిప్పలూ లేకుండా వ్యవసాయం కోసం ప్రాణాలొదిలేందుకు సిద్ధమయ్యారే.. వాళ్ళు. రైతులంటే, నిన్ననే మధ్యప్రదేశ్‌లో పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారే అలాంటివాళ్ళు. కోట్లు గుమ్మరించేయమనడంలేదు.. అప్పనంగా దోచిపెట్టెయ్యమనడంలేదు.. వ్యవసాయరంగం ఎదుర్కొంటోన్న సంక్షోభం నేపథ్యంలో రుణమాఫీ అడుగుతున్నారు.. 'సాయం' కోరుతున్నారు.

పట్టణానికి పోతే రెండొందలో మూడొందలో కూలీ వస్తుంది. కానీ, రైతు ఆత్మగౌరవం చచ్చిపోతుంది. అందుకే, ఇంకా చాలామంది రైతులు వ్యవసాయాన్ని పట్టుకుని వేలాడుతున్నారు. వ్యవసాయం చేస్తే లాభాలొచ్చేస్తాయని కాదు.. దాన్ని రైతు తన బాధ్యతగా భావిస్తున్నాడు.

పాలకులకైనా, మేధావులకైనా రైతు గోడు ఎప్పటికి అర్థమవుతుంది.? రైతులకి అచ్చేదిన్‌ వచ్చేసిందని చాలా సందర్భాల్లో నరేంద్రమోడీ చెబుతున్నారు. జరుగుతున్న వాస్తవమేంటి.? రైతులకు చచ్చేదిన్‌ వచ్చింది.. ఇదీ అసలు వాస్తవం. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?