Advertisement

Advertisement


Home > Articles - Special Articles

నేపాల్‌ భూకంపం.. మృతులెంతమంది.?

నేపాల్‌ భూకంపం.. మృతులెంతమంది.?

నేపాల్‌ భూకంపం సంభవించిన తొలి రోజు మృతుల సంఖ్యను అటూ ఇటూగా ఓ వంద వుండొచ్చని అధికారిక ప్రకటన వచ్చింది. ఆ తర్వాతి రోజుకే అది వెయ్యికి చేరుకుంది. రోజులు గడిచే కొద్దీ ఆ సంఖ్య ఎవరూ ఊహించలేనంతగా పెరిగిపోతోంది. తాజా అంచనాల ప్రకారం మృతుల సంఖ్య 10 వేల నుంచి 20 వేల మధ్యన వుండొచ్చని తెలుస్తోంది.

భూకంప తీవ్రతను బట్టి, ఆ భూకంపం సంభవించిన ప్రాంతాన్ని బట్టి.. మృతుల సంఖ్యను దాదాపుగా అంచనా వేస్తుంటారు. తీవ్ర భూకంపం కావడం, భూకంపం కారణంగా కూలిపోయిన భవనాల సంఖ్య చాలా ఎక్కువగా వుండటం, అన్నిటికీ మించి నేపాల్‌లో ముఖ్య నగరమైన ఖాట్మండూ తుపాను దెబ్బకు కుదేలవడంతో మృతుల సంఖ్య అంచనాలకే అందడంలేదు.

ఒక్కో భవనం తాలూకు శిధిలాల్ని తొలగిస్తోంటే, సహాయక సిబ్బందికే భయం గొలిపేలా మృతదేహాలు వెలుగు చూస్తున్నాయి. దాంతో, మృతుల సంఖ్యను లెక్కగట్టం కష్టంగా మారుతోంది. ఇప్పటిదాకా అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 4 వేల మంది మరణించినట్లు తెలుస్తోంది. మృతులను గుర్తించి, ఆ వెంటనే సామూహికంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

ఇంకా పూర్తిస్థాయిలో శిధిలాల తొలగింపు జరగడంలేదు. శిధిలాల తొలగింపుకు వాతావరణం ఉపకరించకపోవడం, తగినంత ఎక్విప్‌మెంట్‌ అందుబాటులో లేకపోవడం, రోడ్డు మార్గాలు ఛిత్రమైపోవడం.. ఇలాంటి కారణాలతో శిధిలాల తొలగింపు కూడా చాలా నెమ్మదిగా జరుగుతోంది. భూకంపం సంభవించి మూడు రోజులు దాటుతుండడంతో.. శిధిలాల క్రింద వున్నవారెవరూ బతికి వుండే అవకాశమే లేదని అధికారులు చెబుతున్నారు.

నేపాల్‌ అభివృద్ధి చెందిన దేశమేమీ కాదు. ప్రపంచ దేశాలు ఇప్పుడు నేపాల్‌ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. భారతదేశం, తనవంతుగా నేపాల్‌ ఈ ఉత్పాతం నుంచి బయటపడేందుకు సహాయం అందిస్తోంది. నేపాల్‌లో భారత్‌ అందిస్తున్న సేవల్ని ప్రపంచ దేశాలు అభినందిస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?