Advertisement


Home > Articles - Special Articles
ఓ తండ్రి - ఓ కూతురు: ఇదో వింత కథ.!

ఓ తండ్రి.. కాదు కాదు, తండ్రి లాంటోడు. ఓ కూతురు.. కాదు కాదు, కూతురు లాంటిది.. ఆ ఇద్దరి మధ్యా 'ఏదో సంబంధం' వుందట.! ఇది ఈ రోజుల్లో వింత కథ ఏమీ కాదు. ఎందుకంటే, మీడియాలో నిత్యం వస్తోన్న 'క్రైమ్‌ స్టోరీస్‌'ని పరిశీలిస్తే, 'బంధాలు' ఎంత ఛండాలంగా కొందరి విషయంలో తయారయ్యాయో అర్థమవుతుంది మరి. 

ఇక్కడ తండ్రి లాంటి తండ్రి 'డేరా బాబా' గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ అయితే, 'కూతురు లాంటి కూతురు' హనీ ప్రీత్‌ సింగ్‌. డేరా బాబా జైలుకెళ్ళాడు.. అదీ అత్యాచారం కేసులో. హనీ ప్రీత్‌, తన తండ్రి (ముందే చెప్పుకున్నాం కదా, తండ్రి లాంటి తండ్రి.. నిజం తండ్రి కాదు) జైలుకు వెళ్ళడంతో, అజ్ఞాతంలోకి తాను వెళ్ళాల్సి వచ్చింది. నేపాల్‌ పారిపోయిందనీ, పాకిస్తాన్‌కి వెళ్ళిపోవాలనుకుందనీ.. ఇలా హనీ ప్రీత్‌ గురించి మీడియాలో రకరకాల ఊహాగానాలు విన్పించాయి. 

ఇంతకీ, హనీ ప్రీత్‌ సింగ్‌ ఎక్కడ.? ఈ ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ఆమె ఇండియాలోనే వుంది. ఈ మేరకు మొన్నామధ్య సీసీ టీవీ ఫుటేజ్‌ ఒకటి బయటపడింది. తాజాగా ఓ ఛానల్‌లో ఆమె ఇంటర్వ్యూ కూడా వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో హనీ ప్రీత్‌ సింగ్‌, గుర్మీత్‌ తనకు తండ్రి లాంటివాడనీ చెప్పడమే కాదు, 'తండ్రి ఓ కూతుర్ని టచ్‌ చేయకూడదా.?' అంటూ ప్రశ్నించేసింది కూడా. నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుగా వుందీ వ్యవహారం. 

ఫ్లాష్‌ బ్యాక్‌లోకి వెళితే, హనీ ప్రీత్‌ సింగ్‌ భర్తని బెదిరించి, ఆమెని తన వశం చేసుకున్నాడు గుర్మీత్‌ సింగ్‌. ఈ విషయాన్ని స్వయంగా హనీ ప్రీత్‌ భర్త వెల్లడించాడు. 'ఆ ఇద్దరి మధ్యా తేడా సంబంధం వుంది..' అని ఆయన వాపోయాడు కూడా. హనీ ప్రీత్‌ అనే కాదు, చాలామంది భక్తుల నుంచి వారి భార్యల్ని వీడదీసి, తన పంచన చేర్చుకున్న నికృష్టుడిగా నిర్ధారిస్తూ ఇప్పటికే డేరా బాబా గుర్మీత్‌పై అనేక ఆధారాలు బయటపడ్డాయి. 

అన్నట్టు, ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. కొన్నాళ్ళ క్రితం, నిత్యానంద స్వామీజీతో రాసలీలలాడుతూ వీడియోలకు చిక్కేసింది ఒప్పటి హీరోయిన్‌ రంజిత. 'అబ్బే, అది శృంగారం కానే కాదు.. రాసలీలల పేరుతో మా బంధానికి మకిలి పట్టించొద్దు.. ఓ భక్తురాలు, ఓ దేవుడికి చేస్తున్న సేవ మాత్రమే..' అని రంజిత సెలవిచ్చింది. నిత్యానంద అయితే, తాను నపుంసకుడినంటూ నానా యాగీ చేశాడనుకోండి.. అది వేరే విషయం. 

బాబాలు, స్వామీజీలకు సంబంధించి చాలావరకు వ్యవహారాలిలానే వుంటాయి. దురదృష్టవశాత్తూ, భక్తులూ ఆ 'మైకం'లో మునిగిపోయి, ప్రపంచాన్ని మర్చిపోతుంటారు. ఆ తర్వాత నిజం తెలుసుకుని, పైకి చెప్పుకోలేక భక్తులు పడే మానసిక వేదన అంతా ఇంతా కాదు. 

మళ్ళీ గుర్మీత్‌ - హనీప్రీత్‌ వ్యవహారానికొద్దాం. 'తండ్రి లాంటోడు.. టచ్‌ చేస్తే తప్పా.?' అని ఆమె లాజిక్‌ పాయింట్‌ లాగేశారుగానీ, ఇద్దరూ అత్యంత అన్యోన్యంగా (అచ్చంగా భార్యాభర్తల్లా) వున్న ఫొటోలు చాలా వరకు ఇప్పటికే బయటకొచ్చేశాయి. వారి రాసలీలలకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌లు కూడా వున్నాయనే గాసిప్స్‌ విన్పిస్తున్నాయి. 'తండ్రిలాంటోడు', 'కూతురు లాంటిదాన్ని' అనడంలోనే ఆ పవిత్ర బంధానికి మకిలి పట్టించేస్తోన్న హనీప్రీత్‌కి ఎలాంటి శిక్ష విధించాలట.?